swatcha bharath
-
మొక్కలు నాటడం కాదు..బతికించాలి
హైదరాబాద్: మొక్కలు నాటడమే కాకుండా అవి బతికేలా బాధ్యతలు తీసుకోవాలని తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు. మంత్రి ఎర్రబెల్లి బుధవారం ఈజీఎస్, సెర్ఫ్, స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు టార్గెట్ చేరుకోవాలని సూచించారు. ఉపాధిహామీ పథకం కింద కొత్త గ్రామపంచాయతీ భవనాల నిర్మాణం, అలాగే గోడౌన్ల నిర్మాణం కూడా చేపట్టాలని అధికారులకు సూచన చేశారు. మార్చి 31, 2019లోగా తెలంగాణాను బహిరంగ మల విసర్జన రహితంగా తీర్చిదిద్దాలని కోరారు. 57 నుంచి 64 సంవత్సరాలలోపు ఉన్న కొత్త పింఛన్ దారులను గుర్తించాలన్నారు. స్వయం సహాయక సంఘాల నిధులు సద్వినియోగం జరగాలని కోరారు. గ్రామాల్లో యువతకు జాబ్‌మేళాలు నిర్వహించాలని అధికారులకు చెప్పారు. స్మశానవాటిక భూకొనుగోలు కోసం రూ.2 లక్షల వరకు నిధులు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. -
స్వచ్ఛత కొనసాగేనా?
కరీంనగర్ కార్పొరేషన్: కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, స్వచ్ఛభారత్ మిషన్ సంయుక్తంగా స్వచ్ఛ సర్వేక్షణ్–2019 పేరిట దేశవ్యాప్తంగా నిర్వహించిన స్వచ్ఛత పోటీ పరీక్ష గురువారంతో ముగుస్తోంది. కేంద్ర బృందం చేపట్టిన స్వచ్ఛత సర్వే, నగరపాలక సంస్థ చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ, యాప్‌తో ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలన్నీ పరిగణలోకి తీసుకొని స్వచ్ఛత ర్యాంకును కేటాయించనున్నారు. ఈ పోటీలో మెరుగైన ర్యాంకు సాధించడానికి నాలుగు నెలలుగా కరీంనగర్ నగరపాలక సంస్థ అధికారులు, పాలకవర్గ సభ్యులు కుస్తీ పట్టారు. రోడ్ల వెంట చెత్త వేయకుండా, బహిరంగ మలమూత్ర విసర్జన జరగకుండా, తడి, పొడి చెత్తను వేరు చేయడం, డంప్‌యార్డుకు చెత్తను తగ్గించడం, డ్రెయినేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం, నగరంలో సామూహిక టాయిలెట్ల ఏర్పాటు వంటి కార్యక్రమాలను పకడ్బందీగా చేపట్టారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంతోపాటు కమ్యూనిటీ టాయిలెట్లను ఏర్పాటు చేసి పోటీ పరీక్షలో నిలబడ్డారు. ఈనెల 4 నుంచి శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టితో పనులు చేపట్టారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ పనుల్లో నిర్లక్ష్యంగా లేకుండా స్వచ్ఛతకు పెద్దపీట వేసి చెత్తను కనబడకుండా కార్యాచరణతో ముందుకెళ్లారు. మెరుగైన ర్యాంకు లక్ష్యంగా.. 2015లో క్లీన్‌సిటీగా గుర్తించబడ్డ కరీంనగర్ నగరపాలక సంస్థ 2016లో 259వ ర్యాంకు, 2017లో 201 ర్యాంకు, 2018లో 73వ ర్యాంకు సాధించి ఏటేటా తన ర్యాంకు మెరుగుపర్చుకుంది. యేటేటా సాధిస్తున్న ర్యాంకులతో ఉత్సాహంగా ఈయేడాది దేశ వ్యాప్తంగా 10లోపు ర్యాంకు సాధించడమే లక్ష్యంగా పనిచేశారు. వాడవాడలా ఇంటింటికీ స్వచ్ఛతపై అవగాహన కల్పించారు. మహిళా సంఘాలు, పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, హోటళ్లు, బేకరీలు, ఇతర వ్యాపారులకు స్వచ్ఛత ఆవశ్యకతను తెలుపుతూ సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించారు. ప్రత్యేకంగా యాప్‌ను తయారు చేసి ప్రజల నుంచి సమస్యలను ఆహ్వానించారు. సర్వేక్షణ్ పరీక్ష ముగియనుండడంతో ఇక సర్వే నివేదిక, పదిలోపు ర్యాంకు పైనే ఆశలు పెంచుకున్నారు. నిరంతరం కొనసాగేనా..? స్వచ్ఛ సర్వేక్షణ్–2019 కోసం నగరపాలక సంస్థ పారిశుధ్యంలో ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లింది. అయితే స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీ ఉన్నప్పుడు మాత్రమే అధికారులు ఈ విధంగా పనులు చేపట్టడం, ఆ తర్వాత మళ్లీ యధావిధిగా శానిటేషన్ పనులు వదిలేస్తుండడంతో నగరంలో చెత్త సమస్య ఎప్పటికీ తీరడం లేదు. స్వచ్ఛ సర్వేక్షణ్ పుణ్యమా అని నాలుగ ునెలలుగా నగరంలో చెత్త కనబడడం లేదు. అధికారుల నిరంతర పర్యవేక్షణతో శానిటేషన్ పనులు సక్రమంగా జరిగాయి. నైట్ స్వీపింగ్, డే స్వీపింగ్ల్లో ఎక్కడా చెత్త కనబడకుండా చర్యలు చేపట్టారు. ప్రజల్లో కూడా చైతన్యం వచ్చే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి చెత్తను రోడ్లపై వేయకుండా నియంత్రించారు. అయితే స్వచ్ఛత పరీక్ష గురువారంతో ముగియనుండడంతో శానిటేషన్ పనులు పోటీలో ఉన్నప్పటిలాగే నిర్వహిస్తారా? లేదా ఎప్పటిలాగే పరీక్ష ముగిసింది కదా అని చూసీచూడనట్లు వదిలేస్తారా..? అదే సందేహాలు ప్రజల్లో కలుగుతున్నాయి. అధికారులు ఏ మేరకు శానిటేషన్‌పై శ్రద్ధ వహిస్తారో వేచి చూడాల్సిందే. -
గ్రామాలను దత్తత తీసుకోండి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): స్వచ్ఛ భారత్‌లో భాగంగా జిల్లాలో అన్ని మండలాలు, గ్రామాల్లో వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం జరగాలంటే అధికారులు దత్తత తీసుకోవాలని కలెక్టర్ రోనాల్డ్‌రోస్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ హాల్లో స్వచ్ఛభారత్, హరితహారం, ఆసరా పింఛన్లు తదితర అంశాలపై ఎంపీడీఓలు, ఏపీఎంలతో శుక్రవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతు ఏపీఎం, ఈసీలు పది గ్రామాల చొప్పన దత్తత తీసుకువాలని సూచించారు. యాబై శాతం మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తయిన గ్రామాల్లో జనవరి 31వ తేదీ వరకు, 50 శాతం కన్నా తక్కువ పూర్తయిన గ్రామాలు మార్చి 31 వరకు ఓడీఎఫ్‌గా తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. అలాగే, ప్రతీ పాఠశాలలను కూడా సంక్రాంతి పండుగ వరకు స్వచ్ఛ విద్యాలయంగా ప్రకటించాలన్నారు. బిల్లులు చెల్లించకపోవడంపై... గ్రామాల్లో మరుగుదొడ్లు నిర్మాణానికి సంబంధించి బిల్లులు చెల్లించకపోవడంపై ఎంపీడీఓలపై కలెక్టర్ రొనాల్డ్‌రోస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల వారీగా మరుగుదొడ్ల నిర్మాణం, ప్రహరి గోడలు, ఇంకుడు గుంతల నిర్మాణ వివరాలపై ఆరా తీసిన ఆయన పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. ఎంపీడీఓలు, ఏపీఎంలు, ఈసీలు అందరూ కలిసి ప్రణాళికలు రూపొందించి çసమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసుకుని పనుల పురోగతిపై ప్రతీరోజూ నివేదికలు ఇవ్వాలన్నారు. ప్రతీ గ్రామం నుంచి మండలానికి.. అక్కడి నుంచి జిల్లా కేంద్రానికి నివేదికలు అందాలని సూచించారు. పాఠశాలల వారీగా విద్యార్థులతో మాట్లాడి మరుగుదొడ్లు లేని వారి ఇళ్లను గుర్తిస్తే నిర్మాణం సులువుగా చేపట్టవచ్చని తెలిపారు. ఇక ఈనెల 8, 9, 10వ తేదీల్లో స్వచ్ఛ గ్రహీ వర్క్‌షాపు నిర్వహించాలని, మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టే మేస్త్రీలకు శిక్షణ ఇప్పించడంతో పాటు ప్రతీ మండలం నుంచి ఐదుగురు మహిళలను గుర్తించి అవగాహన కల్పించేందుకు నియమించాలని సూచించారు. మండలాలకు సామగ్రి రెండో విడత పంచాయతీ ఎన్నికల జరిగే మండలాలకు సామగ్రి, బ్యాలెట్ పేపర్లు, బాక్సులు పంపించాలని కలెక్టర్ సూచించారు. ఇప్పటికే అధికారులకు శిక్షణ పూర్తయిందని చెప్పారు.అలాగే, గ్రామాల్లో నర్సరీల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్డీఓ క్రాంతి, డీఎఫ్ఓ గంగారెడ్డి, డీపీఓ వెంకటేశ్వర్లు, డీఈఓ సోమిరెడ్డి, డీడబ్ల్యూఓ శంకరాచారితో పాటు బోజప్ప, శృతి, పవన్, రాణి తదితరులు పాల్గొన్నారు. -
స్వచ్ఛత సమరం
కరీంనగర్‌కార్పొరేషన్: పరిశుభ్ర భారతావని లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో మెరుగైన ర్యాంకు సాధించేందుకు కరీంనగర్ నగరపాలక సంస్థ స్వచ్ఛత సమరం చేపట్టింది. దేశ వ్యాప్తంగా స్వచ్ఛతపై జరుగుతున్న పోటీలో పదిలోపు ర్యాంకు సాధించడమే లక్ష్యంగా మున్సిపల్ అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు. పరిశుభ్ర నగరాలను గుర్తించేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, స్వచ్ఛభారత్ మిషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛ సర్వేక్షణ్–2019 పేరుతో పారిశుధ్యంపై సర్వే చేపట్టి ర్యాంకులు నిర్వహించనుంది. కేంద్ర బృందం సర్వేలో ముఖ్యంగా వ్యక్తిగత మరుగుదొడ్లు, తడి, పొడి చెత్త వేరుచేయడం, జనావాసాల్లో చెత్త వేయడం, పబ్లిక్ టాయిలెట్లు, డంప్‌యార్డులు, నగర పరిశుభ్రతపై దృష్టిపెట్టే అవకాశం ఉంది. నగరంలో పారిశుధ్య నిర్వహణ, స్వచ్ఛభారత్ అమలు సక్రమంగా ఉంటేనే మంచి ర్యాంకు సాధించే అవకాశం ఉంది. కరీంనగర్‌కార్పొరేషన్: 2015వ సంవత్సరంలో క్లీన్‌సిటీగా గుర్తించబడ్డ కరీంనగర్ నగరపాలక సంస్థ 2016లో 259వ ర్యాంకు, 2017లో 201వ ర్యాంకుతో సరిపెట్టుకుంది. అయితే.. 2018లో 4,041 నగరాలు స్వచ్ఛత ర్యాంకు కోసం పోటీపడగా 73వ ర్యాంకు సాధించి దేశ వ్యాప్తంగా కరీంనగర్ ఖ్యాతిని చాటిచెప్పింది. ఈ ఏడాది సైతం పోటీ తీవ్రంగా పెరిగే అవకాశం ఉంది. నగర పాలక సంస్థ లక్ష్యంగా పెట్టుకున్న 10లోపు ర్యాంకు సాధించాలంటే తీవ్రంగా శ్రమించాలనే ఉద్దేశంతోనే ముందుకు కదులుతున్నారు. అయితే.. వాడవాడలా ఇంటింటికీ స్వచ్ఛతపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. మహిళా సంఘాలు, పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, హోటళ్లు, బేకరీలు, ఇతర వ్యాపారులకు స్వచ్ఛత ఆవశ్యకతను తెలుపుతూ సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పిస్తే మంచి ఫలితం సాధించే అవకాశాలు ఉన్నాయి. పారిశుధ్యం మెరుగుపడాలి.. నగరంలోని 50 డివిజన్లలో 62 వేల నివాస గృహాలుండగా, సుమారు 72 వేల కుటుంబాలు నివసిస్తున్నాయి. ప్రతిరోజూ సుమారు 200 టన్నుల చెత్త వెలువడుతోంది. అయితే.. చెత్తసేకరణ నుంచి డంపింగ్ వరకు అన్నీ అవాంతరాలే ఏర్పడుతున్నాయి. స్వచ్ఛభారత్ ఇచ్చిన మార్కులు సాధించాలంటే తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరణ జరగాల్సి ఉంది. మురుగు కాలువల శుభ్రత రెగ్యులర్‌గా లేకపోవడం, పూడికను వెంటవెంటనే తొలగించకపోవడం, డంపింగ్ యార్డులో చెత్త పేరుకుపోవడం వంటి అంశాలు పోటీలో ఇబ్బంది పెట్టనున్నాయి. దీనికితోడు వీధుల్లో చెత్త ఎక్కడపడితే అక్కడ వేస్తుండడంతో అపరిశుభ్ర వాతావరణం నెలకొంటోంది. ఇదంతా మార్కులపై ప్రభావం చూపనుంది. ప్రజల భాగస్వామ్యంతోనే.. నగరపాలక ఆధ్వర్యంలో అమలు చేస్తున్న విధానాలపై నగరవాసులు అవగాహన పెంచుకుంటే పరిశుభ్రత కష్టమేమీ కాదు. ఇంట్లోని చెత్తను వేర్వేరు డబ్బాల్లో నిల్వ చేసి పారిశుధ్య కార్మికులకు అప్పగించడం, తడి చెత్తను మురుగుకాల్వల్లో పడేయకుండా ఉంటే చాలు. దీంతో పందుల సంచారం, దుర్వాసన పూర్తిగా దూరమవుతుంది. అప్పుడే స్వచ్ఛ నగరంగా రూపుదిద్దుకుంటుంది. వంద రోజుల ప్రణాళిక.. కరీంనగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్ది స్వచ్ఛ సర్వేక్షణ్–2019లో మంచి ర్యాంకు సాధించాలంటే గతంలో కంటే ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్‌లో పరిగణలోకి తీసుకునే తడి, పొడి చెత్త వేరు చేయడం, డీఆర్‌సీసీల మెయింటెనెన్స్, ఓడిఎఫ్, పబ్లిక్, కమ్యూనిటీ, షీ టాయిలెట్స్ శుద్ధి, తడి–పొడి చెత్తపై అవగాహన, శానిటేషన్ వాహనాల మెయింటెనెన్స్, వర్మికంపోస్టుల ఏర్పాటు, వాహనాల మెయింటెనెన్స్, డంప్‌యార్డు నిర్వహణ తదితర అంశాలపై దృష్టి సారించారు. వంద రోజుల్లో వీటన్నింటిపై పట్టు సాధిస్తేనే స్వచ్ఛసర్వేక్షణ్‌లో మంచి ర్యాంకు సాధించే అవకాశం ఉంది. 10 లోపు ర్యాంకే లక్ష్యం.. కరీంనగర్ నగరపాలక సంస్థ గతంలో జరిగిన స్వచ్ఛ సర్వేక్షణ్ చాలెంజ్‌లో మెరుగైన ర్యాంకులు సాధించింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని రాబోయే 2019లో 10లోపు ర్యాంకు సాధించేందుకు ఏ విధంగా ముందుకు పోవాలనే అంశాలపై కసరత్తు చేస్తున్నాం. ఫలితాన్ని రాబట్టేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. – రవీందర్‌సింగ్, మేయర్ -
‘స్వచ్ఛ’ మార్పు వచ్చేనా..?
ఆదిలాబాద్‌అర్బన్: గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త పథకాలతో ముందడుగు వేస్తున్నాయి. పల్లెలను పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా గ్రామానికో ‘స్వచ్ఛ గ్రహీ’ని నియమించాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. సదరు అభ్యర్థి ఇంట్లో మరుగుదొడ్డి ఉంటేనే స్వచ్ఛగ్రహీ ఉద్యోగానికి ఎంపిక చేయాలనే నిబంధనను తీసుకొచ్చింది. ఎంపికైన వారికి ఐదు రోజులపాటు శిక్షణ ఇచ్చి, సంబంధిత కిట్‌ను అందజేస్తారు. కాగా, జిల్లాలో ఇటీవల కొత్తగా ఏర్పాటైన గ్రామ పంచాయతీలతోపాటు అన్ని పంచాయతీల్లో ఆగస్టు 15 నుంచి స్వచ్ఛతకు పెట్టపీట వేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో స్వచ్ఛగ్రహీల నియమకాలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉండగా, ప్రభుత్వం త్వరలో గ్రామ పంచాయతీ కార్యదర్శుల పోస్టులను భర్తీ చేసేందుకు సన్నహాలు చేస్తోంది. ఈ పోస్టులకు ఎక్కువగా గ్రామీణ అభ్యర్థులు పోటీ పడుతారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి ఇంటిలో వ్యక్తిగత మరుగుదొడ్డి ఉంటేనే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆ ఉద్యోగానికి ఎంపిక చేసే అవకాశాలు లేకపోలేదని పలువురు చర్చించుకుంటున్నారు. జిల్లాలో ఇలా.. జిల్లాలో 2017లో నిర్వహించిన సర్వే ప్రకారం 1,08,758 నివాస గృహాలు ఉన్నాయి. ఇందులో 39,092 నివాస గృహాలు వ్యక్తిగత మరుగుదొడ్లు కలిగి ఉన్నట్లు తేలింది. మిగతా 69,666 నివాస గృహాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు లేవని తేల్చారు. దీని ప్రకారం జిల్లాలో 69,666 వ్యక్తిగత మరుగుదొడ్లను మంజూరు చేశారు. ఇందుకు రూ.40.78 కోట్లు అవసరమని అంచనా వేశారు. అంటే ఒక్కటి కూడా మిగలకుండా జిల్లాలోని అన్ని నివాస గృహాలకు వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరయ్యాయి. ఇది జరిగి ఏడాదిన్నర గడుస్తున్నా.. మంజూరైన మరుగుదొడ్లలో సగం కూడా పూర్తి కాలేదు. కేవలం 20,473 మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి చేసి చేతులు దులుపుకున్నారు. ఇంకా 47,318 నివాస గృహాల్లో మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉన్నా.. ప్రభుత్వం నుంచి స్వచ్ఛతకు సరిపడా నిధులు రాక నిర్మాణాలు వెనుకబడిపోయాయి. ‘బహిరంగ మలవిసర్జన రహిత’(ఓడీఎఫ్) జిల్లాగా తీర్చి దిద్దేందుకు రూ.40.78 కోట్లు అవసరం ఉందని అంచనా వేయగా, ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు రూ.16.20 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. మిగతా రూ.24.58 కోట్లు విడుదల చేయక పెండింగ్‌లో ఉన్నాయి. ఇదిలా ఉండగా, 243 పాత గ్రామ పంచాయతీల పరిధిలోని 589 గ్రామాలను బహిరంగ మలవిసర్జన రహిత(ఓడీఎఫ్) గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు గత రెండేళ్లుగా ప్రయత్నిస్తున్నారు. గ్రామాలను ఓడీఎఫ్‌గా చేసిన ఎంపీడీవోలు, సర్పంచ్‌లు, ఇతర అధికారులకు అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున అవార్డులు, నగదు బహుమతులు అందజేస్తూ వస్తున్నా.. మార్పు కన్పించడం లేదు. జిల్లాలోని 9 గ్రామ పంచాయతీల పరిధిలో గల 18 గ్రామాలు మాత్రమే ఓడీఎఫ్ గ్రామాలుగా ప్రకటించారు. మిగతా 234 గ్రామ పంచాయతీల పరిధిలోని 448 గ్రామాలను ఓడీఎఫ్‌గా తీర్చిదిద్దాల్సి ఉంది. కాగా, 78 పంచాయతీల పరిధిలోని 123 ఓడీఎఫ్ గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ప్రొగ్రెస్‌లో ఉన్నాయి. గ్రామానికో ‘స్వచ్ఛగ్రహీ’ పంచాయతీల్లో ప్రత్యేక పాలన మొదలైనప్పటికీ నుంచి ప్రభుత్వం పరిశుభ్రతపై దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా పరిశుభ్రంగా, పచ్చదనంగా ఉంచేందుకు మూడు నెలల కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని ఇటీవల అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ఇందుకు గ్రామానికో స్వచ్ఛగ్రహీని నియమించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించడంతో ప్రాధాన్యతను సంతరించకుంది. గ్రామాలకు ఎంపికైన స్వచ్ఛగ్రహీలకు ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. ఓడీఎఫ్ గ్రామంగా ప్రకటించిన తర్వాత గ్రామస్తులు మలవిసర్జనకు ఆరుబయటకు వెళ్తున్నదీ.. లేనిదీ.. ఇంటింటికి వెళ్లి పరిశీలించినందుకు ఒక్కో ఇంటికి రూ.25 చొప్పున స్వచ్ఛగ్రహీలకు అందజేస్తారు. ఈ లెక్కన మరుగుదొడ్డికి మరమ్మతులు చేసుకునేలా చైతన్యపరిస్తే, మరుగుదొడ్డి విస్తరణ పనులు చేయించగలిగితే ఒక్కోదానికి రూ.25 చొప్పున, గోబర్‌గ్యాస్ వంటి ప్లాంట్లపై ప్రజలకు అవగాహన కల్పిస్తే రూ.200 చొప్పున ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందజేయనుంది. ఇవే కాకుండా పాఠశాలలు, అంగన్వాడీలు, పీహెచ్‌సీల్లో పరిశుభ్రంగా ఉండేలా చూడడం, ఓడీఎఫ్ రోజు అమలు చేయడం, అంకితభావంతో పని చేసే వారికి సత్కరాలు, అవార్డులు ఇవ్వడంతోపాటు స్వచ్ఛగ్రహీల ఉద్యోగాలు శాశ్వతం కాదనే విషయంపై అవగాహన కల్పించాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించడం ఇక్కడ గమనించదగ్గ విషయం. -
వందశాతం సాధించాలి
జహీరాబాద్ : మరుగుదొడ్ల నిర్మాణంలో లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు సూచించారు. శనివారం సాయంత్రం స్థానిక షెట్కార్ ఫంక్షన్ హాల్లో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో ఇతర జిల్లాలతో పోల్చితే మన జిల్లా వెనుకబడి ఉందన్నారు. ప్రతి ఒక్కరూ చొరవ తీసుకుని లక్ష్యాలను సాధించేలా శ్రద్ధ చూపాలన్నారు. ప్రతి కుటుంబం వ్యక్తిగత మరుగుదొడ్డిని నిర్మించుకునేలా చూడాలన్నారు. మరుగుదొడ్లు లేని మహిళలు బహిర్భూమికి వెళ్లాలన్నా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారిని చైతన్య పర్చి మరుగుదొడ్లను నిర్మించుకునేలా చూడాలని అప్పుడే ఆశించిన లక్ష్యం నెరవేరుతుందన్నారు. మరుగుదొడ్లకు సంబంధించి నిర్మించుకున్న వారికి వెంటనే బిల్లులను చెల్లించడం జరుగుతుందన్నారు. ఇందుకు అవసరమైన నిధులు ఉన్నాయన్నారు. లక్ష్యాన్ని పూర్తి చేయించడంకోసం సర్పంచ్‌లు, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలో ఇతర మండలాలతో పోల్చితే జహీరాబాద్ మండలం మరుగుదొడ్ల నిర్మాణంలో వెనుకబడి ఉందన్నారు. వందశాతం మరుగుదొడ్లను సాధించి జిల్లాను అగ్రగామిగా నిలిపేలా చూడాలన్నారు. ప్రజా ప్రతినిధులు గ్రామాలను దత్తత తీసుకుని లక్ష్యం పూర్తయ్యేలా చూడాలని కోరారు. ఇందుకు సినీ నిర్మాత ఎం.శివకుమార్ ముందుకు వచ్చి ఈదులపల్లి, మేదపల్లి గ్రామాలను దత్తత తీసుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎం.డీ.ఫరీదుద్దీన్, ఆర్డీఓ అబ్దుల్ హమీద్, డీఆర్డీఓ ఎం.వెంకటేశ్వర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ డి.లక్ష్మారెడ్డి, ఆత్మ చైర్మన్ పి.రామకృష్ణారెడ్డి, ఎంపీపీలు చిరంజీవి ప్రసాద్, అనిత, పీఏసీఎస్ చైర్మన్ పి.సంజీవరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ఎం.శివకుమార్, కె.మాణిక్‌రావు, ఎంపీడీఓలు రాములు, లక్ష్మీబాయి, ఎల్లయ్య, ఈఓపీఆర్డీలు శ్రీనివాస్‌రెడ్డి, సుమతి, సాయిబాబా, యాదయ్య, మహిళా సంఘాల సభ్యులు, ఈజీఎస్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. గ్రామాలను దత్తత తీసుకోవాలి : ఎమ్మెల్సీ ఫరీదుద్ధీన్ వందశాతం మరుగుదొడ్ల లక్ష్యాన్ని అధిగమించేందుకు ప్రజా ప్రతినిధులు గ్రామాలను దత్తత తీసుకోవాలని ఎమ్మెల్సీ ఎం.డీ.ఫరీదుద్ధీన్ కోరారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వీలుగా సర్పంచ్‌లు, వార్డు సభ్యులు కూడా పాటు పడాలన్నారు. అధికారులతో ఎప్పటికప్పుడు రివ్యూ సమావేశాలను నిర్వహించినట్లయితే లక్ష్యాన్ని నిర్ణీత సమయంలో అందుకోవచ్చన్నారు. అభివృద్ధి పనులపై సమీక్ష... జహీరాబాద్ : జహీరాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. శనివారం ఎంపీడీఓ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎం.డీ.ఫరీదుద్దీన్‌తో కలిసి మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం, విద్యుత్ శాఖ పనుల ప్రగతిని గురించి ఆయా శాఖల అధికారులతో సమావేశమై చర్చించారు. సమావేశంలో ఎమ్మెల్సీ ఎం.డీ.ఫరీదుద్ధీన్, ఆర్డీఓ అబ్దుల్ హమీద్, మార్కెట్ చైర్మన్ డి.లక్ష్మారెడ్డి, ఆత్మ చైర్మన్ పి.రామకృష్ణారెడ్డి, ఎంపీపీ చిరంజీవి ప్రసాద్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. -
20 రాష్ట్రాల్లో స్వచ్ఛభారత్
రాజాపేట : దేశంలోని 20 రాష్ట్రాల్లో స్వచ్ఛభారత్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు శ్రీ సత్యసాయి సేవాసమితి రంగారెడ్డి జిల్లా, ౖహైదరాబాద్ ఆరోగ్యశిబిరం ఇన్చార్జి ఎస్.సేతురామన్ తెలిపారు. మండలంలోని నెమిల గ్రామంలో శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక శివాలయం ఆవరణలో పిచ్చిమొక్కలను తొలగించారు. ఈ సందర్భంగా సేతురామన్ మాట్లాడుతూ అక్టోబర్ 2 గాంధీ జయంతి పురస్కరించుకుని 20 శ్రీ సత్యసాయి బాబా అవతార్ దినోత్సవం వరకు స్వచ్చ్సే దివస్ తక్ పేరుతో భారత దేశంలోని 20 రాష్ట్రాల్లో స్వచ్ఛభారత్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బూడిద కవిత, ఎంపీపీ పులి సత్యనారాయణ, సమితి కన్వీనర్ కృష్ణమూర్తి, సేవాదల్ సభ్యులు నారాయణ్, రామచంద్రం, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.