చండీగఢ్: ప్రియుడి మోజులో పడి ఓ మహిళ కట్టుకున్న భర్తను కడతేర్చేందుకు సిద్దమైంది. ఒకటి కాదు రెండు ప్లాన్‌లు వేసి అతడిని వదిలించుకోవాలనుకుంది. మొదటి ప్రయత్నంలో అతడు ప్రాణాలతో బయటపడగా.. రెండో సారి పక్కా ప్లాన్ ప్రకారం హత్య జరిపించింది. చివరికి అనుమానాస్పద ప్రవర్తనే ఆమె నేరాన్ని పోలీసులకు పట్టించింది. ఈ కేసుపై దర్యాప్తు చేసిన పోలీసులు మూడేళ్ల తర్వాత ఆ మహిళను అరెస్ట్ చేశారు. హర్యానాలోని పానిపట్‌లో ఈ సంఘటన వెలుగుచూసింది.
వివరాలు.. కంప్యూటర్ ఇనిస్టిట్యూట్ నిర్వహించిన వినోద్ బరారాకు నిధితో వివాహమైంది. ఆ దంపతులకు ఒక కుమార్తె ఉంది. వీరు పానిపట్‌లో నివాసం ఉంటున్నారు. నిధికి కొన్నేళ్ల క్రితం సుమిత్ అనే జిమ్ ట్రెయినర్‌తో పరిచయం ఏర్పడింది. అనంతరం ఇది ప్రేమగా మారింది. ఈ విషయం వినోద్‌కు తెలియడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో వినోద్‌ను ఎలాగైనా అడ్డుతొలగించుకొని సుమిత్‌తో జీవించాలని నిధి నిర్ణయించుకొంది.
పంజాబ్‌కు చెందిన దేవ్ సునార్ అనే లారీ డ్రైవర్‌కు రూ. 10 లక్షలు సుపారీ ఇచ్చి.. తన భర్తను వాహనంతో ఢీకొట్టి చంపాలని సూచించింది. 2021 అక్టోబర్ 5న వినోద్‌ను ఇంటి సమీపంలోనే దేవ్ లారీతో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కానీ, ప్రాణాలతో బయటపడ్డాడు.
నిందితుడైన లారీ డ్రైవర్ దేవ్ సునర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసును వెనక్కి తీసుకోవాలని వినోద్‌ను సునర్ బెదిరించాడు. కానీ అతడు నిరాకరించాడు. దీంతో భర్తను ఎలాగైన సరే అడ్డు తొలగించుకోవాలన్న మహిళ మరో ప్లాన్ వేసింది. అదే ఏడాది డిసెంబర్ 15న దేవ్.. నిధి ఇంటికి వెళ్లి మంచానపడి ఉన్న వినోద్‌ను పాయింట్ బ్లాంక్ రేంజిలో కాల్చి చంపాడు. పోలీసులు దేవ్‌ను హంతకుడిగా గుర్తించి అరెస్టు చేశారు. కోర్టులో కేసు వెనక్కి తీసుకోనందుకే వినోద్‌ను చంపినట్లు పోలీసులకు చెప్పాడు.
ఈ ఘటన తర్వాత దేవ్ కుటుంబ అవసరాలను నిధి, జిమ్ ట్రైనర్ సుమిత్‌లే చూసుకొంటున్నారు. వినోద్ హత్య తర్వాత నిధి సైతం విలాసవంతంగా జీవించింది. కుమార్తెను ఆస్ట్రేలియాలోని బంధువు వద్దకు పంపింది. ఆమె విలాసవంతమైన జీవనశైలి వినోద్ కుటుంబీకుల్లో అనుమానాలను పెంచింది. దీంతో అతడి సోదరుడు ప్రమోద్ మూడేళ్ల తర్వాత పానిపట్ ఎస్పీ అజీత్ సింగ్‌కు విషయం చెప్పాడు.
తన సోదరుడి భార్యపై అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో పోలీసుల ప్రత్యేక బృందం నిందితుడు దేవ్ కాల్ డేటాను వెలికి తీసింది. తరచూ జిమ్ ట్రెయినర్ సుమిత్‌తో మాట్లాడుతున్నట్లు దానిలో గుర్తించారు. దీంతో పోలీసులు అతడి కాల్ డేటాను వెలికి తీయగా నిధితో సంబంధం బయటపడింది. దీంతో సుమిత్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు కుట్ర వెలుగులోకి వచ్చింది. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment