సాక్షి, వరగంల్, హన్మకొండ: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కాన్వాయ్‌పై టీఆర్‌ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో ఆరుగురిపై సుబేదారి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. అరవింద్ హన్మకొండ హంటర్‌రోడ్డులోని వేద బాంక్వెట్ హాల్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వరంగల్ నగరంలోని ఇద్దరు ఎమ్మెల్యేలపై ఘాటైన ఆరోపణలు చేశారు. వారు భూకబ్జాదారులని ఆరోపించారు. ఎంపీ తన వరంగల్ పర్యటనను ముగించుకొని తిరుగు ప్రయాణం అవుతున్న క్రమంలో టీఆర్‌ఎస్ కార్యకర్తలు బీజేపీ జిల్లా కార్యాలయానికి చేరుకున్నారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు వచ్చారు.
ఎమ్మెల్యేలు, నాయకులపై ఎంపీ చేసిన విమర్శలతో ఆగ్రహంతో ఉన్న టీఆర్‌ఎస్ కార్యకర్తలు అరవింద్ కాన్వాయ్‌పై కోడిగుడ్లతో దాడి చేయడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. పోలీసుల ముందే ఎంపీ కాన్వాయ్‌పై దాడి చేయడం పట్ల బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఎంపీ అరవింద్ చేసిన ఆరోపణలు, విమర్శలపై హన్మకొండ బాలసముద్రంలోని క్యాంపు కార్యాలయంలో చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ విలేకరుల సమావేశం పెడుతున్నారనే విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు అక్కడికి బయలు దేరారు. అడ్వొకేట్స్ కాల నీ మధ్యలోకి రాగానే పోలీసులు వచ్చి అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ వాహనం తాళం చెవి లాక్కున్నారు. దీంతో తాళం చెవి ఇచ్చేయాలంటూ వారు అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. అక్కడి నుంచి వారి ని పోలీసులు వెనక్కి పంపగా హంటర్ రోడ్డుకు చేరుకుని సెంటర్‌లో బైఠాయించి ధర్నా చేశారు. ఈ క్రమంలో బీజేపీ నాయకులను అరెస్టు చేస్తున్న క్రమంలో పోలీసుల నెట్టివేతకు గురైన జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ కిందపడిపోగా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రాష్ట్రంలో నైజాం పాలన జరుగుతోందనడానికి ఇంతకంటే ఉదాహరణ మరొకటి లేదని బీజేపీ నేతలు పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ను విమర్శిస్తే దాడులు చేయడం, కేసులు పెట్టి బెదిరించడం రాష్ట్రంలో సాధారణమైందన్నారు. రాష్ట్రంలో ఎంపీలకు కూడా రక్షణ లేకుండా పోయిందని, అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని మండిపడ్డారు. ఇదిలా ఉండగా ఎంపీ « అరవింద్ పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీ నేతలను ఆరా తీసినట్లు తెలిసింది.
రూ.200 కోట్లు ఏమయ్యాయి: అరవింద్
వరంగల్ నగరంలో ఉన్న ఇద్దరు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు భూ కబ్జాదారులని ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. వరంగల్ తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు వినయ్‌భాస్కర్, నన్నపునేని నరేందర్‌ల భూ ఆక్రమణలపై తెలంగాణలో ఎవరిని అడిగినా చెప్తారని అన్నారు. కేంద్రం వివిధ పథకాల కింద వరంగల్‌కు కేటాయించిన రూ.200 కోట్లు ఏమయ్యాయో చెప్పాలని టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులను ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment