టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతల లొల్లి; కిందపడ్డ సీఐ | TRS, BJP Leaders fight in Karimnagar Town | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌ నడిబొడ్డున పొలిటికల్‌ స్ట్రీట్‌ఫైట్‌

Published Mon, Jan 25 2021 8:55 AM | Last Updated on Mon, Jan 25 2021 11:53 AM

TRS, BJP Leaders fight in Karimnagar Town - Sakshi

కరీంనగర్ ‌క్రైం/ కరీంనగర్ ‌టౌన్‌: కరీంనగర్‌ నడిబొడ్డున టీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు స్ట్రీట్‌ఫైట్‌కు దిగారు. తెలంగాణ చౌక్‌ వేదికగా కొట్టుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ దిష్టిబొమ్మ దహనం విషయంలో తలెత్తిన వివాదం పరస్పరం దాడి చేసుకునే స్థాయికి చేరింది. అక్కడే ఉన్న పోలీస్‌ సిబ్బంది ఇరువర్గాలను అడ్డుకునేందుకు విఫలయత్నం చేశారు. పోలీసులనే నాయకులు నెట్టివేయడంతో వారు వన్‌టౌన్, టూటౌన్, ట్రాఫిక్‌ స్టేషన్లకు సమాచారం అందించారు. సీఐలు లక్ష్మిబాబు, విజయ్‌కుమార్, తిరుమల్, ఎస్‌ఐలు తిరుపతి, శ్రీనివాస్, వెంకట్రాజం సిబ్బందితో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరువర్గాలను అదుపుచేసే క్రమంలో టూటౌన్‌ సీఐ కిందపడ్డాడు. దీంతో పోలీసులు అప్రమత్తమై ఇరువర్గాలను చెదరగొట్టారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. నగరంలో ఉద్రిక్తత నెలకొనడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బలగాలు సాయంత్రం వరకు గట్టి బందోబస్తు నిర్వహించాయి.

లొల్లి ముదిరిందిలా..
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు సంజయ్‌ దిష్టిబొమ్మ దహనం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆదివారం దిష్టిబొమ్మతో తెలంగాణ చౌక్‌కు చేరుకున్నారు. అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై నిరసన తెలిపేందుకు బీజేపీ నేతలు అక్కడికి చేరుకున్నారు. బీజేపీ నాయకులు ఎదుటనే టీఆర్‌ఎస్‌ నాయకులు బండి సంజయ్‌ దిష్టిబొమ్మ దహనానికి యత్నించారు. దీంతో బీజేపీ శ్రేణులు అడ్డుకునేందుకు యత్నించాయి. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరగడంతో నాయకులు ఒకరినొకరు తోసుకున్నారు. కోపోద్రిక్తులైన కొంతమంది దాడికి దిగారు. అక్కడు ఉన్న పోలీసులు అప్రమత్తమై ఇరువర్గాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు ఓవైపు వారిస్తున్నా.. రెండు పార్టీల నేతలు వారిని తోసేసి దాడులు చేసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు ఇరువర్గాలను చెదగొట్టే క్రమంలో టూటౌన్‌ సీఐ లక్ష్మీబాబు కిందపడ్డారు.

పోలీసుల అదుపులో ఇరువర్గాలు..
పరస్పర దాడులకు దిగిన ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు రెండు పార్టీలకు చెందిన నాయకులను అదుపులోకి తీసుకున్నారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలను వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు, బీజేపీ కార్యకర్తలను టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. దీంతో నగరంలో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. రెండు పార్టీలకు చెందిన నేతలపై పోలీసులు ప్రత్యేక దృష్టిసారించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. తెలంగాణచౌక్‌లో భారీగా పోలీసులను మోహరించారు. నగరంలోని పలు సమస్యాత్మక ప్రాంతాలపైనా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి బందోబస్తు నిర్వహించారు.

బీజేపీ నేతలపై కేసు..
తెలంగాణ చౌక్‌లో జరిగిన ఘర్షణలో బీజేపీ నేతలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్ ‌టౌన్‌ సీఐ విజయ్‌కుమార్‌ తెలిపారు. తాము నిరసన కార్యక్రమాన్ని చేపడుతుండగా బీజేపీ శ్రేణులు వచ్చి దాడులకు పాల్పడ్డారని టీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. కాగా తాము సైతం ప్రభుత్వ విధానాలపై నిరసన తెలిపేందుకు వస్తుండగా, తమ అధినేత దిష్టిబొమ్మను కాళ్లతో తొక్కడంతో అడ్డుకునే ప్రయత్నం చేశామని బీజేపీ నేతలు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/2

2
2/2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement