TRS Activists
-
కేటీఆర్ ఇలాకాలో సంచలనం.. టీఆర్ఎస్ నేతల వేధింపులు భరించలేక..
తంగళ్లపల్లి (సిరిసిల్ల): ‘టీఆర్ఎస్ నాయకులు వేధిస్తున్నారు. ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారు. డబ్బుల కోసం వేధిస్తున్నారు’ అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని బద్దెనపల్లికి చెందిన మ్యాన పద్మ ఆరోపించారు. అధికార పార్టీ నాయకుల వేధింపులు భరించలేకపోతున్నానని, తనకు చావే శరణ్యమంటూ బుధవారం ఒంటిపై పెట్రోల్ పోసుకునేందుకు యత్నించారు. వివరాల ప్రకారం.. బాధితురాలు పద్మ బద్దెనపల్లిలో కిరాణా దుకాణం నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. తనకున్న స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టగా.. స్థానిక టీఆర్ఎస్ నాయకులు గ్రామ పంచాయతీకి ఫిర్యాదు చేస్తూ ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఒంటిపై పెట్రోల్ పోసుకునేందుకు యత్నించారు. అప్రమత్తమైన స్థానికులు ఆమె నుంచి పెట్రోల్ బాటిల్‌ను లాగేశారు. -
కుమ్ముకున్న టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు.. పరిస్థితి ఉద్రిక్తం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మంత్రి కేటీఆర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. డ్రగ్స్ పరీక్షకు సిద్ధమని మంత్రి కేటీఆర్ ప్రకటించగా దానిపై సోమవారం నాటకీయ పరిణామాలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ ఆరోపణలపై మంత్రి కేటీఆర్ న్యాయ పోరాటానికి దిగారు. వీరి మధ్య ఈ వివాదం కొనసాగుతుండగా తాజాగా ఆ రెండు పార్టీ కార్యకర్తల మధ్య వివాదం ఏర్పడింది. చదవండి: డ్రగ్స్ వార్.. మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా స్వీకరణ మంత్రి కేటీఆర్‌పై ఆరోపణలకు నిరసనగా టీఆర్ఎస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డి నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి యత్నించారు. ఇది గమనించిన కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు. దీంతో ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరు వర్గాల కార్యకర్తలు బహాబాహీకి దిగారు. రేవంత్‌రెడ్డి వర్గీయులు, టీఆర్ఎస్ కార్యకర్తలు కర్రలు పట్టుకుని పరస్పరం దాడి చేసుకున్నారు. పోలీసులు అక్కడకు చేరుకుని ఇరు వర్గాలవారిని వారిస్తున్నా వారు రెచ్చిపోయారు. చివరకు పోలీసులు అతికష్టంగా ఇరు వర్గాలను చెదరగొట్టారు. చదవండి: ఒక్క మహిళా లేదు.. పురుషులతో నిండిన మంత్రివర్గం -
Warangal Municipal Corporation Election 2021: సార్.. టికెట్ ప్లీజ్..!
వరంగల్ మహానగర పాలక సంస్థ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. దీంతో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని డివిజన్ల నుంచి పోటీ చేసేందుకు ఆశావహుల నుంచి టీఆర్ఎస్ నాయకులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. హన్మకొండలో గురువారం ఆరు కౌంటర్లు ఏర్పాటుచేసి దరఖాస్తులు స్వీకరిస్తుండగా.. చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ కేంద్రాన్ని పరిశీలించేందుకు వచ్చారు. ఈ సందర్భంగా టికెట్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన ఆశావహులు ఆయనను చుట్టుముట్టిన దృశ్యమే ఇది. - స్టాఫ్ ఫొటోగ్రాఫర్, వరంగల్ అర్బన్ -
టీఆర్ఎస్, బీజేపీ నేతల లొల్లి; కిందపడ్డ సీఐ
కరీంనగర్ క్రైం/ కరీంనగర్ టౌన్: కరీంనగర్ నడిబొడ్డున టీఆర్ఎస్, బీజేపీ నాయకులు స్ట్రీట్‌ఫైట్‌కు దిగారు. తెలంగాణ చౌక్ వేదికగా కొట్టుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం విషయంలో తలెత్తిన వివాదం పరస్పరం దాడి చేసుకునే స్థాయికి చేరింది. అక్కడే ఉన్న పోలీస్ సిబ్బంది ఇరువర్గాలను అడ్డుకునేందుకు విఫలయత్నం చేశారు. పోలీసులనే నాయకులు నెట్టివేయడంతో వారు వన్‌టౌన్, టూటౌన్, ట్రాఫిక్ స్టేషన్లకు సమాచారం అందించారు. సీఐలు లక్ష్మిబాబు, విజయ్‌కుమార్, తిరుమల్, ఎస్ఐలు తిరుపతి, శ్రీనివాస్, వెంకట్రాజం సిబ్బందితో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరువర్గాలను అదుపుచేసే క్రమంలో టూటౌన్ సీఐ కిందపడ్డాడు. దీంతో పోలీసులు అప్రమత్తమై ఇరువర్గాలను చెదరగొట్టారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. నగరంలో ఉద్రిక్తత నెలకొనడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బలగాలు సాయంత్రం వరకు గట్టి బందోబస్తు నిర్వహించాయి. లొల్లి ముదిరిందిలా.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టీఆర్ఎస్ కార్యకర్తలు సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆదివారం దిష్టిబొమ్మతో తెలంగాణ చౌక్‌కు చేరుకున్నారు. అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై నిరసన తెలిపేందుకు బీజేపీ నేతలు అక్కడికి చేరుకున్నారు. బీజేపీ నాయకులు ఎదుటనే టీఆర్ఎస్ నాయకులు బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనానికి యత్నించారు. దీంతో బీజేపీ శ్రేణులు అడ్డుకునేందుకు యత్నించాయి. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరగడంతో నాయకులు ఒకరినొకరు తోసుకున్నారు. కోపోద్రిక్తులైన కొంతమంది దాడికి దిగారు. అక్కడు ఉన్న పోలీసులు అప్రమత్తమై ఇరువర్గాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు ఓవైపు వారిస్తున్నా.. రెండు పార్టీల నేతలు వారిని తోసేసి దాడులు చేసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు ఇరువర్గాలను చెదగొట్టే క్రమంలో టూటౌన్ సీఐ లక్ష్మీబాబు కిందపడ్డారు. పోలీసుల అదుపులో ఇరువర్గాలు.. పరస్పర దాడులకు దిగిన ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు రెండు పార్టీలకు చెందిన నాయకులను అదుపులోకి తీసుకున్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలను వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు, బీజేపీ కార్యకర్తలను టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో నగరంలో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. రెండు పార్టీలకు చెందిన నేతలపై పోలీసులు ప్రత్యేక దృష్టిసారించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. తెలంగాణచౌక్‌లో భారీగా పోలీసులను మోహరించారు. నగరంలోని పలు సమస్యాత్మక ప్రాంతాలపైనా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి బందోబస్తు నిర్వహించారు. బీజేపీ నేతలపై కేసు.. తెలంగాణ చౌక్‌లో జరిగిన ఘర్షణలో బీజేపీ నేతలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్ టౌన్ సీఐ విజయ్‌కుమార్ తెలిపారు. తాము నిరసన కార్యక్రమాన్ని చేపడుతుండగా బీజేపీ శ్రేణులు వచ్చి దాడులకు పాల్పడ్డారని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కాగా తాము సైతం ప్రభుత్వ విధానాలపై నిరసన తెలిపేందుకు వస్తుండగా, తమ అధినేత దిష్టిబొమ్మను కాళ్లతో తొక్కడంతో అడ్డుకునే ప్రయత్నం చేశామని బీజేపీ నేతలు తెలిపారు. -
ఎంపీ అరవింద్ కాన్వాయ్‌పై దాడి
సాక్షి, వరగంల్, హన్మకొండ: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కాన్వాయ్‌పై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో ఆరుగురిపై సుబేదారి పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. అరవింద్ హన్మకొండ హంటర్‌రోడ్డులోని వేద బాంక్వెట్ హాల్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వరంగల్ నగరంలోని ఇద్దరు ఎమ్మెల్యేలపై ఘాటైన ఆరోపణలు చేశారు. వారు భూకబ్జాదారులని ఆరోపించారు. ఎంపీ తన వరంగల్ పర్యటనను ముగించుకొని తిరుగు ప్రయాణం అవుతున్న క్రమంలో టీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ జిల్లా కార్యాలయానికి చేరుకున్నారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు వచ్చారు. ఎమ్మెల్యేలు, నాయకులపై ఎంపీ చేసిన విమర్శలతో ఆగ్రహంతో ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు అరవింద్ కాన్వాయ్‌పై కోడిగుడ్లతో దాడి చేయడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. పోలీసుల ముందే ఎంపీ కాన్వాయ్‌పై దాడి చేయడం పట్ల బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఎంపీ అరవింద్ చేసిన ఆరోపణలు, విమర్శలపై హన్మకొండ బాలసముద్రంలోని క్యాంపు కార్యాలయంలో చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ విలేకరుల సమావేశం పెడుతున్నారనే విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు అక్కడికి బయలు దేరారు. అడ్వొకేట్స్ కాల నీ మధ్యలోకి రాగానే పోలీసులు వచ్చి అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ వాహనం తాళం చెవి లాక్కున్నారు. దీంతో తాళం చెవి ఇచ్చేయాలంటూ వారు అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. అక్కడి నుంచి వారి ని పోలీసులు వెనక్కి పంపగా హంటర్ రోడ్డుకు చేరుకుని సెంటర్లో బైఠాయించి ధర్నా చేశారు. ఈ క్రమంలో బీజేపీ నాయకులను అరెస్టు చేస్తున్న క్రమంలో పోలీసుల నెట్టివేతకు గురైన జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ కిందపడిపోగా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రాష్ట్రంలో నైజాం పాలన జరుగుతోందనడానికి ఇంతకంటే ఉదాహరణ మరొకటి లేదని బీజేపీ నేతలు పేర్కొన్నారు. టీఆర్ఎస్ను విమర్శిస్తే దాడులు చేయడం, కేసులు పెట్టి బెదిరించడం రాష్ట్రంలో సాధారణమైందన్నారు. రాష్ట్రంలో ఎంపీలకు కూడా రక్షణ లేకుండా పోయిందని, అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని మండిపడ్డారు. ఇదిలా ఉండగా ఎంపీ « అరవింద్ పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీ నేతలను ఆరా తీసినట్లు తెలిసింది. రూ.200 కోట్లు ఏమయ్యాయి: అరవింద్ వరంగల్ నగరంలో ఉన్న ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భూ కబ్జాదారులని ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. వరంగల్ తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు వినయ్‌భాస్కర్, నన్నపునేని నరేందర్‌ల భూ ఆక్రమణలపై తెలంగాణలో ఎవరిని అడిగినా చెప్తారని అన్నారు. కేంద్రం వివిధ పథకాల కింద వరంగల్‌కు కేటాయించిన రూ.200 కోట్లు ఏమయ్యాయో చెప్పాలని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను ప్రశ్నించారు. -
కాళేశ్వర గంగ వచ్చేసింది..
మంథని: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం గంగా జలాలు పెద్దపల్లి జిల్లా మంథనిని తాకాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గోదారమ్మ ఎదురుగా పారుతూ.. బుధవారం సాయంకాలం నాటికి మంథని మండలశివారు ప్రాంతమైన గోదావరిలో బొక్కలవాగు కలిసే ప్రాంతం దాటింది. మంథని నియోజకవర్గంలోని కన్నెపల్లి పంపుహౌస్ నుంచి అన్నారం బ్యారేజీకి చేరిన నీటిని సుందిళ్లకు రివర్స్ పంపింగ్ చేస్తున్నారు. అన్నారం బ్యారేజీ సామర్థ్యం 10.52 టీఎంసీలు కాగా.. ఇప్పటికే 2.5 టీఎంసీల నీరుచేరింది. కన్నెపల్లి వద్ద నాలుగో పంపును ప్రారంభించడంతో ప్రవాహం మరింత పెరిగే అవకాశముంది. ఏడు టీఎంసీల నీరు అన్నారం బ్యారేజీకి చేరితే సుందిళ్ల పంపుహౌస్‌కు వస్తుందని నీటిపారుదల అధికారులు చెబుతున్నారు. గౌతమేశ్వర తీరమైన మంథనికి కాళేశ్వర గోదావరమ్మ చేరుతున్న క్రమంలో స్వాగత పూజలు నిర్వహించేందుకు టీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం మంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టమధు పూజలు నిర్వహించనున్నారు. ఇన్నాళ్లు ఎడారిని తలపించి తొలి ఏకాదశికి ఒక రోజు ముందే గోదారమ్మ మంథనికి చేరుకోవడంతో భక్తుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. -
ఏపీ‘హోదా’కు సంపూర్ణ సహకారం
చంద్రబాబు నన్ను రోజూ తిడుతుండు. హైదరాబాద్‌కు శాపాలు పెడుతుండు. నిన్న, మొన్న అయితే ఇంకా దారుణంగా మాట్లాడిండు. అసలు సంగతేదంటే.. చంద్రబాబు డిపాజిట్ దక్కకుండా దారుణంగా ఓడిపోతుండు. ఆయన పరిస్థితి ఏం బాగోలేదు. చంద్రబాబు కహానీ ఖతం అయిపోయింది. నా దగ్గర లేటెస్టు సర్వే రిపోర్టులు ఉన్నాయి – వికారాబాద్ సభలో సీఎం సాక్షి, వికారాబాద్: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడారు. ఏటా గోదావరి జలాలు సముద్రం పాలయ్యే కన్నా.. ఆంధ్రా ప్రజలు వాడుకుంటే తమకేం ఇబ్బంది లేదని తెలిపారు. పోలవరం నిర్మాణానికి తాము ఏనాడూ అడ్డు తగల్లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా సాధన కోసం టీఆర్ఎస్ ఎంపీలు సహకరిస్తారని ప్రకటించారు. ఏపీ ఎన్నికల్లో వైఎస్ జగన్ బ్రహ్మాండంగా గెలుస్తారని తెలిపారు. చంద్రబాబు డిపాజిట్ రాకుండా దారుణంగా ఓడిపోవడం ఖాయమన్నారు. ఓటమిని జీర్ణించుకోలేకే బాబు రోజూ తనను తిడుతున్నాడని ధ్వజమెత్తారు. ఏపీ ప్రజలతో తనకు, తెలంగాణ ప్రజలకు ఎలాంటి పంచాయితీ లేదన్నారు. బాబు వంటి కొంత మంది నాయకులతోనే తమకు కిరికిరి ఉందన్నారు. లక్షలాది మందిలో చెబుతున్నా.. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు దారుణంగా మాట్లాడుతున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాకు టీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని వైఎస్ జగన్ చెబితే.. కేసీఆర్ నీకు చెవిలో వచ్చి చెప్పిండా అని చంద్రబాబు అంటున్నాడన్నారు. ‘చంద్రబాబు.. మేం ఏదీ చెవిలో చెప్పం.. లక్షలాది మంది సభా వేదికగా, తెలంగాణ గడ్డ నుంచి చెబుతున్నా.. నీలాంటి చీకటి పనులు మాకు రావు. నీలా గోతులు తీయం. కుట్రలు చేయటమూ మాకు రాదు. మేం బాగుండాలి. ఇతరులు బాగుండాలని కోరుకుంటాం’ అని కేసీఆర్ తెలిపారు. ‘రెండు విషయాలు కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నాను. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని మేం లోక్‌సభ, రాజ్యసభలో మాట్లాడాం. ప్రత్యేక హోదా విషయంలో అదే స్టాండు మీద ఉన్నాం’అని కేసీఆర్ పునరుద్ఘాటించారు. తెలంగాణలో 16 ఎంపీ సీట్లు టీఆర్ఎస్, ఒక సీటు మజ్లిస్ గెలవడం ఖాయమన్నారు. ఏపీలో జగన్ బ్రహ్మాండగా గెలుస్తారని.. ఇద్దరికీ కలిపి 35 ఎంపీ సీట్లు వస్తాయని చెప్పారు. కచ్చితంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తేవటనికి తెలంగాణ ఎంపీలు, టీఆర్ఎస్ సపోర్టు చేస్తుందని కేసీఆర్ ప్రకటించారు. ‘చంద్రబాబూ.. నీలాంటి సన్నాసి ఎవ్వరూ ఉండరు. నీలాంటి దరిద్రపు బుద్ధి మాకు లేదు. నీలాగా మేం అల్పులం కాదు. నీకు తెలివిలేదు. నాకు తెలివి ఉంది. నాకు లెక్కలు తెలుసు. నాది ఉదారస్వభావం’అని సీఎం పేర్కొన్నారు. మేం కోరేది మా వాటా మాత్రమే గోదావరిలో తెలంగాణకు 1,000 టీఎంసీల కేటాయింపు ఉందని వాటిని కచ్చితంగా తీసుకుని తీరతామని సీఎం స్పష్టంచేశారు. ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వానికి చెప్పామన్నారు. తెలంగాణను ముంచుతామంటే పోలవరం వద్దన్నామే కానీ పోలవరం ప్రాజెక్టును అడ్డుకోలేదన్నారు. పోలవరం కట్టడానికి సంపూర్ణ సహకారం ఇస్తామని ప్రకటించారు. గోదావరి జలాలు వృధా అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంపూర్తిగా వినియోగించుకున్న తర్వాత కూడా.. 2,600 టీఎంసీ గోదావరి జలాలు సముద్రంలో కలిసిపోతున్నాయన్నారు. గోదావరి నీళ్లు సముద్రం పాలయ్యేకంటే, ఆంధ్రవాళ్లు వాడుకుంటే తమకేమీ ఇబ్బంది లేదన్నారు. ‘మేం కోరేది మా వాటా మాకు రావాలే.. మా పొలాలకు నీరు పారాలే. మాతో పాటు మీరు బతకాలని కోరుతున్నాం’అని కేసీఆర్అన్నారు. కొత్త రెవెన్యూ చట్టం జూన్ తర్వాత కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. రైతులు లంచాలు ఇచ్చే బాధలు పోయేందుకే కొత్త చట్టాన్ని తెస్తున్నామన్నారు. రైతుల బా«ధలు నాకు పూర్తిగా తెలుసు. ఇకపై రైతులు ఎవ్వరికి లంచాలు ఇవ్వవద్దని, రెండు నెలలు ఒపికపట్టాలని కోరారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపాలిటీల్లో నిత్యం ప్రజలు దోపిడీకి గురయ్యే పరిస్థితి ఉందన్నారు. కొంతమంది అధికారులు దుర్మార్గంగా లంచం కోసం పట్టి పీడిస్తున్నారని కేసీఆర్ తెలిపారు. తాను అందరు అధికారులను తప్పుపట్టడంలేదని, లంచం తీసుకునే వారిని మాత్రమే తప్పుపడుతున్నట్లు చెప్పారు. ఇతనకు ఇటీవల డా.శ్రీనివాస్ అనే వ్యక్తి భువనగిరి నుంచి ఎస్సెమ్మెస్ చేసినట్లు కేసీఆర్ చెప్పారు. ఆ ఎస్ఎంఎస్లో తాను రెండు ప్రభుత్వ కార్యాలయాలకు పనికోసం వెళ్లగా అక్కడ రెండు చోట్లా రూ.30వేల చొప్పున తనకు లంచం అడిగారని.. లంచం ఇవ్వక తప్పలేదన్నారు. ‘కేసీఆర్ మీరు పెద్ద పాపులర్ లీడర్. మీరు కూడా లంచంను నివారించలేరా’అని రాశారన్నారు. ఎసెమ్మెస్ చదవి సిగ్గుతో తాను తలవంచుకున్నానని.. అదే రోజు అధికారులతో మాట్లాడి అవినీతి.. లంచాల నిర్మూలించాలని కఠిన నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రజలు కొద్దిరోజులు అగాలని మంచి రోజులొస్తాయని భరోసా ఇచ్చారు. మే నుంచి పింఛన్ మొత్తాలను పెంచుతున్నామని, బడ్జెట్లో డబ్బులు పెట్టామని కేసీఆర్ చెప్పారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సొంతజాగాలో డబుల్బెడ్రూమ్ నిర్మించుకుంటే ఆర్థిక సహాయం చేస్తామన్నారు. వికారాబాద్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. వికారాబాద్‌ను చార్మినార్ జోన్లో కలుపుతామని హామీ ఇచ్చారు. వికారాబాద్‌కు పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు ఇస్తామని సీఎం తెలిపారు. కేంద్రంలో సంకీర్ణ సర్కార్! భారతదేశం చాలా విషయాల్లో వెనకబడిందని కేసీఆర్ అన్నారు. కేంద్రంలో గుణాత్మక మార్పు రావాలని, అది టీఆర్ఎస్తోనే సాధ్యమని తెలిపారు. కేంద్రంలో సంకీర్ణ సర్కార్ ఏర్పడుతుందని జోస్యం చెప్పారు. బీజేపీకి 150, కాంగ్రెస్‌కు వందలోపు ఎంపీ సీట్లు వస్తాయని, కేంద్రంలో ప్రాంతీయ పార్టీలదే హవా ఉంటుందన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందాలన్నా, ప్రాజెక్టులకు జాతీయ హోదా రావాలన్నా 16 మంది ఎంపీలు గెలవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాని లాంటి నేతలు హిందువులు, మైనార్టీలను విభజించి మాట్లాడటం సరికాదన్నారు. దేశాన్ని విభజించి పాలించాలనే కుటిలనీతి సరికాదన్నారు. దేశం సంపద పెరగాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో అందరికి ఉద్యోగాలు, ఉపాధి, విద్య, వైద్యం దొరకాలన్నారు. దేశ ప్రజలందరికి మేలు చేసే ప్రయత్నం మీ బిడ్డగా నేను చేస్తానని కేసీఆర్ అన్నారు. బహిరంగసభలో టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కే. కేశవరావు, చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి, మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్, ఎమ్మెల్యేలు ఆనంద్, మహేశ్‌రెడ్డి, కాలె యాదయ్య, ప్రకాశ్‌గౌడ్, ఎమెల్సీ కర్నె ప్రభాకర్, జీహెచ్ఎంసీ చైర్మన్ బొంతు రామ్మోహన్, టీఆర్ఎస్ నేతలు తీగల కృష్ణారెడ్డి, కార్తీక్‌రెడ్డి, బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నిన్న తల్లి.. నేడు తండ్రి
సాక్షి, అమరచింత (కొత్తకోట): తల్లిదండ్రుల ప్రేమను వారానికో పర్యాయం చూస్తూ.. సంబురపడి చదువుల్లో ముందుకెళ్తున్న చిన్నారులకు ఇక ఆ తల్లిదండ్రులు తిరిగిరాని లోకాలను వెళ్లారన్న సమాచారం తెలియగానే వారి రోదనలు మిన్నంటాయి. చిన్న వయస్సులోనే తల్లిదండ్రులు ఒకరి తర్వాత మరొకరిని పోగొట్టుకుని అనాథలైన ఆ చిన్నారుల ఆర్థనాదాలు పలువురిని కంటతడి పెట్టించాయి. ఈ హృదయవిదారక సంఘటన అమరచింతలో చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించి వివరాలిలా.. అమరచింతకు చెందిన కె.గోపి(42), భార్య కమలమ్మ ఇద్దరు గత ఆదివారం వనపర్తిలోని రేడియంట్ పాఠశాలలో చదువుకుంటున్న తమ పిల్లలను పలకరించి స్వగ్రామమైన అమరచింతకు తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో ఖానాపురం గ్రామం నుంచి ద్విచక్రవాహనంపై వేగంగా వస్తున్న ఇరువులు వ్యక్తులు గోపి బైకును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో గోపి, కమలమ్మకు తీవ్రగాయాలు కావడంతో ఆత్మకూర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ కమలమ్మ మృతిచెందగా.. గోపి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతున్న గోపి పరిస్థితి విషమించి శుక్రవారం మృతిచెందాడు. కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహాన్ని అమరచింతకు తీసుకురావడానికి బయల్దేరారు. గోపి మృతి పట్ల ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి, ఎంపీపీ శ్రీధర్‌గౌడ్, మాజీ మార్కెట్‌యార్డు చైర్మన్ రాజేందర్‌సింగ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాజు తదితరులు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. గోపి కుటుంబాన్ని ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు టీఆర్ఎస్ నాయకులు తెలిపారు. ఒకరిదొకరికి తెలియకుండానే.. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన కమలమ్మ అదే రోజు మృతిచెందిన సంఘటన భర్త గోపికి తెలియకుండానే కోమాలోకి వెళ్లాడు. భార్య కడసారి చూపునకు నోచుకోలేని పరిస్థితిలో చికిత్స పొందుతుండగానే కుటుంబ సభ్యులు కమలమ్మ అంత్యక్రియలను పూర్తిచేశారు. ఈ క్రమంలోనే భర్త సైతం మృతిచెందడంతో గ్రామస్తులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. అమ్మనాన్నలకు ఏమైందో కూడా తెలియని పరిస్థితిలో ఆ చిన్నారులు బిక్కుబిక్కుమంటూ కన్నీరు కార్చుతున్న సంఘటనలు పలువురి హృదయాలను కలచివేశాయి. చురుకైన కార్యకర్త అమరచింతకు చెందిన గోపి తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్లో క్రియాశీలక పాత్ర పోషిస్తూ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవాడు. గత రెండేళ్ల క్రితం టీఆర్ఎస్ పార్టీ అమరచింత పట్టణ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. భార్య కమలమ్మ ఆత్మకూర్ మండలం బాలకిష్టాపూర్‌లోని కస్తూర్బాలో అటెండర్‌గా పనిచేస్తుంది. ఈ క్రమంలోనే తమ పిల్లలు సిద్ధార్థ, సింధూజలను వనపర్తిలోని రేడియంట్ పాఠశాలలో చేర్పించి చదివిస్తున్నారు. వారానికోసారి తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి పిల్లల వద్దకు వెళ్లి వచ్చేవారు. ఈ క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు ఇద్దరూ అనంతలోకాలకు వెళ్లిపోవడంతో వారు అనాథలుగా మారారు. వీరికి దిక్కెవరు..? రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కమలమ్మ, గోపిలకు కుమారుడు సిద్ధార్థతోపాటు కుమార్తె సింధూజ ఉన్నారు. సిద్ధార్థ వనపర్తిలోని రేడియంట్ పాఠశాలలో 7వ తరగతి చదువుతుండగా.. అదే పాఠశాలలో సింధూజ కూడా 5వ తరగతి చదువుకుంటుంది. మృతిచెందిన గోపికి సైతం అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములు ఎవరూ లేకపోవడంతో ఆ చిన్నారుల భవిష్యత్ ప్రశ్నార్థకమైంది. కమలమ్మ తల్లితండ్రులు సవారన్న, రుక్కమ్మల ఆదరణలోనే సిద్ధార్థ, సింధూజ ఉన్నారు. చిన్నారులను ప్రభుత్వపరంగా ఆదుకోవాలని పలువురు గ్రామస్తులు కోరుతున్నారు. -
భారీ ఆధిక్యం; టీఆర్ఎస్ సంబరాలు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారీ విజయంగా దూసుకుపోతుండటంతో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి. పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌కు భారీ ఎత్తున చేరుకున్న నాయకులు, కార్యకర్తలు పండగ చేసుకుంటున్నారు. ప్రాథమిక ఫలితాలు తమకు అనుకూలంగా రావడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. తమ పార్టీ భారీ విజయం సాధించబోతోందని స్పష్టం కావడంతో స్వీట్లు, కేకులు పంచుకుంటున్నారు. కేసీఆర్ జిందాబాద్ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. పెద్ద ఎత్తున బాణాసంచా సంచా కాల్చేందుకు రెడీ అవుతున్నారు. జిల్లాల్లోనూ టీఆర్ఎస్ కార్యాలయాల వద్ద సంబరాలు మొదలయ్యియి. కాగా, అసెంబ్లీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని శాంతిభద్రతల విభాగం అదనపు డీజీ జితేందర్ స్పష్టం చేశారు. -
గులాబీ పార్టీలో ముసలం
సాక్షి, జనగామ: జనగామ నియోజకవర్గంలోని అధికార టీఆర్ఎస్ పార్టీలో ముసలం మొదలైంది. ఒక వైపు సాధారణ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండగా.. నేడో, రేపో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగబోతున్న తరుణంలో.. అధికార పార్టీ నాయకులకు సొంత కార్యకర్తల నుంచే విమర్శలు ఎదురవుతుండడం చర్చనీయాంశంగా మారింది. జిల్లాలోని నర్మెట మండలానికి చెందిన పీఏసీఎస్ చైర్మన్, టీఆర్ఎస్ సీనియర్ నేత ఇమ్మడి శ్రీనివాస్‌రెడ్డి.. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తగాపై తిరుగుబాటు ప్రకటించారు. జనగామ ఎమ్మెల్యే చేత నియమితులై సమన్వయకర్తగా చెలామణి అవుతున్న నాయకుడు నాలుగేళ్లుగా కార్యకర్తలను పట్టించుకోవడం లేదని, వారి బాగోగులు మరిచారని, నర్మెట ఎంపీపీ మరణిస్తే కనీసం పరామర్శకు సైతం రాలేదని తన వాట్సప్ పోస్టింగ్‌లో తెలిపారు. నాలుగేళ్లుగా కార్యకర్తలతో సమన్వయకర్త మీటింగ్‌లు పెట్టిన సందర్భాలు లేవని, ఎలక్షన్లు దగ్గరపడుతున్నాయని, ఇప్పటికైనా పార్టీని కాపాడాలని ఇమ్మడి శ్రీనివాస్‌రెడ్డి కామెంట్ చేస్తూ పోస్టింగ్ చేశారు. కాగా, శ్రీనివాస్‌రెడ్డి చేసిన పోస్టింగ్ సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్‌గా మారింది. నియోజకవర్గంలోనే సీనియర్ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాస్‌రెడ్డి పార్టీ నాయకులపై బహిరంగ విమర్శలకు దిగడం టీఆర్ఎస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి. అధికార పార్టీలో అంతర్గత విభేదాలు పొడచూపుతుండడంతో నియోజకవర్గంలోని గులాబీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నారు. ఇమ్మడి శ్రీనివాస్‌రెడ్డి సంధించిన విమర్శలకు సొంత పార్టీలోని నాయకులు, కార్యకర్తలు మద్దతు తెలపడం గమనార్హం. ఏదిఏమైనా అధికార పార్టీలో శ్రీనివాస్‌రెడ్డి చేసిన విమర్శలు టీఆర్ఎస్లోనే కాకుండా రాజకీయాల్లో వర్గాల్లో చర్చకు దారీతీస్తున్నాయి. -
లండన్‌లో కేసీఆర్ జన్మదిన వేడుకలు
లండన్ : తెలంగాణ రాష్ట్ర సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలు లండన్‌లోని ఎన్నారై టీఆర్ఎస్ యూకే సెల్ ఆధ్వర్యంలో అంగరంగవైభవంగా జరిగాయి. ఈ సెల్ ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల అధ్యక్షతన కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యూకే నలుమూలల నుంచి భారీగా తెలంగాణ తెరాస కార్యకర్తలు, ఇతర ప్రవాసులు హాజరయ్యారు. కేసీఆర్ ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని, తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా నిర్మించే క్రమంలో భగవంతుడు వారికి అన్ని సందర్భాల్లో మనోధైర్యాన్ని, ఆశిస్సులను అందించాలని కోరుకుంటున్నానని ఉపాధ్యక్షులు అశోక్ దూసరి ప్రసంగించారు. నవీన్ రెడ్డి మాట్లాడుతూ..‘మనం కలలు కన్న బంగారు తెలంగాణ కోసం కేసీఆర్ అహర్నిశలు కష్టపడుతున్నారు. ఎన్నారై టీఆర్ఎస్ సెల్‌కు కేసీఆర్, ఎంపీ కవిత ఇస్తున్న ప్రోత్సాహానికి కృతజ్ఞతలు. ప్రతి తెలంగాణ బిడ్డ కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచడం చారిత్రక అవసరం’ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాల గురించి సెక్రటరీ సృజన్‌రెడ్డి వివరిస్తూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరిని కలుపుకుని, అందరి సూచనలను తీసుకుని ముందుకు వెళ్తోంది, ఎవరైనా సరే తమ సలహాలు, సూచనలు సోషల్‌మీడియా ద్వారా, వ్యక్తిగతంగానైనా సరే తెలియజేయాలని అన్నారు. అనంతరం ఈస్ట్ లండన్ ఇంచార్జ్ రమేశ్ యెసంపల్లి, ఐటీ సెక్రటరీ వినయ్ ఆకుల ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై టీఆర్ఎస్ ఉపాధ్యక్షులు అశోక్ దూసరి, నవీన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, అడ్వైజర్ బోర్డ్ సభ్యులు దొంతుల వెంకట్ రెడ్డి , సత్యం రెడ్డి కంది, సెక్రటరీ సేరు సంజయ్, సృజన్ రెడ్డి , మీడియా ఇంచార్జ్ శ్రీకాంత్ జెల్ల, యూకె అండ్ ఈయూ ఇంచార్జ్ విక్రమ్ రెడ్డి, ఐటీ సెక్రటరీ వినయ్ ఆకుల, ఈస్ట్ లండన్ కో ఆర్డినేటర్ రమేశ్ యెసంపల్లి, ఈవెంట్స్ కో ఆర్డినేటర్స్ రవి ప్రదీప్ , వెస్ట్ లండన్ ఇంచార్జ్ బుడగం, ముఖ్య సభ్యులు రవికుమార్ రత్తినేని, అశోక్ కుమార్, అంతగిరి రాఘవేందర్, మహేందర్ రెడ్డి, టాక్ సభ్యులు మట్టా రెడ్డి తదితరులు హాజరయ్యారు. -
ఉద్యమకారులకే తొలి ప్రాధాన్యం
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో తెలంగాణ ఉద్యమకారులకే ప్రాధాన్యం ఉంటుందని, రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఏ ఒక్కరినీ టీఆర్ఎస్ పార్టీ మరిచిపోదని, వారికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని రాష్ట్ర, రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఖమ్మంలో నూతనంగా నిర్మించిన టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్.బి.బేగ్ అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి మాట్లాడారు. పార్టీ బలోపేతానికి కృషి చేసే నేతలు, కార్యకర్తలకు ఎప్పటికీ గౌరవం లభిస్తుందన్నారు. పార్టీ కార్యాలయం.. ముఖ్య మంత్రి ఆశయం కోసం పనిచేసే దేవాలయంగా ఉండాలని ఆకాక్షించారు. టీఆర్ఎస్ అధి కారంలోకి వచ్చాక 47 కార్పొరేషన్ పదవులు ఉద్యమకారులకు ఇవ్వటం ఇందుకు నిదర్శనమన్నారు. మార్కెట్ కమిటీలు, గ్రంథాలయ సంస్థలు, రైతు సమన్వయ సమితులకు సంబంధించిన పదవులను స్థానిక ఎమ్మెల్యేల సిఫారస్ ప్రకారం నియమించామన్నారు. పార్టీ, ప్రభుత్వపరంగా ఆయా నియామకాల్లో ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలకు సర్వాధికారాలు ఇచ్చారన్నారు. మిషన్ భగీరథ ద్వారా త్వరలోనే అన్ని మండలాలకు తాగునీరు అందనుందని చెప్పారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అడ్డగోలుగా కేటాయిస్తే కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే పడుతుందన్నారు. పార్టీలకతీతంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తున్నామని, న్యాయబద్ధంగా చేస్తేనే ప్రజలు హర్షిస్తారన్నారు. ఏ తప్పు జరగకుండా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు పేద లకు అందించేందకు టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని తమ సమస్యలను తీర్చుకోవాలని కోరారు. కార్యక్రమంలో అశ్వారావుపేట ఎమ్మె ల్యే తాటి వెంకటేశ్వర్లు, వైరా ఎమ్మెల్యే బానోతు మదన్‌లాల్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ, పారిశ్రామికాభివృద్ధి సంస్థ, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్లు కొండబాల కోటేశ్వరరావు, ఎస్.బి.బేగ్, పిడమర్తి రవి, జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేష్‌రెడ్డి, కార్యదర్శి తెల్లం వెంకట్రావ్, నగర మేయర్ పాపాలాల్, ఉమ్మడి జిల్లాలకు చెందిన నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే ఇంటి ముందు మహిళ ఆత్మహత్యాయత్నం
రంగారెడ్డి : రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఇంటి ముందు టీఆర్ఎస్ మహిళా నాయకురాలు లక్ష్మీరాజ్ ఆత్మహత్యాయత్నం చేసింది. ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకోబోయింది. స్థానికులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. వార్డ్ కమిటీ మెంబర్ పదవి ఇవ్వలేదని ఆమె ఆరోపిస్తోంది. ఎమ్మెల్యే అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా కేవలం మైలర్దేవుపల్లి కార్పొరేటర్ సూచన మేరకు వార్డ్ కమిటీ మెంబర్లను నియమించారని ఆవేదన వ్యక్తం చేసింది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సొమ్మసిల్లి పడిపోవడంతో తోటి కార్యకర్తలు ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
టీఆర్ఎస్ కార్యకర్తపై కాంగ్రెస్ నాయకుల దాడి
కౌడిపల్లి, న్యూస్‌లైన్: టీఆర్ఎస్ కార్యకర్తపై కాంగ్రెస్ నాయకుడు దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని గంగారంలో చోటుచేసుకుంది. బాధితుడు హరినాథ్‌రెడ్డి, అతని తల్లి విజయ, మాజీ కోఆప్షన్ సభ్యుడు ముజాహిద్ హుస్సెన్, గ్రామస్తుల కథనం ప్రకారం... గంగారం గ్రామానికి చెందిన ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్ ప్రభాకర్ గ్రామంలో ఉపాధి హామీ పనులు, ఎత్తిపోతల పథకం సాగునీరు, పింఛన్లు ఇక నుండి బంద్ చేస్తామని, ఆదివారం గ్రామస్తులంతా గ్రామ చావిడివద్దకు రావాలని చాటింపు వేయించాడు. దీంతో ఆదివారం ఉదయం గ్రామస్థులందరు గ్రామచావిడివద్దకు వచ్చారు. పనులు, సాగునీరు ఎందుకు బంద్చేస్తారని గ్రామస్థులతోపాటు హరినాథ్‌రెడ్డి ప్రశ్నించాడు. ఇదేవిషయంపై గ్రామస్థుడు శంకర్ మాట్లాడుతూ తమకు కొన్ని నెలలుగా ఉపాధి హామీ కూలి డబ్బులు ఎందుకు ఇవ్వడంలేదని ఫీల్డ్ అసిస్టెంట్‌ను నిలదీయగా అతనికి హరినాథ్‌రెడ్డి మద్దతు పలికాడు. దీంతో అడిగేందుకు మీరెవరంటు ఫీల్డ్అసిస్టెంట్ దూషించగా, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, గ్రామ ఉపసర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి గ్రామస్థుల సమక్షంలోనే హరినాథ్‌రెడ్డిపై దాడికి పాల్పడ్డాడు. దీంతో బాధితులు పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నాయకుడిపై ఫిర్యాదు చేశారు. అయితే కేసు ఇంకా నమోదు కాలేదని, విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. ఇదిలాఉండగా ఎన్నికల్లలో కాంగ్రెస్ పార్టీకి ఓట్టువేయలేదన్న కక్షతోనే గ్రామంలో పనులు బంద్చేయస్తామని చాటింపు వేశారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్ పనులు బంద్ చేస్తామంటు చాటింపుచేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు. పోలీసులు స్పందించి తమకు రక్షణ కల్పించాలని బాధితుడి తల్లి కోరింది.