Swatch Bharat
-
నీతి ఆయోగ్ సీఈవోగా పరమేశ్వరన్ అయ్యర్ నియామకం!
నీతి ఆయోగ్ సీఈవోగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పరమేశ్వరన్ అయ్యర్ నియమితులయ్యారు. ఆయన నియమాకాన్ని కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం అధికారికంగా ప్రకటించింది. పరమేశ్వరన్ అయ్యర్ రెండేళ్ల పాటు నీతి ఆయోగం సీఈవోగా కొనసాగనున్నారు. 1981 ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన పరమేశ్వరన్ అయ్యర్ పారిశుద్ధ్య నిపుణుడిగా గుర్తింపు పొందారు. 2009లో ఐఏఎస్ నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఆయన.. ఐక్యరాజ్యసమితిలో సీనియర్ గ్రామీణ నీటి పారుదల, పారిశుద్ధ్య నిపుణుడిగా పని చేశారు. ఆ తర్వాత 2016లో భారత్‌కు తిరిగి వచ్చారు. వెంటనే డ్రింకింగ్ అండ్ శానిటేషన్ విభాగానికి అధిపతిగా కేంద్రం నియమించింది. అంతకు ముందు 2014లో కేంద్రం ప్రవేశ పెట్టిన స్వచ్ఛ భారత్ మిషన్‌కు నాయకత్వం వహించారు. -
అధికారులను అభినందించిన సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ స్వచ్ఛభారత్ మిషన్ అర్బన్‌లో భాగంగా అందించే వాటర్ ప్లస్ సర్టిఫికేషన్‌కు ఏపీ నుంచి మూడు నగరాలకు చోటు దక్కడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధికారులను అభినందించారు. దేశవ్యాప్తంగా 9 నగరాలు మాత్రమే వాటర్ ప్లస్ సర్టిఫికెట్ సాధించగా వాటిలో 3 నగరాలు ఏపీ నుంచి అర్హత సాధించాయని సీఎం జగన్‌కు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వివరించారు. (చదవండి: ఆ నలుగురి మరణం ‘పోలీస్ కుటుంబానికి తీరని లోటు’) గ్రేటర్ విశాఖ, విజయవాడ, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లు వాటర్ ప్లస్ సర్టిఫికెట్ పొందాయని తెలిపారు. జగనన్న కాలనీలు, మౌలిక వసతులపై సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో వాటర్ ప్లస్ అంశాన్ని మంత్రి బొత్స తెలిపారు. ఇళ్లు, వాణిజ్య సముదాయాల నుంచి డ్రైన్లు, నాలాలతో పాటు ఇతర వ్యర్ధ జలాల శుద్ధి, నిర్వహణ, పునర్వినియోగాన్ని నిర్దేశిత ప్రమాణాల మేరకు సమర్ధవంతంగా నిర్వహించే నగరాలకు వాటర్ ప్లస్ సర్టిఫికెట్ అందిస్తున్న విషయం తెలిసిందే. అధికారులను అభినందించిన అనంతరం సీఎం ఉత్తమ తాగునీటి సరఫరా విధానాలు, మురుగునీటి నిర్వహణపై మార్గదర్శకాలను కలెక్టర్లు, కమిషనర్లకు పంపించాలని ఆదేశించారు. అన్ని మున్సిపాల్టీల్లో అవి అమలయ్యేలా చూడాలని చెప్పారు. పట్టణాలు ఉన్నత ప్రమాణాలు దిశగా అడుగులు వేయాలని తెలిపారు. ప్రతి నగరం, మున్సిపాల్టీ కూడా సర్టిఫికెట్ పొందిన నగరాల స్థాయిని చేరుకోవాలని అభిలషించారు. చదవండి: ‘హీరోయిన్లా జట్టు విరబూసుకుని రావొద్దు’ ‘సెల్ఫీలు దిగొద్దు’) సమావేశంలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, గృహ నిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్, గృహ నిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, టిడ్కో ఎండీ శ్రీధర్, గృహ నిర్మాణశాఖ కార్యదర్శి రాహుల్ పాండే, ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ నారాయణ భరత్ గుప్తా ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
అమ్మమ్మ లాంటి ప్రభుత్వం ఉండాలి
ఒడిశా: తండ్రి చనిపోతాడు. తల్లి పిల్లల్ని పెంచి పెద్ద చేస్తుంది. వాళ్లు ఐ.ఏ.ఎస్.లు, ఐ.పి.ఎస్.లు అవుతారు. (లేదా) తల్లి చనిపోతుంది. తండ్రి పిల్లల్ని వదిలేసి వెళ్లిపోతాడు. వాళ్లను అమ్మమ్మ చేరదీస్తుంది. చాలావరకు ఇలాగే జరుగుతుంది. తండ్రికి పిల్లలెందుకు పట్టరో తల్లిని తీసుకెళ్లిన ఆ దేవుడికే తెలియాలి. మూడేళ్ల క్రితం తల్లి చనిపోయి, తండ్రి వదిలేసి పోతే విమలమ్మే ఇద్దరు మనవరాళ్లను (8 ఏళ్లు, 4 ఏళ్లు) మనవడిని (6 ఏళ్లు) సాకుతోంది. ఏ ప్రభుత్వ రికార్డులలో లేని ఈ కుటుంబం ఒడిశాలోని అంగుల్ జిల్లా, కిషోర్ నగర్ తాలూకా, బైసాన గ్రామంలో ఉంది. మొన్నటి వరకు మట్టి గుడిసెలో ఉండేవారు. వర్షాలకు అది మెత్తబడి, కూలిపోవడంతో గ్రామ శివారులో కొత్తగా కట్టిన స్వచ్ఛ భారత్ మరుగుదొడ్డిలో తల దాచుకుంటున్నారు. తలే దాచుకుంటున్నారు. చదవండి: (ఈ చిన్నారులకు దిక్కెవరూ...! ) వంట, స్నానాలు ఆరు బయట. ఆ నలుగురే ఒకరికొకరు నా అన్న వాళ్లు. పిల్లల్ని ఇంట్లో వదిలేసి ఏ రోజుకారోజు పని వెతుక్కోడానికి వెళ్లొస్తుంటుంది విమలమ్మ. వయసు మీద పడి ఇప్పుడు ఏ పనీ చేయలేకపోతోంది. ఆ కష్టాలను ఊహించుకోవలసిందే. పై నుంచి తల్లి తన తల్లిని, బిడ్డల్ని చూసిందో ఏమో, ఆమే పంపినట్లుగా ఒక సామాజిక కార్యకర్త వాళ్లను చూశాడు. పంచాయితీ ఆఫీసులో తాత్కాలికంగా గూడు ఏర్పాటు చేయించాడు. ఆ నలుగురు పొట్టల్ని నింపడానికి ప్రభుత్వం దగ్గర బియ్యం, పప్పులు ఉప్పులు ఉన్నాయి. ఆమెకు పింఛను ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయి. పిల్లల్ని చేర్చడానికి బడులు ఉన్నాయి. నివాసం ఉంచేందుకు షెల్టర్లు ఉన్నాయి. ప్రభుత్వం దగ్గర ఇన్ని ఉన్నా, తీసుకోడానికి వీళ్ల దగ్గర పౌరులుగా ఏ గుర్తింపూ లేదు. కనీసం ఆధార్ కార్డు లేదు. అవన్నీ వచ్చేవరకు పంచాయితీ కార్యాలయం లో ఉండేందుకైతే అనుమతి వచ్చింది. అక్కడికే సంతోషంగా ఉంది విమలమ్మ. విమలా ప్రధాన్ పూర్తి పేరు. పిల్లలకు ఇవేమీ తెలియదు. తల్లి లేకపోవడం పేదరికం. అమ్మమ్మ దగ్గర ఉండటం రాజరికం. పేదలందరికీ అమ్మమ్మ లాంటి ప్రభుత్వం ఉండాలి. వారిని ప్రభుత్వం దగ్గరకు చేర్చేందుకు అమ్మ లాంటి యాక్టివిస్ట్ లు ఉండాలి. -
జియో ఉద్యోగుల 'స్వచ్ఛ రైల్ అభియాన్'
సాక్షి, హైదరాబాద్: స్వచ్ఛ భారత్ స్ఫూర్తి తో రిలయన్స్ జియో ఉద్యోగులు శనివారం దేశవ్యాప్తంగా 'జియో స్వచ్ఛ రైల్ అభియాన్' కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 900 రైల్వే స్టేషన్లలో సుమారు 25,000 మందికి పైగా జియో ఉద్యోగులు వ్యర్ధ ప్లాస్టిక్ వస్తువులను సేకరించారు. తెలంగాణలో సుమారు 27 రైల్వే స్టేషన్లలో దాదాపు 1200 మందికి పైగా జియో ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సేకరించిన బాటిల్స్, ఆహార ప్యాకింగ్ కవర్లు, స్ట్రాలు, ప్లాస్టిక్ స్పూన్లు, క్యారీ బ్యాగ్‌లు వంటి వ్యర్ధ పాస్టిక్ ను జియో, సుశిక్షుతులైన ఏజెన్సీల సహాయంతో పర్యావరణహితంగా రీసైకిల్ చేయనుంది. -
మహిళలకు ప్రత్యేక టాయిలెట్లు
సాక్షి, వరంగల్(వరంగల్) : స్వచ్ఛభారత్‌లో భాగంగా మహిళల కోసం ప్రత్యేకంగా షీ టాయిలెట్లు ఏర్పాటు చేస్తున్నట్లు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు వెల్లడించారు. వరంగల్ నగరంలో శనివారం జపాన్ బృందం పర్యటించింది. గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయంలోని షీ టాయిలెట్ నిర్వహణ, విధానాన్ని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఆస్కీ) ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. అమ్మవారిపేటలోని మానవ మల, మూత్ర వ్యర్థాల ప్లాంట్‌ను సందర్శించారు. వ్యర్థాల శుద్దీకరణ, తదుపరి నీరు మొక్కలకు సద్వినియోగం, ఎరువు మొక్కల సంరక్షణకు వాడుతున్న తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. రెండు పద్దతుల్లో ఫీకల్ ఎరువుగా మార్చడం జరుగుతుందని ఆస్కీ డైరెక్టర్ శ్రీనివాసాచారి వెల్లడించారు. ఈ ప్రక్రియను జపాన్ ప్రతినిధి తన కెమెరాలో చిత్రాలను బంధించారు. అనంతరం హన్మకొండ ఫారెస్టు కార్యాలయానికి సమీపంలోని పబ్లిక్ టాయిలెట్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో ఆస్కీ ప్రతినిధులు రాజమోహన్‌రెడ్డి, ప్రొఫెసర్ సుబ్రమణ్యం, అవినాష్ తదితరులు పాల్గొన్నారు. మేయర్‌తో జపాన్ ప్రతినిధి భేటీ.. సంపూర్ణ పారిశుద్ధ్యంతో మెరుగైన సమాజం సిద్ధి్దస్తుందని వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు గ్రేటర్ వరంగల్ మేయర్ గుండా ప్రకాశ్‌రావు తెలిపారు. మేయర్‌ను తన క్యాంపు కార్యాలయంలో జపాన్ ప్రతినిధులు కజుషి హషిముటో, డాక్టర్ సీతారాం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మేయర్ జపాన్ ప్రతినిధులకు పారిశుద్ధ్య నిర్వహణ, ఆధునిక పద్దతులు, వ్యర్థ నీటి సమర్థ నిర్వహణ నగర పరిస్థితులకు అనుగుణంగా చేపడుతున్న వివరాలను వెల్లడించారు. బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ వారు ప్రపంచంలో 8 నగరాలను ఎంపిక చేయగా, అందులో వరంగల్ ఒకటని తెలిపారు. చెత్త, మానవవ్యర్థాలు, కలుషిత నీరు ఎక్కడ ఉత్పత్తి అవుతున్నాయో అక్కడే శుద్ధి చేసే ప్రక్రియ ఉపయోగకరమన్నారు. పెద్దపెద్ద హోటళ్లలో, వాణిజ్య సముదాయాల్లో అవలంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియకు సంబంధించిన పరికరాలను జపాన్ నుంచి దిగుమతి చేసి తెలంగాణలో తయారీ కేంద్రం ఏర్పాటుచేస్తే ప్రభుత్వ పరంగా, కార్పొరేషన్ పరంగా సహాయ సహకారాలు అందిస్తామని మేయర్ తెలిపారు. భేటీలో ఆస్కీ, ఎంహెచ్ఓ రాజారెడ్డి, డీఈ నరేందర్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్‌తో సమావేశం.. బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ సలహా, ఆస్కీ ఆహ్వానం మేరకు వ్యర్థ నీటి నిర్వహణ, వికేంద్రీకరణ, చెరువుల అభివృద్ధిపై సలహాలు ఇచ్చేందుకు జపాన్ ప్రతినిధి మెస్సర్స్ యబియో ఇంజినీరింగ్ కంపెనీ లిమిటెడ్, అంతర్జాతీయ శాఖ సలహాదారుడు కజుషి హషిమోటో, ఏషియాన్ డెవలప్మెంట్ బ్యాంక్, టోక్యో , జపాన్ నుంచి డాక్టర్ సీతారాం జికలెక్టర్ ప్రశాంత్ జీవన్ ప్రాటిల్ను కలిశారు. కలెక్టర్ పారిశుద్ధ్య మెరుగుకు చేపడుతున్న అంశాలను కలెక్టర్ వివరించారు.అమ్మవారిపేటలోని మల, మూత్ర వ్యర్థాల ప్లాంట్‌ను పరిశీలిస్తున్న జపాన్ ప్రతినిధి, ఆస్కీ సిబ్బంది. -
అధికారులూ.. కదలాలి మీరు..!
సాక్షి, మంచిర్యాల: స్వచ్ఛభారత్‌లో భాగంగా మంచిర్యాలను స్వచ్ఛజిల్లాగా ప్రకటింపచేసేదిశగా అధికార యంత్రాంగం వేగంగా అడుగులు వేస్తోంది. వందశాతం వ్య క్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసి, ఓడీఎఫ్ (ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ) జిల్లాగా గుర్తింపు పొందేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. వందశాతా నికి ఏడు వేలు మాత్రమే వెనుకబడి ఉండడంతో వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టింది. మూడు రోజుల్లో వందశాతం పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ ఆదేశించగా.. మరికొద్ది రోజులు సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలోనే నరేంద్రమోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపట్టడం తెలిసిందే. స్వచ్ఛజిల్లాలుగా ప్రకటింపబడిన జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం పాయింట్లు కేటాయించడం.. అదనపు నిధులు మంజూరు చేస్తుండడంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాలు కూడా స్వచ్ఛ జిల్లాల కోసం పోటీపడుతున్నాయి. గ్రామ, పట్టణాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం వందశాతం పూర్తి చేసిన జిల్లాను బహిరంగ మల విసర్జన రహిత (ఓడీఎఫ్) జిల్లాగా ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఓడీఎఫ్‌గా ప్రకటించిన జిల్లాకు కేంద్ర ప్రభుత్వంతో గుర్తింపు లభించడంతోపాటు, ప్రత్యేకంగా నిధులు కూడా విడుదలవుతాయి. ఇప్పటికే రాష్ట్రంలోని పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల, సిద్దిపేట తదితర జిల్లాలు అగ్రస్థానంలో ఉన్నాయి. ఆ జిల్లాలు స్వచ్ఛప్లస్ వైపు పయనిస్తున్నాయి. మంచిర్యాల జిల్లా ఇప్పటివరకు స్వచ్ఛజిల్లాగా ప్రకటింపబడలేదు. ఇప్పటికే ఆలస్యం కావడంతో అధికార యంత్రాంగం తాజాగా ఆ దిశగా దృష్టి సారించింది. అందులో భాగంగా జిల్లాలోని అన్ని పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రభుత్వ శాఖలను సమన్వయపరుస్తోంది. ఈనెల 10న జిల్లా కలెక్టర్ భారతి హోళీకేరి అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి.. మూడు రోజుల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం వందశాతం పూర్తి కావాలని ఆదేశాలు జారీ చేశారు. అధికారులు ఆ దిశగా ప్రయత్నాలను వేగవంతం చేసినా.. వందశాతం పూర్తయ్యేందుకు మరికొద్ది రోజులు పట్టే అవకాశం కనిపిస్తోంది. జిల్లాకు మంజూరు 50 వేలు స్వచ్ఛభారత్‌లో భాగంగా ప్రతి ఇంటికీ వ్యక్తిగత మరుగుదొడ్డి ఉండాలనేది ప్రభుత్వ నిబంధన. ఎక్కడా, ఎవరూ బహిరంగ మల విసర్జనకు వెళ్లే పరిస్థితి ఉండరాదని, స్వచ్ఛతను పాటించాలని ప్రభుత్వ ఆదేశాలు. ఈ క్రమంలోనే వ్యక్తిగత మరుగుదొడ్లు లేని ఇండ్లను గుర్తించిన ప్రభుత్వం.. జిల్లాకు 50,090 వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేసింది. ఇందులో ఇప్పటివరకు 41వేల నిర్మాణం పూర్తయింది. ఇతరత్రా కారణాలతో 1504 తొలగించబడ్డాయి. మిగిలిన మరుగుదొడ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. లక్సెట్టిపేటలో 18, మందమర్రిలో మూడు నిర్మాణాలు ఇంకా మొదలు కాలేదు. మంచిర్యాలలో మాత్రమే మంజూరైన నిర్మాణాలు పూర్తయ్యాయి. పూర్తి చేసేందుకు పాట్లు వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం నానా పాట్లు పడుతోంది. ఒక్కో ఐఎస్ఎల్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.12 వేలు చెల్లిస్తోంది. ఇందులో రూ.6 వేల విలువైన మెటీరియల్, మరో రూ.6 వేలు నగదును లబ్ధిదారుడికి అందజేస్తోంది. అయితే చాలా గ్రామాల్లో ఇళ్ల యజమానులు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి మొగ్గుచూపకపోవడం అధికారులకు ఇబ్బందిగా మారింది. నిర్మాణానికి రూ.12 వేలు సరిపోవని కొంతమంది, ఇతరత్రా కారణాలతో మరికొంతమంది ముందుకు రావడం లేదు. దీంతో తప్పనిసరిగా ఒత్తిడి చేసైనా ఐఎస్ఎల్ నిర్మాణాలు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. జైపూర్ మండలం వేలాల, పౌనూరు తదితర గ్రామాల్లో ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిపివేసి కూడా ఒత్తిడి తెచ్చిన సందర్భాలున్నాయి. ప్రభుత్వ పథకాలు లబ్ధిపొందాలంటే వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాల్సిందేనని అధికారులు హెచ్చరిస్తుండడంతో కాస్త సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. మూడు రోజుల్లో మిగిలిన ఐఎస్ఎల్ నిర్మాణాలు పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ ఆదేశించినా.. ప్రస్తుత పరిస్థితి చూస్తే గడువులోగా పూర్తి కావడం కష్టంగానే ఉంది. ఏదేమైనా త్వరగా వందశాతం లక్ష్యం పూర్తి చేసి, ఓడీఎఫ్ జిల్లాగా గుర్తింపు పొందే తరుణం ఎంతో దూరంలో లేదు. -
గ్రామీణాభివృద్ధికి పెద్దపీట
సాక్షి, మరికల్: ‘‘ఊరికి మరిన్ని మెరుపులు మెరిపించాలనే ఉద్దేశంతో ఇటీవల కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన బడ్జెట్లో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా అడుగలు వేసింది. ఉపాధి హామీకి మరింత ధీమాను ఇచ్చి.. మారుమూల పల్లెల్లో కూడా అందరికీ విద్యుత్ సౌకర్యం.. గ్రామీణ రోడ్లకు మెరుగులు దిద్దేందుకు నిధులు విడుదల.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లు.. స్వచ్ఛభారత్ లక్ష్యానికి అందుకోవడం కోసం ఇంటింటికి మరుగుదొడ్ల నిర్మాణాలను వేగవంతం చేయడంతోపాటు ప్రతి గ్రామంలో కనీస మౌలిక వసతుల కల్పనకు కేంద్రం పెద్దపీట వేయడంతో గ్రామీణ రంగస్థలం ముస్తాబువుతుంది.’’ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామాల్లో ఏ ఒక్కరూ ఆకలితో ఉండరాదనే ఉద్దేశంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మరింత ఊతమిచ్చింది. ఆ దిశగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కూలీలకు గిట్టుబాటు కూలీ కల్పించడంలో ఉపాధి పనులు చేయాడానికి కూలీలు ఉత్సాహం చూపుతున్నారు. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్జ్యోతి యోజన మారుమూల గ్రామాల్లో కూడా విద్యుత్ కాంతులను నింపేందుకు రూ.125కే విద్యుత్ మీటర్‌ను ఏర్పాటు చేసి గిరిజనుల కుటుంబాల్లో వెలుగు జ్యోతిని నింపేందుకు దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్జ్యోతి యోజన పథకం అమలు చేసి పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన రహదారులు లేని అవాసాలకు కూడా ప్రధాన మంత్రి గ్రామ్‌సడక్ యోజన పథకం బీటీరోడ్లను వేయించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ పథకం ద్వారా గిరిజన ప్రాంతాలకు నాణ్యమైన రోడ్లు వస్తాయానే భరోసా వచ్చింది. గ్రామీణ తాగునీటి పథకం తాగునీటి వనరులు లేని అనేక మారుమూల గ్రామాల్లో, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లో జాతీయ గ్రామీణ తాగునీటి పథకం కింద అక్కడి ప్రజలకు సురక్షితమైన, తాగునీటిని అందించాలనేది ఈ పథకం ప్రధాన ఉద్ధేశం. గ్రామీణ టెలిఫోనీ మారుమూల పంచాయతీలో కూడా వైపై హాట్‌స్పాట్స్, ఇన్స్టలేషన్, హైస్ఫీడ్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ కనెక్టివిటీ వంటి సౌకర్యాలను అందించడమే గ్రామీణ టెలిఫోనీ పథకం లక్ష్యం. స్వచ్ఛ్భారత్ బహిరంగ మలవిసర్జన చేయరాదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్ పథకం అమలు చేసింది. ఈ పథకం ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల్లో పరిసరాల పరిశుభ్రత కోసం ఇంటింటికి మరుగుదొడ్లను నిర్మించేందుకు చర్యలు చేపట్టింది. ప్రతి గ్రామంలో వందశాతం మరుగుదొడ్లను నిర్మించడమే ఈ పథకం లక్ష్యం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇళ్లులేని పేదలకు గ్రామీణ ఆవాస్ యోజన పథకం కింద ఇళ్లు నిర్మించి ఇవ్వడం కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అమల్లోకి వచ్చింది. -
స్వచ్ఛత పనుల జోరు
సాక్షి, పెంట్లవెల్లి: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా ఊరురా.. మరుగుదొడ్ల నిర్మాణం జోరందుకుంది. గ్రామాల్లో మరుగుదొడ్లను నిర్మించుకోవడం కోసం స్వచ్ఛందంగా ప్రజలు ముందుకు రావడంతో వీటి నిర్మాణాలను వేగవంతంగా నిర్మించేందుకు అధికారుల సైతం ఉత్సాహం చూపుతున్నారు. 3600 మరుగుదొడ్లు మంజూరు మండలంలోని జటప్రోల్, పెంట్లవెల్లి, కొండూరు, మల్లేశ్వరం, మంచాలకట్ట, మాధవస్వామినగర్ గ్రామాలలో ప్రజలు మరుగుదొడ్ల నిర్మాణంపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. గతంలో మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడిన మహిళలు స్వచ్ఛభారత్ నేపథ్యంలో ఈ పథకంపై ఆసక్తి చూపుతున్నారు. మండలంలో 10గ్రామ పంచాయతీలకు 3,600 మరుగుదొడ్లు మంజూరయ్యాయి. ఇందులో 1500పైగా నిర్మాణాలు పూర్తయ్యాయి. ఆసక్తి చూపుతున్న ప్రజలు ప్రతి గ్రామంలో అధికారులు పర్యటించి స్వచ్ఛతపై అవగాహన కల్పించారు. ఊరూరా తిరుగుతూ మరుగుదొడ్లు నిర్మించుకోవాలని చెప్పారు. కొన్నిచోట్ల వాటిని కఠినం చేస్తూ సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని చెప్పడంతో స్వచ్ఛతపై అవగాహన పెంచుకున్నారు. గతంలో ఎవరో ఒకరు మాత్రమే నిర్మించుకునే వారని, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఇంటింటికి మరుగుదొడ్డి నిర్మించుకుంటున్నారని అధికారులు అంటున్నారు. చెక్కుల పంపిణీ గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు మొదటి, రెండో విడుతల చెక్కులను అందజేసేందుకు పంచాయతీ కార్యదర్శి, గ్రామ సర్పంచ్, మహిళ సంఘం అధ్యక్షురాలుతో చెక్కుపై సంతాకం పెట్టించారు. మరుగుదొడ్లు నిర్మించుకున్నవారికి ప్రభుత్వం అందించే రూ.12వేల ప్రోత్సాహకం సమయానికి అందుతుంది. మండలంలో 1500లకు పైగానే మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసుకున్నారు. ఇంకా 2,100 నిర్మాణ దశలో ఉన్నాయి. స్వచ్ఛత పాటిస్తాం మరుగుదొడ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.12వేలు ఇచ్చే పథకం ఎంతో బాగుంది. ప్రభుత్వ నిధులకు తోడు మరికొంత వ్యయం చేసి మరుగుదొడ్డి నిర్మించుకున్నాం. స్వచ్ఛత పాటిస్తేనే అందరూ ఆరోగ్యంగా ఉంటారు. చిన్నారులు, వృద్ధులు, మహిళల ఇబ్బందులు తొలగిపోయాయి. – శివయ్య, మంచాలకట్ట -
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ముందడుగు..
కోరుట్ల టౌన్ : స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో కోరుట్ల మున్సిపాల్టీ ప్రగతి పథంలో దూసుకుపోతుంది. దేశంలో 40 41 నగరాలు స్వచ్ఛ సర్వేక్షణ్‌లో పోటీపడుతూ పరిసరాల పరిశుభ్రత, 100 శాతం సానిటేషన్, పారిశుధ్యం పనులు, తడి, పొడి చెత్త సేకరణ, ఉదయం, రాత్రి వేళల్లో జాతీయ రహదారితోపాటు, ప్రధాన రహదారులు పరిశుభ్రం చే స్తూ, చెత్త రహిత మున్సిపాల్టీగా తీర్చిదిద్దుతున్న క్రమంలో మందడుగు వేసింది. ఈ నేపథ్యంలో ఫీడ్‌బ్యాక్‌లో దేశ ంలో 44వ స్థానం, రాష్ట్రంలో 2వ స్థానంలో కొనసాగుతుంది. కోరుట్ల బడ్డీ యాప్‌కు స్పందన.. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా కోరుట్ల పట్టణంలోని ప్రజలకు తమ సమస్యలు పరిష్కారానికి, పన్నులు ఆన్లైన్లో చెల్లించడానికి కోరుట్ల బడ్డీ యాప్ రూపొందించి, ప్రచారం చేశారు. ప్రధాన చౌరస్తాల్లో ప్రచారబోర్డులపై అవగాహన కోసం పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ప్రజలను భాగస్వాములు చేసేందుకు 31వార్డుల్లో విస్తృత ప్రచారం చేస్తూ, ప్రధాన కూడళ్ళు, కళాశాలల్లో, దుకాణా ల వద్ద బడ్డీ యాప్ ప్రచారం చేశారు. వాల్ పోస్టర్, గోడ రాతలతో బొమ్మలు వేయించారు. కోరుట్ల బడ్డీ యాప్‌కు స్పందన లభించింది. జనవరి 8, 9 రెండు రోజులు స్వచ్ఛ సర్వేక్షణ్ పనితీరుపై పర్యవేక్షకులు కోరుట్లకు చేరుకుని వార్డుల్లో తనిఖీలు నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. 2 నెలల్లో 2500 మంది యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. 700 మంది తమ సమస్యల పరిష్కారానికి బడ్డీ యాప్‌ను వినియోగించుకోగా 654 సమస్యలు వెంటనే పరిష్కరమయ్యాయి. 46 సమస్యలు ఆర్థిక వనరులతో చేపట్టాల్సిన అవసరం ఉండడంతో నిధులు రాగానే పనులు పూర్తి చేయనున్నట్లు పర్యవేక్షిస్తున్న ఇంజినీర్ ఎ.మహిపాల్ పేర్కొన్నారు. షీ టాయిలెట్స్ నిర్మాణం మున్సిపల్ నిధులతో రూ. 2లక్షలు వెచ్చించి, గురుజు మార్కెట్లో స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా షీ టాయిలెట్స్ నిర్మాణం చేశారు. మహిళలకు టాయిలెట్స్ ఇబ్బందులు తీర్చారు. ప్రత్యేకంగా మహిళ సిబ్బందిని ఏర్పాటు చేసి, టాయిలెట్స్ నిర్వహణ పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. రహదారులు పరిశుభ్రం పట్టణంలోని జాతీయ రహదారి, ప్రధాన రహదారులు, బిజినెస్ కూడళ్ళ దారులు టీచర్స్క్లబ్ రోడ్, ఇందిరారోడ్, ఐబీరోడ్లను రాత్రివేళల్లో ఊడ్చివేయిస్తున్నారు. మిగతా రహాదారులు ఉదయం వేళ పరిశుభ్రం చేయిస్తూ, చెత్త రహిత రహదారులుగా పరిశుభ్రంగా దర్శనమిస్తున్నాయి. సానిటేషన్పై ప్రత్యేకశ్రద్ధ పెట్టి, అవసరమైన చోట మురికి కాలువలు నిర్మాణం చేయడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల భాగస్వామ్యంతో.. స్వచ్ఛ సర్వేక్షణ్కు ప్రజల భాగస్వామ్యంతో రాష్ట్రంలో ప్రథమస్థానం దేశంలో మంచి స్థానం పదిలం చేసేం దుకు ప్రతీ రోజు పనులతీరును పర్యవేక్షిస్తున్నాం. రహదారులు పరిశుభ్రంగా ఉండేందుకు ఉదయం, రాత్రి వేళల్లో క్లీన్ చేయిస్తున్నాం. రోడ్లపై చెత్త వేయకుండా అన్ని చర్యలు తీసుకొని, అందంగా ఉంచుతున్నాం. – అల్లూరి వాణిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ -
గ్రామ పంచాయితీ వివాదాస్పద నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ : ఛత్తీస్‌గఢ్‌లో ఓ గ్రామ పంచాయితీ జారీ చేసిన ఆదేశాలు కాస్త విడ్డూరంగానూ.. చర్చనీయాంశంగానూ మారాయి. టాయ్లెట్లలో పిల్లల ఫోటోలను తీసి వాటిని వాట్సాప్ గ్రూప్‌లలో వైరల్ చేయాలని పంచాయితీ పెద్దలు స్కూళ్ల యాజమాన్యాలను ఆదేశించారు. ధామటారి జిల్లాలోని ఓ గ్రామ పంచాయితీ అధికారులు ఈ ఆదేశాలను జారీ చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లను కలుపుకుని సుమారు 355 పాఠశాలలకు ఈ ఉత్తర్వులు అందాయంట. స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా ఆయా స్కూళ్లలో టాయ్ లెట్ల నిర్మాణాలను చేపట్టగా.. వాటి పనితీరు... పిల్లలు వాటిని సరిగ్గా వినియోగిస్తున్నారా? లేదా? శుభ్రత తదితర విషయాలపై స్పష్టత కోసమే ఈ ఆదేశాలను ఇచ్చినట్లు పంచాయితీ పెద్దలు చెబుతున్నారు. ఈ ఆదేశాలకు వ్యతిరేకంగా స్కూళ్ల యాజమాన్యాలు ఆందోళన చేపట్టేందుకు సిద్ధమైపోయాయి. ఇది ముమ్మాటికీ పిల్లల హక్కులను భంగం కలిగించటం అవుతుందని.. పైగా స్కూల్ సిబ్బంది కూడా ఈ ఆదేశాలను ఇబ్బందిగా భావిస్తున్నారని టీచర్లు చెబుతున్నారు. -
పరిశుభ్రతను పాటించే ఆస్పత్రులకు ప్రత్యేక బహుమతులు
ఎంజీఎం : స్వచ్ఛ భారత్ అభియాన్‌లో భాగంగా జిల్లాలోని ఆస్పత్రులను పరిశుభ్రంగా ఉంచి సుందరీకరించడంలో, పేద రోగులకు మెరుగైన సేవలందించేలా కృషి చేస్తున్న పీహెచ్సీ, సీహెచ్‌సీ, జిల్లా ఆస్పత్రులను ఎంపిక చేసి ప్రత్యేక బహుమతులు అందించనున్నట్లు అడిషనల్ డీఎంహెచ్ఓ శ్రీరాం తెలిపారు. కాయకల్ప్ కార్యక్రమంలో భాగంగా ఐఎంఏ హాల్లో శనివారం ఎస్పీహెచ్ఓలతోపాటు పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీరాం మాట్లాడుతూ ఆస్పత్రుల్లో పరిశుభ్రత, ఆరోగ్యకరమైన పరిసరాలు మెరుగుపరిచేందుకు కాయకల్ప్ కార్యక్రమం చేట్టినట్లు తెలిపారు. బహుమతులు సాధించిన జిల్లా ఆస్పత్రులు, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలకు అక్టోబర్ 2వ తేదీన రాష్ట్ర స్థాయిలో బహుమతులు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో వైద్యవిధాన పరిషత్ కోఆర్డినేటర్ సంజీవయ్య, ఎన్ఆర్హెచ్ఎం ప్రోగ్రామింగ్ అధికారి రాజిరెడ్డి, మాస్‌మీడియా అధికారి అశోక్‌రెడ్డి, డిప్యూటీ డెమో స్వరూపరాణి, హెల్త్ ఎడ్యూకేటర్ అన్వర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలపై ‘స్వచ్ఛ’ భారం
అన్ని సేవలపై స్వచ్ఛభారత్ పేరిట 0.5 శాతం పన్ను ఈనెల 15 నుంచి అమలు కేంద్రానికి అదనంగా ఏటా రూ.4,000 కోట్లు సాక్షి, న్యూఢిల్లీ: మోదీ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమానికి నిధుల సేకరణే లక్ష్యంగా తాజాగా అన్ని సేవలపై 0.5 శాతం ‘స్వచ్ఛభారత్’ పన్నును విధించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నెల 15వ తేదీ నుంచి ఈ కొత్త పన్ను అమల్లోకి రానుంది. పన్ను అమల్లోకి వస్తే ప్రతీ రూ.100 విలువైన సేవలపై 50 పైసలు సెస్ రూపంలో వసూలు చేస్తారు. విమాన ప్రయాణాలు, టెలిఫోన్ సేవలు, హోటల్ భోజనాలు, బ్యాంకింగ్ ఇలా ప్రతీ సేవ పైనా ‘స్వచ్ఛ భారత్’ పన్నును విధిస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తగా వసూలు చేస్తున్న 14 శాతం సేవా పన్నుకు ఇది అదనం. ఈ పన్ను ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలోనే అదనంగా రూ.4,000 కోట్లు కేంద్రం సమీకరించనుంది. ఈ మొత్తాన్ని కేవలం స్వచ్ఛభారత్ కార్యక్రమం కోసం ఖర్చు చేయనున్నారు. ఫిబ్రవరి 28న 2015-16 బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి జైట్లీ మాట్లాడుతూ.. అవసరమైతే 2 శాతం స్వచ్ఛభారత్ సెస్ వసూలుచేస్తామని వ్యాఖ్యానించడం తెలిసిందే. స్వచ్ఛభారత్ అభియాన్ నీతి ఆయోగ్ ఉప కమిటీ కన్వీనర్‌గా ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల నివేదికను ప్రధాని మోదీకి అందచేసిన విషయం విదితమే. ఆ నివేదికలో 2019 నాటికి దేశాన్ని స్వచ్ఛభారత్‌గా తీర్చిదిద్దడానికి చేపట్టాల్సిన అంశాలను సిఫార్సుల రూపంలో కేంద్రానికి నివేదించింది. స్వచ్ఛభారత్‌కు నిధుల సమీకరణ విషయంలో కార్పొరేటు సామాజిక బాధ్యత కింద వివిధ సంస్థలు, చమురు సంస్థలు, ఇతరత్రాల నుంచి సెస్‌ల రూపంలో వసూలు చేయడానికి సిఫార్సులు చేసినట్టు బాబు చెప్పడం ప్రస్తావనార్హం. కానీ శుక్రవారం కేంద్రం అన్ని సేవలపై సెస్ రూపంలో ప్రజలపై భారం వేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే, స్వచ్ఛభారత్ సెస్ ఎలాంటి పన్ను కాదని శుక్రవారం ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదలచేసింది. స్వచ్ఛభారత్‌లో దేశ ప్రజలందరినీ భాగస్వాములను చేసే దిశలో కేంద్రం వేసిన ముందడుగు అని అభివర్ణించింది. ఈ దిశగా దేశంలో ఇప్పుడు అమలులో ఉన్న అన్ని రకాల సేవలపై స్వచ్ఛభారత్ సెస్‌గా విధిస్తున్నట్లు ప్రకటన తెలిపింది. 2015-16 బడ్జెట్లో స్వచ్ఛభారత్‌కు సంబంధించి సెస్ వసూలకు ప్రతిపాదన చేసినట్టు పేర్కొంది. కేంద్రం తాజా నిర్ణయంతో సేవా పన్ను పెరగడంతోపాటు, కార్పోరేట్ సంస్థలు సెస్‌కు తగ్గట్లుగా తమ వ్యాపార ప్రణాళికలను మార్చుకోవాల్సి ఉంటుందని ఎర్నెస్ట్ అండ్ యంగ్ ట్యాక్స్ పార్ట్నర్ బిపిన్ సాప్రా అభిప్రాయపడ్డారు. కొత్త సెస్‌తో భారత్‌లో వ్యాపార ఖర్చు పెరుగుతుందని డెలాయిడ్ ఇండియా సీనియర్ డెరైక్టర్ సలోని రాయ్ చెప్పారు. -
జూన్‌కల్లా స్వచ్ఛభారత్‌పై కేంద్రానికి నివేదిక
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్‌ను పటిష్ఠంగా అమలు చేసేందుకు కచ్చితమైన విధానాలన్నింటినీ అధ్యయనం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆయన గురువారం నీతి అయోగ్ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ జూన్ నెలాఖరుకల్లా స్వచ్ఛభారత్ పై కేంద్రానికి నివేదిక ఇస్తామని తెలిపారు. జపాన్ పారిశ్రామికవేత్తలు ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో పాలుపంచుకోవాలని భావిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. -
తెల్లవారక ముందే రోడ్లూడిస్తే జైలుశిక్ష
స్వచ్ఛ భారత్ కోసం సాక్షాత్తు ప్రధాన మంత్రే చీపురుపట్టి రోడ్లూడుస్తుంటే...జార్జియాలోని శాండీ స్ప్రింగ్స్ నగరంలో మాత్రం ఓ పారిశుద్ధ్య కార్మికుడు చెత్త 'శుద్ధి' ఎక్కువై తెలతెలవారక ముందే రోడ్లు ఊడుస్తుంటే బొక్కలోతోశారు పాపం! 30 రోజులు జైలు శిక్ష కూడా విధించారు. ఆ నగరంలో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల మధ్యనే రోడ్లూడవాలనేది అక్కడ రూల్. అంతుకుముందు రోడ్లూడుస్తుంటే మేడలు, మిద్దెల్లో నివసించే విలాసవంతుల నిద్రకు భంగం కలుగుతుందని నగర మున్సిపల్ అధికారులు ఈ రూల్ తీసుకొచ్చారట. మూడు నెలల క్రితమే పనిలో చేరిన పారిశుద్ధ్య కార్మికుడు మ్యాక్గిల్ ఓ రోజు ఉదయం ఐదు గంటల ప్రాంతంలో రోడ్లూడుస్తూ అధికారుల కంటపడ్డాడు. అంతే అతని పెడరెక్కలు విరిచి పట్టుకొని తీసుకెళ్లి బొక్కలో వేశారు. మ్యాక్గిల్కు సొంతంగా లాయరును పెట్టుకొనే స్థామత లేకపోవడంతో అధికారుల తరఫున చీఫ్ ప్రాసిక్యూటర్ బిల్ రిలే కోర్టులో వీరంగం వేశారు. చట్టాలను అతిక్రమించి తెల్లవారుజామునే పారిశుద్ధ్య కార్మికులు రోడ్లూడవడం తరచూ జరుగుతోందని, నష్టపరిహారంతో దారికి రావడం లేదని, జైలు శిక్ష వేయడమే తగిన శిక్షంటూ తెగవాదించారు. ఆయన వాగ్ధాటికి కోర్టులో ఆసీనులైవున్న జడ్జీగారు మురిసిపోయారో, భయపడ్డారో తెలదుగానీ మ్యాక్గిల్కు 30 రోజుల జైలు శిక్ష విధిస్తూ ఇటీవల తీర్పు చెప్పారు. అయితే ఆ తర్వాత మ్యాక్ గిల్ శిక్షను కోర్టు తగ్గించింది. -
స్వచ్ఛభారత్‌లో అపశ్రుతి
వేంపల్లె : స్వచ్ఛభారత్ కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. పాఠశాల ఆవరణంలో చెత్తా చెదారం తొలగించి శుభ్రంగా చేస్తుండగా ఓ విద్యార్థికి విషపురుగు కుట్టి మృతి చెందాడు. పాఠశాల ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు మృతి చెందాడని ఆ బాలుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వివరాలిలా ఉన్నారుు. ఇడుపులపాయ గ్రామ పంచాయతీలోని మారుతీ నగర్ ప్రాథమిక పాఠశాలలో ఆంజనేయులు, వెంకటేశ్వరమ్మల దంపతుల కుమారుడు వెంకట చరణ్ (6) 1వ తరగతి చదువుతున్నాడు. మధ్యాహ్నం 12గంటల ప్రాంతంలో భోజన సమయంలో అక్కడ పాఠశాల ఆవరణంలో ఇతర విద్యార్థులతో కలిసి శుభ్రపరిచేందుకు వెళ్లాడు. ఆ సమయంలో వెంకట చరణ్ కుడికాలికి నొప్పి తగిలింది. వెంటనే అక్కడ ఉన్న ఉపాధ్యాయులు వెంకటేష్, గిరిజకుమారిలకు చెప్పాడు. ఏదో కుచ్చుకుని నొప్పిగా ఉందని తెలియజేయడంతో ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు విషయాన్ని చేరవేశారు. తల్లి వెంకటేశ్వరమ్మ పాఠశాల వద్దకు వెళ్లి తన కొడుకును ఆటోలో వేంపల్లె ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఇక్కడ చికిత్స పొందుతూ వెంకటచరణ్ మృతి చెందాడు. ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్లే... స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో పాఠశాల ఆవరణాన్ని శుభ్రపరుస్తుండగా ఏదో విష పురుగు కుట్టిందని.. దీంతోనే తన కుమారుడు మృతి చెందాడని తల్లిదండ్రులు ఆరోపించారు. ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్లే తన కుమారుడు మృతి చెందారని తీవ్రస్థాయిలో తల్లిదండ్రులు, బంధువులు ఆసుపత్రి వద్ద అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులపై విరుచుకపడ్డారు. సంఘటన జరిగిన వెంటనే ఉపాధ్యాయులు ఆసుపత్రికి తీసుకెళ్లి ఉండి ఉంటే తమ కుమారుడు ప్రాణాలతో ఉండేవారని వారు కన్నీటి పర్యంతమయ్యారు. అక్కడే ఉన్న ఆర్.కె.వ్యాలీ ఎస్ఐ ప్రదీప్‌నాయుడు ఘర్షణ జరగకుండా నిలువరించగలిగారు. తమ కుమారుడు మృతికి ఉపాధ్యాయులే కారణమని వాపోయారు. మృతి చెందిన వెంకట చరణ్‌కు నోటి నుండి బురుగు రావడంతో దాదాపు విష పురుగు కుట్టిందని నిర్థారణకు వచ్చారు. పోస్టుమార్టం నిర్వహిస్తే కానీ సరైన కారణం తెలియదు. ఆర్కె వ్యాలీ ఎస్ఐ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. స్వచ్ఛ భారత్ చేపట్టలేదు స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టలేదని.. మధ్యాహ్న భోజన సమయంలో ప్లేట్లు శుభ్రపరిచేందుకు అక్కడికి వెళ్లి ఏదో ముళ్లు కుచ్చుకున్నట్లు తమ వద్దకు వచ్చారని అక్కడి ఉపాధ్యాయులు చెబుతున్నారు. పలువురి పరామర్శ మృతి చెందిన వెంకటచరణ్ మృతదేహాన్ని పలువురు రాజకీయ నాయకులు సందర్శించారు. తల్లిదండ్రులు, బంధువులను ఓదార్చారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఇడుపులపాయ ఎంపీటీసీ, వేంపల్లె ఎంపీపీ రవికుమార్‌రెడ్డి, వైఎస్ఆర్ సీపీ కన్వీనర్ చంద్ర ఓబుళరెడ్డి, వేంపల్లె గ్రామ సర్పంచ్ విష్ణువర్థన్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్‌రెడ్డిలు పరామర్శించిన వారిలో ఉన్నారు. విద్యార్థి మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ పులివెందుల డివిజన్ అధ్యక్షుడు విష్ణువర్థన్‌రెడ్డి డిమాండు చేశారు. -
స్వచ్ఛభారత్ కు సంకల్పం
-
స్వచ్ఛభారత్ కు సంకల్పం
* దేశంలోనే అతిపెద్ద పరిశుభ్రత కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని * ఐదేళ్లలో 2 లక్షల కోట్లతో ‘క్లీన్ ఇండియా’ లక్ష్యం * ఇది గాంధీజీ స్వప్నం.. 125 కోట్ల భారతీయుల బాధ్యత న్యూఢిల్లీ: ‘పరిశుభ్ర భారత్’ దిశగా దేశం తొలి అడుగు వేసింది. జాతిపిత జయంతి రోజు ఆయన స్వప్నం ‘క్లీన్ ఇండియా’కు భారత ప్రధాని నరేంద్రమోదీ శ్రీకారం చుట్టారు. స్వయంగా చీపురు పట్టి, చెత్త ఊడ్చి కార్యక్రమం పట్ల తన అంకితభావాన్ని ప్రదర్శించారు. ఐదేళ్లలో భారత్‌ను ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్ర దేశాల్లో ఒకటిగా మార్చే బాధ్యత 125 కోట్ల భారతీయులందరిపై ఉందంటూ.. 2019లో మహాత్ముడి 150వ జయంతి నాటికి స్వచ్ఛమైన భారతదేశాన్ని ఆయనకు నివాళిగా అందిద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. దాదాపు రూ. 2 లక్షల కోట్ల ఖర్చుతో ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారతదేశ అతిపెద్ద పారిశుద్ధ్య కార్యక్రమం ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమాన్ని ఢిల్లీలోని రాజ్‌పథ్ రోడ్లో గురువారం ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. దేశాన్ని స్వచ్ఛంగా మారుస్తామంటూ ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. ఒక్కరు 9 మందిని, ఆ 9 మంది ఒక్కొక్కరు మరో 9 మందిని.. ఇలా గొలుసుకట్టుతో స్వచ్ఛభారత్ మిషన్‌లో దేశ ప్రజలను భాగస్వాములు చేయాలని పిలుపునిచ్చారు. దీన్ని కేవలం ఫోటోలు దిగే కార్యక్రమంగా భావించరాదని, పరిశుభ్రత కోసం దేశప్రజలందరూ వారానికి రెండు గంటలు, సంవత్సరానికి 100 గంటలు కేటాయించాలని కోరారు. తాను కూడా ఆ మేరకు సమయం కేటాయిస్తానన్నారు. అనంతరం మోదీ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని దేశవ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాల్లో లక్షలాదిగా ప్రజలు స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో పాల్గొని, తమ ఇళ్లు, కార్యాలయాల పరిసరాలను పరిశుభ్రం చేశారు. బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ కూడా పాల్గొన్న ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. ‘స్వచ్ఛ భారత్’ భాధ్యత ప్రభుత్వానిదో, పారిశుద్ధ్య కార్మికులదో, స్వచ్ఛంద సంస్థలదో మాత్రమే కాదని, 125 కోట్ల మంది భారతీయులు ఇందులో భాగస్వాములని తేల్చి చెప్పారు. ‘అత్యంత చవకగా అంగారక గ్రహానికి చేరుకోగలిగిన మనం.. మన దేశాన్ని శుభ్రం చేసుకోలేమా?’ అంటూ దేశ ప్రజల్లో స్ఫూర్తిని నింపారు. ‘ఈ కార్యక్రమం రాజకీయాలకు అతీతమైంది. ఇది దేశభక్తి నుంచి స్ఫూర్తి పొందిన కార్యక్రమం’ అని స్పష్టం చేశారు. ‘రాజకీయాలపై దృష్టి పెట్టి ఈ పని చేయొద్దు. స్వచ్ఛమైన మనస్సుతో చెబుతున్నా. ఇందులో రాజకీయాలు చేరితే.. మరోసారి భరతమాత సేవలో మనం విఫలమైనట్లే’ అన్నారు. భారత్‌ను పరిశుభ్రంగా మార్చేందుకు గత ప్రభుత్వాలు కూడా కృషి చేశాయని పేర్కొన్నారు. పలు రాజకీయ, సామాజిక, సాంస్కృతిక సంస్థలు కూడా ఈ దిశగా ప్రయత్నించాయన్నారు. ‘మహాత్మాగాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ కూడా ఈ పని చేపట్టింది. అయితే, ఇందులో ఎవరు విజయవంతమయ్యారు? ఎవరు విఫలమయ్యారన్న విషయాల్లోకి మనం వెళ్లొద్దు. మన బాధ్యత మనం సక్రమంగా నిర్వర్తిద్దాం’ అని వ్యాఖ్యానించారు. గ్రామీణ మహిళల వెతలపై ఆవేదన: దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా 60% ప్రజలు ఇంకా బహిరంగ ప్రదేశాల్లోనే మల విసర్జన చేస్తున్నారన్న మోదీ.. టాయిలెట్లు లేని గ్రామీణ మహిళల వెతలను తీర్చాల్సి ఉందన్నారు. సామాజిక బాధ్యతగా భావించి పాఠశాలల్లో బాలికల కోసం ప్రత్యేక టాయిలెట్ల నిర్మాణాన్ని చేపట్టాలని తాను కార్పొరేట్ సంస్థలకు విజ్ఞప్తి చేశానన్నారు. విదేశాల్లో బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేయరని, ఆ విషయంలో విదేశాల నుంచి భారత్ ఎంతో నేర్చుకోవాల్సి ఉందని మోదీ వ్యాఖ్యానించారు. ‘అలవాట్లు అంత తొందరగా మారవు. అయినా చిత్తశుద్ధితో ప్రయత్నించాలి’ అన్నారు. స్వచ్ఛ్ భారత్ కార్యక్రమాన్ని ఇంటర్నెట్లో, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నామన్నారు. ఇందుకు ఝడ జౌఠి.జీ అనే ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించామని తెలిపారు. క్లీన్ ఇండియాకు ప్రత్యేకంగా వెబ్సైట్, ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ప్రారంభించామన్నారు. అనారోగ్య కారణాలతో ప్రతీవ్యక్తి ఏటా రూ. 6500 ఖర్చు చేస్తున్నాడన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలను ప్రస్తావిస్తూ.. పరిశుభ్ర పరిసరాలతో ప్రజలు అరోగ్యంగా ఉండి, ఆ ఖర్చును తగ్గించుకోవచ్చన్నారు. లోగో రూపకర్తలకు అభినందనలు మహాత్మాగాంధీ కళ్లద్దాలను ‘స్వచ్ఛ్ భారత్’ లోగోగా రూపొందించిన మహారాష్ట్రకు చెందిన అనంత్‌ను, ‘ఏక్ కదమ్ స్వచ్ఛతా కీ ఓర్(స్వచ్ఛత దిశగా ఒక అడుగు)’ను కార్యక్రమ నినాదంగా ఇచ్చిన గుజరాత్‌కు చెందిన భాగ్యశ్రీలను ఈ సందర్భంగా మోదీ అభినందించారు. ‘భారత్‌ను స్వచ్ఛంగా చేశామా లేదా? అని ఈ కళ్లద్దాల ద్వారా గాంధీజీ మనల్ని చూస్తున్నట్లుగా అనిపిస్తోంది’ అన్నారు. మోదీ ప్రసంగంలోని మరికొన్ని ముఖ్యాంశాలు.. ఈ రోజు గాంధీజీ, లాల్‌బహదూర్ శాస్త్రిల జయంతి. శాస్త్రి ఇచ్చిన జై జవాన్ పిలుపునకు రైతాంగం కదిలి దేశ ధాన్యాగారాలను నింపింది. గాంధీ కల ‘క్విట్ ఇండియా’, ‘క్లీన్ ఇండియా’. క్విట్ ఇండియా పిలుపుతో స్వాతంత్య్రం సాధించారు. కానీ ‘క్లీన్ ఇండియా’ కల అసంపూర్తిగానే మిగిలింది. ఆ కల నెవవేర్చడానికి ఇప్పుడు సమయం వచ్చింది. ఎక్కడైనా చెత్త ఉంటే ఫోటోను, ఎత్తివేసిన తరువాత ఫోటోను అప్లోడ్ చేయండి. పారిశుధ్యం కోసం కృషి చేస్తున్న యువసంఘాలను వెలుగులోకి తీసుకురావాలని మీడియాను కోరుతున్నా. 2 లక్షల కోట్లు: రెండు స్థాయిల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. రూ. 62 వేల కోట్లతో(ఇందులో కేంద్ర వాటా రూ. 14,623 కోట్లు) దేశవ్యాప్తంగా 4041 పట్టణాల్లో.. రూ. 1.34 లక్షల కోట్లతో గ్రామాల్లో ‘స్వచ్ఛ్ భారత్’ను నిర్వహిస్తారు. గ్రామాల్లో పరిశుభ్రత కోసం ప్రారంభించిన ‘నిర్మల్ భారత్ అభియాన్’ను ఈ కార్యక్రమంలోనే విలీనం చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించిన విషయం తెలిసిందే. స్వచ్ఛ్ భారత్‌లో ఏం చేయాలి...! * ప్రతీఒక్కరు ‘పరిశుభ్ర భారత్’లో భాగస్వాములు కావాలి. * అందరూ వారానికి రెండు గంటల చొప్పున సంవత్సరానికి కనీసం 100 గంటల సమయం పరిశుభ్రతకు కేటాయించాలి. * తాము నివాసం ఉంటున్న ప్రాంతాలు, ఆ పరిసరాలు.. కార్యాలయాలు, కార్యాలయ ప్రాంగణాలను శుభ్రంగా ఉంచాలి. * పరిసరాల్లోని మురికికాల్వలను శుభ్రం చేయాలి. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయరాదు. * విద్యార్థుల తమ పాఠశాలలను స్వచ్ఛంగా ఉంచుకోవాలి. * పాఠశాలల్లో బాలికల కోసం ప్రత్యేక టాయిలెట్లను నిర్మించాలి. (ఇందుకు కార్పొరేట్ సంస్థల సాయం కోరినట్లు ప్రధాని మోదీ తెలిపారు) * గ్రామీణప్రాంతాల్లో బహిరంగ మలవిసర్జనను నిర్మూలించాలి. వ్యక్తిగత టాయిలెట్ల నిర్మాణాన్ని ప్రోత్సహించాలి. * గ్రామీణ మహిళల కోసం కమ్యూనిటీ టాయిలెట్లను నిర్మించాలి. * ‘మేన్యువల్ స్కావెంజర్’ వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలి. గ్రామాల స్వచ్ఛతకు ఏటా 20 లక్షలు న్యూఢిల్లీ: ‘స్వచ్ఛ భారత్’ ఉద్యమంలో భాగంగా దేశంలోని 2.47 లక్షలకుపైగా ఉన్న గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు గ్రామ పంచాయతీలకు ఏటా రూ. 20 లక్షల చొప్పున నిధులు అందిస్తామని కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్యశాఖ మంత్రి నితిన్ గడ్కారీ ప్రకటించారు. గురువారం ఢిల్లీలోని తన శాఖ కార్యాలయం ఆవరణలో అధికారులతో కలిసి చీపురుపట్టిన గడ్కారీ అనంతరం మీడియాతో మాట్లాడారు. త్వరలోనే కొన్ని గ్రామాలకు ఈ నిధులను అందిస్తామన్నారు. ఈ పథకం కోసం ప్రభుత్వం ప్రకటించిన రూ. 1.96 లక్షల కోట్ల నిధి నుంచి ఈ సొమ్మును గ్రామాలకు అందిస్తామని అధికారులు చెప్పారు. స్వచ్ఛ భారత్ నిధి గ్రామాలు ప్రత్యేకించి స్కూళ్లలో పారిశుద్ధ్య సేవలకు కార్పొరేట్ కంపెనీలు, వ్యక్తుల నుంచి నిధుల సేకరణ కోసం కేంద్రం గురువారం స్వచ్ఛ భారత్ నిధిని ఏర్పాటు చేసింది. సాధించేదాకా కొనసాగిద్దాం! సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రారంభమైన ‘స్వచ్ఛభారత్’ కార్యక్రమాన్ని ఐదేళ్లపాటు కొనసాగించాలని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. పనిచేసే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి పని వాతావరణాన్ని సృష్టించాలని ఉద్యోగులకు సూచించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో గురువారం జరిగిన ర్యాలీలో వెంకయ్య టీషర్టు, క్యాప్ ధరించి విద్యార్థులతో కలిసి 4 కిలోమీటర్లు నడిచారు. -
‘చెత్తశుద్ధి’ లేని వీఐపీలు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కార్యక్రమం స్వచ్ఛభారత్. దేశాన్ని పరిశుభ్రమైన భారత్‌గా తీర్చిదిద్దాలనేది ఆయన లక్ష్యం. అయితే ఇండియా గేట్ వద్ద నిర్వహించిన ప్రారంభ కార్యక్రమానికి అతిథులుగా హాజరైన వీఐపీలకు స్వచ్ఛ భారత్ స్ఫూర్తి అర్థం అయినట్టు కనిపించలేదు. ఈ కార్యక్రమం పూర్తయిన అనంతరం వీరంతా తమ సీట్ల వద్దే ఖాళీ వాటర్ బాటిళ్లు, కరపత్రాలను వదిలేశారు. వారికి సమీపంలోనే భారీ డస్ట్ బిన్ను నిర్వాహకులు ఏర్పాటు చేసినా ఎవరూ దానిని పట్టించుకోలేదు. కార్యక్రమం పూర్తయిన వెంటనే మోదీ వెంట వెళ్లేందుకు తొందరపడిన వీఐపీలు చెత్తను అక్కడే వదిలేశారు. చెత్తను వేసేందుకు ఏర్పాటు చేసిన డస్ట్ బిన్ కిందపడి.. అందులోని వ్యర్థాలు, ఖాళీ వాటర్ బాటిళ్లు బయటపడి ఆ ప్రదేశమంతా చిందరవందరగా తయారైంది. స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి మద్దతిచ్చేందుకు బాలీవుడ్ నటుడు ఆమిర్‌ఖాన్ వచ్చిన సమయంలో వీవీఐపీ, మీడియా ఎన్‌క్లోజర్‌లో గందరగోళం చెలరేగింది. ఆమిర్‌ను కలిసేందుకు మీడియా ప్రతినిధులు, సీనియర్ అధికారులు ప్రయత్నించడంతో ఒక దశలో తొక్కిసలాట జరుగుతుందేమో అన్న పరిస్థితి నెలకొంది. స్వచ్ఛ భారత్ ప్రారంభోత్సవంలో స్కూలు విద్యార్థులే ప్రత్యేక ఆకర్షణ. వివిధ ప్రభుత్వ పాఠశాలల నుంచి 5 వేల మంది విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వీరంతా మోదీతో పాటు స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయడమే కాక.. ఆయన చెప్పిన పరిశుభ్రతా సూచనలను పాటిస్తూ అందరినీ ఆకర్షించారు. కార్యక్రమం సాగినంత సేపూ విద్యార్థులు మూడు రంగుల బెలూన్లు, రంగురంగుల పోస్టర్లు చేత పట్టుకుని హంగామా చేశారు. దక్షిణాది నుంచి వచ్చినవారికి హిందీలో చెప్పిన స్వచ్ఛతా సందేశం అర్థం కాలేదని, అందువల్ల తాను ఇంగ్లిష్‌లో ప్రసంగిస్తానని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు చెప్పడంతో సభికులంతా చప్పట్లు కొట్టారు. స్వచ్ఛ భారత్... యూపీఏ పథకమే: స్వచ్ఛ భారత్ పథకం కొత్తదేమీ కాదని సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం చెప్పుకొచ్చారు. యూపీఏ హయాంలో చేపట్టిన నిర్మల్ భారత్ అభియాన్ పేరు మార్చి మోదీ సర్కారు స్వచ్ఛ భారత్‌ను ప్రారంభించిందన్నారు. ఈ పథకాన్ని కేంద్రం వాస్తవిక కోణంలో అమలు చేయాలని లేకుంటే ఇది ఫొటో ప్రదర్శనగా మారవచ్చని కాంగ్రెస్ ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ పేర్కొన్నారు. -
ప్రధాని ‘స్వచ్ఛ భారత్’ చాలెంజ్!
ప్రచారంపై తొమ్మిది మంది ప్రముఖులకు మోదీ ఆహ్వానం న్యూఢిల్లీ: ప్రజలతో భావాలను పంచుకునేందుకు ఇంటర్నెట్ను విరివిగా వాడే ప్రధాని మోదీ ‘స్వచ్ఛ భారత్’పై ప్రచారం కోసం వినూత్న పంథాను ఎంచుకున్నారు. ఇంటర్నెట్లో ఇటీవల హల్చల్ చేసిన ‘ఐస్ బకెట్ చాలెంజ్’ నుంచి స్ఫూర్తి పొందారో ఏమోగానీ మోదీ ఆ తరహాలో తనదైన సవాల్‌ను విసిరారు. పరిశుభ్ర భారతావని ఆవశ్యకతపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలంటూ పలు రంగాల్లోని తొమ్మిది మంది ప్రముఖులకు ఆహ్వానం పలికారు. అలాగే ఆ ప్రముఖుల్లో ఒక్కొక్కరూ మరో తొమ్మిదేసి మందిని ఈ ప్రచారంలో పాల్గొనాల్సిందిగా కోరాలని సూచించారు. తద్వారా ఈ గొలుసుకట్టు ప్రచారం నిరంతరాయంగా కొనసాగుతుందని ఆశిస్తున్నట్లు మోదీ చెప్పారు. మోదీ ఎంపిక చేసిన 9 మంది ప్రముఖుల్లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, పారిశ్రామిక దిగ్గజం అనిల్ అంబానీ, కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్, నటులు కమల్‌హాసన్, సల్మాన్‌ఖాన్, ప్రియాంకా చోప్రా, గోవా గవర్నర్ మృదుల సిన్హా, ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్‌తోపాటు ‘తారక్ మెహతా కా ఉల్టా చష్మా’ టీవీ సీరియల్ బృందం ఉంది. ఉద్యమానికి అంకితం: అనిల్ అంబానీ స్వచ్ఛ భారత్ ప్రచార ఉద్యమానికి తాను అంకితం అవుతానని రిలయెన్స్ గ్రూపు చైర్మన్ అనిల్ అంబానీ తెలిపారు. దీనిపై ప్రచారంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని మోదీ తనను ఆహ్వానించడాన్ని గౌరవంగా భావిస్తానన్నారు. ప్రచారకర్తగా నియమిస్తే సంతోషం: ఆమిర్‌ఖాన్ ప్రధాని మోదీతో కలిసి ‘స్వచ్ఛ భారత్’ ప్రారంభోత్సవంలో పాల్గొన్న అనంతరం బాలీవుడ్ నటుడు ఆమిర్‌ఖాన్ మీడియాతో మాట్లాడుతూ ఈ ఉద్యమంలో ప్రభుత్వం తనను ప్రచారకర్తగా (బ్రాండ్ అంబాసిడర్) నియమిస్తే సంతోషిస్తానన్నారు. ఆ బాధ్యతను మనస్ఫూర్తిగా చేపడతానన్నారు. -
దేశమంతటా ఉద్యమస్ఫూర్తి
న్యూఢిల్లీ: ప్రజా ప్రతినిధులు, రాజకీయ నేతలు, అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు.. ఇలా దాదాపు అన్ని వర్గాల ప్రజలు గురువారం దేశవ్యాప్తంగా ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమంలో ఉద్యమస్ఫూర్తితో పాలు పంచుకున్నారు. గాంధీ జయంతి సందర్బంగా సెలవురోజైనప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లి స్వచ్ఛ్ భారత్ ప్రతిజ్ఞ చేశారు. చీపుర్లు పట్టి కార్యాలయ పరిసరాలను శుభ్రం చేసుకున్నారు. లక్నోలోని చార్బాగ్ రైల్వే స్టేషన్లో, అనంతరం బాలు అడ్డాలోని వాల్మీకి ఏరియాలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, అలహాబాద్‌లో బీజేపీ అగ్రనేత అద్వానీ ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. మధ్యప్రదేశ్‌లోని సొంత నియోజకవర్గం ఝాన్సీలోని పలు ప్రాంతాల్లో కేంద్రమంత్రి ఉమాభారతి పరిశుభ్ర భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. తిరువనంతపురంలో కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ ప్లాస్టిక్‌ను తొలగించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. -
స్వచ్ఛ్ భారత్‌ను స్వాగతిద్దాం
పరిశుభ్రమైన భారత దేశ నిర్మాణం కోసం స్వచ్ఛ్ భారత్ పేరుతో ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన జాతీయోద్యమం చరిత్రాత్మకమైనది. తరతరాల అలవాట్లను మార్చడానికీ, మరుగుదొడ్లు కట్టుకొని వినియో గించడానికీ, ప్రతి ఇంటినీ, వాడనీ, గ్రామాన్నీ పరిశుద్ధంగా దిద్దితీర్చ డానికీ గురువారం మోదీ మొదలుపెట్టిన రెండు లక్షల కోట్ల రూపాయల భారీ పారిశుద్ధ్య పథకం విజయవంతంగా అమలు జరగడానికీ ప్రజలందరూ త్రికరణశుద్ధిగా కృషి చేయాలి. మోదీ స్వయంగా చీపురు చేతపట్టి ఊడ్చటం, దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులూ, సామాజిక ప్రముఖులూ, ఉన్నతాధికారులూ పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొనడం, ఈ సందర్భంగా మహాత్మాగాంధీని స్మరించడం గమనించినవారికి దీన్ని ఎంత సమర్థంగా అమలు చేయాలని ప్రధాని సంకల్పించారో అర్థం అవుతుంది. లోగడ ప్రభుత్వాలు ఇటువంటి ప్రయత్నాలు చేయకపోలేదు. అన్నిటి మాదిరే ఇది కూడా అరకొర ఫలితాలు ఇచ్చి మూలనపడింది. ఎన్డీఏ సర్కార్ ప్రారంభించిన ఈ కార్యక్రమం ఇదివరకటి కార్యక్రమాల కంటే విస్తృతిలో, ప్రాధాన్యంలో భిన్నమైనది. మోదీ ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజులకే స్వాతంత్య్ర దినోత్సవ సందేశంలో స్వచ్ఛ్భారత్ స్వప్నాన్ని ఆవిష్కరించారు. ఈ బృహత్కార్యక్రమానికి మహాత్మాగాంధీ 145వ జయంతినాడు శ్రీకారం చుట్టబోతున్నట్టు చెప్పారు. అమెరికా యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకొని వచ్చిన వెంటనే మోదీ తన ఆలోచనను ఆచరణలో పెట్టారు. లోగడ ఏ ప్రధానీ చేయని విధంగా పరిశుభ్రమైన భారతదేశ నిర్మాణానికి జాతీయోద్యమం నిర్వహించాలనీ, దానికి కేంద్రప్రభుత్వమే పూనిక వహించాలనీ, 2019 నాటికి మరుగుదొడ్డి లేని ఇల్లు కానీ, విద్యాసంస్థ కానీ, కార్యాలయం కానీ ఉండకూడదనీ, స్వచ్ఛమైన నీరూ, గాలీ, వాతావరణం ఉండే విధంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునే సంస్కృతి నెలకొనాలనీ, బహిరంగ ప్రదేశాలలో కాలకృత్యాలు తీర్చుకునే అలవాటుకు స్వస్తి చెప్పే విధంగా ప్రజలలో అవగాహన, చైతన్యం పెంచాలనీ సంకల్పం. అపరి శుభ్రత అనారోగ్యానికి మూలం. అనారోగ్యం పైన విజయం సాధించాలంటే స్వచ్ఛ్ భారత్ ఉద్యమం జయప్రదం కావాలి. పారిశుద్ధ్యం లోపించిన కారణంగా వాతావరణం కలుషితమై వ్యాధులు ప్రబలి ప్రాణనష్టంతో పాటు లక్షల కోట్ల రూపాయల నష్టం జరుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఘోషిస్తోంది. బహిర్భూమికి వెళ్ళవలసిన కారణంగా దేశంలోని అనేక ప్రాంతాలలో యువతులు మానవమృగాల లైంగికదాడికి గురైన ఉదంతాలు అనేకం. పాఠశాలలో మరుగుదొడ్లు లేక దేశంలో లక్షలమంది బాలికలు చదువులను అర్ధంతరంగా మాని వేస్తున్నారు. అనేకమంది బాలికలకూ, ఉపాధ్యాయులకూ మూత్రపిండాల జబ్బులు వచ్చినట్టు నివేదికలు ఉన్నాయి. పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణాన్ని సుప్రీంకోర్టు పర్యవేక్షించినా ప్రయోజనం లేకపోయింది. ఇప్పుడు ప్రధాని స్వయంగా పూనుకున్నారు కనుకా, ఇందులో దేశ ప్రజలను భాగస్వాములను చేయబోతున్నారు కనుకా ఈ మహాప్రయత్నం ఫలిస్తుందని ఆశించవచ్చు. కానీ ఇది ప్రభుత్వ బాధ్యతగానో, సర్కారీ కార్యక్రమంగానో ప్రజలు భావించినట్లయితే ఈ పథకం సైతం పూర్వపు పథకాల మాదిరే విఫలమై మనలను వెక్కిరిస్తుంది. ఇది ఒక్క రోజుకో లేదా కేరళ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమం ఉద్దేశించిన ట్టు ఒక నెలకో పరిమితం కారాదు. ఇది నిత్యకృత్యం కావాలి. గొప్ప కల కనడమే కాకుండా, జాతి సిగ్గుతో తల దించుకోవలసిన ఒకానొక మౌలిక సమస్యనూ, దురాచారాన్నీ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ప్రముఖంగా ప్రస్తావించే సాహసం చేసినందుకూ, పరిష్కారానికి నడుం బిగించినందుకూ నరేంద్రమోదీకి సహస్రాభినం దనలు. ఈ పథకాన్ని మహాత్మాగాంధీ పుట్టిన రోజున ప్రారంభించడంలో గడుసుదనం లేకపోలేదు. మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న బీజేపీకీ, దాని సైద్ధాంతిక మూలాధారమైన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌కీ గాంధీ అంటే సరిపడదు. నాథూరాం గాడ్సే, వీర్ సావర్కర్ల భావజాలానికీ, గాంధీమార్గానికీ పొంతనలేదు. పైగా వైరుధ్యం ఉంది. అటువంటి గాంధీని ఒక ముఖ్యమైన జాతీయస్థాయి ఉద్యమానికి ప్రతీకగా నిలపడం ద్వారా మోదీ రెండు సత్ఫలితాలు సాధించాలని ఆశించి ఉంటారు. ఒకటి, గాంధీజీ కాంగ్రె స్ సొంతం కాదనీ, అందరికీ చెందినవాడని నిరూపించడం. రెండు, సంఘ్ పరివారం గాంధీ మార్గాన్ని అనుసరించడానికీ సంకోచించదనీ, ఇదివరకటి రాజీలేని, పట్టువిడుపులు లేని వైఖరిని విడనాడి స్వాతంత్య్ర సేనాని స్ఫూర్తిని గౌరవిస్తుందనీ చాటడం ద్వారా బీజేపీకి ఉదారస్వభావం కలిగిన పార్టీగా కొత్త అర్థాన్ని ఆపాదించడం. ఈ రెండు లక్ష్యాలు కూడా కాషాయం రంగు వెలసి బీజేపీ అన్ని వర్గాలకూ, అన్ని తరగతులకూ ఆమోదయోగ్యమైన పార్టీగా రూపాంతరం చెందితే దేశానికి మంచిదే కానీ నష్టం లేదు. ఏ కోణం నుంచి చూసినా స్వచ్ఛ్ భారత్ ఉద్యమం పట్ల సందేహాలూ, సంకోచాలూ ఉండవలసిన అవసరం కనిపించదు. పారిశుద్ధ్య కార్యక్రమాన్ని మహాత్మాగాంధీ కేవలం మురికి లేకుండా, అనారోగ్యాన్ని దూరంగా పారదోలే సాధనంగా మాత్రమే చూడలేదు. ప్రజల మధ్య కులపరమైన, ఆర్థికపరమైన అంతరాలు తొలగించడానికీ, పారిశుద్ధ్యం పనిపట్ల గౌరవం కలిగించడానికీ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించారు. మోదీ సైతం సమాజంలో వివిధ వర్గాల మధ్య ఉన్న గోడల్ని కూల్చడానికి ఈ కార్యక్రమం ద్వారా ప్రయత్నిస్తున్నారు. పనిలో పనిగా ప్రజలు, ముఖ్యంగా కాంగ్రెస్‌పార్టీ, విస్మరించిన మహాత్ముడిని మరో విమోచన ఉద్యమానికి, ప్రేరణకు సంకేతంగా నిలిపి జాతిపితకు అద్భుతమైన నివాళి అర్పించారు. ఈ మంచి ప్రయత్నం విజయం సాధించాలనీ, స్వచ్ఛ్ భారత్ స్వప్నం సాకారం కావాలనీ దేశవాసులంతా ఆకాంక్షించాలి. -
పోటాపోటీగా ‘స్వచ్ఛ్ విద్యాలయ్’
గాంధీ జయంతి సందర్భంగా ‘స్వచ్ఛ్ భారత్.. స్వచ్ఛ్ విద్యాలయ్’ ప్రారంభం సాక్షి, ముంబై : నగరంలోని పలు పాఠశాలలు కేవలం విద్య లో మాత్రమే గ్రేడ్ సంపాదించడమేకాకుండా తమ పాఠశాల ఆవరణలను పరిశుభ్రంగా ఉంచి గ్రేడ్ సాధించేందుకు పోటీ పడనున్నారు. ఇందుకు గాను ఆయా పాఠశాలలకు నగదు బహుమతి కూడా లభించనుంది. గాంధీ జయంతిని పురస్కరించుకొని ‘స్వచ్ఛ్ భారత్..స్వచ్ఛ్ విద్యాలయ’ అనే ప్రచారాన్ని మానవ వనరుల అభివృద్ధి మం త్రిత్వ శాఖ ఇటీవల ప్రారంభించింది. దీంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పరిశుభ్రత పాటించిన పాఠశాలలకు రివార్డులను అందించనుంది. పాఠశాలల ఆవరణలను పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు ఎవరెవరు ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తారో వారికి గ్రేడుల వారీగా రేటింగ్‌ను ప్రకటించి నగదు బహుమతిని అందించనుంది. ఈ ప్రయత్నంలో భాగంగా ఆయా పాఠశాలలు తమ పాఠశాలలో పారిశుధ్యానికి సంబంధించి స్థితిగతులను అక్టోబర్ 31వ తేదీవరకు ఆన్లైన్లో అప్డేట్ చేయాల్సి ఉంటుంది. దీనిలో ఎక్కువగా స్కోర్ చేసిన పాఠశాలలకు ‘గ్రీన్ రేటింగ్’ ఇవ్వనున్నారు. అదేవిధంగా నగదు బహుమతిగా రూ.లక్ష ఇవ్వనున్నారు. అలాగే ‘బ్లూ రేటింగ్’ సాధించిన పాఠశాలలకు రూ.75 వేలు, ‘యెల్లో రేటింగ్’ వచ్చి న పాఠశాలలకు రూ.25 వేలు అందించనున్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని అక్టోబర్ 2వ తేదీన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వచ్ఛ్ భారత్ అభియాన్‌ను ప్రారంభించనుంది. ఈ జీవో ను సీబీఎస్ఈ తనకు అనుకూలంగా మార్చుకునేం దుకు ప్రణాళిక రచించింది. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పాఠశాల మేనేజ్మెంట్ కమిటీలతోపాటు విద్యార్థులను కూడా ఈ డ్రైవ్‌లో భాగస్వాములను చేసేందుకు నిర్ణయించింది. పాఠశాల తరగతి గదులు, టాయిలెట్లు, లేబరేటరీలు, ఆట మైదానాలు, వంట గదులను శుభ్రంగా ఉంచడంలో వీరందరూ కృషిచేస్తారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో అన్ని సీబీఎస్ఈ పాఠశాల లే కాకుండా ఇతర బోర్డులు కూడా పాల్గొననున్నాయి. ఇందుకు సంబంధించి తాము ఓ ప్రణాళికను కూడా రూపొందించామని అంధేరీకి చెందిన సీబీ ఎస్ఈ పాఠశాలకు చెందిన ప్రిన్సిపల్ దీప్షిక శ్రీవాస్తవ్ పేర్కొన్నారు. ఈ ప్రక్రి య ద్వారా చాలా మంది విద్యార్థుల్లో మంచి మార్పు వస్తుందని మరో ప్రిన్సిపల్ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా విద్యార్థులకు కూడా పరిశుభ్రత విలువ తెలుస్తుందని తెలిపారు. -
ఇండియా గేట్ వద్ద రెండున స్వచ్ఛ్ భారత్ ప్రతిజ్ఙ
సాక్షి, న్యూఢిలీ: వచ్చే నెల రెండో తేదీన ఇండియా గేట్ వద్ద ‘స్వచ్ఛ్ భారత్ ప్రతిజ్ఙ’ కార్యక్రమం జరగనుంది. ఇందులోభాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పాటు బీజేపీ నేతలు అధికారులు దేశాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దుతామంటూ ప్రతిజ్ఞ చేయనున్నారు. స్వచ్ఛ్ భారత్ మిషన్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియా గేట్ వద్ద మారథాన్‌తోపాటు గాలిపటాలను ఎగురవేసే కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం పట్టణ అభివృద్ధి మంత్రిత్వశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ప్రతిష్టాత్మంగా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యతను రాష్ట్ర బీజేపీ శాఖ స్వీకరించింది. వీలైనంత ఎక్కువ మంది ఈ కార్యక్రమంలో పాల్గొనేవిధంగా చేయడం కోసం ఆ పార్టీ నేతలు శ్రమిస్తున్నారు. ఇండియా గేట్ వద్దకు కనీసం 15 వేల మందిని చేర్చాలని యోచిస్తున్నారు. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు, కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ప్రజలకు దీనిపై అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా మండల స్థాయిలలో కార్యకర్తల సమావేశాలు జరుగుతున్నాయి. వీలైనంత ఎక్కువమంది యువత ఈ కార్యక్రమంలో పాల్గొనేవిధంగా చూడాలని బీజేపీ నేతలు కార్యకర్తలను కోరుతున్నారు. మరోవైపు వాల్మీకీ బస్తీలో స్వచ్చ్ భారత్ మిషన్ కోసం ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి. ఈ కాలనీలో ఇప్పటికే మరమ్మతు పనులు మొదలయ్యాయి. శిథిలావస్థలో ఉన్న రోడ్డు డివైడర్‌కు మరమ్మతులు చేశారు. ఇక్కడే ఉన్న పార్కులో గడ్డి కత్తిరించే పని కూడా ఇప్పటికే పూర్తి చేశారు. 300 కుటుంబాలు నివసించే ఈ కాలనీలో ప్రతి ఒక్కరూఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారని రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఆర్డబ్ల్యూఎస్) సభ్యుడు ప్రధాన్ వీరేంద్ర రాజ్‌పుత్ తెలిపారు. 20 మంది బీజేపీ కార్యకర్తలతో కలిసి ప్రధాని మోడీ వాల్మీకీ మందిర్ వద్ద చీపురు పడతారని అంటున్నారు. ఈ ఆలయం పక్కనే మహ్మాత్మా గాంధీ నివసించిన గది కూడా ఉంది. ఇక్కడ గాంధీజీ 214 రోజులు గడిపారు .ఆ సమయంలో ఆయన వాల్మీకీ వర్గానికి చెందిన పిల్లలకు చదువు చెప్పారు. నరేంద్ర మోడీ ఆ రోజున మహాత్మా గాంధీ గదిని సందర్శించడంతో పాటు డీఆర్డీఓ టెక్నాలజీతో నిర్మించిన మరుగుదొడ్డిని కూడా ప్రారంభిస్తారు. వికలాంగులకు కూడా అనువుగా ఉండే డిజైన్‌తో కూడిన ఈ టాయిలెట్ నిర్మాణ పనులు ప్రసుతం జోరుగా జరుగుతున్నాయి. కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, నితిన్ గడ్కరీ కూడా ఎన్డీఎంసీ ఏరియాలో వేర్వేరు చోట్ల జరిగే పారిశుధ్య కార్యక్రమాలలో పాల్గొంటారు. ఏడుగురు బీజేపీ ఎంపీలు కూడా తమ తమ పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలో పారిశుధ్య కార్యక్రమాలను ప్రారంభిస్తారు.