‘డబుల్‌’ జాప్యం | contractors lack of interest | Sakshi
Sakshi News home page

‘డబుల్‌’ జాప్యం

Published Fri, Mar 3 2017 11:05 PM | Last Updated on Sat, Sep 29 2018 4:44 PM

‘డబుల్‌’ జాప్యం - Sakshi

‘డబుల్‌’ జాప్యం

► జిల్లాలో మొదటగా 718 ఇళ్లు మంజూరు
► స్థలం కొరతతో గుర్తించింది 20 ఎకరాలే..
► ముందుకు రాని కాంట్రాక్టర్లు ∙రెండో ‘సారి’ నో రెస్పాన్స్


ఆదిలాబాద్‌ అర్బన్  : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘డబుల్‌ బెడ్‌ రూమ్‌’ ఇళ్ల నిర్మాణ ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. మొదటి విడతలో ప్రతీ నియోజకవర్గానికి 400 ఇళ్ల చొప్పున ప్రభుత్వం మంజూరు చేసిన విషయం తెలిసిందే. గ్రామీణ ప్రాంతాల్లో 240, పట్టణ ప్రాంతంలో 160 ఇళ్లు నిర్మించేందుకు ప్రభుత్వ, పరిపాలన అనుమతులు కూడా లభించాయి. దీంతోపాటు అదనపు కోటా కింద గ్రామీణ ప్రాంతాలకు మరో 78 ఇళ్లు మంజూరైనట్లు అధికారులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ‘డబుల్‌’ ఇళ్లు నిర్మించేందుకు ప్రభుత్వ స్థలం కొరత ఉండగా.. స్థలం అందుబాటులో ఉన్న గ్రామాల్లో నిర్మాణాలు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాలేకపోతున్నారు. దీంతో ‘డబుల్‌’ పథకం అమలు ముందుకు సాగడం లేదు.

అసలు సంగతి ఇదీ..  
ఆదిలాబాద్‌ నియోజకవర్గంలోగల మూడు మండలాల్లోని ఐదు గ్రామాల్లో ‘డబుల్‌’ ఇళ్లు నిర్మించేందుకు పరిపాలన అనుమతి లభించింది. కాగా బేల మండలంలోని ఏ ఒక్క గ్రామంలో మొదటి విడతలో ఇళ్లు నిర్మించేందుకు ప్రణాళికలు లేవు. ఆదిలాబాద్‌లోని బట్టిసావర్‌గాంలో 100 ఇళ్లు నిర్మించేందుకు స్థలం గుర్తించారు. టెండర్లు కూడా ఖరారు చేశారు. పని ప్రారంభించాల్సి ఉంది. మావలకు 30 ఇళ్లు మంజూరైతే 25ఇళ్లు నిర్మించేందుకే స్థలం ఉంది.

మిగతా ఐదు ఇళ్లు ఎక్కడ నిర్మించాలని అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. జైనథ్‌కు 131 ఇళ్లు మంజూరైతే 43 ఇళ్లకే స్థలం అందుబాటులో ఉంది. మిగతా ఇళ్లకు స్థలం లేక ఇబ్బందిగా మారింది. జైనథ్‌లోని గూడ గ్రామానికి 28 ఇళ్లు, గిమ్మ(కె) గ్రామానికి 29 ఇళ్లు మంజూరై స్థలం కూడా అందుబాటులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కానీ ఇళ్ల నిర్మాణాలకు టెండర్‌ పిలువగా కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో ప్రక్రియ నిలిచిపోయింది.

బోథ్‌ నియోజకవర్గంలో..
నియోజకవర్గంలోని బజార్‌హత్నూర్‌లోని కోలా్హరి, బాలాపూర్, జాతర్ల, కిన్నరపల్లి గ్రామాలకు 70 ఇళ్లు మంజూరయ్యాయి. కానీ ఇళ్లు నిర్మించేందుకు స్థలం అందుబాటులో లేదు. ప్రస్తుతం టెండర్‌ ప్రక్రియ నిలిచిపోయింది. బోథ్‌ మండలంలోని దన్నూర్, కరత్వాడ, సోనాల గ్రామాలకు 64 ఇళ్లు మంజూరు కాగా స్థలం అందుబాటులో ఉంది. మిగతా వాటికి స్థలం లేదు. ప్రస్తుతం అధికారులు స్థల అన్వేషణ కొనసాగిస్తున్నారు. ఇచ్చోడలోని ముక్రా(కె), సోన్ పల్లి, సిరికొండ, కోకస్‌మన్నూర్, ముక్రా(బి) ఐదు గ్రామాలకు 78 ఇళ్లు మంజూరు కాగా 33 ఇళ్ల నిర్మాణాలకు మాత్రమే స్థలం అందుబాటులో ఉందని అధికారులు గుర్తించారు. గుడిహత్నూర్‌లోని నచ్చాపూర్, శాంతాపూర్‌ రెండు గ్రామాలకు 37 ఇళ్లు మంజూరయ్యాయి.

స్థలం అందుబాటులో ఉందని గుర్తించారు. నేరడిగొండలోని తేజాపూర్, చించోలి, బుర్కపల్లి మూడు గ్రామాలకు 38 ఇళ్లు మంజూరు కాగా స్థలం ఉన్నట్లు గుర్తించినా టెండర్‌ పక్రియ నిలిచింది. తాంసిలోని అర్లి(టి), కరంజి(టి), పాలోడి, బండల్‌ నాగాపూర్‌ నాలుగు గ్రామాలకు 77 ఇళ్లు మంజూరు కాగా 40 ఇళ్లు నిర్మించేందుకే స్థలం అందుబాటులో ఉంది. మిగతా ఇళ్లకు స్థల అన్వేషణ కొనసాగుతుండగా, కాంట్రాక్టర్ల నుంచి రెస్పాన్  రాకపోవడంతో ప్రక్రియ నిలిచింది.

తలమడుగులోని సోనాపూర్, నర్సాపూర్, సుంకిడి, కొత్తూర్‌ నాలుగు గ్రామాలకు కలిపి 36 ఇళ్లు మంజూరయ్యాయి. 11ఇళ్లు నిర్మించేందుకు మాత్రమే స్థలం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. టెండర్లు పిలిచినా ఎలాంటి రెస్పాన్ రాకపోవడంతో రెండోసారి పిలిచారు. ప్రస్తుతం పరిశీలనలో ఉంది. నార్నూర్‌కు 50, ఉట్నూర్‌కు 80, ఇంద్రవెల్లికి 80 ‘డబుల్‌’ ఇళ్ల నిర్మాణానికి అనుమతి లభించినట్లు అధికారులు పేర్కొంటున్నారు.

424 ఇళ్లకే స్థలం.
జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు మొదటి విడతగా మంజూరైన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు నిర్మించేందుకు స్థలం కొరత ఏర్పడుతోంది. జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలకు 718 ఇళ్లు మంజూరు కాగా 424 ఇళ్లు నిర్మించేందుకు స్థలం అందుబాటులో ఉంది. మిగతా ఇళ్ల నిర్మాణాలకు స్థలం అందుబాటులో లేనట్లుగా అధికారులు గుర్తించారు. అయితే మావలలో 1.62 ఎకరాలు, జైనథ్‌లో 5.89, గూడలో 2.68, గిమ్మలో 1.57 ఎకరాల స్థలం అందుబాటులో ఉందని అధికారులు సర్వే ద్వారా గుర్తించారు.

బజార్‌హత్నూర్‌లోని జాతర్లలో ఎకరం, ఇచ్చోడలోని ముక్రా(కె)లో 63 గుంటలు, సిరికొండలో 3.98 ఎకరాలు, నేరడిగొండలోని తేజాపూర్‌లో 1.7 ఎకరాలు, చించోలిలో 20గుంటలు, తాంసిలోని అర్లి(టి)లో 1.2 ఎకరాలు, పాలోడిలో ఎకరం స్థలం ఇళ్ల నిర్మాణాలకు అందుబాటులో ఉన్నట్లు అధికారుల సర్వే స్పష్టం చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా 424 ఇళ్ల నిర్మాణాలకు 20.59 ఎకరాల స్థలం అందుబాటులో ఉంది. మిగతా ఇళ్లకు స్థలం గుర్తించాల్సి ఉంది. తహసీల్దార్ల నుంచి స్థలం ఉన్నట్లు సర్వే శాఖకు సమాచారం ఉండగా, సర్వేయర్లు వెళ్లి సర్వే చేసి ఖరారు చేయాల్సి ఉంది.

టెండర్లు రెండో‘సారి’..  
జిల్లాలో 718 ‘డబుల్‌’ ఇళ్లు నిర్మించాల్సి ఉండగా, ముందుగా 396 ఇళ్ల నిర్మాణాలకే టెండర్లు పిలిచారు. మొదటిసారి స్పందన రాకపోవడంతో రెండుసార్లు టెండర్లు పిలిచారు. మొదటి సారిగా బట్టిసావర్‌గాం, జైనథ్, సిరికొండ, మావల, గిమ్మ, గూడ, పాలోడి, చించోలి, అర్లి(టి) గ్రామాల్లో నిర్మాణాలకు టెండర్లు పిలవగా, బట్టిసావర్గాం, జైనథ్, ఇచ్చోడలోని సిరికొండ గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలకు మాత్రమే టెండర్లు ఖరారయ్యాయి. మిగతా గ్రామాలకు టెండర్లు ఖరారు కావాల్సి ఉంది. అయితే రెండోసారి బుర్కపల్లి, నాచాపూర్, శాంతాపూర్, ముక్రా(కె), దన్నూర్, తేజాపూర్, బండల్‌నాగాపూర్, సోనాపూర్‌ గ్రామాలతో పాటు మొదటిసారి రెస్పాన్స్  రాని గ్రామాలను కలుపుకుని రెండోసారి టెండర్లు పిలిచారు. అయినా ఇంత వరకు స్పందన రాకపోవడంతో ‘డబుల్‌’ ఇళ్లపై లబ్ధిదారుల ఆశలు ఆవిరవుతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement