సాక్షి, ఆదిలాబాద్: కేంద్ర ప్రభుత్వం పత్తికి గత ఏడాది కంటే ఈసారి మద్దతు ధర పెంచడం ఊరటనిచ్చినా.. కొనుగోళ్లలో రైతుకు గిట్టుబాటయ్యే ధర లభిస్తేనే లాభం చేకూరుతుంది. ఏటా కొనుగోళ్లలో తేమ, నాణ్యత కారణంగా ధరలో కోత విధించడంతో న్యాయం చేయాలంటూ రైతులు ఆందోళనలు చేపట్టడం జిల్లాలో జరుగుతూనే ఉంది. ఈ యేడాది ప్రకృతి రైతుపై కన్నెర్ర చేసింది. భారీ వర్షాల కారణంగా ఇప్పటికే పంట నష్టం చవిచూశారు. దిగుబడిపై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర లభిస్తేనే పత్తి రైతుకు న్యాయం జరిగే పరిస్థితి ఉంది. తెల్ల బంగారం ఈసారి రైతు మోములో తళుక్కుమనిపిస్తుందా అనే సందేహం వ్యక్తమవుతోంది.
23లక్షల క్వింటాళ్ల దిగుబడి అంచనా..
జిల్లాలో ఈయేడాది 1.28 లక్షల హెక్టార్లలో పత్తి పంట సాగైంది. గతేడాది 1.21 లక్షల హెక్టార్లలో సాగు కాగా, మార్కెట్లో 23లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు జరిగాయి. ఈయేడాది సుమారుగా అంతే దిగుబడులు రావచ్చని అంచనా వేస్తున్నారు. ప్రధానంగా గతేడాది హెక్టార్‌కు 15 నుంచి 16 క్వింటాళ్ల దిగుబడి రాగా, ఈ యేడాది 20 క్వింటాళ్ల దిగుబడి రావచ్చని వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యం కారణంగా దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. ప్రధానంగా జిల్లాలో ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో1.24 లక్షల ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. ఇందులో అత్యధికంగా 93వేల ఎకరాల్లో పత్తి పంటకే నష్టం చేకూరింది. మిగిలిన పంటలోనూ పత్తి దిగుబడిపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మద్దతు ధరపైనే వారు ఆశలు పెట్టుకున్నారు.
మద్దతు ధర రూ.5,450
2018–19 కోసం కేంద్ర ప్రభుత్వం పంటల మద్దతు ధరలో నాణ్యమైన పత్తి క్వింటాలుకు రూ.5,450 ప్రకటించడం జరిగింది. సాధారణ పత్తి క్వింటాలుకు రూ.5,150 ప్రకటించారు. గతేడాది నాణ్యమైన పత్తికి రూ.4320 ఉండగా, సాధారణ పత్తికి రూ.4,020 ఇవ్వడం జరిగింది. కాగా ప్రస్తుతం పెంచిన మద్దతు ధరలతో రైతుకు అదనంగా రూ.వెయ్యికి పైగా లభిస్తున్నప్పటికీ పత్తి తేమ, నాణ్యత విషయంలో మళ్లీ రైతుకు కొర్రీలు పెట్టిన పక్షంలో రైతుకు మద్దతు ధర లభించడం గగనమే.
పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు..
పత్తి కొనుగోళ్ల కోసం మార్కెట్ కమిటీల్లో ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్, ఆదిలాబాద్–బి, బేల, ఇచ్చోడ, ఇంద్రవెల్లి, బోథ్, నేరడిగొండ, పొచ్చర, సొనాల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆయా మార్కెట్ యార్డుల్లో పత్తి తూకం యంత్రాలను సరిచేయాల్సి ఉంది. కాగా జిల్లాలో సాధారణంగా దసరాకు పత్తి కొనుగోళ్లు ప్రారంభమవుతాయి. అక్టోబర్ 1 నాటికి మార్కెట్ యార్డులన్ని సిద్ధంగా ఉంచాలని మార్కెటింగ్ శాఖ నుంచి ఆదేశాలు వెలబడ్డాయి. ఈ దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. మరోపక్క సీసీఐకి జిన్నింగ్ మిల్లు అద్దెకు ఇచ్చే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. సోమవారం నాటికి టెండర్ల గడువు ముగిసినప్పటికీ జిన్నింగ్ మిల్లు అద్దె వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.
అక్టోబర్ 10 నాటికి పత్తి మార్కెట్‌కు..
అక్టోబర్ 10 నాటికి పత్తి మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉంది. గతేడాది కూడా ఇదే సమయంలో దిగుబడులు రావడం జరిగింది. మార్కెట్ యార్డుల్లో ఏర్పాట్లు చేస్తున్నాం. రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపడుతున్నాం. ఈ మేరకు పనులు ప్రారంభించాం. – శ్రీనివాస్, జిల్లా మార్కెటింగ్ అధికారి, ఆదిలాబాద్
Comments
Please login to add a commentAdd a comment