రైతన్నకు సంకెళ్లు | 'Chilli farmers victimised in Khammam market yard case' | Sakshi
Sakshi News home page

రైతన్నకు సంకెళ్లు

Published Fri, May 12 2017 4:56 AM | Last Updated on Tue, Sep 5 2017 10:56 AM

రైతన్నకు సంకెళ్లు

రైతన్నకు సంకెళ్లు

ఖమ్మం మిర్చి మార్కెట్‌ ఘటనలో  12 రోజులుగా జైల్లో ఉన్న రైతులు
సాక్షి, ఖమ్మం: ఖమ్మం మార్కెట్‌ యార్డు విధ్వంసం ఘటనలో రిమాండ్‌లో ఉన్న రైతులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకురావడం సంచలనం సృష్టించింది. పోలీసులు అత్యుత్సాహంతో రైతులను కరుడుగట్టిన నేరస్తుల తరహాలో సంకెళ్లతో తీసుకురావడంపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. దీనిపై గురువారం కోర్టు వద్ద రైతుల బంధువులు, న్యాయవాదులు, విపక్షాల నాయకులు, మానవ హక్కుల ప్రతినిధులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పోలీసు ఉన్నతా ధికారులు వెంటనే స్పందించారు. అత్యుత్సాహంతో రైతులకు బేడీలు వేసి తీసుకువచ్చిన ఇద్దరు ఏఆర్‌ ఎస్సైలను సస్పెండ్‌ చేయడంతోపాటు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి రెండు కేసుల్లో ఖమ్మం జిల్లా కోర్టు పది మంది రైతులకు బెయిల్‌ మంజూరు చేసింది.

ఆవేదనతో విధ్వంసం
గత నెల 28న ఖమ్మం మార్కెట్‌కు సుమారు 2 లక్షల మిర్చి బస్తాలు వచ్చాయి. దాని కంటే ముందు రెండు రోజులు మార్కెట్‌కు సెలవులు కావడం, తర్వాత రెండు రోజులు సెలవులు ఉంటాయనే ప్రచారంతో పెద్దసంఖ్యలో రైతులు మార్కెట్‌కు మిర్చిపంటను తీసుకువచ్చారు. దీంతో వ్యాపారులు, ఏజెంట్లు కుమ్మక్కై మిర్చిధరను ఒక్కసారిగా తగ్గించేశారు. దీంతో రైతులంతా ఆందోళనకు దిగారు. అది ఉద్రిక్తతకు దారి తీసింది. రైతులు ఆగ్రహంతో మార్కెట్‌ కార్యాలయం, చైర్మన్‌ చాంబర్, ఈ–నామ్‌ కార్యాలయాల్లో ఫర్నీచర్, కంప్యూటర్లను, ఎలక్ట్రానిక్‌ తూకం యంత్రాలను ధ్వంసం చేశారు. ఆ ఘటనపై కలెక్టర్‌ ప్రభుత్వానికి 8 పేజీల నివేదిక పంపారు.

 కొందరు వ్యాపారులు, కమీషన్‌ ఏజెంట్లు మార్కెట్‌ సెలవులు ఉంటాయని ప్రచారం చేయడం, ధర తగ్గించడం వంటి అంశాలను ఆ నివేదికలో పేర్కొన్నారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వచ్చిన సమయంలోనే దాడి మొదలైందని వివరించారు. మొత్తంగా మార్కెట్‌ ధ్వంసంపై సీసీ కెమెరాలు, పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్‌ల ఆధారంగా ఎమ్మెల్యే సండ్రతో పాటు పదిమంది రైతులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

