స్వచ్ఛ భారత్ కోసం సాక్షాత్తు ప్రధాన మంత్రే చీపురుపట్టి రోడ్లూడుస్తుంటే...జార్జియాలోని శాండీ స్ప్రింగ్స్ నగరంలో మాత్రం ఓ పారిశుద్ధ్య కార్మికుడు చెత్త 'శుద్ధి' ఎక్కువై తెలతెలవారక ముందే రోడ్లు ఊడుస్తుంటే బొక్కలోతోశారు పాపం! 30 రోజులు జైలు శిక్ష కూడా విధించారు. ఆ నగరంలో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల మధ్యనే రోడ్లూడవాలనేది అక్కడ రూల్. అంతుకుముందు రోడ్లూడుస్తుంటే మేడలు, మిద్దెల్లో నివసించే విలాసవంతుల నిద్రకు భంగం కలుగుతుందని నగర మున్సిపల్ అధికారులు ఈ రూల్ తీసుకొచ్చారట.
మూడు నెలల క్రితమే పనిలో చేరిన పారిశుద్ధ్య కార్మికుడు మ్యాక్‌గిల్ ఓ రోజు ఉదయం ఐదు గంటల ప్రాంతంలో రోడ్లూడుస్తూ అధికారుల కంటపడ్డాడు. అంతే అతని పెడరెక్కలు విరిచి పట్టుకొని తీసుకెళ్లి బొక్కలో వేశారు. మ్యాక్‌గిల్‌కు సొంతంగా లాయరును పెట్టుకొనే స్థామత లేకపోవడంతో అధికారుల తరఫున చీఫ్ ప్రాసిక్యూటర్ బిల్ రిలే కోర్టులో వీరంగం వేశారు.
చట్టాలను అతిక్రమించి తెల్లవారుజామునే పారిశుద్ధ్య కార్మికులు రోడ్లూడవడం తరచూ జరుగుతోందని, నష్టపరిహారంతో దారికి రావడం లేదని, జైలు శిక్ష వేయడమే తగిన శిక్షంటూ తెగవాదించారు. ఆయన వాగ్ధాటికి కోర్టులో ఆసీనులైవున్న జడ్జీగారు మురిసిపోయారో, భయపడ్డారో తెలదుగానీ మ్యాక్‌గిల్‌కు 30 రోజుల జైలు శిక్ష విధిస్తూ ఇటీవల తీర్పు చెప్పారు. అయితే ఆ తర్వాత మ్యాక్ గిల్ శిక్షను కోర్టు తగ్గించింది.
తెల్లవారక ముందే రోడ్లూడిస్తే జైలుశిక్ష
Published Thu, Mar 12 2015 2:24 PM | Last Updated on Thu, Aug 30 2018 4:49 PM
Advertisement