మిర్చియార్డులో రైతుల ఆందోళన, ఉద్రిక్తత
ఖమ్మం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో ఉద్రిక్తత నెలకొంది. మార్కెట్‌కు రైతులు భారీగా మిర్చిని తీసుకొచ్చారు. మిర్చి ధర క్వింటాల్‌కు రూ. 3 వేలకు పడిపోవడం, వ్యాపారులు రోడ్డుపై కొనుగోళ్లు జరపడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తూకం వేస్తున్న కాంటాలను వారు ధ్వంసం చేసి తగలబెట్టారు.
మార్కెట్ కమిటీ చైర్మన్ కార్యాలయాన్ని చుట్టుముట్టి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఆగ్రహంతో కార్యాలయంపై రాళ్లు రువ్వారు. ఉదయం నుంచి ఆందోళన చేస్తున్నా ఒక్క అధికారి కూడా తమను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిర్చియార్డు పాలకవర్గం, అధికారులు కుమ్మక్కైయ్యారని రైతులు ఆరోపించారు. రైతుల ఆందోళన సమాచారం అందుకున్న పోలీసులు మార్కెట్‌కు చేరుకుని పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
కాగా, టీడీపీ నేతలు రైతులకు సంఘీభావం ప్రకటించారు. మద్దతు ధరను రూ.10 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో పలువురు టీడీపీ నాయకులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు.