మంథని మండలం ఖానాపూర్‌శివారులో గోదావరి నీరు
మంథని: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం గంగా జలాలు పెద్దపల్లి జిల్లా మంథనిని తాకాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గోదారమ్మ ఎదురుగా పారుతూ.. బుధవారం సాయంకాలం నాటికి మంథని మండలశివారు ప్రాంతమైన గోదావరిలో బొక్కలవాగు కలిసే ప్రాంతం దాటింది. మంథని నియోజకవర్గంలోని కన్నెపల్లి పంపుహౌస్ నుంచి అన్నారం బ్యారేజీకి చేరిన నీటిని సుందిళ్లకు రివర్స్ పంపింగ్ చేస్తున్నారు. అన్నారం బ్యారేజీ సామర్థ్యం 10.52 టీఎంసీలు కాగా.. ఇప్పటికే 2.5 టీఎంసీల నీరుచేరింది. కన్నెపల్లి వద్ద నాలుగో పంపును ప్రారంభించడంతో ప్రవాహం మరింత పెరిగే అవకాశముంది. ఏడు టీఎంసీల నీరు అన్నారం బ్యారేజీకి చేరితే సుందిళ్ల పంపుహౌస్‌కు వస్తుందని నీటిపారుదల అధికారులు చెబుతున్నారు. గౌతమేశ్వర తీరమైన మంథనికి కాళేశ్వర గోదావరమ్మ చేరుతున్న క్రమంలో స్వాగత పూజలు నిర్వహించేందుకు టీఆర్‌ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం మంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టమధు పూజలు నిర్వహించనున్నారు. ఇన్నాళ్లు ఎడారిని తలపించి తొలి ఏకాదశికి ఒక రోజు ముందే గోదారమ్మ మంథనికి చేరుకోవడంతో భక్తుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment