మరుగుదొడ్డి నిర్మాణాన్ని పరిశీలిస్తున్న బేల మండల అభివృద్ధి అధికారి
ఆదిలాబాద్‌అర్బన్: గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త పథకాలతో ముందడుగు వేస్తున్నాయి. పల్లెలను పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా గ్రామానికో ‘స్వచ్ఛ గ్రహీ’ని నియమించాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. సదరు అభ్యర్థి ఇంట్లో మరుగుదొడ్డి ఉంటేనే స్వచ్ఛగ్రహీ ఉద్యోగానికి ఎంపిక చేయాలనే నిబంధనను తీసుకొచ్చింది. ఎంపికైన వారికి ఐదు రోజులపాటు శిక్షణ ఇచ్చి, సంబంధిత కిట్‌ను అందజేస్తారు. కాగా, జిల్లాలో ఇటీవల కొత్తగా ఏర్పాటైన గ్రామ పంచాయతీలతోపాటు అన్ని పంచాయతీల్లో ఆగస్టు 15 నుంచి స్వచ్ఛతకు పెట్టపీట వేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో స్వచ్ఛగ్రహీల నియమకాలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉండగా, ప్రభుత్వం త్వరలో గ్రామ పంచాయతీ కార్యదర్శుల పోస్టులను భర్తీ చేసేందుకు సన్నహాలు చేస్తోంది. ఈ పోస్టులకు ఎక్కువగా గ్రామీణ అభ్యర్థులు పోటీ పడుతారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి ఇంటిలో వ్యక్తిగత మరుగుదొడ్డి ఉంటేనే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆ ఉద్యోగానికి ఎంపిక చేసే అవకాశాలు లేకపోలేదని పలువురు చర్చించుకుంటున్నారు.
జిల్లాలో ఇలా..
జిల్లాలో 2017లో నిర్వహించిన సర్వే ప్రకారం 1,08,758 నివాస గృహాలు ఉన్నాయి. ఇందులో 39,092 నివాస గృహాలు వ్యక్తిగత మరుగుదొడ్లు కలిగి ఉన్నట్లు తేలింది. మిగతా 69,666 నివాస గృహాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు లేవని తేల్చారు. దీని ప్రకారం జిల్లాలో 69,666 వ్యక్తిగత మరుగుదొడ్లను మంజూరు చేశారు. ఇందుకు రూ.40.78 కోట్లు అవసరమని అంచనా వేశారు. అంటే ఒక్కటి కూడా మిగలకుండా జిల్లాలోని అన్ని నివాస గృహాలకు వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరయ్యాయి. ఇది జరిగి ఏడాదిన్నర గడుస్తున్నా.. మంజూరైన మరుగుదొడ్లలో సగం కూడా పూర్తి కాలేదు. కేవలం 20,473 మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి చేసి చేతులు దులుపుకున్నారు. ఇంకా 47,318 నివాస గృహాల్లో మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉన్నా.. ప్రభుత్వం నుంచి స్వచ్ఛతకు సరిపడా నిధులు రాక నిర్మాణాలు వెనుకబడిపోయాయి.
‘బహిరంగ మలవిసర్జన రహిత’(ఓడీఎఫ్) జిల్లాగా తీర్చి దిద్దేందుకు రూ.40.78 కోట్లు అవసరం ఉందని అంచనా వేయగా, ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు రూ.16.20 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. మిగతా రూ.24.58 కోట్లు విడుదల చేయక పెండింగ్‌లో ఉన్నాయి. ఇదిలా ఉండగా, 243 పాత గ్రామ పంచాయతీల పరిధిలోని 589 గ్రామాలను బహిరంగ మలవిసర్జన రహిత(ఓడీఎఫ్) గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు గత రెండేళ్లుగా ప్రయత్నిస్తున్నారు. గ్రామాలను ఓడీఎఫ్‌గా చేసిన ఎంపీడీవోలు, సర్పంచ్‌లు, ఇతర అధికారులకు అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున అవార్డులు, నగదు బహుమతులు అందజేస్తూ వస్తున్నా.. మార్పు కన్పించడం లేదు. జిల్లాలోని 9 గ్రామ పంచాయతీల పరిధిలో గల 18 గ్రామాలు మాత్రమే ఓడీఎఫ్ గ్రామాలుగా ప్రకటించారు. మిగతా 234 గ్రామ పంచాయతీల పరిధిలోని 448 గ్రామాలను ఓడీఎఫ్‌గా తీర్చిదిద్దాల్సి ఉంది. కాగా, 78 పంచాయతీల పరిధిలోని 123 ఓడీఎఫ్ గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ప్రొగ్రెస్‌లో ఉన్నాయి.
గ్రామానికో ‘స్వచ్ఛగ్రహీ’
పంచాయతీల్లో ప్రత్యేక పాలన మొదలైనప్పటికీ నుంచి ప్రభుత్వం పరిశుభ్రతపై దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా పరిశుభ్రంగా, పచ్చదనంగా ఉంచేందుకు మూడు నెలల కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని ఇటీవల అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ఇందుకు గ్రామానికో స్వచ్ఛగ్రహీని నియమించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించడంతో ప్రాధాన్యతను సంతరించకుంది. గ్రామాలకు ఎంపికైన స్వచ్ఛగ్రహీలకు ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. ఓడీఎఫ్ గ్రామంగా ప్రకటించిన తర్వాత గ్రామస్తులు మలవిసర్జనకు ఆరుబయటకు వెళ్తున్నదీ.. లేనిదీ.. ఇంటింటికి వెళ్లి పరిశీలించినందుకు ఒక్కో ఇంటికి రూ.25 చొప్పున స్వచ్ఛగ్రహీలకు అందజేస్తారు.
ఈ లెక్కన మరుగుదొడ్డికి మరమ్మతులు చేసుకునేలా చైతన్యపరిస్తే, మరుగుదొడ్డి విస్తరణ పనులు చేయించగలిగితే ఒక్కోదానికి రూ.25 చొప్పున, గోబర్‌గ్యాస్ వంటి ప్లాంట్లపై ప్రజలకు అవగాహన కల్పిస్తే రూ.200 చొప్పున ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందజేయనుంది. ఇవే కాకుండా పాఠశాలలు, అంగన్‌వాడీలు, పీహెచ్‌సీల్లో పరిశుభ్రంగా ఉండేలా చూడడం, ఓడీఎఫ్ రోజు అమలు చేయడం, అంకితభావంతో పని చేసే వారికి సత్కరాలు, అవార్డులు ఇవ్వడంతోపాటు స్వచ్ఛగ్రహీల ఉద్యోగాలు శాశ్వతం కాదనే విషయంపై అవగాహన కల్పించాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించడం ఇక్కడ గమనించదగ్గ విషయం.
Comments
Please login to add a commentAdd a comment