CCI purchase of cotton
-
తెల్లబోతున్న బంగారం..!
జమ్మికుంట(హుజూరాబాద్): తెల్లబంగారం తెల్లబోతోంది. మొన్నటివరకు మద్దతును మించి ధర పలికిన పత్తి.. వారం వ్యవధిలోనే రూ.600 తగ్గింది. ఒకదశలో రూ.6వేలకు పెరుగుతుందని ఆశించిన రైతులకు తాజాగా పడిపోతున్న ధరలు అయోమయానికి గురిచేస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా మద్దతు కంటే ధర దిగువకు పడిపోయాయి. మంగళవారం క్వింటాల్‌కు రూ.5,350 పలికింది. మరోవైపు పత్తి కొనుగోలుకు సీసీఐ రంగంలోకి దిగడంతో రైతులు ఆశలు పెంచుకుంటున్నారు. పత్తి ధర పతనం ఇలా.. అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి డిమాండ్ పడిపోతోంది. ఫలితంగా ఇక్కడి పత్తికీ ధర తగ్గుతోంది. తాజాగా మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ రా ష్ట్రాల్లో పత్తి అమ్మకాలు జోరందుకోవడంతో పత్తి ధరలపై ప్రభావం చూపుతోందని ఎగుమతిదారులు వెల్లడిస్తున్నారు. నార్త్ ఇండియాలోని హర్యానా, పంజాబ్, రాజాస్థాన్‌లో గతంలో క్యాండి ధర రూ.47,500 వరకు పలకగా.. ప్రస్తుతం ఆ ధర రూ.44 వేలకు పడిపోయింది. అదే విధంగా సౌత్ ఇండియాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో క్యాండీ ధర గతంలో 47,500 వరకు పలకగా.. సోమవారం రూ.44, 300కు దిగజారింది. పత్తి గింజలు సైతం క్వింటాల్‌కు గతంలో రూ.2,350 నుంచి 2,500 వరకు పలకగా.. సోమవారం ఏకంగా రూ.2,100 నుంచి 2,070కు దిగింది. దీంతో జమ్మికుంట పత్తి మార్కెట్లో క్వింటాల్ పత్తి అక్టోబర్ నుంచి నవంబర్ మొదటి వారం క్వింటాల్ పత్తి ధర రూ.5800 పలకగా.. సోమవారం రూ.5,350కు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొంటున్న వ్యాపార సంక్షోభంతో పత్తి రైతులు ఆందోళనకు గురవుతున్నారు. రానున్న రోజుల్లో ధరలు మరింత పతనంకానున్నాయని వ్యాపారవర్గాలు వెల్లడిస్తున్నాయి. కాటన్ వ్యాపారులకు భారీ నష్టం..? జమ్మికుంట పత్తిమార్కెట్లో రైతుల వద్ద పత్తిని కొనుగోలు చేసిన వ్యాపారులకు పడిపొతున్న పత్తి, గింజల ధరలు భారీనష్టాన్ని మిగిల్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఒక్కో కాటన్ మిల్లర్ దాదాపు 20 రోజుల వ్యవధిలో రూ.10 లక్షల నుంచి రూ.30లక్షల వరకు నష్టపోయినట్లు సమాచారం. పత్తికి డిమాండ్ లేకున్నా.. మిల్లుల నిర్వహణ కోసం పోటీ పడి మరీ పత్తిని కొనుగోలు చేసిన వ్యాపారులు పడిపోయిన ధరలతో గందరగోళంలో పడినట్లు తెలిసింది. చేసేదేమీ లేక ప్రభుత్వ మద్దతు ధర కంటే తక్కువ ధరకు కొనుగోళ్లు చేపట్టినట్లు సమాచారం. కొందరు కాటన్ మిల్లర్లు తమ వ్యాపారాలను పక్కన పెట్టినట్లు తెలిసింది. దీంతో ఇక సీసీఐ కొనుగోలు జోరందుకునే అవకాశాలు ఉన్నాయి. జమ్మికుంటలో పడిపోయిన పత్తి ధర జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్లో మంగళవారం క్వింటాల్ పత్తికి రూ.5,350 పలికింది. మార్కెట్‌కు వివిధ ప్రాంతాల నుంయి 1165 క్విం టాళ్ల పత్తి అమ్మకానికి వచ్చింది. ప్రైవేట్ వ్యాపారులు క్వింటాల్‌కు రూ.5350 చెల్లించారు. కనిష్టంగా రూ.5,300 చెల్లించారు. ప్రభుత్వ మద్దతు ధర రూ.5450 ఉండగా.. వ్యాపారులు రూ.100 తగ్గించి కొనుగోలు చేశారు. డబ్బులు అత్యవసరం ఉన్న రైతులు ధర తక్కువైనా వ్యాపారులకే విక్రయించారు. రెండుమూడు రోజులు అలస్యమైనా సరే అనుకున్నవారు సీసీఐకి విక్రయించారు. రంగంలోకి సీసీఐ మద్దతు ధర కంటే ప్రైవేట్ వ్యాపారులు ధర తక్కువగా చెల్లిస్తుండడం.. సీసీఐ రంగంలోకి దిగడంతో రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. సీసీఐ ఇన్చార్జి తిరుమల్‌రావు సైతం రైతులకు మద్దతు ధర చెల్లించేందుకు ముందుకు వచ్చి పలువురు రైతుల వద్ద సోమవారం 60 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయించారు. మంగళవారం మరో 120 క్వింటాళ్లు కొన్నారు. సీసీఐకే అమ్ముకున్న..పసుల రాజయ్య, భీంపల్లి, కమాలాపూర్ మాది కమాలాపూర్ మండలం భీంపెల్లి. నాకున్న ఐదెకరాల్లో పంటలు సాగు చేశా. నాలుగెకరాల్లో ప త్తి పెట్టిన. మొదట పత్తి ఏరితే 24క్వింటాళ్లు చేతికి వచ్చింది. జమ్మికుంట మార్కెట్‌కు నాలుగున్నర క్వింటాళ్లు తీసుకొచ్చిన. క్వింటాల్‌కు ప్రవేట్ వ్యా పారులు రూ.5350 ధర చెల్లిస్తామన్నారు. నేను సీసీఐకి మద్దతు ధరతో రూ.5450తో అమ్ముకున్న. పాసుబుక్కు తప్పనిసరి తిరుమల్‌రావు, సీసీఐ సెంటర్ ఇన్చార్జి సీసీఐకి విక్రయించాలనుకునే రైతులు తమవెంట ఆధార్‌కార్డు, పట్టదారు పాస్‌పుస్తకం, బ్యాంక్ ఖాతా బుక్కు తెచ్చుకోవాలి. తేమశాతం 12లోపు ఉన్న ఉత్పత్తులను తప్పకుండా కొంటాం. పత్తి మార్కెట్‌తోపాటు పట్టణంలోని మూడు కాటన్ మిల్లుల్లో మద్దతు ధరకు కొనుగోలు చేస్తాం. పట్టణంలోని ఆరు మిల్లుల్లో అగ్రిమెంట్లు పూర్తయ్యాయి. -
పత్తి కొనుగోళ్లకు సీసీఐ సిద్ధం
కరీంనగర్‌సిటీ: పత్తి కొనుగోళ్లకు ప్రభుత్వ రంగ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) సిద్ధమయ్యింది. బహిరంగ మార్కెట్లో పత్తి పంటకు అధిక ధరలు పలుకుతున్న క్రమంలో నిన్నామొన్నటి వరకు ప్రైవేట్ వ్యాపారులు పోటీ పడి కొనుగోలు చేశారు. ప్రస్తుతం ధరలు పతనమవుతున్న నేపథ్యంలో పత్తి పంటకు మద్దతు ధర కల్పిం చేందుకు సీసీఐ రంగంలోకి దిగింది. సీసీఐ ద్వారా జిల్లాలోని 4 మార్కెట్‌యార్డులు, 8 జిన్నింగ్ మిల్లుల్లో విడి పత్తి కొనుగోలు చేయుటకు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మార్కెటింగ్‌శాఖ డీడీ పద్మావతి తెలిపారు. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్‌యార్డు, జమ్మికుంట, చొప్పదండి, గంగాధర మార్కెట్‌యార్డుల్లో సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేశారు. శక్తి మురుగన్ ఇండస్ట్రీస్ (ఎలబోతారం), మల్లారెడ్డి కాటన్ ఇండస్ట్రీస్(మల్కాపూర్), రామినేని ఆగ్రో ఇండస్ట్రీస్ (రేణికుంట), ఆదిత్య కాటన్ అండ్ ఆయిల్ ఆగ్రో (జమ్మికుంట), రాజశ్రీ కాటన్ ఇండస్ట్రీస్ (జమ్మికుంట), మురుగన్ ఇండస్ట్రీస్ (జమ్మికుంట), శివశివాని కాటన్ ఇండస్ట్రీస్ (రుక్మాపూర్), కావేరి జిన్నింగ్ మిల్లు (వెలిచాల) జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రైతులు పత్తిని 12 శాతం తేమ మించకుండా.. నీరు చల్లకుండా నాణ్యతా ప్రమాణాలను పాటించి మార్కెట్‌యార్డుకు లేదా జిన్నింగ్ మిల్లులకు తీసుకొచ్చి సీసీఐకి విక్రయించి మద్దతు ధర పొందాలని పద్మావతి కోరారు. సీసీఐ 8 నుంచి 12 శాతం లోపు తేమశాతం ఉన్న పత్తిని మాత్రమే కొనుగోలు చేస్తారని పేర్కొన్నారు. 12 శాతం మించితే సీసీఐ కొనుగోలు చేయబోదని పేర్కొన్నారు. 8 శాతం కంటే తేమ ఎక్కువగా ఉన్నట్లయితే క్వింటాల్ పత్తికి రూ.5450లోపు చెల్లిస్తారని తెలిపారు. సీసీఐకి పత్తిని అమ్ముకునే రైతులు గత సంవత్సరం వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ద్వారా జారీ చేసిన పత్తి రైతు గుర్తింపు కార్డు తీసుకురావాలని కోరారు. గుర్తింపు కార్డు లేని పక్షంలో సంబంధిత వ్యవసాయ విస్తీర్ణాధికారి జారీ చేసిన పత్తి రైతు ధ్రువీకరణ పత్రం తీసుకుని రావాలని పేర్కొన్నారు. గుర్తింపుకార్డు, ధ్రువీకరణ పత్రంతో పాటు పట్టాదారు పాసు పుస్తకం, పహాణి జిరాక్స్, ఆధార్‌కార్డు జిరాక్స్, బ్యాంకు ఖాతా పుస్తకంలోని మొదటి రెండు పేజీలు జిరాక్స్ తీసుకుని రావాలని కోరారు. ఇప్పటివరకు జిల్లాలోని మార్కెట్ యార్డులో 46,354 క్వింటాళ్ల పత్తిని ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేశారని తెలిపారు. పత్తి రైతులు నాణ్యతా ప్రమాణాలతో పత్తిని తీసుకువచ్చి సీసీఐ ద్వారా మద్దతు ధర పొందాలని కోరారు. -
సీసీఐ కసరత్తు..
ఖమ్మంవ్యవసాయం: ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో పండించిన పత్తి కొనుగోలుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జిల్లాలో మొత్తం పంటల సాగు విస్తీర్ణం 5,81,767 ఎకరాలు కాగా, ప్రధాన పంటల్లో ఒకటైన పత్తిని 2,41,752 ఎకరాల్లో సాగు చేశారు. అక్టోబర్ నెలారంభం నుంచి పంట ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో ప్రభుత్వం నిర్ణయించిన ధరతో సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) రైతుల నుంచి పత్తి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది మద్దతు ధర క్వింటాలుకు రూ. 5,450 చెల్లించాలని, 8 నుంచి 12 తేమ శాతం కలిగిన పత్తిని మాత్రమే కొనాలని ప్రభుత్వం నిర్ణయించింది. 8 శాతం తేమ కలిగిన పత్తికి రూ.5,450లు చెల్లించనుంది. తేమ 9 శాతం ఉంటే క్వింటాల్‌కు రూ. 54.50 తగ్గించి కొనుగోలు చేస్తారు. తేమ 10 శాతం ఉంటే ధర మరో రూ.54.50 తగ్గిస్తారు. తేమ శాతం 12కు మించితే పత్తిని కొనుగోలు చేయొద్దని నిబంధనలు వధించారు. గత ఏడాది ప్రభుత్వం మద్దతు ధర రూ.4,320 నిర్ణయించగా, సీసీఐ 1.26 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసింది. ప్రైవేటు మార్కెట్లో అధిక ధర పలకటంతో సీసీఐ కేంద్రాల్లో తక్కువ కొనుగోళ్లు జరిగాయి. ప్రైవేటు మార్కెట్లో జిల్లా వ్యాప్తంగా దాదాపు 13 లక్షల క్వింటాళ్లు కొనుగోళ్లు చేసినట్లు మార్కెటింగ్ శాఖ లెక్కలు చెబుతున్నాయి. 5 మార్కెట్ల పరిధిలో పత్తి కొనుగోళ్లు.. జిల్లాలో సత్తుపల్లి వ్యవసాయ డివిజన్ మినహా ఖమ్మం, వైరా, మధిర, కూసుమంచి వ్యవసాయ డివిజన్లలో పత్తి పంటను సాగు చేస్తున్నారు. పంట ఉత్పత్తి ఆధారంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తోంది. ఖమ్మం, వైరా, మధిర, నేలకొండపల్లి, ఏన్కూరు.. 5 వ్యవసాయ మార్కెట్ల పరిధిలో కొనుగోళ్లు చేపట్టాలని నిర్ణయించింది. ఈ మార్కెట్ల పరిధిలో ఉన్న జిన్నింగ్ మిల్లుల్లో కూడా పత్తి కొనుగోళ్లు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో మొత్తం 12 జిన్నింగ్ మిల్లులు ఉండగా 10 మిల్లులు నిర్వహణలో ఉన్నాయి. వాటిలో కూడా పలు మిల్లులకు తగిన అనుమతులు లేవని తెలిసింది. 6 మిల్లులు మాత్రం జిన్నింగ్‌కు అన్ని అనుమతులు కలిగి ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. మరో 10 రోజుల్లో కేంద్రాలు మరో 10 రోజుల్లో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను చేర్పాటు చేయనుంది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సంబంధిత అధికారులకు సూచించారు. ఇప్పటికే సీసీఐ అధికారులు పత్తి కొనుగోలు చేసే కేంద్రాలను పరిశీలించారు. ప్రధానంగా మార్కెటింగ్ శాఖతో పాటు అగ్నిమాపక, లీగల్ మెట్రాలజీ, వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ శాఖలకు పంట ఉత్పత్తి కొనుగోలు అంశాలపై తగిన బాధ్యతలను అప్పగించారు. వ్యవసాయ శాఖ పంట ఉత్పత్తి విక్రయాలపై గ్రామాలకు షెడ్యూల్‌ను రూపొందించి, కొనుగోలు కేంద్రాలను పంపించాలని సూచించారు. కాగా గతేడాది అక్టోబర్ 10వ తేదీ నుంచి సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేసి పత్తి కొనుగోళ్లు చేపట్టారు. తేమశాతమే ప్రధాన ప్రామాణికం పత్తి కొనుగోళ్లలో ప్రధాన ప్రామాణికం తేమశాతమే. తేమ 8 నుంచి 12 శాతం వరకు తేమ కలిగిన తేమను మాత్రమే కొనుగోలు చేయాలని సీసీఐ నిబంధనలు విధించింది. ఈ తేమశాతాన్ని గ్రామాల్లోనే పరిశీలించి సమీప కేంద్రాలకు తరలించే విధంగా చర్యలు ఉండాలని కలెక్టర్ సూచించారు. వ్యవసాయ శాఖకు చెందిన గ్రామ వ్యవసాయ విస్తర్ణాధికారులకు తేమ శాతాన్ని గుర్తించే మాయిశ్చర్ మిషన్లను అందించి గ్రామాల్లోనే ఈ పరీక్షలు చేయించి పంటను విక్రయాలకు పంపించాలని నిర్ణయించారు. నూతనంగా రూపొందించిన ఈ విధానం ఏ మేరకు ఫలితాలను ఇస్తుందనేది మాత్రం ప్రశ్నార్థకంగా ఉంది. గ్రామాల్లో ఏఈవోలు తేమశాతాన్ని ధ్రువీకరించి పంపించినా సీసీఐ కేంద్రాల్లో మళ్లీ పరీక్షలు నిర్వహించి కొర్రీలు పెడతారా..? అనే సందేహాలు రైతులకు కలుగుతుంది. పత్తి జిన్నింగ్పై కుదరని ఒప్పందం సీసీఐ కొనుగోలు చేసిన పత్తిని జిల్లాలో గుర్తించిన జిన్నింగ్ మిల్లులు జిన్నింగ్ చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా పత్తి పండించే అన్ని జిల్లాల్లో సీసీఐ జిన్నింగ్ మిల్లుల యాజమానులతో ఒప్పందం(కాంట్రాక్ట్) కుదుర్చుకుంది. కానీ ఖమ్మం జిల్లాలో మాత్రం సీసీఐ నిబంధనల ప్రకారం జిన్నింగ్ చేయలేమని మిల్లుల యజమానులు వెనకడుగు వేశారు. లింట్ సైజు 30.5 మి.మీలు ఉండే విధంగా జిన్నింగ్ ఉండాలని సీసీఐ నిర్ణయించింది. ఇక్కడి జిన్నింగ్ మిల్లుల యజమానులు ఆ సైజుకు అంగీకరించటం లేదు. ఇక్కడ పండించే పత్తిలో విత్తనాలు అధికంగా ఉంటాయని, లింట్ సైజ్ 29.5 మి.మీలుగా నిర్ణయిస్తే జిన్నింగ్ చేస్తామని, లేదంటే మిల్లులను సీసీఐ లీజ్‌కు తీసుకొని నిర్వహించుకోవచ్చని యజమానులు చెబుతున్నారు. దీంతో సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. సీసీఐ మిల్లుల యజమానులతో చర్చలు కొనసాగిస్తూనే ఉంది. అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం జిల్లాలో సీసీఐ పత్తి కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డుల్లో, జిన్నింగ్ మిల్లుల్లో అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. పత్తి విక్రయానికి తెచ్చే రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా సౌకర్యాలను కల్పిస్తున్నాం. మరికొద్ది రోజుల్లో సీసీఐ పత్తి కొనుగోళ్లను నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. – రత్నం సంతోష్‌కుమార్, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి, ఖమ్మం -
ప్రతిష్టంభన తొలగేనా..!
సాక్షి, ఆదిలాబాద్: పత్తి కొనుగోళ్ల సీజన్ సమీపిస్తున్నా సీసీఐకి జిన్నింగ్ మిల్లులు అద్దెకు ఇచ్చే విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. పత్తిని జిన్నింగ్ చేసి దూదిని విడదీసి ఇచ్చే విషయంలో సీసీఐ, జిన్నింగ్ మిల్లుల మధ్య కొత్త నిబంధనల లొల్లి నెలకొనగా గత నెల ప్రభుత్వం క్వింటాల్ పత్తికి 33 కిలోల దూది ఇవ్వాలనే నిబంధనను 31 కిలోలకు తగ్గించింది. తద్వారా సమస్య పరిష్కారం అయిందన్న అభిప్రాయం ప్రభుత్వం నుంచి వ్యక్తమైంది. ఇప్పటికీ జిన్నింగ్‌ల అద్దె విషయంలో టెండర్లు పూర్తి కాకపోవడం సమస్యను తేటతెల్లం చేస్తోంది. సీసీఐ నాలుగోసారి టెండర్లను పిలిచింది. ఈ నెల 14 వరకు జన్నింగ్ మిల్లుల నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది. 17న టెండర్లను తెరవనుంది. అప్పటికీ పరిస్థితి తేటతెల్లం అయ్యే అవకాశం ఉంది. కొనుగోళ్ల ఏర్పాట్లపై సమీక్ష పత్తి కొనుగోళ్ల ఏర్పాట్లపై జిల్లాలోని మార్కెట్ల వారీగా మంగళవారం హైదరాబాద్‌లో మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి సమావేశం నిర్వహిస్తున్నారు. దీనికి ఉమ్మడి జిల్లా నుంచి మార్కెటింగ్ శాఖ అధికారులు హాజరు కానున్నారు. ఉమ్మడి జిల్లాలో పత్తి కొనుగోలుకు సంబంధించి సీసీఐ 23 కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇప్పటికీ టెండర్లు పూర్తి కాకపోవడంతో కొనుగోళ్లకు ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయోనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రధానంగా ఉమ్మడి జిల్లాలో దసరా నుంచి పత్తి కొనుగోళ్లను ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుంది. మరో 40 రోజులు మాత్రమే సమయం ఉండగా ఇప్పటికీ జిన్నింగ్ మిల్లుల అద్దె వ్యవహారం తేలకపోవడం పత్తి కొనుగోళ్లలో ప్రతిష్టంభన తేటతెల్లం చేస్తోంది. కొన్ని నిబంధనలు సడలించినా.. ప్రతి ఏడాది సీసీఐ కనీస మద్దతు ధరకు రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేస్తుంది. ఈ పత్తి నిల్వలను ఉంచడంతోపాటు జిన్నింగ్ చేసి దూదిని విడదీసి బేళ్లుగా తయారు చేసేందుకు జిన్నింగ్ మిల్లులను అద్దెకు తీసుకుటుంది. ఈ అద్దె కోసం సీసీఐ కొన్ని నిబంధనలు విధించి మిల్లుల యజమానుల నుంచి టెండర్ల ద్వారా కొటేషన్లను ఆహ్వానిస్తుంది. ఈ ఏడాది సీసీఐ సీఎండీ కొత్త నిబంధనలను తీసుకురావడం ఇప్పుడు వివాదానికి కారణమైంది. క్వింటాలు పత్తిని మిల్లులో జన్నింగ్ చేసినప్పుడు తప్పనిసరిగా 33 కిలోల దూదిని తమకు అప్పగించాలని సీసీఐ నిబంధన పెట్టింది. గతంలో ఇది 30.5 కిలోలే ఉండేది. దీనిపై మిల్లుల యజమానుల నుంచి ఆగ్రహం వ్యక్తం కావడంతో ప్రభుత్వం 31 కిలోలకు దిగి వచ్చింది. మరో నిబంధన పత్తిని జన్నింగ్ చేసిన తర్వాత వచ్చే దూది నుంచి బేళ్లు తయారు చేయగా, అందులో 2 శాతం వ్యర్థాలు మించరాదని కొత్త నిబంధనను తీసుకవచ్చారు. సాధారణంగానే జిన్నింగ్ చేసిన తర్వాత పత్తిలో 3.5 శాతం వ్యర్థాలు ఉంటాయని అలాంటి పరిస్థితిలో బేళ్లలో రెండు శాతం వ్యర్థాల నిబంధన సరికాదని మిల్లుల యజమానులు వాధించారు. దీన్ని 2.5 శాతానికి సీసీఐ పెంచింది. అదే సమయంలో సీసీఐ పత్తిని జిన్నింగ్ కోసం మిల్లులకు పత్తిని ఇచ్చిన తర్వాత తిరిగి బేళ్లను ఇచ్చే క్రమంలో నిబంధనలను మించి తరుగు ఉంటే ఆ భారాన్ని జిన్నింగ్ మిల్లులకు మోపడం ద్వారా అసలు వ్యాపారం చేసుకోవ్వని పరిస్థితి ఉందని వాపోతున్నారు. తరుగు 3.25 కిలోల వరకు మినహాయింపును ఇచ్చింది. కొలిక్కిరాని టెండర్లు.. ప్రతి ఏడాది దసరా నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభం అవుతాయి. అంతకు ముందు సీసీఐ జిన్నింగ్ మిల్లులను అద్దెకు తీసుకోవాలి. పత్తి కొనుగోలు అధికారులను నియమించాలి. జిన్నింగ్ మిల్లులతో టెండర్ల ద్వారా ఒప్పందం చేసుకుని ముందుకు వెళ్తే పత్తి కొనుగోళ్లు సరైన సమయానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగే అవకాశం ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో 18 మార్కెట్ యార్డుల పరిధిలో సుమారు 23 జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ లీజుకు తీసుకోవడం ద్వారా ఈ వ్యవహారాన్ని నడపాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు మూడు సార్లు టెండర్లు పిలిచినా వ్యాపారులు ముందుకు రాలేదు. ఇక తాజాగా గత శుక్రవారం నాలుగోసారి టెండర్లను పిలవడం జరిగింది. దూది శాతం, వ్యర్థాల శాతం, తరుగుశాతం విషయంలో సీసీఐ కొంత దిగి వచ్చినప్పటికీ ఇందులో నెలల వారీగా మళ్లీ శాతం హెచ్చింపు ఉందని, అదే విధంగా ఇతర నిబంధనలు కూడా జిన్నింగ్ మిల్లుల యజమానులకు నష్టం కలిగించేలా ఉన్నాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. దీంతో నాలుగో సారి కూడా టెండర్లు కొలిక్కి వస్తాయో లేదోననే సందిగ్ధం కనిపిస్తోంది. జిల్లాలో ఇదీ పరిస్థితి.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 3.47 లక్షల హెక్టార్లలో పత్తి పంట గతేడాది సాగైంది. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో పత్తిపంట సాగవుతోంది. సుమారు 50 నుంచి 60 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఏడాది పత్తి పంటకు కేంద్రం కనీస మద్దతు ధర రూ.5450కి పెంచింది. దీంతో ఈ ఏడాది సీసీఐ కొనుగోళ్లు అధికంగా ఉండే అవకాశాలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో జిన్నింగ్ మిల్లుల యజమానులు టెండర్లకు ముందుకు వస్తేనే కొనుగోళ్లలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకున్న పక్షంలోనే కొనుగోళ్లు ప్రారంభమయ్యే సమయానికి ఎలాంటి ప్రతిష్టంభన ఉండదు. టెండర్లు పిలిచిన పత్తి కొనుగోలు కేంద్రాలు.. ఉమ్మడి జిల్లాలో 23 జిన్నింగ్‌లు టెండర్లకు పిలిచాయి. అందులో ఆదిలాబాద్, ఆదిలాబాద్(బి), ఆసిఫాబాద్, బేల, బెల్లంపల్లి, భైంసా, చెన్నూర్, ఇచ్చోడ, ఇంద్రవెల్లి, బోథ్, జైనూర్, కడెం, కుభీర్, లక్సెట్టిపేట, మంచిర్యాల, నేరడిగొండ, నిర్మల్, పొచ్చెర, సారంగపూర్, సొనాల, వాంకిడి ఉన్నాయి. నష్టం కలిగిస్తున్నాయి.. సీసీఐ కొత్త నిబంధనలతో జిన్నింగ్ మిల్లులను అద్దెకు ఇవ్వలేం. దూది శాతం, వ్యర్థాల శాతం, తరుగు శాతంలో కొంత మినహాయింపులు ఇచ్చింది. కొనుగోలు ముందుకు సాగే సమయంలో ప్రతి నెల ఈ నిబంధనలు మారి తిరిగి సీసీఐ మొదట సూచించిన శాతాలకు చేరుకుంటున్నాయి. అదే విధంగా ఇందులో ఇతర అనేక నిబంధనలు కూడా జిన్నింగ్ మిల్లుల యజమానులకు నష్టం కలిగించేలా ఉన్నాయి. అయినప్పటికీ అద్దెకు ఇచ్చే విషయంలో ఆలోచన చేస్తున్నాం. త్వరలోనే మా వైఖరి వెల్లడిస్తాం. – రాజీవ్‌కుమార్ మిట్టల్, జిన్నింగ్ మిల్లు యజమాని, ఆదిలాబాద్ -
త్వరలో మరి కొన్ని యార్డులలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలు
జేడీఏ రామాంజినేయులు ఆదోని: మార్కెట్లో పత్తి దర తగ్గిపోవడంతో రైతులను అదుకునేందుకు మార్కెటింగ్ కడప రీజియన్ పరిధిలో మరి కొన్ని యార్డులలో సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నామని జేడీఏ రామాంజినేయులు తెలిపారు. బుధవారం ఆయన ఆదోని యార్డును పరిశీలించారు. కొత్తగా ప్రవేశ పెట్టిన ఈ-టెండర్ల అమలు, అమలులో ఎదురవుతున్న సమస్యలు, పరిష్కారంపై యార్డు ఎంపిక శ్రేణి కార్యదర్శి రామారావు, అధికారులతో చర్చించారు. సెస్సు వసూలును సమీక్షించారు. నిర్ణీత లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేయాలని సూచించారు. అనంతరం తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. మార్కెట్లో పత్తి ధర తగ్గిపోవడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోందని అన్నారు. మద్దతు ధర క్వింటాలు రూ.4050 అమ్ముకోడానికి సీసీఐ వద్దకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని చెప్పారు. ఇప్పటి వరకు కడప రీజన్లో సీసీఐ దాదాపు రూ.4.5 లక్షల క్వింటాళ్లు కొనుగోలు చేసిందని తెలిపారు. అయితే రైతుల నుంచి మరింత ఒత్తిడి పెరుగడంతో మరి కొన్ని కొనుగోలు కేంద్రాలు అవసరమని తాము ప్రతి పాదనలు పంపగా ఇందుకు ప్రభుత్వం అంగీకరించిందని చెప్పారు. జిల్లాలో ఆలూరు, పత్తికొండ, డోన్, కడప జిల్లాలో గుత్తిలో కొత్తగా కేంద్రాలు ప్రారంబిస్తున్నామని తెలిపారు. సీసీఐ అధికారులు ఇందుకు అవసరం అయిన చర్యలు తీసుకుంటారని అన్నారు. వారంలోగా అన్ని అదనపు కేంద్రాలు ప్రారంభం అవుతాయని ఒక ప్రశ్నకు సమాదానంగా చెప్పారు. ఆదోని యార్డులో విస్తరణకు అనుగుణంగా సెక్యూరిటీని పెంచకపోవడం వల్ల దొంగతనాలు జరుగుతున్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకు వెళ్లగా సెక్యూరిటీ నియామకంపై నిషేదం ఉందని పేర్కొన్నారు. అయితే యార్డులో దాదాపు రూ.50 లక్షలతో 36 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని, నిర్వహణను ప్రేవేటు వ్యక్తులకు ఇస్తున్నామని, సీసీ కెమెరాల ఏర్పాటుతో దొంగతనాలతో పాటు అక్రమాలకు అడ్డుకట్ట పడుతోందని ఆయన వివరించారు. కాటన్ యార్డులో ప్లాట్ ఫారం పై కప్పు నిర్మాణం నెలల తరబడి ఎందుకు వాయిదా పడుతోందని ప్రశ్నించగా నైపుణ్యత కలిగిన కాంట్రాక్టర్లు టెండర్లతో పాల్గొనడం లేదని తెలిపారు. ఇప్పటి వరకు ఆరు సార్లు టెండర్లు పిలిచినా ప్రయోజన ం లేకుండా పోయిందని, మళ్లీ టెండర్లు పిలుస్తున్నామని చెప్పారు. రిజయన్‌లో మొత్తం 10 మార్కెట్ యార్డులకు ప్రభుత్వం పాలక మండళ్లను నియమించిందని, మిగిలిన యార్డులకు త్వరలోనే పాలక మండళ్లు నియమించే అవకాశం ఉందని తెలిపారు. పిడబ్ల్యూడీఆర్ స్వీం కింద రీజియన్‌లో రూ.2 కోట్లతో గోదాముల మరతమ్మతు చేపడుతున్నామని అన్నారు. కడప రీజియన్‌లో మొత్తం 60 మార్కెట్ యార్డులు ఉండగా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.78.34 కోట్లు సెస్సు వసూలు చేయాలని లక్షంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 78 శాతం రూ.57.8 కోట్లు వసూలు చేశామని తెలిపారు. మిగిలిన మొత్తంను మార్చిలోగా వసూలు చేయాలని యార్డు అధికారులను ఆదేశించామని చెప్పారు.