సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : సాధారణ ఎన్నికల్లో వివిధ రాజకీయపక్షాల తరఫున పోటీకి ఆసక్తి చూపుతున్న ఔత్సాహిక నేతలు క్షేత్ర స్థాయిలో సొంత బలాన్ని పెంచుకోవడంపై దృష్టి సారించారు. అధికార, విపక్ష పార్టీలనే తేడాలు లేకుండా వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. సొంత బలం ఉంటేనే టికెట్ వేటలో సొంత పార్టీలో పోటీని ఎదుర్కోవడం సాధ్యమవుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మండలాలు, గ్రామాల వారీగా వివిధ పార్టీల్లో చురుగ్గా ఉన్న నేతలు, కార్యకర్తలపై దృష్టి పెడుతున్నారు. ప్రత్యర్థి పార్టీలోని అసంతృప్తివాదులు, అవకాశవాదులు ఎవరనే కోణంలో ఆరా తీస్తున్నారు. వీలైన చోటల్లా పార్టీ కండువాలు కప్పుతూ చేరికల పేరిట హడావుడి సృష్టిస్తున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో జహీరాబాద్ అసెంబ్లీ స్థానం మినహా లోక్‌సభ, శాసనసభా నియోజకవర్గాలు అన్నింటిలోనూ అధికార టీఆర్‌ఎస్ నేతలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేల్లో 2019 ఎన్నికల్లో ఎంత మందికి తిరిగి అవకాశం దక్కుతుందనే అంశంపై సొంత పార్టీ నేతలే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చాలా చోట్ల అధికార టీఆర్‌ఎస్ పార్టీలోనూ సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని, తమకు అవకాశం ఇస్తారని ఔత్సాహిక నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలను మాత్రమే బరిలో దించాలని టీఆర్‌ఎస్ భావిస్తున్న నేపథ్యంలో చివరి నిమిషంలోనూ టికెట్ల కేటాయింపులో నాటకీయ పరి ణామాలు చోటు చేసుకుంటాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌కు రెండు లోక్‌సభ స్థానాలతో పాటు ఐదు అసెంబ్లీ స్థానాల్లో బలహీన లేదా బహుళ నాయకత్వం ఉండడంతో ఎవరికి టికెట్ దక్కుతుందో తెలియని పరిస్థితి ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా కొత్త ముఖాలను బరిలోకి దించే ఉద్దేశంతో ఇప్పటికే వడపోత ప్రారంభించింది. టీడీపీ పూర్తి స్థాయిలో జిల్లా రాజకీయ ముఖచిత్రం నుంచి కనుమరుగు కాగా, కొత్తగా టీజేఏసీ, బీఎల్‌ఎఫ్ తదితర పార్టీలు, కూటములు తెరమీదకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తంగా వచ్చే సాధారణ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లోనూ బహుముఖ పోటీ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
సొంత బలం కోసం నేతల తంటాలు..
ఎన్నికల్లో బహుముఖ పోటీతో పాటు పార్టీల్లోనూ టికెట్ ఆశిస్తున్న నేతలు కూడా బహుళ సంఖ్యలో ఉన్నారు. ఓ వైపు అధిష్టానం వద్ద టికెట్ కోసం లాబీయింగ్ చేస్తూనే.. క్షేత్ర స్థాయిలో బలం పెంచుకోవడానికి ఔత్సాహిక నేతలు ప్రాధాన్యత ఇస్తున్నారు. సొంత పార్టీలో టికెట్ ఆశిస్తున్న ప్రత్యర్థిపై సొంత బలం ద్వారా పైచేయి సాధించాలనే వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. అధికార టీఆర్‌ఎస్ పార్టీలో నర్సాపూర్, జహీరాబాద్, నారాయణఖేడ్ వంటి నియోజవకర్గాల్లో ఈ రకమైన పరిస్థితి నెలకొంది. సొంత బలాన్ని కలిగిఉంటే సిట్టింగులున్నా, వారిని కాదని టికెట్ ఇస్తారనే ఆశ సదరు నేతల్లో కనిపిస్తోంది. మరోవైపు కాంగ్రెస్‌లో సిద్దిపేట, దుబ్బాక, మెదక్, పటాన్‌చెరు నియోజకవర్గాల్లో బహుళ నాయకత్వం ఉండగా, ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు పోటాపోటీగా క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నారు. వివాహాలు, విందులు, మరణాలు తదితర సందర్భాల్లో గ్రామాల్లోకి వెళ్తూ ఆర్థిక సాయం ద్వారా బలం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలనుకుంటున్న బీజేపీ తన కేడర్‌తో పాటు, వివిధ పార్టీల్లో కార్యకర్తలు, నాయకుల వివరాలు సేకరిస్తోంది.
చేరికల పేరిట హడావుడి..
గ్రామాల వారీగా వివిధ పార్టీల్లో చురుకైన నేతలు, కార్యకర్తల వివరాలపై ఆరా తీస్తూ వారిని అధికార, విపక్షమనే తేడా లేకుండా తమ దగ్గరకు చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామంలో పలుకుబడి ఉన్న పెద్దలు, మాజీ సర్పంచ్‌లు, ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తుల మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సాధారణ ఎన్నికల కంటే ముందే సర్పంచ్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఆర్థిక సాయం చేస్తామంటూ మచ్చిక చేసుకునే ప్రయత్నాలు కూడా సాగుతున్నాయి. అధికార పార్టీలో అసంతృప్తితో ఉన్న కార్యకర్తలు, నాయకులను పార్టీలో చేర్చుకుంటూ పార్టీ కండువాలు కప్పుతున్నారు. అధికార పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు మాత్రం ప్రస్తుతం తమ వెంట ఉన్న కేడర్ చేజారకుండా చూసుకుంటూనే, ఇతర పార్టీల కార్యకర్తలను దరికి చేర్చుకునేందుకు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. తమ వెంట వస్తే ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ఆర్థికంగా చేయూతనందిస్తామని చెబుతున్నారు. రాజకీయ ప్రత్యర్థికి కేడర్ లేకుండా చేయడం ద్వారా మానసికంగా బలహీనపర్చాలనే వ్యూహంతో సాగుతున్నారు. దీంతో గ్రామ స్థాయిలో ఒకే పార్టీలో రెండు, ఆపైన గ్రూపులు తయారు కావడంతో నేతలు కొత్త తలనొప్పులు ఎదుర్కొంటున్నారు. మొత్తంగా ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్ర, జిల్లా స్థాయిలోనే కాకుండా క్షేత్ర స్థాయిలోనూ రాజకీయ వలసలు మరింత ఊపందుకునేలా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment