సాక్షి, మంచిర్యాల: స్వచ్ఛభారత్‌లో భాగంగా మంచిర్యాలను స్వచ్ఛజిల్లాగా ప్రకటింపచేసేదిశగా అధికార యంత్రాంగం వేగంగా అడుగులు వేస్తోంది. వందశాతం వ్య క్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసి, ఓడీఎఫ్ (ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ) జిల్లాగా గుర్తింపు పొందేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. వందశాతా నికి ఏడు వేలు మాత్రమే వెనుకబడి ఉండడంతో వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టింది. మూడు రోజుల్లో వందశాతం పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ ఆదేశించగా.. మరికొద్ది రోజులు సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది.
గత ప్రభుత్వ హయాంలోనే నరేంద్రమోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపట్టడం తెలిసిందే. స్వచ్ఛజిల్లాలుగా ప్రకటింపబడిన జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం పాయింట్లు కేటాయించడం.. అదనపు నిధులు మంజూరు చేస్తుండడంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాలు కూడా స్వచ్ఛ జిల్లాల కోసం పోటీపడుతున్నాయి. గ్రామ, పట్టణాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం వందశాతం పూర్తి చేసిన జిల్లాను బహిరంగ మల విసర్జన రహిత (ఓడీఎఫ్) జిల్లాగా ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఓడీఎఫ్‌గా ప్రకటించిన జిల్లాకు కేంద్ర ప్రభుత్వంతో గుర్తింపు లభించడంతోపాటు, ప్రత్యేకంగా నిధులు కూడా విడుదలవుతాయి. ఇప్పటికే రాష్ట్రంలోని పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల, సిద్దిపేట తదితర జిల్లాలు అగ్రస్థానంలో ఉన్నాయి.
ఆ జిల్లాలు స్వచ్ఛప్లస్ వైపు పయనిస్తున్నాయి. మంచిర్యాల జిల్లా ఇప్పటివరకు స్వచ్ఛజిల్లాగా ప్రకటింపబడలేదు. ఇప్పటికే ఆలస్యం కావడంతో అధికార యంత్రాంగం తాజాగా ఆ దిశగా దృష్టి సారించింది. అందులో భాగంగా జిల్లాలోని అన్ని పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రభుత్వ శాఖలను సమన్వయపరుస్తోంది. ఈనెల 10న జిల్లా కలెక్టర్ భారతి హోళీకేరి అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి.. మూడు రోజుల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం వందశాతం పూర్తి కావాలని ఆదేశాలు జారీ చేశారు. అధికారులు ఆ దిశగా ప్రయత్నాలను వేగవంతం చేసినా.. వందశాతం పూర్తయ్యేందుకు మరికొద్ది రోజులు పట్టే అవకాశం కనిపిస్తోంది.
జిల్లాకు మంజూరు 50 వేలు
స్వచ్ఛభారత్‌లో భాగంగా ప్రతి ఇంటికీ వ్యక్తిగత మరుగుదొడ్డి ఉండాలనేది ప్రభుత్వ నిబంధన. ఎక్కడా, ఎవరూ బహిరంగ మల విసర్జనకు వెళ్లే పరిస్థితి ఉండరాదని, స్వచ్ఛతను పాటించాలని ప్రభుత్వ ఆదేశాలు. ఈ క్రమంలోనే వ్యక్తిగత మరుగుదొడ్లు లేని ఇండ్లను గుర్తించిన ప్రభుత్వం.. జిల్లాకు 50,090 వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేసింది. ఇందులో ఇప్పటివరకు 41వేల నిర్మాణం పూర్తయింది. ఇతరత్రా కారణాలతో 1504 తొలగించబడ్డాయి. మిగిలిన మరుగుదొడ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. లక్సెట్టిపేటలో 18, మందమర్రిలో మూడు నిర్మాణాలు ఇంకా మొదలు కాలేదు. మంచిర్యాలలో మాత్రమే మంజూరైన నిర్మాణాలు పూర్తయ్యాయి.
పూర్తి చేసేందుకు పాట్లు
వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం నానా పాట్లు పడుతోంది. ఒక్కో ఐఎస్‌ఎల్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.12 వేలు చెల్లిస్తోంది. ఇందులో రూ.6 వేల విలువైన మెటీరియల్, మరో రూ.6 వేలు నగదును లబ్ధిదారుడికి అందజేస్తోంది. అయితే చాలా గ్రామాల్లో ఇళ్ల యజమానులు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి మొగ్గుచూపకపోవడం అధికారులకు ఇబ్బందిగా మారింది. నిర్మాణానికి రూ.12 వేలు సరిపోవని కొంతమంది, ఇతరత్రా కారణాలతో మరికొంతమంది ముందుకు రావడం లేదు.
దీంతో తప్పనిసరిగా ఒత్తిడి చేసైనా ఐఎస్‌ఎల్ నిర్మాణాలు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. జైపూర్ మండలం వేలాల, పౌనూరు తదితర గ్రామాల్లో ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిపివేసి కూడా ఒత్తిడి తెచ్చిన సందర్భాలున్నాయి. ప్రభుత్వ పథకాలు లబ్ధిపొందాలంటే వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాల్సిందేనని అధికారులు హెచ్చరిస్తుండడంతో కాస్త సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. మూడు రోజుల్లో మిగిలిన ఐఎస్‌ఎల్ నిర్మాణాలు పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ ఆదేశించినా.. ప్రస్తుత పరిస్థితి చూస్తే గడువులోగా పూర్తి కావడం కష్టంగానే ఉంది. ఏదేమైనా త్వరగా వందశాతం లక్ష్యం పూర్తి చేసి, ఓడీఎఫ్ జిల్లాగా గుర్తింపు పొందే తరుణం ఎంతో దూరంలో లేదు.
Comments
Please login to add a commentAdd a comment