సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ రొనాల్డ్‌రోస్
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): స్వచ్ఛ భారత్‌లో భాగంగా జిల్లాలో అన్ని మండలాలు, గ్రామాల్లో వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం జరగాలంటే అధికారులు దత్తత తీసుకోవాలని కలెక్టర్ రోనాల్డ్‌రోస్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ హాల్‌లో స్వచ్ఛభారత్, హరితహారం, ఆసరా పింఛన్లు తదితర అంశాలపై ఎంపీడీఓలు, ఏపీఎంలతో శుక్రవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతు ఏపీఎం, ఈసీలు పది గ్రామాల చొప్పన దత్తత తీసుకువాలని సూచించారు. యాబై శాతం మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తయిన గ్రామాల్లో జనవరి 31వ తేదీ వరకు, 50 శాతం కన్నా తక్కువ పూర్తయిన గ్రామాలు మార్చి 31 వరకు ఓడీఎఫ్‌గా తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. అలాగే, ప్రతీ పాఠశాలలను కూడా సంక్రాంతి పండుగ వరకు స్వచ్ఛ విద్యాలయంగా ప్రకటించాలన్నారు.
బిల్లులు చెల్లించకపోవడంపై...
గ్రామాల్లో మరుగుదొడ్లు నిర్మాణానికి సంబంధించి బిల్లులు చెల్లించకపోవడంపై ఎంపీడీఓలపై కలెక్టర్ రొనాల్డ్‌రోస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల వారీగా మరుగుదొడ్ల నిర్మాణం, ప్రహరి గోడలు, ఇంకుడు గుంతల నిర్మాణ వివరాలపై ఆరా తీసిన ఆయన పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. ఎంపీడీఓలు, ఏపీఎంలు, ఈసీలు అందరూ కలిసి ప్రణాళికలు రూపొందించి çసమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసుకుని పనుల పురోగతిపై ప్రతీరోజూ నివేదికలు ఇవ్వాలన్నారు. ప్రతీ గ్రామం నుంచి మండలానికి.. అక్కడి నుంచి జిల్లా కేంద్రానికి నివేదికలు అందాలని సూచించారు. పాఠశాలల వారీగా విద్యార్థులతో మాట్లాడి మరుగుదొడ్లు లేని వారి ఇళ్లను గుర్తిస్తే నిర్మాణం సులువుగా చేపట్టవచ్చని తెలిపారు. ఇక ఈనెల 8, 9, 10వ తేదీల్లో స్వచ్ఛ గ్రహీ వర్క్‌షాపు నిర్వహించాలని, మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టే మేస్త్రీలకు శిక్షణ ఇప్పించడంతో పాటు ప్రతీ మండలం నుంచి ఐదుగురు మహిళలను గుర్తించి అవగాహన కల్పించేందుకు నియమించాలని సూచించారు.
మండలాలకు సామగ్రి
రెండో విడత పంచాయతీ ఎన్నికల జరిగే మండలాలకు సామగ్రి, బ్యాలెట్ పేపర్లు, బాక్సులు పంపించాలని కలెక్టర్ సూచించారు. ఇప్పటికే అధికారులకు శిక్షణ పూర్తయిందని చెప్పారు.అలాగే, గ్రామాల్లో నర్సరీల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్డీఓ క్రాంతి, డీఎఫ్‌ఓ గంగారెడ్డి, డీపీఓ వెంకటేశ్వర్లు, డీఈఓ సోమిరెడ్డి, డీడబ్ల్యూఓ శంకరాచారితో పాటు బోజప్ప, శృతి, పవన్, రాణి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment