
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మంత్రి కేటీఆర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. డ్రగ్స్ పరీక్షకు సిద్ధమని మంత్రి కేటీఆర్ ప్రకటించగా దానిపై సోమవారం నాటకీయ పరిణామాలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ ఆరోపణలపై మంత్రి కేటీఆర్ న్యాయ పోరాటానికి దిగారు. వీరి మధ్య ఈ వివాదం కొనసాగుతుండగా తాజాగా ఆ రెండు పార్టీ కార్యకర్తల మధ్య వివాదం ఏర్పడింది.
చదవండి: డ్రగ్స్ వార్.. మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా స్వీకరణ
మంత్రి కేటీఆర్‌పై ఆరోపణలకు నిరసనగా టీఆర్‌ఎస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డి నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి యత్నించారు. ఇది గమనించిన కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు. దీంతో ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరు వర్గాల కార్యకర్తలు బహాబాహీకి దిగారు. రేవంత్‌రెడ్డి వర్గీయులు, టీఆర్‌ఎస్ కార్యకర్తలు కర్రలు పట్టుకుని పరస్పరం దాడి చేసుకున్నారు. పోలీసులు అక్కడకు చేరుకుని ఇరు వర్గాలవారిని వారిస్తున్నా వారు రెచ్చిపోయారు. చివరకు పోలీసులు అతికష్టంగా ఇరు వర్గాలను చెదరగొట్టారు.
చదవండి: ఒక్క మహిళా లేదు.. పురుషులతో నిండిన మంత్రివర్గం