సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లాలో మిర్చి యార్డుపై దాడికేసులో ఇటీవల అరెస్టయిన రైతులకు పోలీసులు బేడీలు వేసి కోర్టులో హాజరుపరచడంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. ఉగ్రవాదులు, సంఘవిద్రోహ శక్తులకు వేసినట్టుగా అన్నదాతకు సంకెళ్లు వేయడంపై మండిపడ్డాయి.
కేసీఆర్ అసలు స్వరూపం బయటపడింది
మిర్చి పంటకు మద్దతు ధరకోసం నిలదీసిన రైతులేమన్నా ఉగ్రవాదులా? తీవ్రవా దులా? అన్నదాతకు సంకెళ్లు వేయడం కంటే నియంతృత్వం ఏముంటుంది. కేసీఆర్ అసలు స్వరూపం బయటపడింది. – ఉత్తమ్‌కుమార్, టీపీసీసీ అధ్యక్షుడు
వెంటనే విడుదల చేయాలి
మిర్చి రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తేసి వెంటనే వారిని విడుదల చేయాలి. బాధిత రైతులకు పరిహారం చెల్లించాలి. రైతులకు సంకెళ్లు వేసినందుకు రాష్ట్ర రైతాం గానికి ప్రభుత్వం బహిరంగ క్షమాపణ చెప్పాలి. – జి.కిషన్‌రెడ్డి, బీజేఎల్పీ నేత
కన్నతల్లిని అవమానించినట్లే?
ఖమ్మంలో రైతులకు సంకెళ్లు వేయడమంటే కన్నతల్లిని నడివీధిలో అవమానించినట్లే. రైతులకు సంకెళ్లు వేసే ధైర్యం పోలీసులకు ఎక్కడిది. ప్రభుత్వం రైతాంగాన్ని అవమానిస్తోంది. – కె.నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి
వారు దొంగలా? దోపిడీ దారులా?
సంకెళ్లు వేయడానికి రైతులేమైనా దొంగలా? దోపిడీ దారులా? రైతులపట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా శుక్రవారం నిరసన కార్యక్రమాలు చేపడతాం.
– చాడ వెంకటరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
అత్యంత బాధాకరం
ఖమ్మం జిల్లాలో మిర్చి రైతులకు సంకెళ్లు వేసి తీసుకుపోవడం అత్యంత బాధాకరం. ఇది రైతాంగాన్ని అవమానించడమే. కోర్టు అనుమతి లేకుండా సంకెళ్లు వేయకూడ దన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పోలీసులు ఉల్లంఘించారు. సదరు పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకుని, కేసులు ఎత్తేయాలి. – కోదండరాం, టీజేఏసీ చైర్మన్
ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి
ఖమ్మం మార్కెట్ ఘటనలో రైతులకు బేడీలు వేసినందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు క్షమాపణలు చెప్పాలి. రైతులపై కేసులు వెంటనే ఎత్తేసి వారిని విడుదల చేయాలి. – రేవంత్‌రెడ్డి, టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు
రైతులను ముంచుతున్నారు
ప్రభుత్వం మార్కెట్లలో జోక్యం చేసుకోకుండా రైతులను ముంచుతోంది. రైతులకు సంకెళ్లు వేయడాన్ని సీపీఎం ఖండిస్తోంది. రైతులకు రక్షణగా నిలవాల్సిన ప్రభుత్వమే వారిని అణచివేస్తోంది. – తమ్మినేని వీరభద్రం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి
రైతులకు బేడీలు వేస్తారా?
రైతాంగాన్ని అవమానపరిచే విధంగా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరించింది. రైతులు ఏమైనా తీవ్రవాదులా? దేశ ద్రోహులా? దీనికి కేసీఆర్ తగిన మూల్యం చెల్లించకోక తప్పదు. ప్రభుత్వం రైతుల పట్ల ఇలా వ్యవహరించినప్పటికీ కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది. – గట్టు శ్రీకాంత్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు
బేడీలు వేయడాన్ని ఖండిస్తున్నాం
పోలీసులు రైతులకు బేడీలు వేయడాన్ని ఖండిస్తున్నాం. అధికారులకు గత ప్రభుత్వం లో పనిచేసిన వాసనలు పోలేదు. కేంద్రం ఇప్పటికైనా మిర్చికి రూ.7వేల ధర ప్రకటించాలి.
– పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ విప్
రైతులేమన్నా ఉగ్రవాదులా..!
Published Fri, May 12 2017 4:42 AM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
Advertisement
Advertisement