10 మందిపై క్రిమినల్‌ కేసులు
పోలీసులు ఈకేసులో సండ్ర వెంకట వీరయ్య పరారీలో ఉన్నట్లు చూపిస్తూ.. మిగతా పది మంది రైతులను గతనెల30న అరెస్టు చేశారు. వారిపై ఐపీసీ సెక్షన్లు 147 (దాడి చేయడానికి వెళ్లడం), 148 (మరణాయుధాలతో దాడిచేయడం), 353 (ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడం), 427 (ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడం), 446, 448 (అక్రమంగా, దురుద్దేశంగా ప్రవేశించడం), 120 (బి) (కుట్రపూరిత నేరం), రెడ్‌విత్‌149, సెక్షన్‌ 3 అండ్‌ 4 పీడీ పీపీ యాక్ట్‌ (ప్రభుత్వ ఆస్తులకు భంగం, నష్టం కలిగించుట), 436 (వస్తువులు, ఫర్నీచర్‌ను తగలబెట్టడం), 506 (ఉద్దేశపూర్వకంగా నేరం చేయదలచుకోవడం) కింద కేసులు నమోదు చేశారు.

ఆద్యంతం ఉత్కంఠ
ఏఆర్‌ పోలీసులు రైతులను తీసుకుని జైలు నుంచి ఉదయం 11 గంటలకు వ్యాన్‌లో 3వ అదనపు ఫస్ట్‌క్లాస్‌ కోర్టు వద్దకు వచ్చారు. రైతులందరికీ సంకెళ్లు వేసి తీసుకొచ్చారు. ఈ సమయంలో రైతులను పరామర్శించేందుకు రాజకీయ నాయకులు, రైతుల బంధువులు, వారి తరఫు న్యాయవాదులు కోర్టు వద్ద వేచి ఉన్నప్పటికీ వారిని కలవనీయలేదు. కోర్టు ఆవరణలో ఉన్నంతసేపు సంకెళ్లతోనే ఉంచారు. ఈలోపు మీడియా ప్రతినిధులు, న్యాయవాదులు సంకెళ్ల విషయమై పోలీసులను నిలదీశారు. ఆందోళన వ్యక్తం చేశారు. కొద్దిసేపటికి పోలీసులు సంకెళ్లు తొలగించి రైతులను న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచి, బయటకు తీసుకువచ్చారు. అప్పటికీ ప్రతిపక్షాలు, న్యాయవాదులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. దీంతో రైతులను తిరిగి జైలుకు తరలించేటప్పుడు సంకెళ్లు లేకుండా తీసుకెళ్లారు. కాగా.. రైతులకు సంకెళ్లపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు న్యాయవాదులు తెలిపారు.

షరతులతో బెయిల్‌..
ఖమ్మం లీగల్‌: మార్కెట్‌ యార్డు ఘటనకు సంబంధించి పది మంది రైతులపై మొత్తం మూడు కేసులు నమోదయ్యాయి. ఈ రైతులకు బెయిల్‌ కోసం కాంగ్రెస్, టీడీపీ లీగల్‌ సెల్‌ న్యాయవాదులు జిల్లాకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఒక కేసులో ఈనెల8నే బెయిల్‌ మంజూరు కాగా.. ఖమ్మం త్రీటౌన్‌ పోలీసులు రైతులను పీటీ వారెంట్‌పై మరో రెండు కేసుల్లో కస్టడీలోకి తీసుకున్నారు. ఆ రెండు కేసుల్లోనూ బెయిల్‌ కోసం పిటిషన్లు దాఖలు చేయగా.. అవి గురువారం ఖమ్మం ఎస్సీ,ఎస్టీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎదుటకు వచ్చాయి.

 ప్రాసిక్యూషన్‌ తరఫున ఇన్‌చార్జి అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కొండపల్లి జగన్‌మోహన్‌రావు వాదిస్తూ... రైతుల బెయిల్‌ పిటిషన్లను వ్యతిరేకించారు. కేసుల విచారణ ఇంకా పూర్తికాలేదని, కొందరు సాక్షులను విచారించాల్సి ఉన్నందున బెయిల్‌ మంజూరు చేయవద్దని కోరారు. రైతుల తరఫున న్యాయవాదులు జమ్ముల శరత్‌కుమార్‌రెడ్డి, మువ్వా నాగేశ్వరరావు, రామా రావు, శ్రీనివాసరావు తదితరులు వాదనలు వినిపించారు. ఈ కేసుల విచారణ పూర్తయిందని, సాక్షుల వాంగ్మూలాలను సైతం నమోదుచేశారని స్పష్టం చేశారు. రైతులకు బెయిల్‌ మంజూరు చేయాలని అభ్యర్థించారు. వాదనలు విన్న న్యాయమూర్తి షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేశారు.

బేడీలు వేయడం హక్కుల ఉల్లంఘనే!
ఖమ్మంలీగల్‌: సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. తరచూ నేరాలు చేసే వారికి, నేరప్రవృత్తి గల వారికి, దొంగతనం, దోపిడీలకు, మతవిద్వేషాలకు పాల్పడినవారికి, కరుడుగట్టిన నేరస్తులు, ఉగ్రవాదులు, పారిపోయే ప్రమాదంముందన్న అనుమానమున్న వారికి మాత్రమే బేడీలు వేసి కోర్టులో హాజరుపర్చాలి. అది కూడా కేవలం ప్రయాణ సమయంలో మాత్రమే, కోర్టు అనుమతితోనే బేడీలు వేయాలి. 1995లో క్లాజ్‌ త్రీ డివిజన్‌ ఫర్‌ డెమోక్రసీ వర్సెస్‌ అస్సాం ప్రభుత్వానికి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు ఈవిషయాన్ని స్పష్టం చేసింది. ఆ ఘటనలో గిరిజనులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకు వచ్చినందుకు ఐదుగురు పోలీసు అధికారులను శిక్షించింది కూడా. సునీల్‌ బాత్రా వర్సెస్‌ ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్‌ కేసులోనూ సుప్రీం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 కల్పించిన వ్యక్తిగత స్వేచ్ఛను దెబ్బతీయకూడదని, కోర్టు అనుమతితో మాత్రమే బేడీలు వేయాలని సూచించింది.

ఇద్దరు ఏఆర్‌ ఎస్సైలపై వేటు
రైతులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకు రావడంపై ఖమ్మం పోలీస్‌ కమిషనర్‌ తఫ్సీర్‌ ఇక్బాల్‌ విచారణకు ఆదేశించారు. విచారణాధికారిగా అడిషనల్‌ డీసీపీ సాయికృష్ణను నియమించారు. వెంటనే దీనిపై నివేదిక ఇవ్వడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. ఎనిమిది మంది రైతులకు ఏఆర్‌ సిబ్బంది సంకెళ్లు వేసి కోర్టుకు తీసుకొచ్చారు. ఇందులో ఏఆర్‌ ఎస్సైలు పూర్ణానాయక్, వెంకటేశ్వరరావులను సస్పెండ్‌ చేస్తున్నట్లు డీఐజీ నాగిరెడ్డి ప్రకటించారు.

విడుదలైన రైతులు..
 మండెపుడి ఆనందరావు
(చిరుమర్రి, ముదిగొండ మండలం)
 నెల్లూరి వెంకటేశ్వర్లు, సత్తు కొండయ్య     (బాణాపురం, ముదిగొండ మండలం)

 ఇస్రాల బాలు
(లక్ష్మీపురంతండా, కల్లూరు మండలం)

 భూక్యా అశోక్‌
(మహబూబాబాద్‌ జిల్లా సూదనపల్లి)

 భూక్యా నర్సింహారావు
(శ్రీరామపురంతండా, ఏన్కూరు)
 భూక్యా శ్రీను, బానోతు సైదులు (బచ్చోడుతండా, తిరుమలాయపాలెం మండలం)
తేజావత్‌ భావ్‌సింగ్‌
(దుబ్బతండా, కారేపల్లి మండలం)

 బానోతు ఉపేందర్‌
(శంకరగిరితండా, నేలకొండపల్లి)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement