సీసీఐ కసరత్తు.. | CCI Purchase Of Cotton Khammam Market Yard | Sakshi
Sakshi News home page

సీసీఐ కసరత్తు..

Published Mon, Oct 1 2018 7:43 AM | Last Updated on Mon, Oct 1 2018 7:43 AM

CCI Purchase Of Cotton Khammam Market Yard - Sakshi

కొనుగోలు చేసిన పత్తిని లోడ్‌ చేస్తున్న దృశ్యం(ఫైల్‌)

ఖమ్మంవ్యవసాయం: ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో పండించిన పత్తి కొనుగోలుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జిల్లాలో మొత్తం పంటల సాగు విస్తీర్ణం 5,81,767 ఎకరాలు కాగా, ప్రధాన పంటల్లో ఒకటైన పత్తిని 2,41,752 ఎకరాల్లో సాగు చేశారు. అక్టోబర్‌ నెలారంభం నుంచి పంట ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో ప్రభుత్వం నిర్ణయించిన ధరతో సీసీఐ(కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా) రైతుల నుంచి పత్తి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది మద్దతు ధర క్వింటాలుకు రూ. 5,450 చెల్లించాలని, 8 నుంచి 12 తేమ శాతం కలిగిన పత్తిని మాత్రమే కొనాలని ప్రభుత్వం నిర్ణయించింది.

8 శాతం తేమ కలిగిన పత్తికి రూ.5,450లు చెల్లించనుంది.  తేమ 9 శాతం ఉంటే క్వింటాల్‌కు రూ. 54.50 తగ్గించి కొనుగోలు చేస్తారు. తేమ 10 శాతం ఉంటే ధర మరో రూ.54.50 తగ్గిస్తారు. తేమ శాతం 12కు మించితే పత్తిని కొనుగోలు చేయొద్దని నిబంధనలు వధించారు.  గత ఏడాది ప్రభుత్వం మద్దతు ధర రూ.4,320 నిర్ణయించగా, సీసీఐ 1.26 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసింది. ప్రైవేటు మార్కెట్‌లో అధిక ధర పలకటంతో సీసీఐ కేంద్రాల్లో తక్కువ కొనుగోళ్లు జరిగాయి.  ప్రైవేటు మార్కెట్‌లో జిల్లా వ్యాప్తంగా దాదాపు 13 లక్షల క్వింటాళ్లు కొనుగోళ్లు చేసినట్లు మార్కెటింగ్‌ శాఖ లెక్కలు చెబుతున్నాయి.
  
5 మార్కెట్‌ల పరిధిలో పత్తి కొనుగోళ్లు..   
జిల్లాలో సత్తుపల్లి వ్యవసాయ డివిజన్‌ మినహా ఖమ్మం, వైరా, మధిర, కూసుమంచి వ్యవసాయ డివిజన్‌లలో పత్తి పంటను సాగు చేస్తున్నారు.  పంట ఉత్పత్తి ఆధారంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు రంగం  సిద్ధం చేస్తోంది. ఖమ్మం, వైరా, మధిర, నేలకొండపల్లి, ఏన్కూరు.. 5 వ్యవసాయ మార్కెట్‌ల పరిధిలో కొనుగోళ్లు చేపట్టాలని నిర్ణయించింది. ఈ మార్కెట్‌ల పరిధిలో ఉన్న జిన్నింగ్‌ మిల్లుల్లో కూడా పత్తి కొనుగోళ్లు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో మొత్తం 12 జిన్నింగ్‌ మిల్లులు ఉండగా 10 మిల్లులు నిర్వహణలో ఉన్నాయి. వాటిలో కూడా పలు మిల్లులకు తగిన అనుమతులు లేవని తెలిసింది. 6 మిల్లులు మాత్రం జిన్నింగ్‌కు అన్ని అనుమతులు కలిగి ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

మరో 10 రోజుల్లో కేంద్రాలు  
మరో 10 రోజుల్లో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను చేర్పాటు చేయనుంది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సంబంధిత అధికారులకు సూచించారు. ఇప్పటికే సీసీఐ అధికారులు పత్తి కొనుగోలు చేసే కేంద్రాలను పరిశీలించారు. ప్రధానంగా మార్కెటింగ్‌ శాఖతో పాటు అగ్నిమాపక, లీగల్‌ మెట్రాలజీ, వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్‌ శాఖలకు పంట ఉత్పత్తి కొనుగోలు అంశాలపై తగిన బాధ్యతలను అప్పగించారు. వ్యవసాయ శాఖ పంట ఉత్పత్తి విక్రయాలపై గ్రామాలకు షెడ్యూల్‌ను రూపొందించి, కొనుగోలు కేంద్రాలను పంపించాలని సూచించారు. కాగా గతేడాది అక్టోబర్‌ 10వ తేదీ నుంచి సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేసి పత్తి కొనుగోళ్లు చేపట్టారు.

తేమశాతమే ప్రధాన ప్రామాణికం 
పత్తి కొనుగోళ్లలో ప్రధాన ప్రామాణికం తేమశాతమే. తేమ 8 నుంచి 12 శాతం వరకు తేమ కలిగిన తేమను మాత్రమే కొనుగోలు చేయాలని సీసీఐ నిబంధనలు విధించింది. ఈ తేమశాతాన్ని గ్రామాల్లోనే పరిశీలించి సమీప కేంద్రాలకు తరలించే విధంగా చర్యలు ఉండాలని కలెక్టర్‌ సూచించారు. వ్యవసాయ శాఖకు చెందిన గ్రామ వ్యవసాయ విస్తర్ణాధికారులకు తేమ శాతాన్ని గుర్తించే మాయిశ్చర్‌ మిషన్లను అందించి గ్రామాల్లోనే ఈ పరీక్షలు చేయించి పంటను విక్రయాలకు పంపించాలని నిర్ణయించారు. నూతనంగా రూపొందించిన ఈ విధానం ఏ మేరకు ఫలితాలను ఇస్తుందనేది మాత్రం ప్రశ్నార్థకంగా ఉంది. గ్రామాల్లో ఏఈవోలు తేమశాతాన్ని ధ్రువీకరించి పంపించినా సీసీఐ కేంద్రాల్లో మళ్లీ పరీక్షలు నిర్వహించి కొర్రీలు పెడతారా..? అనే సందేహాలు రైతులకు కలుగుతుంది.

పత్తి జిన్నింగ్‌పై కుదరని ఒప్పందం 
సీసీఐ కొనుగోలు చేసిన పత్తిని జిల్లాలో గుర్తించిన జిన్నింగ్‌ మిల్లులు జిన్నింగ్‌ చేయాల్సి ఉంటుంది.  రాష్ట్ర వ్యాప్తంగా పత్తి పండించే అన్ని జిల్లాల్లో సీసీఐ జిన్నింగ్‌ మిల్లుల యాజమానులతో ఒప్పందం(కాంట్రాక్ట్‌) కుదుర్చుకుంది. కానీ ఖమ్మం జిల్లాలో మాత్రం సీసీఐ నిబంధనల ప్రకారం జిన్నింగ్‌ చేయలేమని మిల్లుల యజమానులు వెనకడుగు వేశారు. లింట్‌ సైజు 30.5 మి.మీలు ఉండే విధంగా జిన్నింగ్‌ ఉండాలని సీసీఐ నిర్ణయించింది. ఇక్కడి జిన్నింగ్‌ మిల్లుల యజమానులు ఆ సైజుకు అంగీకరించటం లేదు. ఇక్కడ పండించే పత్తిలో విత్తనాలు అధికంగా ఉంటాయని, లింట్‌ సైజ్‌ 29.5 మి.మీలుగా నిర్ణయిస్తే జిన్నింగ్‌ చేస్తామని, లేదంటే మిల్లులను సీసీఐ లీజ్‌కు తీసుకొని నిర్వహించుకోవచ్చని యజమానులు చెబుతున్నారు. దీంతో సమస్య ఇంకా పరిష్కారం కాలేదు.  సీసీఐ మిల్లుల యజమానులతో చర్చలు కొనసాగిస్తూనే ఉంది. 
 
అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం  
జిల్లాలో సీసీఐ పత్తి కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. వ్యవసాయ మార్కెట్‌ కమిటీ యార్డుల్లో, జిన్నింగ్‌ మిల్లుల్లో అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. పత్తి విక్రయానికి తెచ్చే రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా సౌకర్యాలను కల్పిస్తున్నాం. మరికొద్ది రోజుల్లో సీసీఐ పత్తి కొనుగోళ్లను నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.  – రత్నం సంతోష్‌కుమార్, జిల్లా మార్కెటింగ్‌ శాఖ అధికారి, ఖమ్మం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement