Thumala Nageshwara Rao
-
మైనింగ్ గ్రామాల అభివృద్ధికి రూ.290 కోట్లు
కొత్తగూడెం/చుంచుపల్లి: జిల్లాలో మైనింగ్ ప్రభావిత గ్రామాల అభివృద్ధికి రూ.290 కోట్లు విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. కొత్తగూడెంలోని ఇల్లెందు గెస్ట్‌హౌస్‌లో జిల్లా మినరల్ ఫౌండేషన్ ప్రథమ సమావేశం శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన తుమ్మల మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం మైనింగ్ ప్రభావిత గ్రామాల విషయంలో ప్రత్యేక దృష్టిని సారించి వాటి అభివృద్ది కోసం కృషి చేస్తోందని అన్నారు. ఈ నిధులను జిల్లాలోని మైనింగ్ ప్రభావిత 86 గ్రామాలలో ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఆయా గ్రామాల్లో చేపట్టాల్సిన పనుల గుర్తింపునకు గ్రామసభలను నిర్వహించి తీర్మానం చేసి జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని ఎమ్మెల్యేలకు సూచించారు. ఈ నిధులలో 60 శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో పాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు, ప్రజల సాంఘిక, ఆర్థిక, ఆరోగ్య, వాతావరణ పరిస్థితుల ప్రభావాన్ని తగ్గించుటకు, ప్రజలకు శాశ్వత జీవనోపాధి కల్పించేందుకు వినియోగిస్తామని, మిగితా 40 శాతం నిధులను మంచినీటి సరఫరా, వాతావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, విద్య, స్త్రీ, శిశు సంక్షేమం, వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమం, వృత్తి నైపుణ్యాభివృద్ధి తదితర పనులకు కేటాయి స్తామని వివరించారు. రెండు కిలోమీటర్ల లోపు మైనింగ్ ప్రభావిత ప్రాంత గ్రామాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని, వాటి జాబితాను సింగరేణి అధికారులు అందజేయాలని కోరారు. జిల్లా మినరల్ ఫౌండేషన్‌లో సభ్యులుగా మైనింగ్ ప్రభావిత గ్రామంలోని ఒక మహిళ, ఒక పురుష అభ్యర్థులు తీర్మానం చేసి పంపాలని, ఆ జాబితా ఆధారంగా జిల్లా కమిటీలో సభ్యులుగా నియమిస్తామని అన్నారు. పనులు ఆలస్యం కాకుండా తక్షణమే తీర్మానాలు చేయాలన్నారు. మంజూరు చేసిన నిధులలో ప్రతి సంవత్సరం 5 శాతం ఏదేని జాతీయ బ్యాంకులో భవిష్యత్ అవసరాల కోసం జమ చేస్తామని, 5 శాతం నిధులు జాతీయ విపత్తులు, ప్రకృతి వైపరీత్యా లు వంటి అత్యవసర సమయాలలో వినియోగించేందు కు కేటాయిస్తామని తెలిపారు. కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మం తు మాట్లాడుతూ జిల్లాలో ఎ క్కువ శాతం సింగరేణి సంస్థ మినరల్స్ ద్వారానే వచ్చాయ ని అన్నారు. ఈ నిధుల కేటాయింపు విషయంలో స్థానిక ఎమ్మెల్యేల సూచనల మేరకు ప్రధాన మౌలిక వసతులను గుర్తించి, మొదట వాటికి ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ.. మైనింగ్ ప్రభావిత ప్రాంతాన్ని రెండు కిలోమీటర్లకే పరిమితం చేయడంతో పలు గ్రామాలకు నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వేలాది ఎకరాలను ధ్వంసం చేసి ఆయా గ్రామాలకు అన్యాయం చేయటం తగదన్నారు. దీనిపై మంత్రి తుమ్మల స్పందిస్తూ.. ఈ విషయాలను ప్రభుత్వానికి కలెక్టర్ లేఖ పంపితే, సింగరేణి ఉన్నతాధికారులతో చర్చించి న్యాయం జరిగేలా చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమావేశంలో జెడ్పీ ఛైర్పర్సన్ గడిపల్లి కవిత, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కొత్తగూడెం, ఇల్లెందు, అశ్వారావుపేట, పినపాక ఎమ్మెల్యేలు జలగం వెంకటరావు, కోరం కనకయ్య, తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు, జేసీ రాంకిషన్, డీఆర్డీఓ జగత్‌కుమార్‌రెడ్డి, కొత్తగూడెం, ఇల్లందు మున్సిపల్ ఛైర్పర్సన్లు పులి గీత, మడత రమ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యమకారులకే తొలి ప్రాధాన్యం
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో తెలంగాణ ఉద్యమకారులకే ప్రాధాన్యం ఉంటుందని, రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఏ ఒక్కరినీ టీఆర్ఎస్ పార్టీ మరిచిపోదని, వారికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని రాష్ట్ర, రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఖమ్మంలో నూతనంగా నిర్మించిన టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్.బి.బేగ్ అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి మాట్లాడారు. పార్టీ బలోపేతానికి కృషి చేసే నేతలు, కార్యకర్తలకు ఎప్పటికీ గౌరవం లభిస్తుందన్నారు. పార్టీ కార్యాలయం.. ముఖ్య మంత్రి ఆశయం కోసం పనిచేసే దేవాలయంగా ఉండాలని ఆకాక్షించారు. టీఆర్ఎస్ అధి కారంలోకి వచ్చాక 47 కార్పొరేషన్ పదవులు ఉద్యమకారులకు ఇవ్వటం ఇందుకు నిదర్శనమన్నారు. మార్కెట్ కమిటీలు, గ్రంథాలయ సంస్థలు, రైతు సమన్వయ సమితులకు సంబంధించిన పదవులను స్థానిక ఎమ్మెల్యేల సిఫారస్ ప్రకారం నియమించామన్నారు. పార్టీ, ప్రభుత్వపరంగా ఆయా నియామకాల్లో ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలకు సర్వాధికారాలు ఇచ్చారన్నారు. మిషన్ భగీరథ ద్వారా త్వరలోనే అన్ని మండలాలకు తాగునీరు అందనుందని చెప్పారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అడ్డగోలుగా కేటాయిస్తే కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే పడుతుందన్నారు. పార్టీలకతీతంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తున్నామని, న్యాయబద్ధంగా చేస్తేనే ప్రజలు హర్షిస్తారన్నారు. ఏ తప్పు జరగకుండా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు పేద లకు అందించేందకు టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని తమ సమస్యలను తీర్చుకోవాలని కోరారు. కార్యక్రమంలో అశ్వారావుపేట ఎమ్మె ల్యే తాటి వెంకటేశ్వర్లు, వైరా ఎమ్మెల్యే బానోతు మదన్‌లాల్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ, పారిశ్రామికాభివృద్ధి సంస్థ, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్లు కొండబాల కోటేశ్వరరావు, ఎస్.బి.బేగ్, పిడమర్తి రవి, జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేష్‌రెడ్డి, కార్యదర్శి తెల్లం వెంకట్రావ్, నగర మేయర్ పాపాలాల్, ఉమ్మడి జిల్లాలకు చెందిన నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
బాధ్యులపై చర్యలు తీసుకోవాలి: తుమ్మల
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం మిర్చి యార్డు ఘటనలో అరెస్టయిన రైతుల విషయంలో అధికారులు ప్రవర్తించిన తీరుపై రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను అవమానించేలా వారికి సంకెళ్లు వేసి కోర్టుకు హజరు పర్చడాన్ని తప్పుబట్టారు. ఇందుకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గురువారం ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిందని, రుణమాఫీ, 24గంటల ఉచిత విద్యుత్, ఎకరాకు రూ.4వేల ఆర్థిక సాయంలాంటి కార్యక్రమాలు చేపడుతున్న క్రమంలో అధికారులు ఇలా వ్యవహరించడం బాధాకరమన్నారు. ఈ విషయంలో బాధ్యులైన వారిని ఉపేక్షించేది లేదని, రైతుల పట్ల అమర్యాధగా వ్యవహరిస్తే సహించమని మంత్రి హెచ్చరించారు.