Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

India attacks terror camps in Pakistan1
ఫ్లాష్‌ ఫ్లాష్‌: పాక్‌లోని ఉగ్ర శిబిరాలపై భారత్‌ దాడి

పహల్గాం దాడికి భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరిట పీవోకేతో పాటు పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్‌ వైమానిక దాడులు జరిపింది. మొత్తం 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసినట్టు వెల్లడించింది. ఈ దాడిలో 12 మంది ఉగ్రవాదులు మృతి చెందగా మొత్తం 55 మందికి పైగా గాయపడ్డారు.పాకిస్తాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని కోట్లి, ముజఫరాబాద్, పంజాబ్‌లోని బహవల్‌పూర్‌తో పాటు లాహోర్‌ లోని ఒక ప్రదేశంపై భారత్‌ క్షిపణి దాడులు జరిపింది. ఈ సందర్భంగా ‘ఎయిర్‌ టు సర్ఫేస్‌’ మిసైళ్లను ప్రయోగించారు. దాడి అనంతరం ‘న్యాయం జరిగింది.. జైహింద్‌’ అంటూ భారత్‌ సైన్యం ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసింది. ఇవి సర్జికల్‌ స్ట్రైక్స్‌ కాదు. భారత భూభాగంనుంచే అత్యంత కచ్చితత్వంతో చేసిన దాడులని వెల్లడించింది. పహల్గాందాడిలో ఉగ్రవాదులు పురుషులను మాత్రమే ఎంచుకుని కాల్చి చంపి ఎందరో మహిళల నుదుటి సిందూరం తుడిచేసిన కారణంగానే ఆపరేషన్‌కు ‘సిందూర్‌’ అని నామకరణం చేశారు. మసూద్‌ అజర్, హఫీజ్‌ సయీద్‌ ప్రధాన స్థావరాలు లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని తెలుస్తోంది. భారత దాడి అనంతరం పాకిస్తాన్‌లో ఎమర్జెన్సీ ప్రకటించారు. విమానాశ్రయాలు మూసివేశారు. కాగా దాడులను ధృవీకరించిన పాకిస్తాన్‌ ప్రతీకార దాడులు చేస్తామంటూ ప్రకటించింది. అర్ధరాత్రి 1:44కు ఈ దాడులు జరిగినట్టు ఎక్స్‌లో అధికారికంగా పోస్ట్‌ చేసిన భారత సైన్యం. దాడి అనంతరం భారత్‌ మాతాకీ జై అంటూ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టిన రాజ్‌నాద్‌ సింగ్‌. भारत माता की जय!— Rajnath Singh (@rajnathsingh) May 6, 2025

Chandrababu Coalition govt fails to respond to 50 percent marks in degree2
మెగా పేరుతో ఎందుకీ దగా?

సాక్షి, అమరావతి: డీఎస్సీ అభ్యర్థులను కూటమి ప్రభుత్వం ముప్పు తిప్పలు పెడుతోంది. అర్హత మార్కుల నిబంధన పేరుతో దరఖాస్తు దశలోనే ఎంతో మందిని అనర్హులను చేసింది. ఈ అంశంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) నిబంధనలను సైతం పరిగణనలోకి తీసుకోకుండా సగం మంది అభ్యర్థులపై ప్రాథమిక దశలోనే వేటు వేసింది. అభ్యర్థుల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు రిజర్వుడు కేటగిరీలో ఉన్న అభ్యర్థుల అర్హత మార్కులు తగ్గించినా, జనరల్‌ అభ్యర్థుల మార్కుల నిబంధనను సడలించలేదు. డీఎస్సీ ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఇంకా తొమ్మిది రోజులే మిగిలి ఉండడంతో లక్షల మంది జనరల్‌ అభ్యర్థులు తమనూ పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. వాస్తవానికి టెట్‌ అర్హత సాధించిన అందరికీ డీఎస్సీ రాసేందుకు అర్హత కల్పించాల్సి ఉన్నా, ప్రభుత్వం ఆ దిశగా కనీసం ఆలోచించక పోవడంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెగా డీఎస్సీ–2025 పేరుతో గత నెల 20న 16,347 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు 10 నెలల పాటు ఊరించి ఇచ్చిన ఈ నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనలు అభ్యర్థులకు తీరని నష్టం కలిగించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎస్జీటీ పోస్టులకు ఇంటర్మీడియట్‌లో, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు డిగ్రీలో 50 శాతం మార్కులు తప్పనిసరి చేసింది. వాస్తవానికి 2011 జూలై 29కి ముందు బీఈడీ, డీఈడీ చేసిన వారికి ఈ నిబంధన వర్తించదని 2019 నవంబర్‌లో భారత ప్రభుత్వం గెజిట్‌ విడుదల చేసినా.. ఇవేమీ పట్టించుకోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో డీఎస్సీ అభ్యర్థుల జీవితాలతో ఆడుకుంటోంది. కనీస మార్కుల అంశంలో భిన్న వైఖరి అభ్యర్థుల అర్హత మార్కుల అంశంలో అటు ప్రభుత్వం, ఇటు పాఠశాల విద్యాశాఖలు భిన్నంగా వ్యవహరించడం విస్తుగొలుపుతోంది. తొలుత ఇంటర్, గ్రాడ్యుయేషన్‌లో జనరల్‌ అభ్యర్థులకు 50 శాతం, రిజర్వుడు అభ్యర్థులకు 45 శాతం అర్హత మార్కులు తప్పనిసరి చేసింది. అనంతరం టీచర్‌ అర్హత పరీక్ష (టెట్‌)లో రిజర్వుడు అభ్యర్థులకు 40 శాతం మార్కు­లే పేర్కొన్నందున డీఎస్సీ అర్హత మార్కులను 40 శాతానికి తగ్గిస్తూ అనుబంధ జీవోలను ప్రభుత్వం విడుదల చేసింది. కానీ జనరల్‌ అభ్యర్థులకు మాత్రం 50 శాతం అలాగే ఉంచింది. వాస్తవా­నికి జనరల్‌ అభ్యర్థులకు టెట్‌లో అర్హత మార్కులు 45 శాతం ఉన్నా, ఆ మేరకు అయినా తగ్గించక పో­వడం గమనార్హం. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో గతేడాది ఫిబ్ర­వరిలో విడుదల చేసిన డీఎస్సీ–­2024లో తొలుత 50 శాతం మార్కుల నిబంధన విధించగా అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. దాంతో ఎన్‌సీటీఈ నిబంధనల మేరకు ఇంటర్మీడియట్, డిగ్రీలలో కనీస మార్కులు జనరల్‌ అభ్యర్థులకు 45 శాతం, రిజర్వేషన్‌ అభ్యర్థులకు 40 శాతానికి తగ్గించారు. ఈ మేరకు నియమకాలు కూడా జరిగిపోయాయి. కానీ ఏపీలో మా­త్రం ఎన్‌సీటీఈ నిబంధనల అమలు చేయలేదు. నిబంధనలు ఏం చెబుతున్నాయంటే.. ఉపాధ్యాయ నియామకాలపై రాజస్థాన్, ఉత్తరఖండ్‌ రాష్ట్రాల్లో ఇదే సమస్య ఉత్పన్నమైనప్పుటు అక్కడి అభ్యర్థులు ఆయా రాష్ట్రాల హైకోర్టులను ఆశ్రయించారు. దాంతో డిగ్రీలో కనీస అర్హత మార్కులపై ఇచ్చిన తీర్పులకు అనుగుణంగా సుప్రీంకోర్టు ఎన్‌సీటీఈకి మార్గదర్శకాలు విడుదల చేసింది. కనీస మార్కులపై తగిన నిర్ణయాన్ని ప్రకటించాలని, హైకోర్టు తీర్పునకు అనుగుణంగా ఉండేలా సూ­చ­నలు చేసింది. ఎన్‌సీటీఈ 2019 నవంబర్‌ 21న గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ప్రకారం ‘ఉపాధ్యాయ నియామకాల్లో 2011 జూలై 29కి ముందు బీఈడీ, డీఈడీ లేదా సమానమైన కో­ర్సులో ప్రవేశం పొందిన వారికి గ్రాడ్యుయేషన్‌లో కనీస మార్కుల శాతం వర్తించదు’ అని ప్రకటించింది. 2011 ఆగస్టు 2నాటి ఎన్‌సీటీఈ గెజిట్‌ నోటిఫికేషన్‌లోనూ కనీసం 45 శాతం మార్కులతో గ్రాడ్యు­యేషన్, ఏడాది కాల పరిమితి గల బీఈడీ చేసినవారు డీఎస్సీకి అర్హులుగా పేర్కొంది. ఈ లెక్కన ఎలా చూసినా జనరల్‌ అభ్యర్థులకు డీఎస్సీ రాసేందుకు అర్హత మార్కులు 45 శాతం మించరాదు. నిబంధనల్లో వివక్షపై తీవ్ర విమర్శలు రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ నియామకాల కోసం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌ నిబంధనలు పూర్తి వివక్షతో ఉన్నాయని అటు అభ్యర్థులు, ఇటు ఉపాధ్యాయ సంఘాలు విమర్శిస్తున్నాయి. ప్రభు­త్వం ఇచ్చిన జీవో నంబర్‌ 15లో 2007 వరకు డిప్లొ­మా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో ప్రవేశం పొందిన వారు కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్మీడియ­ట్‌ ఉంటే ఎస్జీటీకి అర్హులుగా పేర్కొంది. కానీ స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు 29 జూలై 2011కు ముందు బీఈడీ లేదా బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ లేదా తత్సమాన కోర్సులో ప్రవేశం పొందిన వారికి గ్రాడ్యుయేషన్‌లో కనీస మార్కుల శాతం వర్తించ­దన్న ఎన్‌సీటీఈ గెజిట్‌ నోటిఫికేషన్‌ నిబంధనలను మెగా డీఎస్సీ ఉత్తర్వుల్లో పేర్కొనలేదు. ఈ నిబంధనను తెలంగాణ డీఎస్సీ–2024 కోసం ఇ­చ్చిన సవరణ జీవో నంబర్‌ 14లో పేర్కొన్నారు. దీని ప్రకారం రిజర్వుడు అభ్యర్థులకు 40 శాతం, జనరల్‌ అభ్యర్థులకు 45 శాతం అర్హత మార్కులుగా నిర్ణయించారు. దీంతోపాటు ఎన్‌సీటీఈ గెజిట్‌ నోటిఫి­కేషన్‌ ప్రకారం 2011 జూలై 29 నాటికి బీఈడీ, డీఈడీ చేసిన వారికి అర్హత మార్కుల నిబంధన తొలగించారు. కానీ ఏపీ ప్రభుత్వం ఎన్‌సీటీఈ నిబంధనలను పట్టించుకోకపోవడంతో అర్హులైన జనరల్‌ అభ్యర్థులకు తీవ్ర అన్యా­యం జరిగినట్లయింది. దీనిపై జనరల్‌ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.సీబీఎస్‌ఈ అభ్యర్థులకు అన్యాయం పదో తరగతి వరకు సీబీఎస్‌ఈలో చదివి, డీఈడీ ఇంగ్లిష్‌ మీడియంలో పూర్తి చేసిన వారికీ ప్రభుత్వం డీఎస్సీలో అన్యాయం చేసింది. సీబీఎస్‌ఈ విద్యార్థులకు మొదటి భాష ఇంగ్లిష్‌ మాత్రమే ఉంటుంది. రెండో భాషగా తెలుగు/హిందీ/ ఉర్దూ తదితర భాషలు ఎంచుకుంటారు. అయితే, మొదటి భాష తెలుగు ఉంటేనే ఎస్జీటీ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలని నిబంధన పెట్టడంతో సీబీఎస్‌ఈ అభ్యర్థులు నష్టపోతున్నారు. ఫిబ్రవరి–2024 డీఎస్సీ నోటిఫికేషన్‌లో ఈ సమస్య లేదని అభ్యర్థులు చెబుతున్నారు. జూలై–2024 టెట్‌లోనూ కూటమి ప్ర­భు­త్వం ఈ నిబంధన పేర్కొనలేదంటున్నారు. ఉన్న ఫళంగా నిబంధలు మార్చేసి అన్యాయం చేస్తే సహించమని, తాజా టెట్‌ అర్హత సాధించిన అందరికీ డీఎస్సీకి అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

India will now use the water for is own interests PM Modi3
మా దేశం నీళ్లు ఇక మావే: ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ: ఇక నుంచి భారత్‌కు చెందిన నీళ్లు దేశ ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగించబడతాయని ప్రధాని నరేంద్ర మోదీ నొక్కి చెప్పారు. భారత నీళ్లు ఇప్పటివరకూ బయటకు వెళ్లాయని, ఇక నుంచి అది ఉండదన్నారు. మన నీళ్లు- మన హక్కు అంటూ ప్రధాని మోదీ స్సష్టం చేశారు. పాకిస్తాన్‌ కు సింధు జలాల నిలిపివేత అంశంపై స్పందించిన మోదీ.. మన నీళ్లు ఇక నుంచి మన అవసరాలకు మాత్రమే వినియోగిస్తామన్నారు.చీనాబ్ నదిపై ఉన్న బాగ్లిహార్ ఆనకట్ట నుండి పాకిస్తాన్‌కు నీటి ప్రవాహాన్ని నిలిపివేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో జీలం నదిపై ఉన్న కిషన్‌గంగా ప్రాజెక్ట్ నుండి ప్రవాహాలను తగ్గించడానికి సన్నాహాలు చేస్తున్న తరుణంలో ప్రధాని మోదీ ఈ ప్రకటన చేశారు.కాగా, ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ ల మధ్య యుద్ధ వాతావరణ తలపిస్తోంది. ఈ ఉగ్రవాద చర్య పాకిస్తాన్ భూ భాగం నుంచే జరిగిందేనని బలంగా నమ్ముతున్న భారత్.. ఆ మేరకు ఆంక్షలు విధిస్తూ వస్తోంది. పాకిస్తాన్ ను అష్టదిగ్బంధనం చేసి ఉక్కిరి బిక్కిరి చేసే యత్నాలను ఇప్పటికే భారత్ ప్రారంభించింది. పాకిస్తాన్ పౌరులు భారత్ ను విడిచి వెళ్లిపోవాలనే ఆదేశాల దగ్గర్నుంచి పలు నిషేధాజ్ఞల్ని భారత్ అమలు చేస్తూ వస్తోంది. సింధూ జలాలను పాక్‌కు వెళ్లకుండా నిలిపివేయడం, భారత్‌లో పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖుల యూట్యూబ్‌ చానెళ్ల నిలిపివేత, భారత్‌ జలాల్లోకి పాక్‌ ఓడలు రాకుండా నిషేధం, పాక్‌ దిగుమతులపై నిషేధం ఇలా పలు రకాలైన ఆంక్షలతో పాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.అంతు చూస్తాం..ఉగ్రవాదుల్ని, వారి మద్దతు దారుల అంతు చూస్తామని మూడు రోజుల క్రితం మరోసారి హెచ్చరించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. మానవాళికి ఉగ్రవాదం అనేది అతి పెద్ద వినాశనకారి అని పేర్కొన్న మోదీ.. ఉగ్రవాదాన్ని అంతం చేయడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు. ఉగ్రదాడి తర్వాత మోదీ మాట్లాడుతూ.. పహల్గామ్ పై ఘటనకు బాధ్యులైన వారిని ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రస్తక్తే లేదన్నారు. వారిని మట్టిలో కలిపేస్తామంటూ మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా మరోసారి ఉగ్రచర్యలకు సంబంధించి హెచ్చరికలు జారీ చేశారు.

CBI Special Court: Sabitha Indra Reddy Not guilty in Obulapuram mining case4
ఓబుళాపురం మైనింగ్‌ కేసు.. సబిత నిర్దోషి

సాక్షి, హైదరాబాద్‌: ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ (ఓఎంసీ) కేసులో నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం తుది తీర్పు వెల్లడించింది. గనుల శాఖ మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి, పరిశ్రమల శాఖ అప్పటి కార్యదర్శి కృపానందంలను నిర్దోషులుగా ప్రకటించింది. దాదాపు 15 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసులో మంగళవారం మొత్తం ఐదుగురిని దోషులుగా, ఇద్దరిని నిర్దోషులుగా తేల్చింది. ప్రధాన నిందితులైన ఓఎంసీ అప్పటి డైరెక్టర్, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి, కంపెనీ ఎండీ బీవీ శ్రీనివాసరెడ్డి, గనుల శాఖ అప్పటి డైరెక్టర్‌ వీడీ రాజగోపాల్, గాలి జనార్దనరెడ్డి పీఏ మెహఫూజ్‌ అలీఖాన్‌లను దోషులుగా నిర్ధారిస్తూ.. ఏడేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల చొప్పున,ఓఎంసీకి రూ.2 లక్షల జరిమానా విధించింది. రాజగోపాల్‌కు అవినీతి నిరోధక చట్టం కింద అదనంగా నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. కాగా, పరిశ్రమల శాఖ అప్పటి కార్యదర్శి ఐఏఎస్‌ అధికారి యర్రా శ్రీలక్ష్మిని ఈ కేసు నుంచి డిశ్చార్జ్‌ చేస్తూ తెలంగాణ హైకోర్టు 2022లో తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. 2009లో కేసు నమోదు ఏపీ–కర్ణాటక సరిహద్దు అనంతపురం, బళ్లారి రిజర్వు ఫారెస్టులో ఓబుళాపురం గ్రామ పరిధిలోని ఇనుప గనుల తవ్వకాలను ఓఎంసీ నిర్వహించేంది. అయితే, నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేపట్టిందని 2009 డిసెంబరు 7న సీబీఐకి ఫిర్యాదు అందింది. అనుమతి పొందిన 68.5 హెక్టార్ల ప్రాంతాన్ని దాటి ఇనుప ఖనిజాన్ని తవి్వందని అందులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ.. బీవీ శ్రీనివాసరెడ్డి, గాలి జనార్దన్‌రెడ్డి, వీడీ రాజగోపాల్, ఓఎంసీ, కృపానందం, సబితాఇంద్రారెడ్డి, గనుల శాఖ నాటి ఏడీ లింగారెడ్డి, శ్రీలక్ష్మిలపై అభియోగాలు నమోదు చేసింది. ఐపీసీ సెక్షన్లతో పాటు కొందరిపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు పెట్టింది. రూ.884.13 కోట్ల మేర అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారని 2011లో సీబీఐ తొలి చార్జిషీట్‌ దాఖలు చేసింది. 2014 వరకు ఇలా నాలుగు చార్జిషీట్లు వేసింది. 60 లక్షల మెట్రిక్‌ టన్నుల ఇనుప ఖనిజాన్ని అక్రమంగా విదేశాలకు ఎగుమతి చేశారని, బినామీ లావాదేవీలు జరిగాయని సీబీఐ పేర్కొంది. కాగా, కేసు విచారణ ఏళ్లకు ఏళ్లు పడుతుండడంతో సుప్రీంకోర్టు విచారణను పర్యవేక్షిస్తూ.. మే నెలలోగా పూర్తి చేయాలని గడువు విధించింది. ఇక 219 మంది సాక్షులను విచారించి, 3,330 డాక్యుమెంట్లను పరిశీలించిన సీబీఐ న్యాయస్థానం గత నెలలో తీర్పు రిజర్వు చేసింది. కాగా, లింగారెడ్డి విచారణ దశలోనే మృతి చెందారు. కోర్టుకు హాజరైన నిందితులు తీర్పు వెల్లడి సందర్భంగా కేసులో నిందితులు కోర్టుకు హాజరయ్యారు. ఈ నెల 18న తన కుమారుడి పెళ్లి ఉందని అప్పటివరకు అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వాలని శ్రీనివాసరెడ్డి కోరారు. తాను ఎన్నో ప్రజాపయోగ కార్యక్రమాలు చేశానని, పేద కుటుంబం నుంచి వచ్చి వేలాదిమందికి ఉపాధి కల్పించానని గాలి జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. కోర్టు తనను బళ్లారిలో అడుగుపెట్టొద్దని ఆదేశించినా, మరో నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచానని తెలిపారు. ఉపశమనం కల్పిస్తే ఆధ్యాత్మిక పథంలో వెళ్తానని విన్నవించారు. ప్రభుత్య ఉద్యోగులందరినీ వదిలేసి తనను శిక్షించడం అన్యాయమని రాజగోపాల్‌ నివేదించారు. తనపై ఆధారపడి తల్లిదండ్రులు, నలుగురు పిల్లలు ఉన్నారని అలీ విజ్ఞప్తి చేశారు. సబితాఇంద్రారెడ్డి, కృపానందం కూడా కోర్టుకు హాజరయ్యారు.

MI vs GT IPL 2025: Gujarat Titans beat Mumbai Indians by 3 wickets5
ముంబై జోరుకు బ్రేక్‌

ముంబై: ఐపీఎల్‌–2025లో ముంబై ఇండియన్స్‌ జైత్రయాత్రకు కాస్త విరామం... వరుసగా ఆరు విజయాలతో కొనసాగించిన జోరుకు గుజరాత్‌ టైటాన్స్‌ బ్రేక్‌ వేసింది. మంగళవారం వాంఖెడే మైదానంలో జరిగిన పోరులో గుజరాత్‌ 3 వికెట్ల తేడాతో (డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం) ముంబైపై విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. విల్‌ జాక్స్‌ (35 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా, సూర్యకుమార్‌ యాదవ్‌ (24 బంతుల్లో 35; 5 ఫోర్లు) రాణించాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 43 బంతుల్లో 71 పరుగులు జోడించారు. చక్కటి బౌలింగ్‌తో ముంబైని తక్కువ స్కోరుకు కట్టడి చేయడంలో టైటాన్స్‌ సఫలమైంది. అనంతరం గుజరాత్‌ 19 ఓవర్లలో 7 వికెట్లకు 147 పరుగులు చేసి గెలిచింది. శుబ్‌మన్‌ గిల్‌ (46 బంతుల్లో 43; 3 ఫోర్లు, 1 సిక్స్‌), జోస్‌ బట్లర్‌ (27 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్స్‌), రూథర్‌ఫర్డ్‌ (15 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. ఛేదనలో 14 ఓవర్ల తర్వాత 107/2తో గుజరాత్‌ మెరుగైన స్థితిలో నిలిచింది. చేతిలో 8 వికెట్లు ఉన్న జట్టు మరో 36 బంతుల్లో 49 పరుగులే చేయాలి. గుజరాత్‌ విజయం లాంఛనమే అనిపించింది. ఈ దశలో వానతో చాలా సేపు ఆట ఆగిపోయింది. అంతా చక్కబడి మ్యాచ్‌ మొదలైన తర్వాత ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. బుమ్రా, బౌల్ట్‌ చెలరేగిపోవడంతో గుజరాత్‌ బ్యాటింగ్‌ తడబాటుకు లోనైంది. తర్వాతి 4 ఓవర్లలో 25 పరుగులు చేసిన జట్టు 16 బంతుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయింది. 2 ఓవర్లలో 24 పరుగులు చేయాల్సిన ఉన్న సమయంలో మళ్లీ భారీ వర్షంతో ఆట ఆగిపోయింది. దాంతో ఆటను ఒక ఓవర్‌ కుదించి డక్‌వర్త్‌–లూయిస్‌ ప్రకారం గుజరాత్‌ లక్ష్యాన్ని 19 ఓవర్లలో 147గా నిర్దేశించారు. దాంతో చివరి ఓవర్లో విజయానికి 15 పరుగులు అవసరమయ్యాయి. చహర్‌ వేసిన ఈ ఓవర్లో టైటాన్స్‌ 15 పరుగులు చేసి విజయాన్నందుకుంది. స్కోరు వివరాలు: ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: రికెల్టన్‌ (సి) సుదర్శన్‌ (బి) సిరాజ్‌ 2; రోహిత్‌ (సి) ప్రసిధ్‌ (బి) అర్షద్‌ 7; జాక్స్‌ (సి) సుదర్శన్‌ (బి) రషీద్‌ 53; సూర్యకుమార్‌ (సి) షారుఖ్‌ (బి) సాయికిషోర్‌ 35; తిలక్‌ (సి) గిల్‌ (బి) కొయెట్జీ 7; పాండ్యా (సి) గిల్‌ (బి) సాయికిషోర్‌ 1; నమన్‌ (సి) గిల్‌ (బి) ప్రసిధ్‌ 7; బాష్‌ (రనౌట్‌) 27; చహర్‌ (నాటౌట్‌) 8; కరణ్‌ శర్మ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 155. వికెట్ల పతనం: 1–2, 2–26, 3–97, 4–103, 5–106, 6–113, 7–123, 8–150. బౌలింగ్‌: సిరాజ్‌ 3–0–29–1, అర్షద్‌ 3–0–18–1, ప్రసిధ్‌ 4–0–37–1, సాయికిషోర్‌ 4–0–34–2, రషీద్‌ ఖాన్‌ 4–0–21–1, కొయెట్జీ 2–0–10–1. గుజరాత్‌ టైటాన్స్‌ ఇన్నింగ్స్‌: సాయి సుదర్శన్‌ (సి) రికెల్టన్‌ (బి) బౌల్ట్‌ 5; గిల్‌ (బి) బుమ్రా 43; బట్లర్‌ (సి) రికెల్టన్‌ (బి) అశ్వని 30; రూథర్‌ఫర్డ్‌ (ఎల్బీ) (బి) బౌల్ట్‌ 28; షారుఖ్‌ (బి) బుమ్రా 6; తెవాటియా (నాటౌట్‌) 11; రషీద్‌ ఖాన్‌ (ఎల్బీ) (బి) అశ్వని 2; కొయెట్జీ (సి) నమన్‌ (బి) చహర్‌ 12; అర్షద్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (19 ఓవర్లలో 7 వికెట్లకు) 147. వికెట్ల పతనం: 1–6, 2–78, 3–113, 4–115, 5–123, 6–126, 7–146. బౌలింగ్‌: దీపక్‌ చహర్‌ 3–0–32–1, బౌల్ట్‌ 4–0–22–2, బుమ్రా 4–0–19–2, హార్దిక్‌ పాండ్యా 1–0–18–0, కరణ్‌ శర్మ 2–0–13–0, అశ్వని కుమార్‌ 4–0–28–2, జాక్స్‌ 1–0–15–0.

Sakshi Guest Column On India Pakistan Issues6
ఇది ఐక్యతా సమయం

గత వారం ఓ రోజు ఉదయం 6 గంటల తర్వాత నా మొబైల్‌లో నోటిఫికేషన్‌ పింగ్‌ అయింది. నా స్నేహితుడి కొడుకు నుండి ఒక సందేశం వస్తున్నట్లు నేను చూశాను. పహల్గామ్‌లో జరిగిన సంఘటనల గురించి అతను కలత చెందాడు. సంఘటన తర్వాత వెంటనే ఎటువంటి ప్రతీకార చర్యా తీసుకోనందుకు మన ప్రభుత్వంపై అతడు అసహనం వ్యక్తం చేశాడు. ప్రభుత్వం తక్షణ చర్య తీసుకోవడానికి తీవ్రస్థాయిలో మీడియా ప్రచారాన్ని నడపటం ద్వారా నా వంతు కృషి నేను చేస్తానని అతను ఆశించాడు. నేను షాక్‌ అయ్యాను. చిన్నప్పటి నుండి అతడు నాకు తెలుసు. దేశంలోని ఉత్తమ పాఠశాలల్లో అతను చదువుకున్నాడు. ఇంజనీరింగ్‌ డిగ్రీని సాధించాడు. ఇన్‌ స్టిట్యూట్‌ నుండి పట్టభద్రుడయ్యే ముందు, అతనికి ఓ బహుళజాతి సంస్థ ఉద్యోగం ఆఫర్‌ కూడా ఉండేది. ఉన్నత స్థాయికి ఎదిగాడు. నేడు కార్పొరేట్‌ వర్గాల ఆకర్షణీయమైన సర్కిల్‌లో ఉంటున్నాడు. తన తెలివితేటలు, జ్ఞానం వల్ల మంచి గుర్తింపు, గౌరవం పొందాడు. అందుకే తాను ప్రకటించిన విద్వేష భావానికి నేను పెద్దగా కలత చెందలేదు. తనను ప్రశాంతంగా ఉండమని సలహా ఇచ్చాను. ప్రభుత్వాన్ని విశ్వసించమని నచ్చ చెప్పాను. సరైన సమయం వచ్చినప్పుడు, ప్రపంచం భారత్‌ నుండి పూర్తి స్థాయి చర్యను వీక్షిస్తుందని చెప్పాను. 1971లోనూ భారతదేశంలో ఇలాంటి యుద్ధ సన్నద్ధతే పెరుగుతూ వచ్చిందని అతనికి గుర్తు చేశాను. తిరుగులేని వ్యూహకర్త మానెక్‌ షా!అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ శ్యామ్‌ మానెక్‌ షాను పిలిపించారు. ‘‘తూర్పు పాకిస్తాన్‌ పై భారత సైన్యం వెంటనే దాడి చేసి, దాన్ని స్వతంత్ర దేశంగా, బంగ్లాదేశ్‌గా మార్చడానికి సహాయం చేయగలదా?’’ అని ఆమె అడిగారు. అద్భు తమైన వ్యూహకర్త మానెక్‌ షా. కొన్ని నెలల్లో రుతుపవనాలు రాను న్నాయని ప్రధానితో చెప్పారు. వర్షాకాలంలో, బంగ్లాదేశ్‌లోని పొలాలు చిత్తడి నేలలుగా మారతాయి. అందువల్ల అలాంటి సమయంలో దాడి చేయడం అంటే అది పెద్ద ఎత్తున సైనికుల మరణానికి దారితీస్తుందని వివరించారు. దాంతో మానెక్‌ షా తొందరపాటు ఆదేశాలు జారీ చేయబోవడం లేదని నిర్ధారణ అయింది. అనంతరం, తొమ్మిది నెలలపాటు జాగ్రత్తగా వేసుకున్న ప్రణాళిక, సమన్వయం, కచ్చితమైన వ్యూహం తర్వాత, భారత దళాలు తూర్పు పాకిస్తాన్‌పై దాడి చేసినప్పుడు, శత్రువు ఓడిపోవడమే కాకుండా, 90,000 మందికి పైగా పాక్‌ సైనికులు భారత్‌కు లొంగిపోయారు. మానవాళి చరిత్రలో, ఇంత పెద్ద సైనిక దళం ఎప్పుడూ ప్రత్యర్థికి లొంగి పోలేదు. 1971 డిసెంబర్‌ 16న, భారత సైన్యం తన అత్యుత్తమ ఘడియను ఆస్వాదిస్తూ, మన సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యా యాన్ని లిఖిస్తున్న సమయంలో బంగ్లాదేశ్‌ ఆవిర్భవించింది.1971ని తలపిస్తున్న మంతనాలుప్రస్తుత ప్రధాని కూడా భారత సాయుధ దళాలకు పాక్‌పై తగిన చర్య తీసుకోవడానికి అధికారం ఇచ్చారు. నెంబర్‌ 7 – లోక్‌ కల్యాణ్‌ మార్గ్, నార్త్‌ బ్లాక్, సౌత్‌ బ్లాక్‌లలో వ్యూహాత్మక సమావేశాలు జరిగాయి. సైనిక చర్యలు ఆర్థిక, దౌత్యపరమైన పర్యవసానాలను కలిగి ఉంటాయి. కనీస ప్రాణనష్టంతో త్వరిత విజయాన్ని సాధించడానికి, శక్తిమంతమైన మిత్రులు మద్దతు ఇవ్వడానికి లేదా నిర్ణాయక సమయంలో కనీసం తటస్థంగా ఉండటానికి కొన్ని నిబద్ధతలు అవసరం. 1991లో మొదటి గల్ఫ్‌ యుద్ధంలో సంకీర్ణ సైన్యానికి నాయకత్వం వహించిన యు.ఎస్‌. జనరల్‌ నార్మన్‌ స్క్వార్జ్‌కోఫ్, ‘‘మీరు శాంతిలో ఎంత ఎక్కువ చెమట చిందిస్తే, యుద్ధంలో అంత తక్కువ రక్తస్రావం అవుతుంది...’’ అని అన్నారు.రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ అమెరికా సహా వివిధ దేశాలలో తమ సమ ఉజ్జీలతో ముమ్మరంగా చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చలు 1971ని గుర్తుకు తెస్తున్నాయి. ఆనాడు మానెక్‌ షా, నావికాదళ, వైమానిక దళ అధిపతులు యుద్ధా నికి సిద్ధమవుతుండగా, ఇందిరా గాంధీ కూడా నమ్మకమైన దౌత్య భాగస్వాముల కోసం వెతికే పనిలో పడ్డారు. భారతదేశం అప్పటికి కొంతకాలం క్రితం పాశ్చాత్య జోక్యానికి వ్యతిరేకంగా హామీ కోసం నాటి సోవియట్‌ యూనియన్‌తో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తరువాత, యుద్ధ సమయంలో బంగాళాఖాతంలో అమెరికన్‌ సిక్స్‌త్‌ ఫ్లీట్‌ కనిపించడం, దాన్ని ఎదుర్కోవడానికి సోవి యట్‌ జలాంతర్గాములు రావడం వంటి సంఘటనలు భారతదేశపు దౌత్యపరమైన మాస్టర్‌ స్ట్రోక్‌ (పైఎత్తు)ను ధ్రువీకరించాయి. నేడు రెండూ అణ్వాయుధ శక్తులే!నేటి పరిస్థితి కూడా అంతే ప్రమాదకరమైనది. ట్రంప్‌ 2.0 యుగంలో ఇది మరింత క్లిష్టంగా మారింది. ఎటువంటి భావజాలం లేకుండా, సోషల్‌ మీడియా నిరంతర చూపు కింద నడిచే భౌగోళిక రాజకీయాలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. 1971లో మాది రిగా కాకుండా భారతదేశం, పాకిస్తాన్‌ రెండూ ఇప్పుడు అణ్వాయుధ శక్తులు. మనకు మద్దతు ఇవ్వడానికి ఇప్పుడు సోవియట్‌ యూనియన్‌ లేదు. ఏదైనా సహాయం అందించే పరిమిత సామర్థ్యంతోనే రష్యా ఇప్పుడు ఉక్రెయిన్‌ తో పోరాడుతోంది, చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యి వ్యాఖ్యలు బీజింగ్‌ జాగరూకతా వైఖరిని వెల్లడిస్తున్నాయి: ‘‘సంఘర్షణ అనేది భారత్‌ లేదా పాకిస్థాన్‌ ప్రాథమిక ప్రయోజనాలకు నష్టం చేస్తుంది..’’ అని వాంగ్‌ వ్యాఖ్యానించారు. అయితే చైనా సానుభూతి పాక్‌ వైపు ఉంది. ప్రపంచంలోని ఏకైక అగ్రరాజ్యమైన అమెరికా, మిశ్రమ సంకేతాలను పంపుతోంది. ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌ ప్రకటనను పరిగణించండి: ‘‘పహల్గామ్‌ దాడి పట్ల భారత్‌ విస్తృత ప్రాంతీయ సంఘర్షణకు దారితీయని విధంగా ప్రతిస్పంది స్తుందని మేము ఆశిస్తున్నాము’’ అన్నారాయన. ప్రమాదకరంగా సోషల్‌ మీడియా!ప్రభుత్వం చేతులు కట్టివేయడం, దాని ఎంపికలను పరిమితం చేయడం వంటి సంక్లిష్టతలను గ్రహించకుండా, లెక్కలేనన్ని స్వరాలు సోషల్‌ మీడియాలో ఇప్పుడు ఉగ్రదాడి పట్ల, పాక్‌ పైన నిరంతరం మండిపడుతున్నాయి. సర్జికల్‌ స్ట్రయిక్స్‌ అయినా, లేదా బాలాకోట్‌ వైమానిక దాడి అయినా సరే, తన మాటను నిలబెట్టుకోవడంలో ప్రధాని మోదీకి ఉన్న విశ్వసనీయతను వారు విస్మరిస్తున్నారు.దాంతో మన సోషల్‌ మీడియా కార్యకలాపాలు శత్రువులకు ఫిరంగి మేతగా మారాయి. ఎవరైనా సరే, ప్రభుత్వ పక్షాన నిశ్శబ్దంగా నిలబ డాల్సిన సమయం ఇది. అనవసరమైన వాగ్వాదాలకు పాల్పడకుండా ఉండాల్సిన సమయం ఇది. మతతత్వపు విష బీజాలు నాటడానికి కొందరు ఈ పరిస్థితిని మలచుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం బృందావన్‌లో ఆలయ సేవలో పాల్గొన్న ముస్లింలను బహిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ బాంకే బిహారీ ఆలయం ముందు ఒక మూక నిరసన తెలిపింది. అయితే ఆలయ ట్రస్ట్‌... స్పష్టంగా ప్రతిస్పందించింది. ఆ ముస్లింలు శతాబ్దాలుగా శ్రీకృష్ణుని దుస్తులను తయారు చేస్తున్నారని ట్రస్ట్‌ నిర్వాహకులు నొక్కి చెప్పారు.ఐక్యంగా ముందుకు సాగాలిఉగ్రవాద దాడిని జమ్మూ – కశ్మీర్‌ అసెంబ్లీ ఏప్రిల్‌ 29న ఏకగ్రీవంగా ఖండించింది. దేశంలోని మిగిలిన ప్రాంతాలకు సంఘీభావం తెలిపింది. లోయలో ఉగ్రవాదం అంతం ప్రారంభమైందని శాసన సభ్యులు భావిస్తున్నారు. ద్వేషపూరిత వ్యక్తులు అలాంటి సంఘీభావ ప్రదర్శనను విస్మరించడమే కాకుండా, దేశవ్యాప్తంగా అనేక మసీదులు మొన్నటి ఉగ్రవాద దాడిని ఖండించడాన్ని సులువుగా మరచి పోతారు. ఇప్పుడు పాకిస్థాన్‌ను బహిరంగంగా ఖండించని ముస్లిం నాయకుడు లేడు. ద్వేషం, విభజన రాజకీయాలతో రెచ్చగొట్టడం కాకుండా, అందరూ ప్రభుత్వంతో కలిసి నిలబడి సామాజిక ఐక్యత కోసం పనిచేయాల్సిన సమయం ఇది!శశి శేఖర్‌ వ్యాసకర్త సీనియర్‌ సంపాదకులు

Sakshi Editorial On Central govt Decision on Road accidents7
ప్రాణంపోసే నిర్ణయం

అనునిత్యం నెత్తుటి చరిత్ర రచిస్తున్న రహదారులపై దుర్మరణాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక మంచి ప్రయత్నం చేసింది. సోమవారం విడుదలైన ఒక నోటిఫికేషన్‌ ప్రకారం ఇకపై రోడ్డు ప్రమాదాల్లో చిక్కుకున్నవారికి ఆస్పత్రుల్లో నగదురహిత చికిత్స వెనువెంటనే అందుతుంది. ప్రమాద బాధితులకు లక్షన్నర రూపాయల వరకూ చికిత్స సదుపాయం లభించటంతోపాటు వారం రోజుల వరకూ వైద్య సేవలు పొందే వెసులుబాటునిచ్చారు. దేశంలో ఏ రోడ్డుపై ప్రమాదం జరిగినా ఈ పథకం వర్తిస్తుందని నోటిఫికేషన్‌ చెబుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఏడాది పాలన పూర్తి చేసుకున్నాక 2015 జూలైలో ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో రోడ్డు ప్రమాదాలను ప్రస్తావించారు. బాధితులకు చికిత్స చేయటంలో ఆస్పత్రులు వెనుకంజ వేయకుండా నగదురహిత వైద్యానికి వీలుకల్పిస్తామని ఆ సందర్భంలోనే చెప్పారు. అది ఇన్నాళ్లకు సాకారమైంది. ప్రమాదాల నియంత్రణకు కేంద్రం అనేక చర్యలు తీసుకుంటూనేవుంది. కానీ పెద్దగా ఫలితాన్నిస్తున్న జాడ కనబడదు. ఏటా వెల్లడయ్యే గణాంకాలే ఇందుకు సాక్ష్యం. కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీ మొన్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో మాట్లాడుతూ ఏటా మన రహ దారులపై దాదాపు 4,80,000 ప్రమాదాలు సంభవిస్తున్నాయని, 1,78,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పినప్పుడు అందరూ దిగ్భ్రాంతి చెందారు. ఈ ప్రమాద మృతుల్లో 60 శాతం మంది 18–34 యేళ్ల మధ్య వయస్కులేనని ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా తన మంత్రిత్వశాఖ నిస్సహాయతను కూడా వివరించారు. 2024 ఆఖరుకల్లా రోడ్డు ప్రమాదాలు, మరణాల సంఖ్య 50 శాతం మేరకు తగ్గించాలని నిర్ణయించుకున్నా ఏమాత్రం సాధ్యపడలేదని, పైపెచ్చు అవి మరింత పెరిగాయని ఆయన ఒప్పుకున్నారు. ప్రమాదాల నివారణ మాట అటుంచి బాధితులకు సకాలంలో వైద్యసాయం అందితే చాలామందిని మృత్యుముఖం నుంచి బయటకు తీసుకురావొచ్చని నిపుణులు ఎప్పటినుంచో చెబుతున్నారు. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ప్రమాదాలు సంభవిస్తే చికిత్స ఆలస్యం కావటాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ డబ్బు విదిలిస్తే తప్ప చికిత్సకు ముందుకురాని ఆస్ప త్రుల కారణంగా అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది గమనించే ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ పథకంలో క్షతగాత్రులకు తక్షణ వైద్యసాయం అందే వెసులుబాటు కల్పించారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక అదికాస్తా అటకెక్కింది. ప్రపంచంలో రోడ్డు ప్రమాదాల బెడదపై నాలుగేళ్లక్రితం ఐక్యరాజ్యసమితి దృష్టి సారించింది. 2021–30 మధ్య ఈ ఉదంతాల్లో మరణాల సంఖ్యను 50 శాతం తగ్గించాలని లక్ష్యనిర్దేశం చేసింది. ఆ మాటెలా వున్నా కేవలం పెను వేగంతో వెళ్లే వాహనాల వల్లనే ప్రమాదాలు చోటుచేసుకుంటా యన్నది నిజం కాదు. మొన్న మార్చిలో జరిగిన సదస్సులో కేంద్రమంత్రి గడ్కరీయే ఈ విషయాన్ని అంగీకరించారు. ఇరుకురోడ్డని, మలుపు వున్నదని, వేగం తగ్గించాలని సూచించే బోర్డులూ, మార్కింగ్‌లూ అవసరమైనచోట్ల లేకపోవటం దగ్గర్నుంచి నిర్మాణపరంగా వుండే లోపాల వరకూ అనేకానేక మైనవి ప్రమాదాలకు దారితీస్తున్నాయి. సివిల్‌ ఇంజనీర్లు మొదలుకొని కన్సల్టెంట్లు, కాంట్రాక్టర్ల వరకూ ఎవరికీ దీనిపై జవాబుదారీతనం లేదు. సవివర ప్రణాళికా నివేదిక (డీపీఆర్‌)లు నాసిరకంగా వున్నా అడిగేవారు లేరు. ఆధునిక సాంకేతికతలు అందుబాటులోకి రావటం వల్ల లోపాలను ముందు గానే సులభంగా పసిగట్టడం సాధ్యమవుతోంది. వాటిని అనుసరిద్దామన్న ఆలోచన కూడా రాదు. అతి తక్కువ ప్రమాదాలు జరుగుతున్న ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, స్పెయిన్‌ దేశాల్లో ఎలాంటి విధానాలు అనుసరిస్తున్నారో గమనించి, వాటిని అమల్లోకి తెచ్చినా ఎంతో ప్రయోజనం కలుగుతుంది. అసలు మన రోడ్ల నాణ్యతకూ, అమ్మే వాహనాలకూ సంబంధమే లేకుండా పోయింది. అమ్మ కాలు పెంచుకోవటం కోసం అనేక రకాల పథకాలు ప్రవేశపెట్టి, బ్యాంకు లోన్ల సదుపాయం కల్పించి జనంలో వ్యామోహాన్ని పెంచటం రివాజైంది. ద్విచక్ర వాహనాలు సైతం వాయు వేగంతో పోయేలా డిజైన్‌ చేస్తుంటే...అవి నిండా ఇరవయ్యేళ్లు లేనివారి చేతికొస్తుంటే ప్రమాదాలు జరగటంలో వింతేముంది? రోడ్డు ప్రమాదాల విషయంలో సర్వోన్నత న్యాయస్థానం చొరవ తీసుకుని అప్పటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కెఎస్‌ రాధాకృష్ణన్‌ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. కేరళ, యూపీ, నాగాలాండ్‌ మినహా మరే రాష్ట్రమూ రహదారి భద్రతకు సంబంధించిన విధానమే రూపొందించుకోలేదని ఆ కమిటీ నివేదిక ఎత్తిచూపింది. డ్రైవింగ్‌ లైసె న్సుల జారీలో, భద్రతా నిబంధనల అమలులో ప్రభుత్వాలు అలసత్వాన్ని చూపుతున్నాయని చెప్పింది. ఇప్పటికైనా అన్ని రాష్ట్రాలూ ఈ లోపాలన్నిటినీ సరిదిద్దుకున్నాయో లేదో సందేహమే! తొలి గంటలో చికిత్స ప్రారంభిస్తే గాయపడినవారిలో కనీసం 50 శాతంమందికి ప్రాణాపాయం తప్పుతుందని వైద్య నిపుణులంటున్న మాట. గతంలో అయితే అసలు ప్రమాదంలో చిక్కుకున్న వారిని ఆస్పత్రికి తరలించటానికి ఎవరూ ముందుకొచ్చేవారు కాదు. పోలీసులు తమనే అనుమాని తులుగా చూస్తారని, కోర్టుల చుట్టూ తిరగాల్సివస్తుందని చాలామంది భయపడేవారు. ఇందుకు సంబంధించిన నిబంధనలు మార్చాక ఈ విషయంలో చాలా మార్పువచ్చింది. నగదు రహిత చికిత్స అందించటానికి వీలుకల్పించే చర్య ప్రశంసనీయమైనది. కానీ అంతకన్నా ముందు ప్రమాదా లకు దారితీస్తున్న పరిస్థితుల్ని చక్కదిద్దటానికి ప్రయత్నించాలి. అన్ని స్థాయుల్లో జవాబుదారీతనం నిర్ణయించాలి. అప్పుడుగానీ ప్రమాదాల నియంత్రణ సాధ్యంకాదు.

Mock drills across states in India on May 7 in aftermath of Pahalgam attacks8
సన్నద్ధతకు సంసిద్ధం

సాక్షి, న్యూఢిల్లీ: మాక్‌డ్రిల్స్‌కు సర్వం సిద్ధమైంది. అనూహ్య పరిస్థితులను దీటుగా ఎదుర్కొనేందుకు, యుద్ధ సన్నద్ధతను పూర్తిస్థాయిలో చాటేందుకు దేశమంతా ఒక్కటవుతోంది. దాదాపు 54 ఏళ్ల అనంతరం దేశవ్యాప్తంగా పౌర రక్షణ, సన్నద్ధత విన్యాసాలు జరగనున్నాయి. పట్టణాల నుంచి గ్రామస్థాయి దాకా వాటిలో ప్రజలంతా చురుగ్గా భాగస్వాములు కానున్నారు. 6.5 లక్షల మందికి పైగా వలెంటీర్లు ఈ క్రతువులో వారికి సాయపడనున్నారు. 244 సివిల్‌ డిఫెన్స్‌ డిస్ట్రిక్ట్స్‌ (సీడీడీ) పరిధిలో బుధవారం సాయంత్రం నాలుగింటి నుంచి రాత్రి దాకా ‘ఆపరేషన్‌ అభ్యాస్‌’ పేరిట ఈ డ్రిల్స్‌ జరుగుతాయి. దేశవ్యాప్తంగా అణు విద్యుత్కేంద్రాలు, రిఫైనరీలు, కీలక కేంద్ర ప్రభుత్వ సంస్థలున్న, రక్షణపరంగా సున్నితమైన ప్రాంతాలను సీడీడీలుగా 2010లో కేంద్రం నోటిఫై చేసింది. వీటిలో చాలావరకు రాజస్తాన్, పంజాబ్, జమ్మూ కశీ్మర్, పశి్చమబెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో నెలకొని ఉన్నాయి. సున్నితత్వాన్ని బట్టి వాటిని మూడు కేటగిరీలుగా వర్గీకరించారు. ఢిల్లీ, చెన్నై వంటి నగరాలు అత్యంత సున్నితమైన కేటగిరీ 1లో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నం డ్రిల్స్‌కు వేదిక కానున్నాయి. వాటిని సున్నితమైనవిగా పేర్కొంటూ కేటగిరీ 2లో చేర్చారు.కేంద్రం సమీక్ష పాక్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రం ఆదేశాల మేరకు జరుగుతున్న ఈ దేశవ్యాప్త డ్రిల్స్‌ సన్నద్ధతను కేంద్ర హోం శాఖ మంగళవారం సమీక్షించింది. డ్రిల్స్‌ విధివిధానాలు తదితరాలపై కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్‌ మోహన్‌ సారథ్యంలో ఉన్నతస్థాయి సమావేశంలో లోతుగా చర్చించారు. రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో పాటు రక్షణ, పోలీసు విభాగాల అత్యున్నత స్థాయి అధికారులు భేటీలో పాల్గొన్నారు. డ్రిల్స్‌లో విద్యార్థులు, ఎన్‌సీసీ కాడెట్లు, యువతతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల ఉద్యోగులు, ఆస్పత్రుల సిబ్బంది, రైల్వే, మెట్రో ఉద్యోగులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు.ఎక్కడికక్కడ పోలీసు, సైనిక సిబ్బంది వారితో సమన్వయం చేసుకోనున్నారు. 1971 తర్వాత రక్షణపరంగా దేశవ్యాప్తంగా మాక్‌ డ్రిల్స్‌ జరుగుతుండటం ఇదే తొలిసారి. అప్పుడు కూడా పాక్‌తో యుద్ధ నేపథ్యంలోనే ఈ కసరత్తు నిర్వహించారు. అంతకుముందు 1962, 1965ల్లో కూడా చైనా, పాక్‌తో పూర్తిస్థాయి యుద్ధం సందర్భంగా మాక్‌ డ్రిల్స్‌ జరిపారు. మంగళవారం అన్ని రాష్ట్రాల్లోనూ మాక్‌ డ్రిల్స్‌ సన్నాహక కసరత్తులు పోలీసు తదితర బృందాల పర్యవేక్షణలో ముమ్మరంగా జరిగాయి. విద్యార్థులు, యువత మొదలుకుని ప్రజలంతా పెద్ద సంఖ్యలో వాటిలో పాల్గొన్నారు.డ్రిల్స్‌ ఇలా...⇒ మాక్‌ డ్రిల్స్‌లో భాగంగా వైమానిక దాడుల హెచ్చరికలతో సైరన్లు విని్పస్తాయి. ⇒ వెంటనే పరిసర ప్రాంతాల పౌరులంతా క్షణాల్లో అప్రమత్తమై సురక్షిత ప్రాంతాలకు తరలాలి. వీలైన చోట్ల బంకర్లు, సబ్‌వేలు, అండర్‌గ్రౌండ్‌ మెట్రో తదితర చోట్ల తలదాచుకోవాలి. ⇒ ఈ కసరత్తులో యువత, విద్యార్థులు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ కాడెట్లు మొదలుకుని హోం గార్డుల దాకా అందరినీ భాగస్వాములను చేస్తారు. ⇒ కీలక సంస్థలు, మౌలిక సదుపాయ వ్యవస్థలను దాడుల నుంచి కాపాడుకోవడం, అవి శత్రువు కంటపడకుండా జాగ్రత్త పడటం తదితరాల్లో జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ, అగి్నమాపక తదితర బృందాలు వారికి శిక్షణ ఇస్తాయి. ⇒ బ్లాకౌట్‌ వంటివి చోటుచేసుకుంటే ఎలా స్పందించాలో, స్వీయరక్షణతో పాటు పౌరులను కాపాడేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో వివరిస్తాయి. ⇒ రాత్రి 7.30 నుంచి 10 నిమిషాల పాటు క్రాష్‌ బ్లాకౌట్‌ ‘లైట్లను ఆపేయడం) కసరత్తు జరుగుతుంది. ⇒ డ్రిల్స్‌ కోసం హాట్‌లైన్, రేడియో కమ్యూనికేషన్‌ వంటివాటిని వైమానిక దళ లింకులతో అనుసంధానిస్తారు. ⇒ కంట్రోల్‌ రూమ్స్, షాడో కంట్రోల్‌ రూమ్స్‌ విపత్తులకు ఎలా స్పందిస్తాయో పరీక్షిస్తారు. ⇒ డ్రిల్స్‌ నిమిత్తం స్పందన బృందాలన్నింటికీ ఇప్పటికే కోడ్‌ వర్డ్స్‌ కేటాయించారు. ⇒ ఎప్పుడేం చేయాలో పేర్కొంటూ టైమ్‌లైన్‌ను కూడా స్పష్టంగా నిర్దేశించారు. ⇒ వైమానిక దాడుల హెచ్చరిక వ్యవస్థల సమర్థతను డ్రిల్స్‌ ద్వారా పరిశీలించనున్నారు. ⇒ కేంద్ర హోం శాఖ పౌర రక్షణ నిబంధనలు (1968) సెక్షన్‌ 19 ప్రకారం మాక్‌ డ్రిల్స్‌ నిర్వహిస్తున్నారు. ఇవి అందుబాటులో ఉంచుకోవాలి⇒ మాక్‌ డ్రిల్స్‌కు పౌరులు పూరిస్థాయిలో సన్నద్ధం కావాలి. ⇒అత్యవసర చికిత్స నిమిత్తం మెడికల్‌ కిట్లు, కరెంటు కోత తదితరాల కోసం టార్చిలు, క్యాండిళ్లు వెంట ఉంచుకోవాలి. అలాగే వీలైనంత నగదు కూడా దగ్గరుంచుకోవాలి. ⇒ వీటిపై పౌరులను అప్రమత్తం చేయాల్సిందిగా అధికారులను కేంద్ర హోం శాఖ ఆదేశించింది. ⇒ ఢిల్లీ, పశ్చిమబెంగాల్‌ సహా పలు రాష్ట్రాల్లో పౌర రక్షణ బృందాలు ఇప్పటికే చురుగ్గా పని చేస్తున్నాయి. ⇒ అయితే ఇవన్నీ స్వచ్ఛంద స్వభావంతో కూడిన బృందాలే.ఎక్కడెక్కడ?దేశవ్యాప్తంగా మొత్తం 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 244 సివిల్‌ డిఫెన్స్‌ డిస్ట్రిక్ట్స్‌ (సీడీడీ) పరిధిలో ఎంపిక చేసిన 259 చోట్ల మాక్‌డ్రిల్స్‌ జరుగుతాయి.⇒ వీటిలో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై వంటి మెట్రోలు కూడా ఉన్నాయి.⇒ 100కు పైగా సీడీడీలను అత్యంత సున్నితమైనవిగా గుర్తించి ‘ఎ’ కేటగిరీలో చేర్చారు. వాటి పరిధిలో సూరత్, వడోదర, కాక్రపార్‌ (గుజరాత్‌), కోట (రాజస్తాన్‌), బులంద్‌షహర్‌ (యూపీ), చెన్నై, కల్పకం (తమిళనాడు), తాల్చెర్‌ (ఒడిశా), ముంబై, ఉరన్, తారాపూర్‌ (మహారాష్ట్ర), ఢిల్లీ వంటివి ఉన్నాయి.ఈసారి తగ్గేదే లే! ⇒ ఉరి, బాలాకోట్‌ మాదిరిగా కాదు ⇒ త్వరలో బాహాటంగా భారీ ‘ఆపరేషన్‌’ ⇒ ఆ రాజకీయ సందేశమే డ్రిల్స్‌ లక్ష్యం2016లో సర్జికల్‌ స్ట్రైక్స్‌. 2019లో బాలాకోట్‌ వైమానిక దాడులు. ఉగ్రవాద దుశ్చర్యలకు గతంలో మోదీ సర్కారు ప్రతిస్పందనలు. రెండూ సైలెంట్‌గా నిర్వహించిన అండర్‌ కవర్‌ ఆపరేషన్లే. ఉరి, పుల్వామా ఉగ్ర చర్యలతో పోలిస్తే ‘పహల్గాం’ దాడి పరిస్థితి పూర్తి భిన్నం. 26 మంది అమాయక పర్యాటకులను ముష్కరులు అతి కిరాతకంగా పొట్టన పెట్టుకున్నారు. ఒక్కొక్కరినీ మతం అడిగి పిట్టల్లా కాల్చేసి పైశాచికత్వం ప్రదర్శించారు. అంతేగాక ‘పోయి మోదీకి చెప్పుకోండి’ అంటూ కేంద్రానికి సూటిగా సవాలు విసిరారు. దాడిని తలచుకుని భారతీయులంతా ఆగ్రహంతో రగిలిపోతున్నారు.ఈసారి కొట్టబోయే దెబ్బ జన్మలో మర్చిపోలేని విధంగా ఉండాలని కోరుతున్నారు. అందుకే ఈసారి భారత ప్రతి చర్య పూర్తి భిన్నంగా ఉండటం ఖాయమంటున్నారు. బాహాటంగా, అత్యంత భారీ స్థాయిలో సైనిక చర్య ఉండనుందని స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో యుద్ధ సన్నద్ధత, పౌర అవగాహన కోసం దేశవ్యాప్త మాక్‌ డ్రిల్స్‌ నిర్ణయం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాయాదికి గట్టి రాజకీయ సందేశమివ్వడమే దీని లక్ష్యమని చెబుతున్నారు. ఉగ్రవాదానికి, దానికి తల్లివేరు వంటి పొరుగు దేశానికి బుద్ధి చెప్పే విషయంలో దేశమంతా ఒక్కతాటిపై ఉందని ప్రపంచానికి చాటేందుకే మోదీ సర్కారు ఈ చర్య చేపట్టినట్టు తెలుస్తోంది. భారత ‘ఆపరేషన్‌’కు పాక్‌ స్పందనను బట్టి ఒకవేళ యుద్ధం వంటి పరిస్థితులు తలెత్తినా అందుకు దేశమంతా సంసిద్ధంగా ఉందని చాటడం కూడా ఈ డ్రిల్స్‌ ఉద్దేశమని రక్షణ రంగ పరిశీలకులు భావిస్తున్నారు. – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Uday Kotak Buys Rs 400 Crore Mumbai Sea Facing Property9
చదరపు అడుగు రూ.2.75 లక్షలు: రియల్టీలోనే సరికొత్త రికార్డ్!

కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు, బిలియనీర్ 'ఉదయ్ కోటక్'.. ముంబైలోని వర్లి సీ-ఫేస్‌లో ఒక నివాస భవనాన్ని రూ. 400 కోట్లకంటే ఎక్కువ వెచ్చించి కొనుగోలు చేశారు. ఇక్కడ చదరపు అడుగు ధర రూ.2.75 లక్షలు అని సమాచారం. దీంతో ఇది దేశీయ రియల్ ఎస్టేట్ చరిత్రలోనే అత్యధిక ధరగా రికార్డ్ క్రియేట్ చేసింది.కోటక్ ఫ్యామిలీ ఇప్పటికే ఈ భవనంలోని 24 ఫ్లాట్లలో 13 ఫ్లాట్లను రిజిస్టర్ చేసుకుంది. తాజాగా మరో 8 ఫ్లాట్లను రూ. 131.55 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఒక్కో ఫ్లాట్ 444 నుంచి 1004 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. వీటి ధర రూ. 12 కోట్ల నుంచి రూ. 27.59 కోట్లు. మిగిలిన 3 ఫ్లాట్లకు ఎంత చెల్లించారో వెల్లడించకపోయినా, మొత్తం భవనం విలువ రూ. 400 కోట్లను దాటినట్లు తెలుస్తోంది. ఈ భవనంలోని 173 చదరపు అడుగుల ప్లాట్ ధర రూ. 4.7 కోట్లు కావడం గమనార్హం. అయితే ఇందులోనే 1396 చ.అ ఫ్లాట్ ధర రూ. 38.24 కోట్లు. ఇది ముంబైలోని నాగరిక వర్లి ప్రాంతంలో అరేబియా సముద్రం.. ముంబై తీరప్రాంత రహదారికి అభిముఖంగా ఉంటుంది.కోటక్ ఫ్యామిలీ ఇప్పుడు ఈ మొత్తం ప్లాట్లను ఒకటిగా చేసి మళ్ళీ రీడెవల్పెమెంట్ ఏమైనా చేస్తుందా?, లేక ఉన్నది ఉన్నట్లుగానే ఉంచుతుందా? అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ డీల్‌కు సంబంధించిన విషయాలను కోటక్ కుటుంబం అధికారికంగా వెల్లడించలేదు.ఇదీ చదవండి: ఇండియన్ రైల్వే డిజిటల్ క్లాక్ డిజైన్ పోటీ: రూ.5 లక్షల ప్రైజ్

Chandrababu Naidu Government Records In Debt10
అప్పుల్లో చంద్రబాబు సర్కార్‌ రికార్డు

అమరావతి: అప్పుల్లో చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోంది. మరో రూ.7 వేల కోట్లు ప్రభుత్వం అప్పు చేసింది. ఒకే రోజు రూ.7 వేల కోట్లు అప్పులు చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. రిజర్వ్‌ బ్యాంకులో సెక్యూరిటీల వేలం ద్వారా సమీకరించింది. గత నెలలో రూ.5,750 కోట్లు అప్పు చేసిన ప్రభుత్వం.. ఆర్థిక సంవత్సరం రెండో నెలలోనూ భారీగా అప్పు చేసింది.మళ్లీ రూ.7 వేల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు సర్కార్‌.. ఇప్పటివరకు లక్షా 59 వేల కోట్లు అప్పు చేసింది. సూపర్‌ సిక్స్‌ పథకాలు అమలు చేయని చంద్రబాబు ప్రభుత్వం.. హామీలు అమలు చేయకుండానే భారీ అప్పులు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తామన్న చంద్రబాబు.. ఇప్పుడు అప్పులు చేయడంలో రికార్డు సృష్టిస్తున్నారు.ఏడాది కాలంలోనే రికార్డు స్థాయిలో అప్పులు చేయడం చూస్తే చంద్రబాబు ‘సంపద సృష్టి’ భలేగా ఉంది అంటూ జనాలు నవ్వుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్ర ఆదాయం తిరోగమనంలో ఉందని కాగ్‌ తేల్చేసింది. ఒకవైపు రెవెన్యూ రాబడి తగ్గిపోతుండగా.. మరోవైపు అప్పులు భారీగా పెరిగిపోతున్నాయని స్పష్టంచేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు బడ్జెట్‌ రాబడులు, వ్యయాలకు సంబంధించిన గణాంకాలను కాగ్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement