మంచాలకట్టలో నిర్మాణం పూర్తయిన మరుగుదొడ్లు
సాక్షి, పెంట్లవెల్లి: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా ఊరురా.. మరుగుదొడ్ల నిర్మాణం జోరందుకుంది. గ్రామాల్లో మరుగుదొడ్లను నిర్మించుకోవడం కోసం స్వచ్ఛందంగా ప్రజలు ముందుకు రావడంతో వీటి నిర్మాణాలను వేగవంతంగా నిర్మించేందుకు అధికారుల సైతం ఉత్సాహం చూపుతున్నారు.
3600 మరుగుదొడ్లు మంజూరు
మండలంలోని జటప్రోల్, పెంట్లవెల్లి, కొండూరు, మల్లేశ్వరం, మంచాలకట్ట, మాధవస్వామినగర్ గ్రామాలలో ప్రజలు మరుగుదొడ్ల నిర్మాణంపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. గతంలో మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడిన మహిళలు స్వచ్ఛభారత్ నేపథ్యంలో ఈ పథకంపై ఆసక్తి చూపుతున్నారు. మండలంలో 10గ్రామ పంచాయతీలకు 3,600 మరుగుదొడ్లు మంజూరయ్యాయి. ఇందులో 1500పైగా నిర్మాణాలు పూర్తయ్యాయి.
ఆసక్తి చూపుతున్న ప్రజలు
ప్రతి గ్రామంలో అధికారులు పర్యటించి స్వచ్ఛతపై అవగాహన కల్పించారు. ఊరూరా తిరుగుతూ మరుగుదొడ్లు నిర్మించుకోవాలని చెప్పారు. కొన్నిచోట్ల వాటిని కఠినం చేస్తూ సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని చెప్పడంతో స్వచ్ఛతపై అవగాహన పెంచుకున్నారు. గతంలో ఎవరో ఒకరు మాత్రమే నిర్మించుకునే వారని, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఇంటింటికి మరుగుదొడ్డి నిర్మించుకుంటున్నారని అధికారులు అంటున్నారు.
చెక్కుల పంపిణీ
గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు మొదటి, రెండో విడుతల చెక్కులను అందజేసేందుకు పంచాయతీ కార్యదర్శి, గ్రామ సర్పంచ్, మహిళ సంఘం అధ్యక్షురాలుతో చెక్కుపై సంతాకం పెట్టించారు. మరుగుదొడ్లు నిర్మించుకున్నవారికి ప్రభుత్వం అందించే రూ.12వేల ప్రోత్సాహకం సమయానికి అందుతుంది. మండలంలో 1500లకు పైగానే మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసుకున్నారు. ఇంకా 2,100 నిర్మాణ దశలో ఉన్నాయి.
స్వచ్ఛత పాటిస్తాం
మరుగుదొడ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.12వేలు ఇచ్చే పథకం ఎంతో బాగుంది. ప్రభుత్వ నిధులకు తోడు మరికొంత వ్యయం చేసి మరుగుదొడ్డి నిర్మించుకున్నాం. స్వచ్ఛత పాటిస్తేనే అందరూ ఆరోగ్యంగా ఉంటారు. చిన్నారులు, వృద్ధులు, మహిళల ఇబ్బందులు తొలగిపోయాయి. – శివయ్య, మంచాలకట్ట
Comments
Please login to add a commentAdd a comment