రోడ్డు మీద నీళ్లు పోస్తే జైలు శిక్ష..!
చంఢీఘర్: చుక్క నీటిని వృధా చేసినా ఇక ఊచలు లెక్కపెట్టాల్సిందే. గొంతు తడుపుకోవడానికి కూడా కిలోమీటర్ల దూరం వెళ్లి తెచ్చుకోవాల్సిన దుస్థితి ప్రస్తుతం అనేక రాష్ట్రాల్లో చూస్తునే ఉన్నాం. ఇప్పటికే కరువును ఎదుర్కొంటున్న హర్యానా సర్కార్ తాజాగా నీటిని వృధా చేస్తూ, రోడ్లను పాడు చేస్తున్నవారికి జైలు శిక్ష వేయడానికి సిద్ధం అవుతోంది.
తరచూ ఇంట్లో వృథాగా కనిపించే నీటిని రోడ్డు మీదుకు పారబోస్తారా? అయితే, ఇక ముందు అలా చేయకండి. నీరు పారబోసి రోడ్లను పాడుచేస్తున్న వారిని జైలు పంపే యోచనలో ఉంది హర్యానా ప్రభుత్వం. ఆ నిబంధనలు అతిక్రమించిన వారికి రూ.10,000 జరిమానా లేదా మూడు నెలల సాధారణ జైలు శిక్ష విధించాలని చట్టం తీసుకురానున్నట్లు రాష్ట్ర మంత్రి రావ్ నర్బీర్ సింగ్ తెలిపారు.
అధికారుల ఇచ్చిన సమాచారం ప్రకారం.. హర్యానాలో పలు గ్రామాల్లో ... గ్రామస్తులు నీటిని వృథా చేస్తూ రోడ్లపైన పోస్తున్నారు. దీనివల్ల రోడ్లు కొట్టుకుపోయి పాడైపోతున్నాయి. దీంతో చర్యలకు ఉపక్రమించిన సర్కారు రోడ్డు మీద కనీసం ఒక బక్కెట్ నీళ్లు పోసిన శిక్ష లేదా జరిమానా విధించాలనే నిర్ణయానికి వచ్చింది. రోడ్ల నిర్మాణంలో జర్మన్ తరహా గ్రీన్ టెక్నాలజీని రాష్ట్ర ప్రభుత్వ ఉపయోగిస్తుండటంతో దాదాపు 5కిలోమీటర్ల మార్గానికి రూ.3 కోట్ల మేర ఖర్చు అవుతోంది.
ప్రస్తుతం గుడ్ గావ్, ఫరీదాబాద్, రేవారీ, కర్నాల్ ప్రాంతాల్లో రోడ్లు నిర్మాణంలో ఉండగా.. నీటిపోయడం వల్ల రోడ్లు పాడవుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎవరైనా రోడ్లపై నీరు పోయడం చూస్తే వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయోచ్చని ఇందుకోసం ప్రత్యేక ప్రచార కార్యక్రమం కూడా నిర్వహించనున్నట్లు మంత్రి వివరించారు. 2016-17లో రాష్ట్రంలోని 5,605 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం జరపనున్నట్లు తెలిపారు.