Manacles
-
రైతన్నకు సంకెళ్లు
ఖమ్మం మిర్చి మార్కెట్ ఘటనలో 12 రోజులుగా జైల్లో ఉన్న రైతులు సాక్షి, ఖమ్మం: ఖమ్మం మార్కెట్ యార్డు విధ్వంసం ఘటనలో రిమాండ్‌లో ఉన్న రైతులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకురావడం సంచలనం సృష్టించింది. పోలీసులు అత్యుత్సాహంతో రైతులను కరుడుగట్టిన నేరస్తుల తరహాలో సంకెళ్లతో తీసుకురావడంపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. దీనిపై గురువారం కోర్టు వద్ద రైతుల బంధువులు, న్యాయవాదులు, విపక్షాల నాయకులు, మానవ హక్కుల ప్రతినిధులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పోలీసు ఉన్నతా ధికారులు వెంటనే స్పందించారు. అత్యుత్సాహంతో రైతులకు బేడీలు వేసి తీసుకువచ్చిన ఇద్దరు ఏఆర్ ఎస్సైలను సస్పెండ్ చేయడంతోపాటు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి రెండు కేసుల్లో ఖమ్మం జిల్లా కోర్టు పది మంది రైతులకు బెయిల్ మంజూరు చేసింది. ఆవేదనతో విధ్వంసం గత నెల 28న ఖమ్మం మార్కెట్‌కు సుమారు 2 లక్షల మిర్చి బస్తాలు వచ్చాయి. దాని కంటే ముందు రెండు రోజులు మార్కెట్‌కు సెలవులు కావడం, తర్వాత రెండు రోజులు సెలవులు ఉంటాయనే ప్రచారంతో పెద్దసంఖ్యలో రైతులు మార్కెట్‌కు మిర్చిపంటను తీసుకువచ్చారు. దీంతో వ్యాపారులు, ఏజెంట్లు కుమ్మక్కై మిర్చిధరను ఒక్కసారిగా తగ్గించేశారు. దీంతో రైతులంతా ఆందోళనకు దిగారు. అది ఉద్రిక్తతకు దారి తీసింది. రైతులు ఆగ్రహంతో మార్కెట్ కార్యాలయం, చైర్మన్ చాంబర్, ఈ–నామ్ కార్యాలయాల్లో ఫర్నీచర్, కంప్యూటర్లను, ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలను ధ్వంసం చేశారు. ఆ ఘటనపై కలెక్టర్ ప్రభుత్వానికి 8 పేజీల నివేదిక పంపారు. కొందరు వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు మార్కెట్ సెలవులు ఉంటాయని ప్రచారం చేయడం, ధర తగ్గించడం వంటి అంశాలను ఆ నివేదికలో పేర్కొన్నారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వచ్చిన సమయంలోనే దాడి మొదలైందని వివరించారు. మొత్తంగా మార్కెట్ ధ్వంసంపై సీసీ కెమెరాలు, పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్‌ల ఆధారంగా ఎమ్మెల్యే సండ్రతో పాటు పదిమంది రైతులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. 10 మందిపై క్రిమినల్ కేసులు పోలీసులు ఈకేసులో సండ్ర వెంకట వీరయ్య పరారీలో ఉన్నట్లు చూపిస్తూ.. మిగతా పది మంది రైతులను గతనెల30న అరెస్టు చేశారు. వారిపై ఐపీసీ సెక్షన్లు 147 (దాడి చేయడానికి వెళ్లడం), 148 (మరణాయుధాలతో దాడిచేయడం), 353 (ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడం), 427 (ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడం), 446, 448 (అక్రమంగా, దురుద్దేశంగా ప్రవేశించడం), 120 (బి) (కుట్రపూరిత నేరం), రెడ్‌విత్149, సెక్షన్ 3 అండ్ 4 పీడీ పీపీ యాక్ట్ (ప్రభుత్వ ఆస్తులకు భంగం, నష్టం కలిగించుట), 436 (వస్తువులు, ఫర్నీచర్‌ను తగలబెట్టడం), 506 (ఉద్దేశపూర్వకంగా నేరం చేయదలచుకోవడం) కింద కేసులు నమోదు చేశారు. ఆద్యంతం ఉత్కంఠ ఏఆర్ పోలీసులు రైతులను తీసుకుని జైలు నుంచి ఉదయం 11 గంటలకు వ్యాన్‌లో 3వ అదనపు ఫస్ట్‌క్లాస్ కోర్టు వద్దకు వచ్చారు. రైతులందరికీ సంకెళ్లు వేసి తీసుకొచ్చారు. ఈ సమయంలో రైతులను పరామర్శించేందుకు రాజకీయ నాయకులు, రైతుల బంధువులు, వారి తరఫు న్యాయవాదులు కోర్టు వద్ద వేచి ఉన్నప్పటికీ వారిని కలవనీయలేదు. కోర్టు ఆవరణలో ఉన్నంతసేపు సంకెళ్లతోనే ఉంచారు. ఈలోపు మీడియా ప్రతినిధులు, న్యాయవాదులు సంకెళ్ల విషయమై పోలీసులను నిలదీశారు. ఆందోళన వ్యక్తం చేశారు. కొద్దిసేపటికి పోలీసులు సంకెళ్లు తొలగించి రైతులను న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచి, బయటకు తీసుకువచ్చారు. అప్పటికీ ప్రతిపక్షాలు, న్యాయవాదులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. దీంతో రైతులను తిరిగి జైలుకు తరలించేటప్పుడు సంకెళ్లు లేకుండా తీసుకెళ్లారు. కాగా.. రైతులకు సంకెళ్లపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు న్యాయవాదులు తెలిపారు. షరతులతో బెయిల్.. ఖమ్మం లీగల్: మార్కెట్ యార్డు ఘటనకు సంబంధించి పది మంది రైతులపై మొత్తం మూడు కేసులు నమోదయ్యాయి. ఈ రైతులకు బెయిల్ కోసం కాంగ్రెస్, టీడీపీ లీగల్ సెల్ న్యాయవాదులు జిల్లాకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఒక కేసులో ఈనెల8నే బెయిల్ మంజూరు కాగా.. ఖమ్మం త్రీటౌన్ పోలీసులు రైతులను పీటీ వారెంట్‌పై మరో రెండు కేసుల్లో కస్టడీలోకి తీసుకున్నారు. ఆ రెండు కేసుల్లోనూ బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేయగా.. అవి గురువారం ఖమ్మం ఎస్సీ,ఎస్టీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎదుటకు వచ్చాయి. ప్రాసిక్యూషన్ తరఫున ఇన్చార్జి అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొండపల్లి జగన్మోహన్రావు వాదిస్తూ... రైతుల బెయిల్ పిటిషన్లను వ్యతిరేకించారు. కేసుల విచారణ ఇంకా పూర్తికాలేదని, కొందరు సాక్షులను విచారించాల్సి ఉన్నందున బెయిల్ మంజూరు చేయవద్దని కోరారు. రైతుల తరఫున న్యాయవాదులు జమ్ముల శరత్‌కుమార్‌రెడ్డి, మువ్వా నాగేశ్వరరావు, రామా రావు, శ్రీనివాసరావు తదితరులు వాదనలు వినిపించారు. ఈ కేసుల విచారణ పూర్తయిందని, సాక్షుల వాంగ్మూలాలను సైతం నమోదుచేశారని స్పష్టం చేశారు. రైతులకు బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థించారు. వాదనలు విన్న న్యాయమూర్తి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. బేడీలు వేయడం హక్కుల ఉల్లంఘనే! ఖమ్మంలీగల్: సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. తరచూ నేరాలు చేసే వారికి, నేరప్రవృత్తి గల వారికి, దొంగతనం, దోపిడీలకు, మతవిద్వేషాలకు పాల్పడినవారికి, కరుడుగట్టిన నేరస్తులు, ఉగ్రవాదులు, పారిపోయే ప్రమాదంముందన్న అనుమానమున్న వారికి మాత్రమే బేడీలు వేసి కోర్టులో హాజరుపర్చాలి. అది కూడా కేవలం ప్రయాణ సమయంలో మాత్రమే, కోర్టు అనుమతితోనే బేడీలు వేయాలి. 1995లో క్లాజ్ త్రీ డివిజన్ ఫర్ డెమోక్రసీ వర్సెస్ అస్సాం ప్రభుత్వానికి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు ఈవిషయాన్ని స్పష్టం చేసింది. ఆ ఘటనలో గిరిజనులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకు వచ్చినందుకు ఐదుగురు పోలీసు అధికారులను శిక్షించింది కూడా. సునీల్ బాత్రా వర్సెస్ ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ కేసులోనూ సుప్రీం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పించిన వ్యక్తిగత స్వేచ్ఛను దెబ్బతీయకూడదని, కోర్టు అనుమతితో మాత్రమే బేడీలు వేయాలని సూచించింది. ఇద్దరు ఏఆర్ ఎస్సైలపై వేటు రైతులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకు రావడంపై ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ విచారణకు ఆదేశించారు. విచారణాధికారిగా అడిషనల్ డీసీపీ సాయికృష్ణను నియమించారు. వెంటనే దీనిపై నివేదిక ఇవ్వడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. ఎనిమిది మంది రైతులకు ఏఆర్ సిబ్బంది సంకెళ్లు వేసి కోర్టుకు తీసుకొచ్చారు. ఇందులో ఏఆర్ ఎస్సైలు పూర్ణానాయక్, వెంకటేశ్వరరావులను సస్పెండ్ చేస్తున్నట్లు డీఐజీ నాగిరెడ్డి ప్రకటించారు. విడుదలైన రైతులు.. మండెపుడి ఆనందరావు (చిరుమర్రి, ముదిగొండ మండలం) నెల్లూరి వెంకటేశ్వర్లు, సత్తు కొండయ్య (బాణాపురం, ముదిగొండ మండలం) ఇస్రాల బాలు (లక్ష్మీపురంతండా, కల్లూరు మండలం) భూక్యా అశోక్ (మహబూబాబాద్ జిల్లా సూదనపల్లి) భూక్యా నర్సింహారావు (శ్రీరామపురంతండా, ఏన్కూరు) భూక్యా శ్రీను, బానోతు సైదులు (బచ్చోడుతండా, తిరుమలాయపాలెం మండలం) తేజావత్ భావ్‌సింగ్ (దుబ్బతండా, కారేపల్లి మండలం) బానోతు ఉపేందర్ (శంకరగిరితండా, నేలకొండపల్లి) -
రైతులేమన్నా ఉగ్రవాదులా..!
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లాలో మిర్చి యార్డుపై దాడికేసులో ఇటీవల అరెస్టయిన రైతులకు పోలీసులు బేడీలు వేసి కోర్టులో హాజరుపరచడంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. ఉగ్రవాదులు, సంఘవిద్రోహ శక్తులకు వేసినట్టుగా అన్నదాతకు సంకెళ్లు వేయడంపై మండిపడ్డాయి. కేసీఆర్ అసలు స్వరూపం బయటపడింది మిర్చి పంటకు మద్దతు ధరకోసం నిలదీసిన రైతులేమన్నా ఉగ్రవాదులా? తీవ్రవా దులా? అన్నదాతకు సంకెళ్లు వేయడం కంటే నియంతృత్వం ఏముంటుంది. కేసీఆర్ అసలు స్వరూపం బయటపడింది. – ఉత్తమ్‌కుమార్, టీపీసీసీ అధ్యక్షుడు వెంటనే విడుదల చేయాలి మిర్చి రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తేసి వెంటనే వారిని విడుదల చేయాలి. బాధిత రైతులకు పరిహారం చెల్లించాలి. రైతులకు సంకెళ్లు వేసినందుకు రాష్ట్ర రైతాం గానికి ప్రభుత్వం బహిరంగ క్షమాపణ చెప్పాలి. – జి.కిషన్‌రెడ్డి, బీజేఎల్పీ నేత కన్నతల్లిని అవమానించినట్లే? ఖమ్మంలో రైతులకు సంకెళ్లు వేయడమంటే కన్నతల్లిని నడివీధిలో అవమానించినట్లే. రైతులకు సంకెళ్లు వేసే ధైర్యం పోలీసులకు ఎక్కడిది. ప్రభుత్వం రైతాంగాన్ని అవమానిస్తోంది. – కె.నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి వారు దొంగలా? దోపిడీ దారులా? సంకెళ్లు వేయడానికి రైతులేమైనా దొంగలా? దోపిడీ దారులా? రైతులపట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా శుక్రవారం నిరసన కార్యక్రమాలు చేపడతాం. – చాడ వెంకటరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి అత్యంత బాధాకరం ఖమ్మం జిల్లాలో మిర్చి రైతులకు సంకెళ్లు వేసి తీసుకుపోవడం అత్యంత బాధాకరం. ఇది రైతాంగాన్ని అవమానించడమే. కోర్టు అనుమతి లేకుండా సంకెళ్లు వేయకూడ దన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పోలీసులు ఉల్లంఘించారు. సదరు పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకుని, కేసులు ఎత్తేయాలి. – కోదండరాం, టీజేఏసీ చైర్మన్ ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి ఖమ్మం మార్కెట్ ఘటనలో రైతులకు బేడీలు వేసినందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు క్షమాపణలు చెప్పాలి. రైతులపై కేసులు వెంటనే ఎత్తేసి వారిని విడుదల చేయాలి. – రేవంత్‌రెడ్డి, టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రైతులను ముంచుతున్నారు ప్రభుత్వం మార్కెట్లలో జోక్యం చేసుకోకుండా రైతులను ముంచుతోంది. రైతులకు సంకెళ్లు వేయడాన్ని సీపీఎం ఖండిస్తోంది. రైతులకు రక్షణగా నిలవాల్సిన ప్రభుత్వమే వారిని అణచివేస్తోంది. – తమ్మినేని వీరభద్రం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రైతులకు బేడీలు వేస్తారా? రైతాంగాన్ని అవమానపరిచే విధంగా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరించింది. రైతులు ఏమైనా తీవ్రవాదులా? దేశ ద్రోహులా? దీనికి కేసీఆర్ తగిన మూల్యం చెల్లించకోక తప్పదు. ప్రభుత్వం రైతుల పట్ల ఇలా వ్యవహరించినప్పటికీ కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది. – గట్టు శ్రీకాంత్‌రెడ్డి, వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు బేడీలు వేయడాన్ని ఖండిస్తున్నాం పోలీసులు రైతులకు బేడీలు వేయడాన్ని ఖండిస్తున్నాం. అధికారులకు గత ప్రభుత్వం లో పనిచేసిన వాసనలు పోలేదు. కేంద్రం ఇప్పటికైనా మిర్చికి రూ.7వేల ధర ప్రకటించాలి. – పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ విప్ -
బాధ్యులపై చర్యలు తీసుకోవాలి: తుమ్మల
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం మిర్చి యార్డు ఘటనలో అరెస్టయిన రైతుల విషయంలో అధికారులు ప్రవర్తించిన తీరుపై రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను అవమానించేలా వారికి సంకెళ్లు వేసి కోర్టుకు హజరు పర్చడాన్ని తప్పుబట్టారు. ఇందుకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గురువారం ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిందని, రుణమాఫీ, 24గంటల ఉచిత విద్యుత్, ఎకరాకు రూ.4వేల ఆర్థిక సాయంలాంటి కార్యక్రమాలు చేపడుతున్న క్రమంలో అధికారులు ఇలా వ్యవహరించడం బాధాకరమన్నారు. ఈ విషయంలో బాధ్యులైన వారిని ఉపేక్షించేది లేదని, రైతుల పట్ల అమర్యాధగా వ్యవహరిస్తే సహించమని మంత్రి హెచ్చరించారు. -
బాల్యానికి సంకెళ్లు
-
బాల్యానికి సంకెళ్లు
బాల్యానికి సంకెళ్లు వేశారు వేటపాలెం పోలీసులు... దొంగతనం ఆరోపణతో ఒక బాలుడికి సంకెళ్లు వేసి మూడు రోజులుగా పోలీసు స్టేషన్లోనే బంధించడం వివాదాస్పదంగా మారింది. పోలీసుల నిర్వాకంపై మీడియాలో కథనాలు రావడంతో జిల్లా ఎస్పీ చిరువోలు శ్రీకాంత్ స్పందించారు. చీరాల డీఎస్పీని విచారణకు ఆదేశించారు. విచారణ నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు.ఒక మనిషికి సంకెళ్లు వేయడం అనేది వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించినట్లేనని రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 చెబుతోంది. అక్రమ నిర్బంధం కూడా నేరమే. పైగా 18 సంవత్సరాలు నిండని బాలురను అదుపులోకి తీసుకునే సమయంలో సంరక్షకునికి తెలియచేయాలి. ఆ బాలుడిని రెస్క్యూహోంకి పంపాల్సి ఉంటుంది. ఇవన్నీ పోలీసులకు తెలియనిది కాదు. అయితే మనం ఏం చేసినా చెల్లుతుందనే భావనతో ఒక బాలుడిని మూడు రోజులుగా స్టేషన్లో బంధించి ఉంచడం వేటపాలెం పోలీసులకే చెల్లింది. పైగా పారిపోతాడనే భయంతో కాళ్లకు సంకెళ్లు వేసి గొలుసుతో స్టేషన్‌లోని కిటికీకి బంధించడం వంటి చర్యలతో వేటపాలెం పోలీసులు చట్టాన్ని అపహాస్యం చేశారు. వివరాల్లోకి వెళ్తే... సాక్షి ప్రతినిధి, ఒంగోలు, వేటపాలెం చీరాల రూరల్ మండలం రామకృష్ణాపురం పంచాయతీ బండకాలనీకి చెందిన పది - పదకొండేళ్ల బాలుడిని మూడురోజుల క్రితం వేటపాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలుని తల్లిదండ్రులు శ్రీను, వెంకటేశ్వరమ్మతోపాటు ఆనందరావు కూడా వీధుల వెంట కాగితాలు ఏరుకొని వాటిని విక్రయించి జీవనం సాగిస్తుంటారు. అయితే వేటపాలెం ఇందిరాకాలనీలో జరిగిన దొంగతనం కేసులో బాలుని హస్తం ఉందన్న అనుమానంతో వేటపాలెం పోలీసులు ఆ బాలుడిని మూడు రోజులుగా పోలీస్ స్టేషన్లో ఉంచి విచారిస్తున్నట్లు సమాచారం. బాలుడిని మూడు రోజులుగా స్టేషన్లో కాళ్లకు సంకెళ్లు వేసి ఉన్న విషయం మీడియాకు పొక్కడంతో వెంటనే స్పందించిన పోలీసులు బాలుడిని సోమవారం అరస్టు చేసినట్లు దొంగతనం అంగీకరించినట్లు హడావిడిగా కేసు నమోదు చేశారు. ఎస్సై చంద్రశేఖర్‌ను వివరణ కోరగా సోమవారం మధ్యాహ్నం బాలుడు వేటపాలెం రైల్వే స్టేషన్లో పోలీస్‌లను చూసి పారిపోతుండగా అనుమానంతో అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. బాలుడు వేటపాలెం ఇందిరాకాలనీలో జరిగిన దొంగతనంలో అనుమానితుడిగా గుర్తించి విచారిస్తున్నట్లు తెలిపారు. ఈ చర్యల పట్ల ప్రజాసంఘాలు, మానవహక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని బాలుడికి సంకెళ్లు వేయడం అమానుషమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ ఘటన ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం కాగానే జిల్లా ఎస్పీ చిరువోలు శ్రీకాంత్ స్పందించారు. చీరాల డీఎస్పీ జయరామారావుని విచారణకు ఆదేశిచారు. విచారణ నివేదిక రాగానే పోలీసుల తప్పు ఉందని తేలితే చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. బాలుని నిర్బంధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి మూడు రోజులుగా పోలీస్ స్టేషన్లో కాళ్లకు సంకెళ్లు వేసి మైనర్ బాలుడిని ఉంచడం చట్ట ప్రకారం నేరమని ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. బాలుడికి సంకెళ్లు వేసి ఉంచిన వారిపై చర్చలు తీసుకోవాలన్నారు. - ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కంచె చేనుమేసినట్లుంది చట్లాలను కాపాడాల్సిన పోలీసులే చట్టాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని సీపీఎం నాయకుడు కొండయ్య అన్నారు. చట్టం ప్రకారం నేరం చేసిన వారిని అదుపులోకి తీసుకున్న తరువాత 24 గంటల్లో నేరం చేసిన వ్యక్తి కోర్డులో హాజరు పర్చాల్సి ఉంది. కానీ బాలుడి కాళ్లకు సంకెళ్లు వేసి మూడు రోజులుగా చట్టాలు తెలిసిన పోలీస్లే అతిక్రమిచడం నేరమన్నారు. - సీపీఎం నాయకుడు కొండయ్య ఇది మానవహక్కుల ఉల్లంఘనే ఇది కచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘనే. సంకెళ్లు వేయడం ఆర్టికల్ 21కి విరుద్దం. అక్రమ నిర్బంధం కూడా నేరమే. బాలుని రెస్క్యూహోంకి తరలించకుండా స్టేషన్లో సంకెళ్లు వేసిన పోలీసులపై చర్య తీసుకోవాలి. - పిట్టల లక్ష్యయ్య, న్యాయవాది బాలల హక్కులకు భంగమే ఇది కచ్చితంగా బాలల హక్కులను ఉల్లంఘించడమే. బాలలపై నేరారోపణ, దొంగ అనే పదాలే వాడకూడదు. సూర్యాస్తమయంలోపే ఇంటికి పంపించాల్సి ఉంటుంది. అలా కాకుండా స్టేషన్లో ఉంచడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. దీన్ని బాల సంక్షేమ కమిటీ ఛైర్మన్ దృష్టికి తీసుకువెళ్తాం. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరతాం. - సాగర్, చైల్డ్‌లైన్ ప్రతినిధి