BJP TRS
-
టీఆర్ఎస్, బీజేపీ నేతల లొల్లి; కిందపడ్డ సీఐ
కరీంనగర్ క్రైం/ కరీంనగర్ టౌన్: కరీంనగర్ నడిబొడ్డున టీఆర్ఎస్, బీజేపీ నాయకులు స్ట్రీట్‌ఫైట్‌కు దిగారు. తెలంగాణ చౌక్ వేదికగా కొట్టుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం విషయంలో తలెత్తిన వివాదం పరస్పరం దాడి చేసుకునే స్థాయికి చేరింది. అక్కడే ఉన్న పోలీస్ సిబ్బంది ఇరువర్గాలను అడ్డుకునేందుకు విఫలయత్నం చేశారు. పోలీసులనే నాయకులు నెట్టివేయడంతో వారు వన్‌టౌన్, టూటౌన్, ట్రాఫిక్ స్టేషన్లకు సమాచారం అందించారు. సీఐలు లక్ష్మిబాబు, విజయ్‌కుమార్, తిరుమల్, ఎస్ఐలు తిరుపతి, శ్రీనివాస్, వెంకట్రాజం సిబ్బందితో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరువర్గాలను అదుపుచేసే క్రమంలో టూటౌన్ సీఐ కిందపడ్డాడు. దీంతో పోలీసులు అప్రమత్తమై ఇరువర్గాలను చెదరగొట్టారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. నగరంలో ఉద్రిక్తత నెలకొనడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బలగాలు సాయంత్రం వరకు గట్టి బందోబస్తు నిర్వహించాయి. లొల్లి ముదిరిందిలా.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టీఆర్ఎస్ కార్యకర్తలు సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆదివారం దిష్టిబొమ్మతో తెలంగాణ చౌక్‌కు చేరుకున్నారు. అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై నిరసన తెలిపేందుకు బీజేపీ నేతలు అక్కడికి చేరుకున్నారు. బీజేపీ నాయకులు ఎదుటనే టీఆర్ఎస్ నాయకులు బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనానికి యత్నించారు. దీంతో బీజేపీ శ్రేణులు అడ్డుకునేందుకు యత్నించాయి. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరగడంతో నాయకులు ఒకరినొకరు తోసుకున్నారు. కోపోద్రిక్తులైన కొంతమంది దాడికి దిగారు. అక్కడు ఉన్న పోలీసులు అప్రమత్తమై ఇరువర్గాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు ఓవైపు వారిస్తున్నా.. రెండు పార్టీల నేతలు వారిని తోసేసి దాడులు చేసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు ఇరువర్గాలను చెదగొట్టే క్రమంలో టూటౌన్ సీఐ లక్ష్మీబాబు కిందపడ్డారు. పోలీసుల అదుపులో ఇరువర్గాలు.. పరస్పర దాడులకు దిగిన ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు రెండు పార్టీలకు చెందిన నాయకులను అదుపులోకి తీసుకున్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలను వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు, బీజేపీ కార్యకర్తలను టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో నగరంలో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. రెండు పార్టీలకు చెందిన నేతలపై పోలీసులు ప్రత్యేక దృష్టిసారించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. తెలంగాణచౌక్‌లో భారీగా పోలీసులను మోహరించారు. నగరంలోని పలు సమస్యాత్మక ప్రాంతాలపైనా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి బందోబస్తు నిర్వహించారు. బీజేపీ నేతలపై కేసు.. తెలంగాణ చౌక్‌లో జరిగిన ఘర్షణలో బీజేపీ నేతలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్ టౌన్ సీఐ విజయ్‌కుమార్ తెలిపారు. తాము నిరసన కార్యక్రమాన్ని చేపడుతుండగా బీజేపీ శ్రేణులు వచ్చి దాడులకు పాల్పడ్డారని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కాగా తాము సైతం ప్రభుత్వ విధానాలపై నిరసన తెలిపేందుకు వస్తుండగా, తమ అధినేత దిష్టిబొమ్మను కాళ్లతో తొక్కడంతో అడ్డుకునే ప్రయత్నం చేశామని బీజేపీ నేతలు తెలిపారు. -
‘వల’సలే బలం!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : సాధారణ ఎన్నికల్లో వివిధ రాజకీయపక్షాల తరఫున పోటీకి ఆసక్తి చూపుతున్న ఔత్సాహిక నేతలు క్షేత్ర స్థాయిలో సొంత బలాన్ని పెంచుకోవడంపై దృష్టి సారించారు. అధికార, విపక్ష పార్టీలనే తేడాలు లేకుండా వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. సొంత బలం ఉంటేనే టికెట్ వేటలో సొంత పార్టీలో పోటీని ఎదుర్కోవడం సాధ్యమవుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మండలాలు, గ్రామాల వారీగా వివిధ పార్టీల్లో చురుగ్గా ఉన్న నేతలు, కార్యకర్తలపై దృష్టి పెడుతున్నారు. ప్రత్యర్థి పార్టీలోని అసంతృప్తివాదులు, అవకాశవాదులు ఎవరనే కోణంలో ఆరా తీస్తున్నారు. వీలైన చోటల్లా పార్టీ కండువాలు కప్పుతూ చేరికల పేరిట హడావుడి సృష్టిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో జహీరాబాద్ అసెంబ్లీ స్థానం మినహా లోక్‌సభ, శాసనసభా నియోజకవర్గాలు అన్నింటిలోనూ అధికార టీఆర్ఎస్ నేతలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేల్లో 2019 ఎన్నికల్లో ఎంత మందికి తిరిగి అవకాశం దక్కుతుందనే అంశంపై సొంత పార్టీ నేతలే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చాలా చోట్ల అధికార టీఆర్ఎస్ పార్టీలోనూ సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని, తమకు అవకాశం ఇస్తారని ఔత్సాహిక నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలను మాత్రమే బరిలో దించాలని టీఆర్ఎస్ భావిస్తున్న నేపథ్యంలో చివరి నిమిషంలోనూ టికెట్ల కేటాయింపులో నాటకీయ పరి ణామాలు చోటు చేసుకుంటాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌కు రెండు లోక్‌సభ స్థానాలతో పాటు ఐదు అసెంబ్లీ స్థానాల్లో బలహీన లేదా బహుళ నాయకత్వం ఉండడంతో ఎవరికి టికెట్ దక్కుతుందో తెలియని పరిస్థితి ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా కొత్త ముఖాలను బరిలోకి దించే ఉద్దేశంతో ఇప్పటికే వడపోత ప్రారంభించింది. టీడీపీ పూర్తి స్థాయిలో జిల్లా రాజకీయ ముఖచిత్రం నుంచి కనుమరుగు కాగా, కొత్తగా టీజేఏసీ, బీఎల్ఎఫ్ తదితర పార్టీలు, కూటములు తెరమీదకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తంగా వచ్చే సాధారణ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లోనూ బహుముఖ పోటీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. సొంత బలం కోసం నేతల తంటాలు.. ఎన్నికల్లో బహుముఖ పోటీతో పాటు పార్టీల్లోనూ టికెట్ ఆశిస్తున్న నేతలు కూడా బహుళ సంఖ్యలో ఉన్నారు. ఓ వైపు అధిష్టానం వద్ద టికెట్ కోసం లాబీయింగ్ చేస్తూనే.. క్షేత్ర స్థాయిలో బలం పెంచుకోవడానికి ఔత్సాహిక నేతలు ప్రాధాన్యత ఇస్తున్నారు. సొంత పార్టీలో టికెట్ ఆశిస్తున్న ప్రత్యర్థిపై సొంత బలం ద్వారా పైచేయి సాధించాలనే వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీలో నర్సాపూర్, జహీరాబాద్, నారాయణఖేడ్ వంటి నియోజవకర్గాల్లో ఈ రకమైన పరిస్థితి నెలకొంది. సొంత బలాన్ని కలిగిఉంటే సిట్టింగులున్నా, వారిని కాదని టికెట్ ఇస్తారనే ఆశ సదరు నేతల్లో కనిపిస్తోంది. మరోవైపు కాంగ్రెస్‌లో సిద్దిపేట, దుబ్బాక, మెదక్, పటాన్చెరు నియోజకవర్గాల్లో బహుళ నాయకత్వం ఉండగా, ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు పోటాపోటీగా క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నారు. వివాహాలు, విందులు, మరణాలు తదితర సందర్భాల్లో గ్రామాల్లోకి వెళ్తూ ఆర్థిక సాయం ద్వారా బలం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలనుకుంటున్న బీజేపీ తన కేడర్‌తో పాటు, వివిధ పార్టీల్లో కార్యకర్తలు, నాయకుల వివరాలు సేకరిస్తోంది. చేరికల పేరిట హడావుడి.. గ్రామాల వారీగా వివిధ పార్టీల్లో చురుకైన నేతలు, కార్యకర్తల వివరాలపై ఆరా తీస్తూ వారిని అధికార, విపక్షమనే తేడా లేకుండా తమ దగ్గరకు చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామంలో పలుకుబడి ఉన్న పెద్దలు, మాజీ సర్పంచ్‌లు, ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తుల మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సాధారణ ఎన్నికల కంటే ముందే సర్పంచ్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఆర్థిక సాయం చేస్తామంటూ మచ్చిక చేసుకునే ప్రయత్నాలు కూడా సాగుతున్నాయి. అధికార పార్టీలో అసంతృప్తితో ఉన్న కార్యకర్తలు, నాయకులను పార్టీలో చేర్చుకుంటూ పార్టీ కండువాలు కప్పుతున్నారు. అధికార పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు మాత్రం ప్రస్తుతం తమ వెంట ఉన్న కేడర్ చేజారకుండా చూసుకుంటూనే, ఇతర పార్టీల కార్యకర్తలను దరికి చేర్చుకునేందుకు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. తమ వెంట వస్తే ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ఆర్థికంగా చేయూతనందిస్తామని చెబుతున్నారు. రాజకీయ ప్రత్యర్థికి కేడర్ లేకుండా చేయడం ద్వారా మానసికంగా బలహీనపర్చాలనే వ్యూహంతో సాగుతున్నారు. దీంతో గ్రామ స్థాయిలో ఒకే పార్టీలో రెండు, ఆపైన గ్రూపులు తయారు కావడంతో నేతలు కొత్త తలనొప్పులు ఎదుర్కొంటున్నారు. మొత్తంగా ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్ర, జిల్లా స్థాయిలోనే కాకుండా క్షేత్ర స్థాయిలోనూ రాజకీయ వలసలు మరింత ఊపందుకునేలా ఉన్నాయి. -
కేసీఆర్‌కు సాలిడ్ పంచ్
సాక్షి, హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వాల తీరు, ప్రత్యామ్నాయ కూటమి(ఫ్రంట్) ఏర్పాటు గురించి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు చేసిన సంచలన వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న బీజేపీని చూసి కేసీఆర్‌కు భయం పట్టుకుందని తెలంగాణ బీజేపీ చీఫ్ డాక్టర్ కె. లక్ష్మణ్ మండిపడ్డారు. ‘‘గుణాత్మక మార్పు అంటే ఏంటి? ‘కేసీఆర్ పదేపదే గుణాత్మక మార్పు మాట చెప్పారు. దళితుణ్ని ముఖ్యమంత్రిని చేయకుంటే తల నరుక్కుంటానని, ఆ తర్వాత తానే పీఠమెక్కడం, సంతలో పశువుల్లా ఎమ్మెల్యేలను కొనడం, అన్నంపెట్టే రైతులకు బేడీలు వేయడం, ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలను నిర్బంధించడం, ప్రశ్నించే గొంతుకలను అణిచివేయడం.. ఇదేనా గుణాత్మక మార్పు? ఇంతకుముందు చెప్పిన ఒక్కమాటకైనా కేసీఆర్ కట్టుబడి ఉన్నారా? కేంద్రం నిధులపై చర్చకు సిద్ధమేనా? ఫ్రంట్‌కు టెంట్ కూడా దొరకదు : 70 ఏళ్లుగా సాధ్యంకాని అభివృద్ధిని మోదీ ఈ 4 ఏళ్లలో చేసి చూపారు. అందుకే ప్రజలు బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నారు. కేసీఆర్.. ఓటమి అంచుల్లో కొట్టుమిట్టాడుతున్న పార్టీలను పోగేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకు ముందు కూడా దేశప్రజలు ఎన్నో ఫ్రంట్లను(కూటములను) చూశారు. సుస్థిరమైన నాయకత్వం కోసమే బీజేపీకి ఓటేసి నరేంద్ర మోదీని ప్రధానిని చేశారు. కేసీఆర్‌లాంటి వాళ్లు పెట్టే ఫ్రంట్లకు టెంట్లు కూడా దొరకవు. మోదీని తిట్టి, తిట్టలేదంటారా? : వాపును చూసి బలుపుగా భ్రమిస్తున్న కేసీఆర్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ప్రధాని అనే గౌరవంలేకుండా మోదీని తిట్టారు. కేసీఆర్ పొరపాటున నోరుజారాడని వారి సంతానం కేటీఆర్, కవితలే అంగీకరించారు. ఇప్పటికైనా ఆయన తప్పును ఒప్పుకుంటే హుందాగా ఉంటుంది. గత అసెంబ్లీలో కనీసం ఒక్క స్థానం కూడా లేని బీజేపీ త్రిపురలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతోంది. రేపు కర్ణాటక, ఆ తర్వాత తెలంగాణలోనూ మాదే విజయం ’’ అని లక్ష్మణ్ అన్నారు. బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్న లక్ష్మణ్, ఇతర నాయకులు -
24 గంటల కరెంటు బీజేపీ ఘనతే
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో నిరంతర విద్యుత్ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ ఘనతేనని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. విలేకరులో మాట్లాడుతూ.. 2018 వరకు తెలంగాణలో నిరంతర విద్యుత్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిందని చెప్పారు. ఉదయ్ పథకంలో రాష్ట్రాన్ని చేర్చడం, నార్త్ సౌత్ గ్రిడ్ అనుసంధానం, యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్లకు కేంద్రం అనుమతులు ఇచ్చిందన్నారు. ఒక్క మెగావాట్ ఉత్పత్తి పెరగకుండా రాష్ట్రం విద్యుత్‌ను ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. 2014 ముందు దేశంలో విద్యుత్ లోటు ఉందని, మోదీ ప్రభుత్వ విధానాల వల్ల దేశంలో విద్యుత్ ఉత్పత్తి పెరిగిందన్నారు. మోదీ సర్కారు వచ్చాక 19 రాష్ట్రాల్లో మిగులు విద్యుత్ ఏర్పడిందన్నారు. టీఆర్ఎస్ ఇది కేవలం రాష్ట్ర ఘనత అనడం విడ్డూరమన్నారు. 2019 లక్ష్యంగా బీజేపీ పని చేస్తోందని, అందులో భాగంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ వర్గీయ 3 జిల్లాల్లో పర్యటించారని చెప్పారు. -
ఎన్నో మలుపులు..మార్పులు!
కొత్త ప్రభాకర్‌రెడ్డికే గులాబీ మాల కేసీఆర్ అధికారిక ప్రకటన దేవిప్రసాద్‌కు ‘ఎమ్మెల్సీ’ ఇస్తామని హామీ ఎన్నో మలుపులు.. మార్పులు...ఎత్తులు.. కసరత్తులు... తర్వాత ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేశాయి. మెదక్ లోకసభ ఉప పోరుకు నామినేషన్ల గడువు బుధవారంతో ముగుస్తుండటంతో మంగళవారం పొద్దుపోయే వరకు కాంగ్రెస్, బీజేపీలు కసరత్తు చేశాయి. చిట్టచివరకు అభ్యర్థుల జాబితాను మదింపు చేసి గెలుపు గుర్రాలను ఎంపిక చేసి బరిలోకి దింపారు. గెలుపుపై దీమా ఉన్న టీఆర్ఎస్ ముందుగా తన అభ్యర్థిని ప్రకటించింది. సునీతారెడ్డికే కాంగ్రెస్ టికెట్ మెదక్ ఉప ఎన్నికకు కాంగ్రెస్‌పార్టీ.. మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి పేరును ఖరారు చేసింది. మేధోమథనం నేపథ్యంలో దాదాపు ఐదు రోజుల పాటు రాష్ట్రంలోనే మకాం వేసిన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ మెదక్ ఉప ఎన్నికపైనే దృష్టి సారించారు. పోటీ చేసేందుకు మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ, జగ్గారెడ్డి, దామోదర రాజనర్సింహ భార్య పద్మినీరెడ్డి పోటీ పడ్డారు. రేసులో మొదట సర్వే సత్యనారాయణ ముందంజలో ఉన్నారు. దీంతో జిల్లా నేతలంతా ఏకమై.. జిల్లాకు చెందిన వ్యక్తికే టికెట్ ఇవ్వాలని డిమాండ్ డిమాండ్ చేయడంతో అధిష్టానం సర్వే సత్యనారాయణ పేరును తొలగించినట్టు సమాచారం. ఫలితంగా రేసులో జగ్గారెడ్డి పేరు ముందు వరుసలోకి వచ్చింది. ఇక సీనియర్ నేతలు కొందరు జగ్గారెడ్డికి చెక్ పెట్టేందుకు సునీతా లక్ష్మారెడ్డి పేరును సూచించారు. ఆమె పేరు దాదాపు ఖరారు అయిందనే రెండు రోజుల కిందనే మీడియాలో వార్తలు వచ్చాయి. దీనికి సునీతారెడ్డి స్పందిస్తూ.. అధిష్టానం ఆదేశిస్తే ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి తాను సిద్ధమేనని, అయితే ఆర్థిక సహకారం అందిస్తేనే పోటీలో ఉంటానని మెలిక పెట్టడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. మరో 48 గంటల పాటు తర్జనభర్జన చేసి ఎట్టకేలకు సునీతారెడ్డి పేరునే ఖరారు చేశారు. కమలంలో ఇంకా వీడని సస్పెన్స్... బీజేపీ అభ్యర్థి ఎంపిక విషయంలో ఇంకా సస్పెన్స్ వీడటం లేదు. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రభుత్వ మాజీ విప్ జగ్గారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ భార్య పద్మినీరెడ్డి పేర్లు తెరమీదకు వచ్చాయి. ఇద్దరి పేర్లను రాష్ట్ర నాయకత్వం కేంద్రానికి నివేదించింది. బుధవారం నేరుగా ఢిల్లీ నుంచే బీఫాం అభ్యర్థి పేరు మీదనే రానున్నట్టు సమాచారం. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ కోర్ కమిటీ సమావేశమై మంగళవారం పొద్దు పోయేవరకు అభ్యర్థి ఎంపికపై చర్చలు జరిపారు. అంతకు ముందు రెండు రోజులు హైదరాబాద్‌లోనే మకాం వేసిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మెదక్ ఉపపోరును ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలవాలని రాష్ర్ట నేతలకు సూచించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి గెలుపు గుర్రాల కోసం అన్వేషించారు. పదుల సంఖ్యలో ఉన్న ఆశావహుల జాబితాను వడబోసి తుది జాబితా రూపొందించారు. ఈ జాబితాలో రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఆకుల రాజయ్య, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి, ఎస్సార్ ట్రాన్స్‌పోర్టు అధినేత అంజిరెడ్డి పేర్లు తుది పరిశీలనకు వచ్చాయి. వీరిలో ఒకరి పేరు ఖరారు చేస్తారని ప్రచారం జరిగింది. చివరకు జగ్గారెడ్డి, పద్మినీరెడ్డి పేర్లు తెరమీదకు వచ్చాయి. జగ్గారెడ్డి డీసీసీ అధ్యక్షునిగా నియమిస్తున్నట్లు ఈ నెల 23న ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ, సీనియర్ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూన్నారనే కారణంతో ఆ మరుసటి రోజే ఆయన నియామకాన్ని నిలిపివేశారు. పార్టీ నిర్ణయం పట్ల జగ్గారెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఒక వైపు కాంగ్రెస్ పార్టీ మేధోమథనం కార్యక్రమంలో పాల్గొంటూనే మరోవైపు బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్నారు. జగ్గారెడ్డి తనకున్న పాత పరిచయాలతో బీజేపీలో పావులు కదిపారు. జగ్గారెడ్డి సమైక్యవాదిగా ముద్ర పడ్డారనే కారణంతో ఆయన పునరాగమనాన్ని వ్యతిరేకించిన రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చివరకు అంగీకరించినట్లు తెలిసింది సంగారెడ్డి: మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. ఉద్యమ సమయంలో పార్టీకి అండగా ఉన్న రియల్ ఎస్టేట్ మిగతా వ్యాపారి కొత్త ప్రభాకర్‌రెడ్డికి టికెట్ ఖరారు చేశారు. ఈ మేరకు మంగళవారం గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌లో అధికారికంగా ప్రకటించారు. గత సాధారణ ఎన్నికల్లో మెదక్ పార్లమెంటు, గజ్వేల్ అసెంబ్లీ నుంచి కేసీఆర్ పోటీచేసి రెండు చోట్లా గెలుపొందిన విషయం విదితమే. తదనంతరం కేసీఆర్ మెదక్ పార్లమెంటుకు రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అప్పటినుంచే ఆశావహులు టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. కొత్త ప్రభాకర్‌రెడ్డితో పాటు టీఎన్జీవోల సంఘం నాయకుడు దేవిప్రసాద్, పొలిట్‌బ్యూరో సభ్యుడు రాజయ్య యాదవ్, విద్యార్థి నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్, రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రవీణ్‌రెడ్డి తదితరులు పోటీ పడ్డారు. ఎంపీ కల్వకుంట్ల కవిత, మంత్రి హరీష్‌రావు ద్వారా కొత్త ప్రభాకర్‌రెడ్డి మంత్రాంగం నడపగా... దేవిప్రసాద్ టీఎన్జీవో సంఘాన్ని నమ్ముకున్నారు.. దేవిప్రసాద్‌కు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ టీఎన్జీవోలు కేసీఆర్‌పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. ప్రవీణ్‌రెడ్డి మంత్రి కేటీఆర్‌తో ఉన్న సన్నిహిత సంబంధాలతో టికెట్‌కోసం యత్నించారు. చివరకు కేసీఆర్.. గులాబీ మాలను కొత్త ప్రభాకర్ మెడలో వేశారు. దేవిప్రసాద్ సేవలు రాష్ట్రానికి అవసరమని, అతణ్ణి ఎమ్మెల్సీగా ఎన్నుకుంటామని స్వయంగా కేసీఆర్ చెప్పడంతో టికెట్ కథ సుఖాంతమైంది. కొత్త ప్రభాకర్‌రెడ్డికి మొదటి నుంచి కేసీఆర్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయి. ప్రస్తుత నిజామాబాద్ ఎంపీ, కేసీఆర్ కూతురు కవిత అప్పట్లో స్థాపించిన తెలంగాణ జాగృతిని పల్లె పల్లెకు విస్తరింపజేయడంలో కొత్త ప్రభాకర్‌రెడ్డి విశేష కృషి చేశారు. గత సాధారణ ఎన్నికల్లో ఆయన దుబ్బాక నియోజకవర్గం నుంచి అసెంబ్లీ టికెట్‌ను అశించారు. అయితే సోలిపేట రామలింగారెడ్డికి టికెట్ దక్కింది. మెదక్ ఉప ఎన్నికలో టికెట్ నీకే ఇస్తానని కేసీఆర్ కొత్త ప్రభాకర్‌రెడ్డికి మాట ఇచ్చినట్లు అప్పట్లోనే ప్రచారం జరిగింది.