నిన్న తల్లి.. నేడు తండ్రి | Children lost their Parents With In 24 Hours In Road Accident Mahabubnagar | Sakshi
Sakshi News home page

నిన్న తల్లి.. నేడు తండ్రి

Mar 2 2019 11:35 AM | Updated on Mar 2 2019 11:42 AM

Children lost their Parents With In 24 Hours In Road Accident Mahabubnagar - Sakshi

కుమారుడు, కుమార్తెతో గోపి, కమలమ్మ (ఫైల్‌)

సాక్షి, అమరచింత (కొత్తకోట): తల్లిదండ్రుల ప్రేమను వారానికో పర్యాయం చూస్తూ.. సంబురపడి చదువుల్లో ముందుకెళ్తున్న చిన్నారులకు ఇక ఆ తల్లిదండ్రులు తిరిగిరాని లోకాలను వెళ్లారన్న సమాచారం తెలియగానే వారి రోదనలు మిన్నంటాయి. చిన్న వయస్సులోనే తల్లిదండ్రులు ఒకరి తర్వాత మరొకరిని పోగొట్టుకుని అనాథలైన ఆ చిన్నారుల ఆర్థనాదాలు పలువురిని కంటతడి పెట్టించాయి. ఈ హృదయవిదారక సంఘటన అమరచింతలో చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించి వివరాలిలా..  

అమరచింతకు చెందిన కె.గోపి(42), భార్య కమలమ్మ ఇద్దరు గత ఆదివారం వనపర్తిలోని రేడియంట్‌ పాఠశాలలో చదువుకుంటున్న తమ పిల్లలను పలకరించి స్వగ్రామమైన అమరచింతకు తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో ఖానాపురం గ్రామం నుంచి ద్విచక్రవాహనంపై వేగంగా వస్తున్న ఇరువులు వ్యక్తులు గోపి బైకును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో గోపి, కమలమ్మకు తీవ్రగాయాలు కావడంతో ఆత్మకూర్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స  పొందుతూ కమలమ్మ మృతిచెందగా.. గోపి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడే   చికిత్స పొందుతున్న గోపి  పరిస్థితి విషమించి   శుక్రవారం  మృతిచెందాడు. కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహాన్ని అమరచింతకు తీసుకురావడానికి బయల్దేరారు. గోపి  మృతి  పట్ల  ఎమ్మెల్యే  చిట్టెం రాంమోహన్‌రెడ్డి, ఎంపీపీ శ్రీధర్‌గౌడ్, మాజీ మార్కెట్‌యార్డు చైర్మన్‌ రాజేందర్‌సింగ్, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు రాజు తదితరులు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. గోపి కుటుంబాన్ని ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు టీఆర్‌ఎస్‌ నాయకులు తెలిపారు.  
ఒకరిదొకరికి తెలియకుండానే.. 
రోడ్డు ప్రమాదంలో తీవ్ర   గాయాలపాలైన కమలమ్మ అదే రోజు మృతిచెందిన సంఘటన భర్త గోపికి తెలియకుండానే కోమాలోకి వెళ్లాడు. భార్య  కడసారి చూపునకు నోచుకోలేని పరిస్థితిలో చికిత్స పొందుతుండగానే కుటుంబ సభ్యులు కమలమ్మ అంత్యక్రియలను పూర్తిచేశారు. ఈ క్రమంలోనే భర్త సైతం మృతిచెందడంతో గ్రామస్తులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. అమ్మనాన్నలకు ఏమైందో కూడా తెలియని పరిస్థితిలో ఆ చిన్నారులు బిక్కుబిక్కుమంటూ కన్నీరు కార్చుతున్న సంఘటనలు పలువురి హృదయాలను కలచివేశాయి.  

చురుకైన కార్యకర్త 
అమరచింతకు చెందిన గోపి తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్‌లో క్రియాశీలక పాత్ర   పోషిస్తూ కార్యక్రమాల్లో చురుకుగా   పాల్గొనేవాడు.   గత రెండేళ్ల క్రితం టీఆర్‌ఎస్‌  పార్టీ   అమరచింత పట్టణ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. భార్య   కమలమ్మ ఆత్మకూర్‌ మండలం బాలకిష్టాపూర్‌లోని కస్తూర్బాలో అటెండర్‌గా పనిచేస్తుంది. ఈ క్రమంలోనే తమ పిల్లలు సిద్ధార్థ, సింధూజలను   వనపర్తిలోని రేడియంట్‌ పాఠశాలలో చేర్పించి చదివిస్తున్నారు. వారానికోసారి తల్లిదండ్రులు   ఇద్దరూ   కలిసి    పిల్లల వద్దకు వెళ్లి వచ్చేవారు. ఈ క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు ఇద్దరూ అనంతలోకాలకు వెళ్లిపోవడంతో వారు అనాథలుగా మారారు.  

వీరికి దిక్కెవరు..? 

రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కమలమ్మ, గోపిలకు కుమారుడు సిద్ధార్థతోపాటు    కుమార్తె  సింధూజ ఉన్నారు. సిద్ధార్థ  వనపర్తిలోని రేడియంట్‌ పాఠశాలలో 7వ తరగతి చదువుతుండగా.. అదే పాఠశాలలో సింధూజ కూడా 5వ తరగతి చదువుకుంటుంది. మృతిచెందిన గోపికి సైతం అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములు ఎవరూ లేకపోవడంతో ఆ చిన్నారుల భవిష్యత్‌ ప్రశ్నార్థకమైంది. కమలమ్మ తల్లితండ్రులు సవారన్న,  రుక్కమ్మల ఆదరణలోనే సిద్ధార్థ, సింధూజ ఉన్నారు. చిన్నారులను ప్రభుత్వపరంగా ఆదుకోవాలని పలువురు గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement