భార్యాపిల్లలను గెంటేసి ఇంటికి తాళం వేసిన ప్రబుద్ధుడు
ఆపై తల్లిదండ్రులతో కలిసి పరార్
వరంగల్ కరీమాబాద్‌లో ఘటన
మిల్స్‌కాలనీ పీఎస్‌లో బాధితురాలి ఫిర్యాదు
ఖిలా వరంగల్ : ‘ఆడపిల్లలు లేనిదే సృష్టి లేదు. ఆడపిల్లలను బతకనిద్దాం.. సమాజంలో గౌరవంగా నిలుపుదాం.. ఆడపిల్లను చదవనిద్దాం.. ఎదగనిద్దాం.. ఇంటికి వెలుగులు.. ఆడపిల్ల చిరునవ్వులు.. అంటూ ప్రభుత్వాలు, అధికారులు ఎన్ని అవగాహన సమావేశాలు ఏర్పాటు చేసినా కొందరు మారడం లేదు. ఆడపిల్లల పట్ల ఇంకా వివక్షే ప్రదర్శిస్తున్నారు. బాలికకు జన్మించిందంటే చాలు.. ఎక్కడో చోట ఆ తల్లిని చిత్రహింసలకు గురిచేస్తున్నారు.
ఇలాంటి ఘటన వరంగల్‌లో చోటు చేసుకుంది. ఆడపిల్లలకు జన్మనివ్వడమే ఆ ఇల్లాలు చేసిన పాపం..! ఆడపిల్లలకు జన్మనిచ్చిందని ఓ ప్రభుద్ధుడు.. తన భార్య, ఇద్దరు పిల్లలను ఇంటి నుంచి గెంటేసి తాళం వేసి పరారు కాగా.. స్థానికులు, బంధువుల సహకారంతో ఆ ఇల్లాలు తన ఇద్దరి పిల్లలతో కలిసి అత్తారింటి ఎదుట ధర్నా చేపట్టింది. ఈ ఘటన ఆదివారం వరంగల్ ఉర్సు కరీమాబాద్ సుభాశ్‌నగర్‌లో వెలుగులోకి వచ్చింది.
స్థానికులు, బాధితుల కథనం ప్రకారం.. వరంగల్ ఆర్టీఏ జంక్షన్ నాయుడు పెట్రోల్ బంక్ సమీప కాలనీకి చెందిన బైరి వీరస్వామి, నాగమణి దంపతుల కుమార్తె నవితను 14 ఏళ్ల క్రితం వరంగల్ ఉర్సు కరీమాబాద్ సుభాష్‌నగర్‌కు చెందిన బలభద్ర నారాయణ, చంద్రకళ దంపతుల కుమారుడు రాజేశ్‌కు ఇచ్చి వివాహం చేశారు. ఈ సమయంలో కట్నం ఇతర కానుకలు అందజేశారు. అయితే ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చావంటూ భర్త, అత్తామామ వేధింపులకు గురిచేస్తున్నారు. దీంతో నవిత ఈ విషయం తన తల్లిదండ్రులకు చెప్పి కన్నీరుమున్నీరుగా విలపించింది. దీంతో వీరస్వామి తనకుమార్తె ఎదురవుతున్న కష్టాలు చూడలేక 43వ డివిజన్ నక్కలపల్లిలో ఓ ఇళ్లు, మహారాష్ట్రలోని బీమండిలో ఒక ఇళ్లు బిడ్డకు ఇచ్చేశారు.
అయినా ఆడపిల్లలకు జన్మనిచ్చావని మళ్లీ భర్త.. నవితను కొట్టిగా.. ఆరునెలల క్రితం ఒక కన్ను కోల్పోయింది. చికిత్స పొందిన తర్వాత ఆదివారం ఇద్దరు ఆడపిల్లలను తీసుకుని అత్తారింటికి చేరింది. ఇంట్లోకి అడుగుపెట్టగానే భార్య, ఇద్దరు కుమార్తెలను ఇంటి నుంచి గెంటేసి తాళం వేసి భర్త తల్లిదండ్రులను వెంట తీసుకుని పరారయ్యాడు. దీంతో నవిత పుట్టింటికి వెళ్లకుండా స్థానికులు , బంధువుల సహకారంతో అత్తారింటి ఎదుట ధర్నా నిర్వహించింది.
స్థానికులు.. తాళం ధ్వంసం చేసి భార్య, ఇద్దరు కుమార్తెలు ఇంట్లోకి పంపించారు. రాత్రి సమయంలో భర్త వచ్చి ఏదైనా బెదిరింపులకు పాల్పడితే 100 డైల్ చేసి పోలీసులకు సమాచారం చెప్పాలని భరోసా కల్పించారు. కాగా, ఆడపిల్లలకు జన్మనివ్వడమే నవిత చేసిన పాపమా..? పోలీస్ అధికారులు వెంటనే స్పందించి చిత్రహింసలకు గురిచేస్తున్న భర్తకు బుద్ధి చెప్పాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment