ప్రతిష్టంభన తొలగేనా..! | CCI Purchaseof Cotton in Adilabad | Sakshi
Sakshi News home page

ప్రతిష్టంభన తొలగేనా..!

Published Tue, Sep 11 2018 8:02 AM | Last Updated on Tue, Sep 11 2018 8:02 AM

CCI Purchaseof  Cotton in Adilabad - Sakshi

ఆదిలాబాద్‌ జిన్నింగ్‌లో పత్తి నిల్వలు (ఫైల్‌)

సాక్షి, ఆదిలాబాద్‌: పత్తి కొనుగోళ్ల సీజన్‌ సమీపిస్తున్నా సీసీఐకి జిన్నింగ్‌ మిల్లులు అద్దెకు ఇచ్చే విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. పత్తిని జిన్నింగ్‌ చేసి దూదిని విడదీసి ఇచ్చే విషయంలో సీసీఐ, జిన్నింగ్‌ మిల్లుల మధ్య కొత్త నిబంధనల లొల్లి నెలకొనగా గత నెల ప్రభుత్వం క్వింటాల్‌ పత్తికి 33 కిలోల దూది ఇవ్వాలనే నిబంధనను 31 కిలోలకు తగ్గించింది. తద్వారా సమస్య పరిష్కారం అయిందన్న అభిప్రాయం ప్రభుత్వం నుంచి వ్యక్తమైంది. ఇప్పటికీ జిన్నింగ్‌ల అద్దె విషయంలో టెండర్లు పూర్తి కాకపోవడం సమస్యను తేటతెల్లం చేస్తోంది. సీసీఐ నాలుగోసారి టెండర్లను పిలిచింది. ఈ నెల 14 వరకు జన్నింగ్‌ మిల్లుల నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది. 17న టెండర్లను తెరవనుంది. అప్పటికీ పరిస్థితి తేటతెల్లం అయ్యే అవకాశం ఉంది.

కొనుగోళ్ల ఏర్పాట్లపై సమీక్ష
పత్తి కొనుగోళ్ల ఏర్పాట్లపై జిల్లాలోని మార్కెట్ల వారీగా మంగళవారం హైదరాబాద్‌లో మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌ లక్ష్మీబాయి సమావేశం నిర్వహిస్తున్నారు. దీనికి ఉమ్మడి జిల్లా నుంచి మార్కెటింగ్‌ శాఖ అధికారులు హాజరు కానున్నారు. ఉమ్మడి జిల్లాలో పత్తి కొనుగోలుకు సంబంధించి సీసీఐ 23 కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇప్పటికీ టెండర్లు పూర్తి కాకపోవడంతో కొనుగోళ్లకు ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయోనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రధానంగా ఉమ్మడి జిల్లాలో దసరా నుంచి పత్తి కొనుగోళ్లను ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుంది. మరో 40 రోజులు మాత్రమే సమయం ఉండగా ఇప్పటికీ జిన్నింగ్‌ మిల్లుల అద్దె వ్యవహారం తేలకపోవడం పత్తి కొనుగోళ్లలో ప్రతిష్టంభన తేటతెల్లం చేస్తోంది.
 
కొన్ని నిబంధనలు సడలించినా..
ప్రతి ఏడాది సీసీఐ కనీస మద్దతు ధరకు రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేస్తుంది. ఈ పత్తి నిల్వలను ఉంచడంతోపాటు జిన్నింగ్‌ చేసి దూదిని విడదీసి బేళ్లుగా తయారు చేసేందుకు జిన్నింగ్‌ మిల్లులను అద్దెకు తీసుకుటుంది. ఈ అద్దె కోసం సీసీఐ కొన్ని నిబంధనలు విధించి మిల్లుల యజమానుల నుంచి టెండర్ల ద్వారా కొటేషన్లను ఆహ్వానిస్తుంది. ఈ ఏడాది సీసీఐ సీఎండీ కొత్త నిబంధనలను తీసుకురావడం ఇప్పుడు వివాదానికి కారణమైంది. క్వింటాలు పత్తిని మిల్లులో జన్నింగ్‌ చేసినప్పుడు తప్పనిసరిగా 33 కిలోల దూదిని తమకు అప్పగించాలని సీసీఐ నిబంధన పెట్టింది. గతంలో ఇది 30.5 కిలోలే ఉండేది. దీనిపై మిల్లుల యజమానుల నుంచి ఆగ్రహం వ్యక్తం కావడంతో ప్రభుత్వం 31 కిలోలకు దిగి వచ్చింది.

మరో నిబంధన పత్తిని జన్నింగ్‌ చేసిన తర్వాత వచ్చే దూది నుంచి బేళ్లు తయారు చేయగా, అందులో 2 శాతం వ్యర్థాలు మించరాదని కొత్త నిబంధనను తీసుకవచ్చారు. సాధారణంగానే జిన్నింగ్‌ చేసిన తర్వాత పత్తిలో 3.5 శాతం వ్యర్థాలు ఉంటాయని అలాంటి పరిస్థితిలో బేళ్లలో రెండు శాతం వ్యర్థాల నిబంధన సరికాదని మిల్లుల యజమానులు వాధించారు. దీన్ని 2.5 శాతానికి సీసీఐ పెంచింది. అదే సమయంలో సీసీఐ పత్తిని జిన్నింగ్‌ కోసం మిల్లులకు పత్తిని ఇచ్చిన తర్వాత తిరిగి బేళ్లను ఇచ్చే క్రమంలో నిబంధనలను మించి తరుగు ఉంటే ఆ భారాన్ని జిన్నింగ్‌ మిల్లులకు మోపడం ద్వారా అసలు వ్యాపారం చేసుకోవ్వని పరిస్థితి ఉందని వాపోతున్నారు. తరుగు 3.25 కిలోల వరకు మినహాయింపును ఇచ్చింది.

కొలిక్కిరాని టెండర్లు..
ప్రతి ఏడాది దసరా నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభం అవుతాయి. అంతకు ముందు సీసీఐ జిన్నింగ్‌ మిల్లులను అద్దెకు తీసుకోవాలి. పత్తి కొనుగోలు అధికారులను నియమించాలి. జిన్నింగ్‌ మిల్లులతో టెండర్ల ద్వారా ఒప్పందం చేసుకుని ముందుకు వెళ్తే పత్తి కొనుగోళ్లు సరైన సమయానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగే అవకాశం ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో 18 మార్కెట్‌ యార్డుల పరిధిలో సుమారు 23 జిన్నింగ్‌ మిల్లుల్లో సీసీఐ లీజుకు తీసుకోవడం ద్వారా ఈ వ్యవహారాన్ని నడపాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు మూడు సార్లు టెండర్లు పిలిచినా వ్యాపారులు ముందుకు రాలేదు. ఇక తాజాగా గత శుక్రవారం నాలుగోసారి టెండర్లను పిలవడం జరిగింది. దూది శాతం, వ్యర్థాల శాతం, తరుగుశాతం విషయంలో సీసీఐ కొంత దిగి వచ్చినప్పటికీ ఇందులో నెలల వారీగా మళ్లీ శాతం హెచ్చింపు ఉందని, అదే విధంగా ఇతర నిబంధనలు కూడా జిన్నింగ్‌ మిల్లుల యజమానులకు నష్టం కలిగించేలా ఉన్నాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. దీంతో నాలుగో సారి కూడా టెండర్లు కొలిక్కి వస్తాయో లేదోననే సందిగ్ధం కనిపిస్తోంది.
 
జిల్లాలో ఇదీ పరిస్థితి..
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 3.47 లక్షల హెక్టార్లలో పత్తి పంట గతేడాది సాగైంది. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో పత్తిపంట సాగవుతోంది. సుమారు 50 నుంచి 60 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఏడాది పత్తి పంటకు కేంద్రం కనీస మద్దతు ధర రూ.5450కి పెంచింది. దీంతో ఈ ఏడాది సీసీఐ కొనుగోళ్లు అధికంగా ఉండే అవకాశాలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో జిన్నింగ్‌ మిల్లుల యజమానులు టెండర్లకు ముందుకు వస్తేనే కొనుగోళ్లలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకున్న పక్షంలోనే కొనుగోళ్లు ప్రారంభమయ్యే సమయానికి ఎలాంటి ప్రతిష్టంభన ఉండదు.

టెండర్లు పిలిచిన  పత్తి కొనుగోలు కేంద్రాలు..
ఉమ్మడి జిల్లాలో 23 జిన్నింగ్‌లు టెండర్లకు పిలిచాయి. అందులో ఆదిలాబాద్, ఆదిలాబాద్‌(బి), ఆసిఫాబాద్, బేల, బెల్లంపల్లి, భైంసా, చెన్నూర్, ఇచ్చోడ, ఇంద్రవెల్లి, బోథ్, జైనూర్, కడెం, కుభీర్, లక్సెట్టిపేట, మంచిర్యాల, నేరడిగొండ, నిర్మల్, పొచ్చెర, సారంగపూర్, సొనాల, వాంకిడి ఉన్నాయి.

నష్టం కలిగిస్తున్నాయి..
సీసీఐ కొత్త నిబంధనలతో జిన్నింగ్‌ మిల్లులను అద్దెకు ఇవ్వలేం. దూది శాతం, వ్యర్థాల శాతం, తరుగు శాతంలో కొంత మినహాయింపులు ఇచ్చింది. కొనుగోలు ముందుకు సాగే సమయంలో ప్రతి నెల ఈ నిబంధనలు మారి తిరిగి సీసీఐ మొదట సూచించిన శాతాలకు చేరుకుంటున్నాయి. అదే విధంగా ఇందులో ఇతర అనేక నిబంధనలు కూడా జిన్నింగ్‌ మిల్లుల యజమానులకు నష్టం కలిగించేలా ఉన్నాయి. అయినప్పటికీ అద్దెకు ఇచ్చే విషయంలో ఆలోచన చేస్తున్నాం. త్వరలోనే మా వైఖరి వెల్లడిస్తాం. – రాజీవ్‌కుమార్‌ మిట్టల్, జిన్నింగ్‌ మిల్లు యజమాని, ఆదిలాబాద్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement