
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో తెలంగాణ ఉద్యమకారులకే ప్రాధాన్యం ఉంటుందని, రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఏ ఒక్కరినీ టీఆర్‌ఎస్ పార్టీ మరిచిపోదని, వారికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని రాష్ట్ర, రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఖమ్మంలో నూతనంగా నిర్మించిన టీఆర్‌ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్.బి.బేగ్ అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి మాట్లాడారు. పార్టీ బలోపేతానికి కృషి చేసే నేతలు, కార్యకర్తలకు ఎప్పటికీ గౌరవం లభిస్తుందన్నారు. పార్టీ కార్యాలయం.. ముఖ్య మంత్రి ఆశయం కోసం పనిచేసే దేవాలయంగా ఉండాలని ఆకాక్షించారు.
టీఆర్‌ఎస్ అధి కారంలోకి వచ్చాక 47 కార్పొరేషన్ పదవులు ఉద్యమకారులకు ఇవ్వటం ఇందుకు నిదర్శనమన్నారు. మార్కెట్ కమిటీలు, గ్రంథాలయ సంస్థలు, రైతు సమన్వయ సమితులకు సంబంధించిన పదవులను స్థానిక ఎమ్మెల్యేల సిఫారస్ ప్రకారం నియమించామన్నారు. పార్టీ, ప్రభుత్వపరంగా ఆయా నియామకాల్లో ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలకు సర్వాధికారాలు ఇచ్చారన్నారు. మిషన్ భగీరథ ద్వారా త్వరలోనే అన్ని మండలాలకు తాగునీరు అందనుందని చెప్పారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు అడ్డగోలుగా కేటాయిస్తే కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే పడుతుందన్నారు. పార్టీలకతీతంగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టిస్తున్నామని, న్యాయబద్ధంగా చేస్తేనే ప్రజలు హర్షిస్తారన్నారు. ఏ తప్పు జరగకుండా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు పేద లకు అందించేందకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు.
టీఆర్‌ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని తమ సమస్యలను తీర్చుకోవాలని కోరారు. కార్యక్రమంలో అశ్వారావుపేట ఎమ్మె ల్యే తాటి వెంకటేశ్వర్లు, వైరా ఎమ్మెల్యే బానోతు మదన్‌లాల్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ, పారిశ్రామికాభివృద్ధి సంస్థ, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌లు కొండబాల కోటేశ్వరరావు, ఎస్.బి.బేగ్, పిడమర్తి రవి, జెడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేష్‌రెడ్డి, కార్యదర్శి తెల్లం వెంకట్రావ్, నగర మేయర్ పాపాలాల్, ఉమ్మడి జిల్లాలకు చెందిన నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment