
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తహసీల్దార్‌పై గిరిజనులు దాడికి పాల్పడ్డారు. కాగా, తండావాసుల దాడిలో తహసీల్దార్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, ఆయనను మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
వివరాల ప్రకారం.. తహసీల్దార్ ఇమ్మాన్యుయేల్‌పై ఆదివారం మధ్యాహ్నం పట్టణ శివారు సాలార్ తండాకు వెళ్లారు. ఈ సందర్బంగా నూతనంగా ఏర్పాటు చేయనున్న జిల్లా కోర్టుకు కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. గత అధికారులు కేటాయించిన 9 ఎకరాల స్థలానికి హద్దులు పెడుతుండగా ముగ్గురు వ్యక్తులు వచ్చి తహసీల్దార్‌తో వాగ్వాదానికి దిగారు. భూమి తమదంటూ.. ఇక్కడ ఎలాంటి హద్దులు పెట్టొద్దంటూ తహసీల్దార్‌ను అడ్డగించారు.
ఇలా కాసేపు వారి మధ్య వాగ్వాదం తర్వాత తహసీల్దార్ తిరిగి వెళ్తుండగా వారు ఆయనపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తహసీల్దార్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయనను తోటి సిబ్బంది మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. నిందితులు ప్రవీణ్, నవీన్‌ను అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: విషాదం: రోడ్డు ప్రమాదంలో ఎస్‌ఐ మృతి