‘డబుల్‌’కు శుభఘడియలు | good news for double bedroom sanctioners | Sakshi
Sakshi News home page

‘డబుల్‌’కు శుభఘడియలు

Published Sat, Jun 24 2017 3:17 PM | Last Updated on Sat, Sep 29 2018 4:44 PM

‘డబుల్‌’కు శుభఘడియలు - Sakshi

‘డబుల్‌’కు శుభఘడియలు

► 2బీహెచ్‌కే నిర్మాణాలకు ముందడుగు
► అర్బన్‌ ప్రాంతాల్లో ఆర్‌అండ్‌బీ టెండర్లకు కాంట్రాక్టర్లు సుముఖం
► ఉమ్మడి జిల్లాలో 1322 ‘డబుల్‌ బెడ్‌రూం’లకు మోక్షం


ఉమ్మడి జిల్లాలో మొదట నియోజకవర్గానికి 400 చొప్పున పది నియోజకవర్గాలకు 4వేలకు పైగా ఇళ్లు మంజూరయ్యాయి. ఒక్క నిర్మల్‌ జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్వగ్రామం ఎల్లపెల్లిలో మాత్రం 45నిర్మాణాలు ప్రారంభమై దాదాపు పూర్తయ్యే దశకు వచ్చాయి. మిగతా చోట్ల టెండర్ల పరిస్థితి కార్యరూపం దాల్చలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూం నిర్మాణానికి ముందుకొచ్చే కాంట్రాక్టర్లకు నిబంధనల్లో సడలింపు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రస్తుతం కొంత ఆశాజనకంగా కనిపిస్తోంది. ప్రధానంగా సిమెంట్‌ ధర బహిరంగ మార్కెట్లో రూ.300కు పైగా బస్తా ఉండగా, ప్రభుత్వం రూ.230కే పంపిణీ చేస్తామని, ఇసుక క్వారీల వద్ద సీనరేజ్‌ చార్జీలను డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు మినహాయిస్తామని కాంట్రాక్టర్లకు నచ్చజెప్పారు. కాగా డబుల్‌ బెడ్‌రూం ఇంటిని 500 చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మించాలి. అర్బన్‌లో ఇంటి నిర్మాణానికి రూ.5.30 లక్షలు యూనిట్‌ ధర, మౌలిక సదుపాయాల కోసం రూ.75వేలు, రూరల్‌లో నిర్మాణం కోసం రూ.5.04 లక్షలు యూనిట్‌ ధర, మౌలిక సదుపాయాల కోసం రూ.1.25లక్షలు నిర్ణయించారు. ఏదేమైనా ఉమ్మడి జిల్లాలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో నిర్మాణ పనులు ముందడుగు పడటంపై హర్షం వ్యక్తమవుతోంది.

సాక్షి, ఆదిలాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలకు మోక్షం ఎప్పుడా అని ఎదురుచూస్తున్న అర్హులైన వారికి ఇది ఊరటనిచ్చేదే. అర్బన్‌ ప్రాంతాల్లో రహదారులు, భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టెండర్లకు కాంట్రాక్టర్లు ఆసక్తి చూపుతుండడంతో ఇప్పటివరకు ఈ పథకంలో నెలకొన్న సబ్ధతకు తెరపడనుంది. ఉమ్మడి జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో 2బీహెచ్‌కే నిర్మాణాలకు సంబంధించి ఒకడుగు ముందుకు పడితే, రెండడుగులు వెనక్కి పడ్డ చందంగా సాగింది. పలుమార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. దీంతో ఆశించిన స్థాయిలో నిర్మాణాలు జరగలేదు. అయితే అర్బన్‌ ప్రాంతాల్లో ప్రస్తుతం కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. దీంతో ఆశించిన స్థాయిలో నిర్మాణాలు జరగలేదు. అయితే అర్బన్‌ ప్రాంతాల్లో ప్రస్తుతం కాంట్రాక్టర్లు ముందుకు వస్తుండడంతో ‘డబుల్‌’ నిర్మాణాలకు శుభఘడియలు ఆసన్నమవుతున్నట్లు తెలుస్తోంది.

1322 ‘డబుల్‌ బెడ్‌రూం’లకు టెండర్లు..
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కాగజ్‌నగర్, బెల్లంపల్లి, మందమర్రిలో డబుల్‌ బెడ్‌రూం నిర్మాణాలకు కాంట్రాక్టర్లు ముందుకు వచ్చారు. ఇటీవల నిర్వహించిన ఈ టెండర్లలో పాల్గొనడంతో పట్టణ ప్రాంతాల్లో త్వరలో నిర్మాణాలు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది.
► ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో 582 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను నిర్మించనున్నారు. పట్టణ శివారు మావల సర్వే నంబర్‌ 170లో 222, ఖానాపూర్‌లోని సర్వే నం.68లో 360 ఇళ్లను నిర్మించతలపెట్టారు. ఇక్కడ రెండుసార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. మూడోసారి మాత్రం స్పందన లభించింది. మావలలో 100 ఇళ్లను తిరుమల కన్‌స్ట్రక్షన్స్, 122 ఇళ్లను బాలాజీ కన్‌స్ట్రక్షన్స్, ఖానాపూర్‌ కాలనీలో 360 ఇళ్లను ఎన్‌.ఎన్‌. ఎంటర్‌ప్రైజెస్‌ నిర్మాణాలకు టెండర్‌ వేశారు. కలెక్టర్‌ నుంచి వీటికి సంబంధించి లెటర్‌ ఆఫ్‌ ఆక్సెప్టెడ్‌ (ఎల్‌ఓఏ) బుధవారం జారీ అయింది. కాంట్రాక్టర్‌తో అగ్రిమెంట్‌ కాగానే ఇక్కడ నిర్మాణాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
► నిర్మల్‌లో సర్వే నం.434, 435లలో మహాలక్ష్మీ ఆలయ సమీపంలో 160 ఇళ్ల నిర్మాణాలకు ఎన్‌.ఎన్‌. ఎంటర్‌ప్రైజెస్‌ ముందుకు వచ్చింది. ఇక్కడ మొదటిసారి నిర్వహించిన టెండర్లకే మోక్షం లభించడం గమనార్హం. ఎన్‌.ఎన్‌. ఎంటర్‌ప్రైజెస్‌ ఒక్కటే టెండర్‌లో పాల్గొంది. ఈ టెండర్‌కు సంబంధించి ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు కలెక్టర్‌కు నివేదికను పంపారు. కలెక్టర్‌ నుంచి ఎల్‌ఓఏ వెలువడగానే కాంట్రాక్టర్‌తో అగ్రిమెంట్‌ కుదుర్చుకునే అవకాశం ఉంది.
► సిర్పూర్‌ కాగజ్‌నగర్‌లో సర్వే నం.139లో 150 డబుల్‌ బెడ్‌రూంల నిర్మాణానికి టెండర్‌ పిలిచారు. ఇక్కడ కూడా కాంట్రాక్టర్లు నిర్మాణానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
► మంచిర్యాలలో సర్వే నం.345 రాజీవ్‌నగర్‌లో 120 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు ఇప్పటికే టెండర్, అగ్రిమెంట్‌ పూర్తయి పనులు కూడా ప్రారంభమయ్యాయి. అక్కడ మొదటిసారి పిలిచిన టెండర్‌కే కాంట్రాక్టర్ల నుంచి స్పందన లభించింది.
► బెల్లంపల్లిలో సర్వే నం.127 నుంచి 130 వరకు గల స్థలంలో 160 ఇళ్ల నిర్మాణాలకు ఒక కాంట్రాక్టర్‌ ముందుకు రావడం జరిగింది. ఇక్కడ నాలుగుసార్లు టెండర్లు నిర్వహించినా తొలుత స్పందన లభించలేదు. కలెక్టర్‌ నుంచి ఎల్‌ఓఏ లభించగానే ఇక్కడ కూడా కాంట్రాక్టర్‌తో ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది.
► మందమర్రిలో సర్వే నం.148లో మూడోసారి పిలిచిన టెండర్లకు స్పందన లభించింది. ఎన్‌.ఎన్‌. ఎంటర్‌ప్రైజెస్‌ ఈ నిర్మాణాలకు ముందుకొచ్చింది. 150 ఇళ్ల నిర్మాణాలు జరగనున్నాయి.

మొదట అనాసక్తి..
అధికారంలోకి వస్తే పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం చేయిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన టీఆర్‌ఎస్‌ సర్కారు అమలులో మాత్రం నిదానంగా వ్యవహరిస్తోంది. ప్రధానంగా ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వం నిర్ణయించిన యూనిట్‌ ధర గిట్టుబాటు కాదని కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో నిర్మాణాలు ముందుకు సాగలేదు. బహిరంగ మార్కెట్లో సిమెంట్, స్టీల్‌ ధరలు అధికంగా ఉన్నాయని కాంట్రాక్టర్లు ఆసక్తి చూపలేదు. పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో పలుమార్లు టెండర్లు పిలిచినా వారి నుంచి స్పందన కరువైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, అటవీ శాఖ మంత్రి జోగురామన్నలు ఉమ్మడి జిల్లాలో సమావేశాలు నిర్వహించి డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి చర్చించారు. అధికారులు, కాంట్రాక్టర్లను సమావేశపరిచి నిర్మాణాల వేగవంతానికి చొరవ తీసుకున్నారు.

కాంట్రాక్టర్లతో అగ్రిమెంట్లు చేపడతాం..
అర్బన్‌ ప్రాంతాల్లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి టెండర్లు చేపట్టాం. త్వరలో పూర్తిస్థాయిలో కాంట్రాక్టర్లతో అగ్రిమెంట్లు పూర్తి చేస్తాం. ఈ ప్రక్రియ అనంతరం ఇళ్ల నిర్మాణాలను ప్రారంభిస్తాం. – నజీర్‌ అహ్మద్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement