పోలీసులు తీసిన ట్రంప్ మగ్‌షాట్
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ చరిత్ర సృష్టించారు. ఫొటో సహా పోలీసుల రికార్డుల్లోకి ఎక్కిన తొలి మాజీ అధ్యక్షుడయ్యారు. 2020 అధ్యక్ష ఎన్నికల సమయంలో జార్జియాలో ఫలితాల తారుమారుకు యత్నించారన్న ఆరోపణల కేసులో ట్రంప్(77) గురువారం జార్జియాలోని ఫుల్టన్ కౌంటీ జైలులో అధికారుల ఎదుట లొంగిపోయారు. ఈ సమయంలో అధికారులు మగ్ షాట్ తీశారు.
అమెరికా చరిత్రలో మాజీ అధ్యక్షుడి మగ్ షాట్ తీయడం ఇదే మొదటిసారి. ఆరడుగుల 3 అంగుళాల ఎత్తు, 97 కిలోల బరువు, స్ట్రాబెర్రీ రంగు జుట్టు, నీలం కళ్లు..అంటూ ట్రంప్ వివరాలను జైలు అధికారులు నమోదు చేశారు. ఆయనకు ఖైదీ నంబర్ పి01135809 కేటాయించారు. 22 నిమిషాల సేపు జైలులో గడిపిన ట్రంప్ రెండు లక్షల డాలర్ల బెయిల్ బాండ్‌పై విడుదలయ్యారు. అంతకుముందు, విమానంలో అట్లాంటా ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ట్రంప్‌ను భారీ బందోబస్తు మధ్య ఫుల్టన్ కౌంటీ కోర్టుకు తీసుకొచ్చారు.
ఫెడరల్, రాష్ట్ర అధికారులు నమోదు చేసిన వివిధ నేరారోపణలకు గాను ట్రంప్ ఈ ఏడాదిలో ఇప్పటి వరకు నాలుగుసార్లు లొంగిపోయారు. మగ్ షాట్ తీయడం మాత్రం ఇదే తొలిసారి. మగ్ షాట్ ఫొటోను ట్రంప్ తన సొంత ‘ట్రూత్ సోషల్’తోపాటు ‘ఎక్స్’ఖాతాలో పోస్ట్ చేశారు. ఎన్నికల్లో జోక్యం..ఎన్నటికీ లొంగను అంటూ వ్యాఖ్యానించారు. ఫుల్టన్ కౌంటీ జైలు అధికారులు విడుదల చేసిన ట్రంప్ మగ్ షాట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. విడుదలైన అనంతరం ట్రంప్ మీడియాతో మాట్లాడారు. తానెలాంటి తప్పు చేయలేదని చెప్పుకున్నారు. అమెరికాకు ఇది చెడు దినమని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment