Khammam Market Yard
-
ఖమ్మం: అగ్గికి ఆహుతైన 1500 పత్తి బస్తాలు
సాక్షి, ఖమ్మం: జిల్లా మార్కెట్ యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గోడౌన్‌లోని 1500 పత్తి బస్తాలు తగలబడిపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక దళాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే యత్నం చేశాయి. అయితే పత్తి కావడం, మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో బస్తాలు నిమిషాల్లోనే ఆహుతి అయిపోయాయి. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: భర్త లేడు.. ఇప్పుడు చేతికందొచ్చిన బిడ్డలు కూడా! -
ధర ‘తేజం’.. రైతుకు ఉత్తేజం
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది మిర్చి రైతులకు మంచి రోజు వచ్చి వారిలో ఆనందం వ్యక్తమవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఆదరణ పొందే ‘తేజ’రకం మంచి ధర పలుకుతోంది. ఇక సాధారణ రకం కూడా ఊరటనిచ్చే విధంగా ఉండటంతో మిర్చి రైతులు సంబరపడుతున్నారు. ‘మిర్చి’ధర దారుణంగా పతనమై 2017 లో రైతులు ఖమ్మం మార్కెట్ యార్డులో చేపట్టిన ఆందోళన, ఆగ్రహం, విధ్వంసం, అరెస్టులకు గురైన సంఘటన వారిని అప్పట్లో కలచి వేసింది. ఆ సంఘటన తర్వాత అదే ఖమ్మం మార్కెట్లో ఈ ఏడాది రైతులకు ఎంతో ఉపశమనం లభించింది. సాధారణం కంటే... సాధారణ రకానికి ప్రస్తుతం మార్కెట్లో రూ. 17 వేలకు పైగా ఉండగా, తేజ రకం మిర్చికి రూ. 21,300 పలికింది. గతేడాది గరిష్టంగా రూ. 10 వేలలోపు మాత్రమే ధర ఉండేది. బుధవారం ఖమ్మం మార్కెట్లో క్వింటాలుకు రూ. 21,300 పలకడం విశేషం. గతేడాదితో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు అయ్యింది. అంతర్జాతీయ స్థాయి డిమాండ్‌తోనే... రాష్ట్రంలో ఖరీఫ్‌లో మిర్చి సాధారణ సాగు విస్తీర్ణం 1.84 లక్షల ఎకరాలు కాగా, ఈసారి 1.12 లక్షల (61%) ఎకరాల్లోనే సాగైంది. పంట సమయంలో వచి్చన భారీ వర్షాలకు అక్కడక్కడ దెబ్బతిన్నా, మొత్తంగా మంచి నాణ్యమైన పంట పండింది.దేశంలో ఇతర ప్రాంతాల్లో అధిక వర్షాలతో భారీగా దెబ్బతినిపోయింది. అలాగే మలేసియా, థాయ్‌లాండ్, సింగపూర్లలోనూ మిర్చి దెబ్బతిని పోయిందని వ్యాపారులు చెబుతున్నారు.దీంతో ‘తేజ’రకం మిర్చికి చైనా, సింగ పూర్, థాయ్‌లాండ్, అరబ్ దేశాల్లో డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ధర పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. 50 రోజుల్లో దాదాపు రూ. 6 వేలు అధికం... 50 రోజుల నుంచి మిర్చి పంట మార్కెట్‌కు వస్తోంది. నవంబర్ 18న తేజ రకం మిర్చికి రూ. 15,811 ధర పలికింది. 50 రోజుల వ్యవధిలో అది రూ. 6 వేల వరకు పెరిగి రూ. 21,300కు చేరుకుంది.గత నెల 26న ఆ రకం మిర్చి ధర రూ. 19,200 పలుకగా, 27న రూ. 400 పెరిగి రూ. 19,600కు చేరింది. అదే నెల 30 నాటికి మరో రూ. 421కు పెరిగి రూ.20,021కు చేరింది. 31వ తేదీన రూ. 20,021 పలికింది. ఈ నెల2న రూ. 21 వేలు పలికింది. ఇప్పుడు రూ. 21,300లకు చేరింది. -
పుంజుకుంది..!
ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో మార్కెటింగ్ శాఖ ఆదాయం స్వల్పంగా పుంజుకుంది. గత ఏడాది ఆదాయం రూ.27.41కోట్లు కాగా.. ఈ ఏడాది 27.66కోట్లకు చేరింది. జిల్లాలో ఖమ్మం, మధిర, నేలకొండపల్లి, కల్లూరు, వైరా, ఏన్కూరు, సత్తుపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉండగా.. వీటి పరిధిలో పంట ఉత్పత్తుల క్రయవిక్రయాలు నిర్వహించే వ్యాపారుల నుంచి మార్కెట్ ఫీజు(1 శాతం) వసూలు చేస్తారు. మార్కెటింగ్ శాఖ 2018–19 ఆర్థిక సంవత్సరంలో జిల్లా ఆదాయ లక్ష్యాన్ని రూ.33.10కోట్లుగా నిర్దేశించింది. అయితే ఈ ఏడాది జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం సాధారణం కన్నా కొంత మేర తగ్గింది. తగ్గిన సాగు విస్తీర్ణం ప్రభావం మార్కెట్ల ఆదాయంపై కొంత ప్రభావం చూపింది. జిల్లాలో రైతులు ప్రధానంగా పత్తి, మిర్చి, వరి పంటలు సాగు చేస్తారు. అయితే ఈ ఏడాది అనుకూలించని వర్షాలు.. తెగుళ్ల కారణంగా పంట దిగుబడులు గణనీయంగా తగ్గాయి. ముఖ్యంగా పత్తి దిగుబడులు బాగా తగ్గాయి. ఎకరాకు 4 నుంచి 6 క్వింటాళ్లకు మించలేదు. మిర్చి కూడా ఆశించిన స్థాయిలో దిగుబడులు రాలేదు. అయినప్పటికీ గత ఏడాదితో పోలిస్తే జిల్లా మార్కెటింగ్ శాఖ ఆదాయం కొంత మేరకు పుంజుకుంది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో జిల్లా మార్కెటింగ్ శాఖ ఆదాయ లక్ష్యం రూ.29.49కోట్లు కాగా.. రూ.27.41కోట్లు వచ్చింది. ఈ ఏడాది ఆ ఆదాయం కొంత పుంజుకొని రూ.27.66కోట్లకు చేరింది. ఆదాయంపై ప్రభావం చూపిన సాగు జిల్లా మార్కెటింగ్ శాఖ ఆదాయంపై పంటల సాగు ప్రభావం చూపింది. ఖరీఫ్‌లో పంటల సాగు విస్తీర్ణ లక్ష్యం 2,32,707 హెక్టార్లు కాగా.. 2,12,729 హెక్టార్లలో సాగు చేశారు. మొత్తంగా 91.4 శాతం మాత్రమే పంటలను సాగు చేశారు. పత్తి, మిర్చి పంటలు సాగు లక్ష్యాన్ని చేరుకోలేదు. పత్తి 97,862 హెక్టార్ల సాగు లక్ష్యం కాగా.. 96,701 హెక్టార్లలో, మిర్చి 19,828 హెక్టార్లు కాగా.. 18,067 హెక్టార్లలో సాగు చేశారు. అంటే.. ఈ రెండు పంటల సాగు విస్తీర్ణం లక్ష్యాన్ని చేరుకోలేకపోయాయి. మొక్కజొన్న, కంది, వేరుశనగ, చెరకు వంటి పంటల సాగు కూడా లక్ష్యాన్ని చేరుకోలేకపోయాయి. సాగు చేసిన పంటల నుంచి ఆశించిన విధంగా పంట దిగుబడులు రాలేదు. పత్తి దిగుబడులు బాగా పడిపోగా, మిర్చి దిగుబడులు కూడా తగ్గాయి. పండించిన మిర్చి సగటున రూ.8,500 ధర పలుకుతోంది. ఈ ధర రూ.10వేల మార్క్ దాటితే మార్కెట్ ఆదాయం మరింతగా పుంజుకునే అవకాశం ఉంది. ఇక రబీ పంటలకు సాగర్ నీటిని విడుదల చేయలేదు. రబీ సాగు విస్తీర్ణ లక్ష్యం 53,620 హెక్టార్లు కాగా.. కేవలం 33,590 హెక్టార్లలో మాత్రమే పంటలు సాగు చేశారు. ఈ ప్రభావం కూడా మార్కెట్ ఆదాయంపై చూపింది. పంట ఉత్పత్తులపైనే.. పంటల సాగు, దిగుబడులపైనే మార్కెట్ల ఆదాయం ఆధారపడుతుంది. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. అంతేకాక దిగుబడులు కూడా అంత ఆశాజనకంగా లేవు. ఆశించిన మేర పత్తి దిగుబడులు రాకపోవడంతో మార్కెట్ల ఆదాయంపై ప్రభావం చూపింది. అయినప్పటికీ గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మార్కెట్ల ఆదాయం కొంత మేర పెరిగింది. రబీ పంట ఉత్పత్తులు లేకపోవడం కూడా మార్కెట్ ఆదాయంపై ప్రభావం చూపింది. – రత్నం సంతోష్‌కుమార్, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి -
సీసీఐ కసరత్తు..
ఖమ్మంవ్యవసాయం: ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో పండించిన పత్తి కొనుగోలుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జిల్లాలో మొత్తం పంటల సాగు విస్తీర్ణం 5,81,767 ఎకరాలు కాగా, ప్రధాన పంటల్లో ఒకటైన పత్తిని 2,41,752 ఎకరాల్లో సాగు చేశారు. అక్టోబర్ నెలారంభం నుంచి పంట ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో ప్రభుత్వం నిర్ణయించిన ధరతో సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) రైతుల నుంచి పత్తి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది మద్దతు ధర క్వింటాలుకు రూ. 5,450 చెల్లించాలని, 8 నుంచి 12 తేమ శాతం కలిగిన పత్తిని మాత్రమే కొనాలని ప్రభుత్వం నిర్ణయించింది. 8 శాతం తేమ కలిగిన పత్తికి రూ.5,450లు చెల్లించనుంది. తేమ 9 శాతం ఉంటే క్వింటాల్‌కు రూ. 54.50 తగ్గించి కొనుగోలు చేస్తారు. తేమ 10 శాతం ఉంటే ధర మరో రూ.54.50 తగ్గిస్తారు. తేమ శాతం 12కు మించితే పత్తిని కొనుగోలు చేయొద్దని నిబంధనలు వధించారు. గత ఏడాది ప్రభుత్వం మద్దతు ధర రూ.4,320 నిర్ణయించగా, సీసీఐ 1.26 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసింది. ప్రైవేటు మార్కెట్లో అధిక ధర పలకటంతో సీసీఐ కేంద్రాల్లో తక్కువ కొనుగోళ్లు జరిగాయి. ప్రైవేటు మార్కెట్లో జిల్లా వ్యాప్తంగా దాదాపు 13 లక్షల క్వింటాళ్లు కొనుగోళ్లు చేసినట్లు మార్కెటింగ్ శాఖ లెక్కలు చెబుతున్నాయి. 5 మార్కెట్ల పరిధిలో పత్తి కొనుగోళ్లు.. జిల్లాలో సత్తుపల్లి వ్యవసాయ డివిజన్ మినహా ఖమ్మం, వైరా, మధిర, కూసుమంచి వ్యవసాయ డివిజన్లలో పత్తి పంటను సాగు చేస్తున్నారు. పంట ఉత్పత్తి ఆధారంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తోంది. ఖమ్మం, వైరా, మధిర, నేలకొండపల్లి, ఏన్కూరు.. 5 వ్యవసాయ మార్కెట్ల పరిధిలో కొనుగోళ్లు చేపట్టాలని నిర్ణయించింది. ఈ మార్కెట్ల పరిధిలో ఉన్న జిన్నింగ్ మిల్లుల్లో కూడా పత్తి కొనుగోళ్లు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో మొత్తం 12 జిన్నింగ్ మిల్లులు ఉండగా 10 మిల్లులు నిర్వహణలో ఉన్నాయి. వాటిలో కూడా పలు మిల్లులకు తగిన అనుమతులు లేవని తెలిసింది. 6 మిల్లులు మాత్రం జిన్నింగ్‌కు అన్ని అనుమతులు కలిగి ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. మరో 10 రోజుల్లో కేంద్రాలు మరో 10 రోజుల్లో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను చేర్పాటు చేయనుంది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సంబంధిత అధికారులకు సూచించారు. ఇప్పటికే సీసీఐ అధికారులు పత్తి కొనుగోలు చేసే కేంద్రాలను పరిశీలించారు. ప్రధానంగా మార్కెటింగ్ శాఖతో పాటు అగ్నిమాపక, లీగల్ మెట్రాలజీ, వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ శాఖలకు పంట ఉత్పత్తి కొనుగోలు అంశాలపై తగిన బాధ్యతలను అప్పగించారు. వ్యవసాయ శాఖ పంట ఉత్పత్తి విక్రయాలపై గ్రామాలకు షెడ్యూల్‌ను రూపొందించి, కొనుగోలు కేంద్రాలను పంపించాలని సూచించారు. కాగా గతేడాది అక్టోబర్ 10వ తేదీ నుంచి సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేసి పత్తి కొనుగోళ్లు చేపట్టారు. తేమశాతమే ప్రధాన ప్రామాణికం పత్తి కొనుగోళ్లలో ప్రధాన ప్రామాణికం తేమశాతమే. తేమ 8 నుంచి 12 శాతం వరకు తేమ కలిగిన తేమను మాత్రమే కొనుగోలు చేయాలని సీసీఐ నిబంధనలు విధించింది. ఈ తేమశాతాన్ని గ్రామాల్లోనే పరిశీలించి సమీప కేంద్రాలకు తరలించే విధంగా చర్యలు ఉండాలని కలెక్టర్ సూచించారు. వ్యవసాయ శాఖకు చెందిన గ్రామ వ్యవసాయ విస్తర్ణాధికారులకు తేమ శాతాన్ని గుర్తించే మాయిశ్చర్ మిషన్లను అందించి గ్రామాల్లోనే ఈ పరీక్షలు చేయించి పంటను విక్రయాలకు పంపించాలని నిర్ణయించారు. నూతనంగా రూపొందించిన ఈ విధానం ఏ మేరకు ఫలితాలను ఇస్తుందనేది మాత్రం ప్రశ్నార్థకంగా ఉంది. గ్రామాల్లో ఏఈవోలు తేమశాతాన్ని ధ్రువీకరించి పంపించినా సీసీఐ కేంద్రాల్లో మళ్లీ పరీక్షలు నిర్వహించి కొర్రీలు పెడతారా..? అనే సందేహాలు రైతులకు కలుగుతుంది. పత్తి జిన్నింగ్పై కుదరని ఒప్పందం సీసీఐ కొనుగోలు చేసిన పత్తిని జిల్లాలో గుర్తించిన జిన్నింగ్ మిల్లులు జిన్నింగ్ చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా పత్తి పండించే అన్ని జిల్లాల్లో సీసీఐ జిన్నింగ్ మిల్లుల యాజమానులతో ఒప్పందం(కాంట్రాక్ట్) కుదుర్చుకుంది. కానీ ఖమ్మం జిల్లాలో మాత్రం సీసీఐ నిబంధనల ప్రకారం జిన్నింగ్ చేయలేమని మిల్లుల యజమానులు వెనకడుగు వేశారు. లింట్ సైజు 30.5 మి.మీలు ఉండే విధంగా జిన్నింగ్ ఉండాలని సీసీఐ నిర్ణయించింది. ఇక్కడి జిన్నింగ్ మిల్లుల యజమానులు ఆ సైజుకు అంగీకరించటం లేదు. ఇక్కడ పండించే పత్తిలో విత్తనాలు అధికంగా ఉంటాయని, లింట్ సైజ్ 29.5 మి.మీలుగా నిర్ణయిస్తే జిన్నింగ్ చేస్తామని, లేదంటే మిల్లులను సీసీఐ లీజ్‌కు తీసుకొని నిర్వహించుకోవచ్చని యజమానులు చెబుతున్నారు. దీంతో సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. సీసీఐ మిల్లుల యజమానులతో చర్చలు కొనసాగిస్తూనే ఉంది. అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం జిల్లాలో సీసీఐ పత్తి కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డుల్లో, జిన్నింగ్ మిల్లుల్లో అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. పత్తి విక్రయానికి తెచ్చే రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా సౌకర్యాలను కల్పిస్తున్నాం. మరికొద్ది రోజుల్లో సీసీఐ పత్తి కొనుగోళ్లను నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. – రత్నం సంతోష్‌కుమార్, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి, ఖమ్మం -
మిర్చి అ‘ధర’హో!
ఖమ్మం వ్యవసాయం : మిర్చి రైతులకు శుభవార్త. శుక్రవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి క్వింటా ధర రూ. 9,950 పలకగా, సోమవారానికి ఏకంగా రూ. 450లు పెరిగి రూ. 10,400కు చేరింది. పంట సాగు తగ్గడం, ఆశించిన స్థాయిలో ఉత్పత్తి లేకపోవడంతో ధర పెరుగుతోంది. మార్చి నెల ఆరంభంలో రూ. 9,200లు పలికిన ధర క్రమంగా పెరుగుతూ 19 రోజుల వ్యవధిలో దాదాపు రూ.1,200పైకి వెళ్లడం విశేషం. ప్రతి ఏటా మార్చిలో మార్కెట్‌కు నిత్యం 70 వేల నుంచి లక్ష బస్తాల వరకు విక్రయానికి వస్తుంది. ఈ ఏడాది ప్రస్తుతం 20 వేల నుంచి 30 వేలకు మించి రావట్లేదు. అంతర్జాతీయంగా తేజా రకం మిర్చికి డిమాండ్ ఉండటంతో ఆ రకం ధర పెరుగుతోందని అంచనా వేస్తున్నారు. -
రైతన్నకు సంకెళ్లు
ఖమ్మం మిర్చి మార్కెట్ ఘటనలో 12 రోజులుగా జైల్లో ఉన్న రైతులు సాక్షి, ఖమ్మం: ఖమ్మం మార్కెట్ యార్డు విధ్వంసం ఘటనలో రిమాండ్‌లో ఉన్న రైతులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకురావడం సంచలనం సృష్టించింది. పోలీసులు అత్యుత్సాహంతో రైతులను కరుడుగట్టిన నేరస్తుల తరహాలో సంకెళ్లతో తీసుకురావడంపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. దీనిపై గురువారం కోర్టు వద్ద రైతుల బంధువులు, న్యాయవాదులు, విపక్షాల నాయకులు, మానవ హక్కుల ప్రతినిధులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పోలీసు ఉన్నతా ధికారులు వెంటనే స్పందించారు. అత్యుత్సాహంతో రైతులకు బేడీలు వేసి తీసుకువచ్చిన ఇద్దరు ఏఆర్ ఎస్సైలను సస్పెండ్ చేయడంతోపాటు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి రెండు కేసుల్లో ఖమ్మం జిల్లా కోర్టు పది మంది రైతులకు బెయిల్ మంజూరు చేసింది. ఆవేదనతో విధ్వంసం గత నెల 28న ఖమ్మం మార్కెట్‌కు సుమారు 2 లక్షల మిర్చి బస్తాలు వచ్చాయి. దాని కంటే ముందు రెండు రోజులు మార్కెట్‌కు సెలవులు కావడం, తర్వాత రెండు రోజులు సెలవులు ఉంటాయనే ప్రచారంతో పెద్దసంఖ్యలో రైతులు మార్కెట్‌కు మిర్చిపంటను తీసుకువచ్చారు. దీంతో వ్యాపారులు, ఏజెంట్లు కుమ్మక్కై మిర్చిధరను ఒక్కసారిగా తగ్గించేశారు. దీంతో రైతులంతా ఆందోళనకు దిగారు. అది ఉద్రిక్తతకు దారి తీసింది. రైతులు ఆగ్రహంతో మార్కెట్ కార్యాలయం, చైర్మన్ చాంబర్, ఈ–నామ్ కార్యాలయాల్లో ఫర్నీచర్, కంప్యూటర్లను, ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలను ధ్వంసం చేశారు. ఆ ఘటనపై కలెక్టర్ ప్రభుత్వానికి 8 పేజీల నివేదిక పంపారు. కొందరు వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు మార్కెట్ సెలవులు ఉంటాయని ప్రచారం చేయడం, ధర తగ్గించడం వంటి అంశాలను ఆ నివేదికలో పేర్కొన్నారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వచ్చిన సమయంలోనే దాడి మొదలైందని వివరించారు. మొత్తంగా మార్కెట్ ధ్వంసంపై సీసీ కెమెరాలు, పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్‌ల ఆధారంగా ఎమ్మెల్యే సండ్రతో పాటు పదిమంది రైతులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. 10 మందిపై క్రిమినల్ కేసులు పోలీసులు ఈకేసులో సండ్ర వెంకట వీరయ్య పరారీలో ఉన్నట్లు చూపిస్తూ.. మిగతా పది మంది రైతులను గతనెల30న అరెస్టు చేశారు. వారిపై ఐపీసీ సెక్షన్లు 147 (దాడి చేయడానికి వెళ్లడం), 148 (మరణాయుధాలతో దాడిచేయడం), 353 (ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడం), 427 (ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడం), 446, 448 (అక్రమంగా, దురుద్దేశంగా ప్రవేశించడం), 120 (బి) (కుట్రపూరిత నేరం), రెడ్‌విత్149, సెక్షన్ 3 అండ్ 4 పీడీ పీపీ యాక్ట్ (ప్రభుత్వ ఆస్తులకు భంగం, నష్టం కలిగించుట), 436 (వస్తువులు, ఫర్నీచర్‌ను తగలబెట్టడం), 506 (ఉద్దేశపూర్వకంగా నేరం చేయదలచుకోవడం) కింద కేసులు నమోదు చేశారు. ఆద్యంతం ఉత్కంఠ ఏఆర్ పోలీసులు రైతులను తీసుకుని జైలు నుంచి ఉదయం 11 గంటలకు వ్యాన్‌లో 3వ అదనపు ఫస్ట్‌క్లాస్ కోర్టు వద్దకు వచ్చారు. రైతులందరికీ సంకెళ్లు వేసి తీసుకొచ్చారు. ఈ సమయంలో రైతులను పరామర్శించేందుకు రాజకీయ నాయకులు, రైతుల బంధువులు, వారి తరఫు న్యాయవాదులు కోర్టు వద్ద వేచి ఉన్నప్పటికీ వారిని కలవనీయలేదు. కోర్టు ఆవరణలో ఉన్నంతసేపు సంకెళ్లతోనే ఉంచారు. ఈలోపు మీడియా ప్రతినిధులు, న్యాయవాదులు సంకెళ్ల విషయమై పోలీసులను నిలదీశారు. ఆందోళన వ్యక్తం చేశారు. కొద్దిసేపటికి పోలీసులు సంకెళ్లు తొలగించి రైతులను న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచి, బయటకు తీసుకువచ్చారు. అప్పటికీ ప్రతిపక్షాలు, న్యాయవాదులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. దీంతో రైతులను తిరిగి జైలుకు తరలించేటప్పుడు సంకెళ్లు లేకుండా తీసుకెళ్లారు. కాగా.. రైతులకు సంకెళ్లపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు న్యాయవాదులు తెలిపారు. షరతులతో బెయిల్.. ఖమ్మం లీగల్: మార్కెట్ యార్డు ఘటనకు సంబంధించి పది మంది రైతులపై మొత్తం మూడు కేసులు నమోదయ్యాయి. ఈ రైతులకు బెయిల్ కోసం కాంగ్రెస్, టీడీపీ లీగల్ సెల్ న్యాయవాదులు జిల్లాకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఒక కేసులో ఈనెల8నే బెయిల్ మంజూరు కాగా.. ఖమ్మం త్రీటౌన్ పోలీసులు రైతులను పీటీ వారెంట్‌పై మరో రెండు కేసుల్లో కస్టడీలోకి తీసుకున్నారు. ఆ రెండు కేసుల్లోనూ బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేయగా.. అవి గురువారం ఖమ్మం ఎస్సీ,ఎస్టీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎదుటకు వచ్చాయి. ప్రాసిక్యూషన్ తరఫున ఇన్చార్జి అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొండపల్లి జగన్మోహన్రావు వాదిస్తూ... రైతుల బెయిల్ పిటిషన్లను వ్యతిరేకించారు. కేసుల విచారణ ఇంకా పూర్తికాలేదని, కొందరు సాక్షులను విచారించాల్సి ఉన్నందున బెయిల్ మంజూరు చేయవద్దని కోరారు. రైతుల తరఫున న్యాయవాదులు జమ్ముల శరత్‌కుమార్‌రెడ్డి, మువ్వా నాగేశ్వరరావు, రామా రావు, శ్రీనివాసరావు తదితరులు వాదనలు వినిపించారు. ఈ కేసుల విచారణ పూర్తయిందని, సాక్షుల వాంగ్మూలాలను సైతం నమోదుచేశారని స్పష్టం చేశారు. రైతులకు బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థించారు. వాదనలు విన్న న్యాయమూర్తి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. బేడీలు వేయడం హక్కుల ఉల్లంఘనే! ఖమ్మంలీగల్: సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. తరచూ నేరాలు చేసే వారికి, నేరప్రవృత్తి గల వారికి, దొంగతనం, దోపిడీలకు, మతవిద్వేషాలకు పాల్పడినవారికి, కరుడుగట్టిన నేరస్తులు, ఉగ్రవాదులు, పారిపోయే ప్రమాదంముందన్న అనుమానమున్న వారికి మాత్రమే బేడీలు వేసి కోర్టులో హాజరుపర్చాలి. అది కూడా కేవలం ప్రయాణ సమయంలో మాత్రమే, కోర్టు అనుమతితోనే బేడీలు వేయాలి. 1995లో క్లాజ్ త్రీ డివిజన్ ఫర్ డెమోక్రసీ వర్సెస్ అస్సాం ప్రభుత్వానికి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు ఈవిషయాన్ని స్పష్టం చేసింది. ఆ ఘటనలో గిరిజనులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకు వచ్చినందుకు ఐదుగురు పోలీసు అధికారులను శిక్షించింది కూడా. సునీల్ బాత్రా వర్సెస్ ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ కేసులోనూ సుప్రీం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పించిన వ్యక్తిగత స్వేచ్ఛను దెబ్బతీయకూడదని, కోర్టు అనుమతితో మాత్రమే బేడీలు వేయాలని సూచించింది. ఇద్దరు ఏఆర్ ఎస్సైలపై వేటు రైతులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకు రావడంపై ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ విచారణకు ఆదేశించారు. విచారణాధికారిగా అడిషనల్ డీసీపీ సాయికృష్ణను నియమించారు. వెంటనే దీనిపై నివేదిక ఇవ్వడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. ఎనిమిది మంది రైతులకు ఏఆర్ సిబ్బంది సంకెళ్లు వేసి కోర్టుకు తీసుకొచ్చారు. ఇందులో ఏఆర్ ఎస్సైలు పూర్ణానాయక్, వెంకటేశ్వరరావులను సస్పెండ్ చేస్తున్నట్లు డీఐజీ నాగిరెడ్డి ప్రకటించారు. విడుదలైన రైతులు.. మండెపుడి ఆనందరావు (చిరుమర్రి, ముదిగొండ మండలం) నెల్లూరి వెంకటేశ్వర్లు, సత్తు కొండయ్య (బాణాపురం, ముదిగొండ మండలం) ఇస్రాల బాలు (లక్ష్మీపురంతండా, కల్లూరు మండలం) భూక్యా అశోక్ (మహబూబాబాద్ జిల్లా సూదనపల్లి) భూక్యా నర్సింహారావు (శ్రీరామపురంతండా, ఏన్కూరు) భూక్యా శ్రీను, బానోతు సైదులు (బచ్చోడుతండా, తిరుమలాయపాలెం మండలం) తేజావత్ భావ్‌సింగ్ (దుబ్బతండా, కారేపల్లి మండలం) బానోతు ఉపేందర్ (శంకరగిరితండా, నేలకొండపల్లి) -
రైతులకు ఒక్క రూపాయైనా ఖర్చు పెట్టిందా?
-
రైతులే అని నిరూపిస్తాం.. కాళ్లు పట్టుకుంటారా..?
టీఆర్ఎస్ నేతలకు తెలుగుదేశం పార్టీ సవాల్ సాక్షి, హైదరాబాద్: ఖమ్మం మార్కెట్ యార్డులో ఆగ్రహించి దాడికి పాల్పడింది రైతులే అని నిరూపిస్తే వారి కాళ్లు పట్టుకుంటారా అని టీఆర్ఎస్ నేతలకు టీడీపీ సవాల్ విసిరింది. ఆదివారం ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, పార్టీ అధికార ప్రతినిధి వేం నరేందర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఖమ్మం మార్కెట్ యార్డ్ ఘటనలో దాడి చేసింది రైతులే అని తాము నిరూపించగలమని సండ్ర చెప్పారు. వరుస సెలవుల కారణంగా ఖమ్మం మార్కెట్ మొత్తం మిర్చితో నిండిపోవడంతో రైతులు రోడ్లపైనే మిర్చి నిల్వలను గుమ్మరిం చారన్నారు. ఈ క్రమంలో రోడ్లపై ఉన్న మిర్చిని మార్కెట్ కంటే తక్కువ ధరకు కోనుగోలు చేయాలన్న పథకంతో వ్యాపారస్తులు వేలంపాట పాడకుండా క్వింటాల్‌కు రూ.2 వేలతోనే కొనేసేందుకు ప్రయత్నించారని, మే 1 నుంచి ఆ మేరకే కొనుగోలు చేస్తామనే వదంతులు సృష్టించారని చెప్పారు. దీంతో భయభ్రాంతులకు గురైన రైతులు గిట్టుబాటు ధర కోసం ఆందోళన చేపట్టారన్నారు. తమ పార్టీ కేసులకు భయపడదని, మిర్చి రైతుల సమస్య తీర్చే వరకు విశ్రమించదన్నారు. -
ఖమ్మం ఘటనలకు ప్రభుత్వానిదే బాధ్యత
క్వింటాల్ మిర్చికి రూ.10 వేలు ఇవ్వాలి: తమ్మినేని సాక్షి, హైదరాబాద్: ఖమ్మం మార్కెట్ యార్డులో చోటు చేసుకున్న ఘటనలకు మార్కెట్ కమిటీ, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని సీపీఎం డిమాండ్ చేసింది. రైతులు కోరుకున్న ధర ఇప్పించే వరకు వారితోనే తానుంటానని వరంగల్ సభలో సీఎం కేసీఆర్ ప్రకటించి 24 గంటలు గడవకముందే ఖమ్మం మార్కెట్ యార్డులో రైతులు ఆందోళనకు దిగాల్సి వచ్చిందని పేర్కొంది. ఈ ఆందోళన ఇతర మార్కెట్లకు చేరకుండా, రైతులను ఆదుకునే చర్యలు ప్రభుత్వం వెంటనే చేపట్టాలని ఆ పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఒక ప్రకటనలో సూచించారు. క్వింటాల్ మిర్చికి రూ.10 వేల ధర నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ముందుగానే బిల్లు ప్రతులను సభ్యులకివ్వాలి: రాజయ్య ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లుల సవరణ కాపీలు ఒకరోజు ముందుగానే సభ్యులకు అందించాలని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య డిమాండ్ చేశారు. అసెంబ్లీ వెలుపల ధర్నాలకు అవకాశం లేకుండా, సీఎంను కలుసుకునే అవకా శాన్ని కల్పించకుండా, చట్టసభల్లోనూ ప్రతిపక్షాలకు చర్చించే అవకాశమివ్వకుండా ప్రభుత్వం అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. -
ఖమ్మంలో మిర్చి రైతుల ఆగ్రహం
-
మిర్చి కొనుగోలు చేయని వ్యాపారులపై క్రిమినల్ చర్యలు
ఖమ్మం : ఖమ్మం కూరగాయల మార్కెట్ యార్డును ఉప సభాపతి మల్లు భట్టి విక్రమార్క, కలెక్టర్ శ్రీనివాస్ శ్రీనరేష్ సోమవారం సందర్శించారు. ధర విషయంలో ఆందోళనకు దిగిన పచ్చిమిర్చి రైతులతో వారు చర్చలు జరిపారు. అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ మిర్చి రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కొనుగోళ్లు చేయని వ్యాపారుల లైసెన్స్‌లు రద్దు చేసి, వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు ధర విషయంలో గత రాత్రి వ్యాపారులకు, మిర్చి రైతులకు మధ్య వాగ్వివాదం జరిగిన విషయం తెలిసిందే. దాంతో వ్యాపారులు మిర్చి కొనుగోళ్లను నిలిపివేయటంతో ...రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఘర్షణకు దిగారు. అనంతరం అధికారులు చర్చలు...జరిపి మిర్చిని కొనుగోళ్లు చేయాలని ఆదేశించారు. అయితే అధికారుల ఆదేశాలను మాత్రం వ్యాపారులు ఏమాత్రం పట్టించుకోకపోవటంతో ...రైతులు జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగటంతో ట్రాఫిక్ స్తంభించింది. -
ఖమ్మంలో మిర్చి రైతుల ఆగ్రహం
ఖమ్మం : ఖమ్మంలో మిర్చి రైతులు మరోసారి భగ్గుమన్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు సరైన ధర రాకపోవటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్కువ రేటుకే మిర్చి కొనుగోలు చేస్తున్నారంటూ రైతులు ఆందోళన చేపట్టారు. ధ గతరాత్రి ఏడు గంటల సమయంలో మార్కెటుకు వచ్చిన పచ్చిమిర్చిని క్వింటాకు రూ.1390 చొప్పున వ్యాపారస్తులు కొనుగోలు చేశారు. అయితే ఆ తరువాత మిర్చి భారీగా రావటంతో వ్యాపారులు సిండికేట్ అయి క్వింటాకు రూ.800 నుంచి రూ.1000 మాత్రమే చెల్లిస్తామని చెప్పటంతో అన్యాయమని రైతులు నిలదీశారు. ధర విషయమై వారు వ్యాపారులతో వాగ్వివాదానికి దిగారు. దుకాణాల ముందున్న ట్రేలను ధ్వంసం చేశారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు వచ్చి చర్చలు జరిపినా వివాదం సమసిపోలేదు. దాంతో రైతులు రాత్రంతా బైపాస్ రోడ్డుపై ధర్నా చేపట్టారు.