సాక్షి, హైదరాబాద్: ఖమ్మం మిర్చి యార్డు ఘటనలో అరెస్టయిన రైతుల విషయంలో అధికారులు ప్రవర్తించిన తీరుపై రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను అవమానించేలా వారికి సంకెళ్లు వేసి కోర్టుకు హజరు పర్చడాన్ని తప్పుబట్టారు. ఇందుకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గురువారం ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిందని, రుణమాఫీ, 24గంటల ఉచిత విద్యుత్, ఎకరాకు రూ.4వేల ఆర్థిక సాయంలాంటి కార్యక్రమాలు చేపడుతున్న క్రమంలో అధికారులు ఇలా వ్యవహరించడం బాధాకరమన్నారు. ఈ విషయంలో బాధ్యులైన వారిని ఉపేక్షించేది లేదని, రైతుల పట్ల అమర్యాధగా వ్యవహరిస్తే సహించమని మంత్రి హెచ్చరించారు.