ఇలాగైతే ఎలా? | How ilagaite? | Sakshi
Sakshi News home page

ఇలాగైతే ఎలా?

Published Sun, Nov 23 2014 3:13 AM | Last Updated on Thu, Aug 30 2018 4:49 PM

ఇలాగైతే ఎలా? - Sakshi

ఇలాగైతే ఎలా?

అనంతపురం నగరం. తెల్లవారుజామున 5.30 గంటలు. కొందరు నిద్రపోతున్నారు. మరికొందరు వాకింగ్, జాకింగ్‌కు బయలుదేరారు. అదే సమయంలో రోడ్లపై పడిన చెత్తాచెదారంతో పాటు మురుగు కాలువలను శుభ్రం చేసేందుకు పారిశుద్ధ్య కార్మికులు సమాయత్తమయ్యారు. నగరాన్ని నిత్యం క్లీన్‌గా ఉంచేందుకు పాటుపడుతున్న వీరికి ప్రభుత్వం కల్పిస్తున్న వసతులు అంతంత మాత్రమే.

చేతికి గ్లౌజులు లేవు. ముక్కుకు మాస్క్‌ల్లేవు. కాళ్లకు గంబూట్లూ లేవు. అయినా అలానే మురుగు కాలువల్లోకి దిగుతున్నారు. చేతులతో మురుగు ఎత్తేస్తున్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు తమ ఆరోగ్యాలను ఫణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్న వీరి కష్టసుఖాలను ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా ఎమ్మెల్సీ డాక్టర్ మీసరగండ గేయానంద్ స్పృజించారు.
 
 గేయానంద్ : నీ పేరేంటమ్మా?
 పారిశుద్ధ్య కార్మికురాలు : బాల ఓబుళమ్మ సార్...
 గేయానంద్ : రోజూ ఎన్ని గంటలు పని చేస్తావమ్మా?
 బాల ఓబుళమ్మ : ఉదయం ఐదున్నరకు వచ్చి పది గంటల వరకు పనిచేస్తాం.
 గేయానంద్ : పని చేస్తున్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి తల్లీ?
 బాల ఓబుళమ్మ : ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.
 గేయానంద్ : చేతులకు వేసుకునేవి ఇస్తున్నారా?
 బాల ఓబుళమ్మ : చాలా రోజుల కిందట ఇచ్చారు. అవి అప్పుడే పాడైపోయాయి.
 గేయానంద్ : జీతమెంత వస్తోంది?
 బాల ఓబుళమ్మ :15 ఏళ్ల నుంచి పనిచేస్తున్నా. మొదట్లో రూ.800 ఇచ్చారు. ఇప్పుడు రూ.7,600 ఇస్తున్నారు. సరిపోవడం లేదు.
 -----------------------------------
 గేయానంద్ : నీ పేరేంటి?
 పారిశుద్ధ్య కార్మికుడు : నారాయణస్వామి సార్..
 గేయానంద్ : పని చేస్తున్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు కల్గుతున్నాయి?
 నారాయణస్వామి : కసువు ఎత్తేప్పుడు నోట్లోకి, ముక్కలోకి పోతోంది. ఆరోగ్యం పాడవుతోంది. అయినా తప్పదు. మా పనే ఇది. అలాగే చేస్తున్నాం.
 -----------------------------------
 గేయానంద్ : ఏమి పేరమ్మా?
 కార్మికురాలు : బాలమ్మ అయ్యా...
 గేయానంద్ : చేతులకు గ్లౌజులు, ముక్కుకు మాస్క్ లేకపోతే ఎలా పని చేస్తున్నారమ్మా?
 బాలమ్మ : ఏమి చేస్తామయ్యా.. తప్పదు! ఇదో ఈ రేకుతో గంపలోకి నెట్టుకుంటాం. దుమ్ము లోపలికి పోతుంది. ఇబ్బందిగానే ఉంటుంది.
 గేయానంద్ : ఏవైనా రోగాలు వస్తే ఎలాగమ్మా?
 బాలమ్మ : రోగాలు వస్తే పెద్దాస్పత్రికి పోతాం. ప్రైవేటు ఆస్పత్రికి పోయేందుకు మా కాడ అంత స్తోమత ఏడిది?
 గేయానంద్ : వస్తున్న జీతం సరిపోతోందా?
 బాలమ్మ : సరిపోకపోయినా సర్దుకోవాల్సిందే. అన్ని ఖర్చులూ పెరిగాయి.. మా కష్టం చూసి పెంచితే సంతోషమే.
 -----------------------------------
 గేయానంద్ : నీ పేరేంటి?
 కార్మికుడు : వెంకటేశులు
 గేయానంద్ : ఏం పని చేస్తావ్?
 వెంకటేశులు : రెగ్యులర్ మేస్త్రీని సార్..
 గేయానంద్ : ఎంత మందితో పని చేయిస్తావ్?
 వెంకటేశులు : పదకొండు మందితో..
 గేయానంద్ : ఎంత మంది పిల్లలు ?
 వెంకటేశులు :ముగ్గురు కొడుకులు. ఇద్దరు పిల్లలు కార్పొరేషన్‌లోనే కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్నారు.
 గేయానంద్ : సెలవులు ఇస్తారా?
 వెంకటేశులు : ఎక్కడి సెలవులు సార్.. ఇది రోజు ఉండే పని. చాలా తక్కువగానే ఇస్తారు. నేను కూడా సెలవులు పెద్దగా తీసుకోను.
 -----------------------------------
 గేయానంద్ : నీ పేరేంటయ్యా..?
 కార్మికుడు : మల్లికార్జున
 గేయానంద్ : ప్రస్తుత జీతమెంత?
 మల్లికార్జున: రూ.6,800  
 గేయానంద్ :ఎన్నేళ్లుగా         పనిచేస్తున్నావు?
 మల్లికార్జున: తొమ్మిదేళ్ల నుంచి..
 గేయానంద్ : చేతులకు గ్లౌజులు ఇవ్వకపోతే ఎలా చేస్తున్నారు?
 మల్లికార్జున:గ్లౌజులే కాదు.. పనిముట్లు కూడా పెద్దగా ఇవ్వడం లేదు. ఉన్న వాటితోనే సర్దుకుపోతున్నాం.
 -----------------------------------
 గేయానంద్ : నీ పేరు ఏంటమ్మా?
 కార్మికురాలు : ఇమాంబీ
 గేయానంద్ : జీతమెంత ఇస్తున్నారు?
 ఇమాంబీ: ఆరు వేల రూపాయలు
 గేయానంద్ : ఇది సరిపోతుందా?
 ఇమాంబీ:  పిల్లల చదువుకు, ఖర్చుకు కూడా సరిపోదు. ఏమి చేస్తాం సార్.. వచ్చేదాంతోనే సర్దుకుని బతుకుతున్నాము.
 గేయానంద్ : పిల్లలెంతమంది? ఏమి చదివిస్తున్నావు?
 ఇమాంబీ:  ఒక కొడుకు. కాన్వెంట్‌లో చదివిస్తున్నా. ఏడాదికి ఏడు వేల రూపాయల ఫీజు కడుతున్నా.
 గేయానంద్ : ఆరోగ్యం ఎలా ఉంటోంది?  
 ఇమాంబీ:  మాకు ఆరోగ్య సమస్యలు ఎక్కువగానే వస్తాయి. పెద్దాస్పత్రికి వెళ్లి చూపించుకుంటాం.
 -----------------------------------
 గేయానంద్ : నీ పేరు?
 కార్మికుడు : గుర్రప్ప
 గేయానంద్ : ఎప్పటి నుంచి పని చేస్తున్నావ్?
 గుర్రప్ప: 25 ఏళ్లుగా..
 గేయానంద్ : ఎలాంటి ఇబ్బందులు పడుతున్నావ్?
 గుర్రప్ప:  జబ్బులు వస్తున్నాయి. ఈఎస్‌ఐ కార్డు ఇవ్వనేలేదు. అదిస్తే కాస్త ఊరట ఉంటుంది.
 -----------------------------------
 గేయానంద్ : ఏం పేరు బాబూ?
 కార్మికుడు : ప్రసాద్ సార్..
 గేయానంద్ : జీతమెంత?
 ప్రసాద్: రూ.8,300  
 గేయానంద్ : పీఎఫ్, ఈఎస్‌ఐ     జమ అవుతున్నాయా?
 ప్రసాద్: జీతం నుంచి కట్ చేస్తున్నారు. అయితే.. జమ చేయడం లేదు.
 -----------------------------------
 గేయానంద్ : నీ పేరేంటి?
 కార్మికుడు : నాగలింగం
 గేయానంద్ : జీతం సరిపోతోందా?
 నాగలింగం: సరిపోదు. అయినా తప్పదు కదా! వచ్చే కొద్ది జీతంతోనే బతుకుతున్నాం.
 గేయానంద్ : జీతం నెలనెలా ఇస్తున్నారా?
 నాగలింగం: మూడు నెలలైంది.. ఇప్పటికీ ఇవ్వలేదు.
 గేయానంద్ : నెలనెలా రాకపోతే ఇల్లు ఎలా గడుస్తుంది?
 నాగలింగం: వడ్డీకి అప్పు చేస్తున్నాం. మూడు నెలలకు ఒకసారి ఇస్తే వచ్చేదాంట్లో వడ్డీకే కొంత పోతోంది. అలా కాకుండా ప్రతి నెలా ఇస్తే బాగుంటుంది.
 -----------------------------------
 గేయానంద్ : నీ పేరేంటయ్యా?
 కార్మికుడు : మల్లేష్
 గేయానంద్ : ఇంత వాసన భరించి పని చేస్తుంటారు రోగాలు రావా?
 మల్లేష్: ఏమి చేయాల సార్! మాకు ఇదే జీవితం. పనిచేయకపోతే ఇల్లు గడవదు. వాసనొచ్చినా.. ఏమొచ్చినా చేయాల్సిందే కదా!
 గేయానంద్ : ఇన్ని ఏళ్లుగా పని చేస్తున్నారు కదా? ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు?
 మల్లేష్: మాకు వచ్చే జీతంతో కుటుంబాలే గడవవు. పక్కా గృహాలు ఇస్తే అద్దె అయినా తగ్గుతుంది. ఈఎస్‌ఐ కార్డు కూడా ఇవ్వాలి.
 -----------------------------------
 గేయానంద్ : నీ పేరేంటి బాబూ?
 కార్మికుడు : నాగేంద్ర
 గేయానంద్ : ఎన్నేళ్లుగా పని చేస్తున్నావ్? జీతం ఎంత వస్తోంది?
 నాగేంద్ర: 1996 నుంచి పనిచేస్తున్నా. మొదట్లో రూ.800 వచ్చేది. ఇప్పుడు రూ.8,300 ఇస్తున్నారు.
 గేయానంద్ : సమస్యలేవైనా ఉన్నాయా?
 నాగేంద్ర: జ్వరాలు వస్తున్నాయి. గవర్నమెంటు ఆస్పత్రికి పోయి చూపించుకుంటాం.  రోగాలొస్తున్నా అలాగే చేస్తున్నాం.
 గేయానంద్ : ప్రభుత్వం నుంచి ఏమి కోరుకుంటున్నారు?
 నాగేంద్ర: ఏళ్లగా పనిచేస్తున్నాం. పర్మినెంట్ చేయాలని కోరుతున్నాం. జీతభత్యాలు కూడా పెంచాలి.
 -----------------------------------
 గేయానంద్ : నీ పేరు చెప్పమ్మా?
 కార్మికుడు : లక్ష్మినరసమ్మ సార్..
 గేయానంద్ : పనిభారం ఉందా?
 లక్ష్మినరసమ్మ : చాలా ఉంది సార్. ఇక్కడా పని చేయిస్తారు. ఇంటింటికీ వెళ్లి చెత్త తీసుకొచ్చేందుకు పంపిస్తారు. సరిపడా కార్మికులు లేరు. ఎక్కువ మందిని తీసుకోమని అడుగుతున్నా పట్టించుకోవడం లేదు.
 గేయానంద్ : సొంతిల్లు ఉందా?
 లక్ష్మినరసమ్మ : లేదు సార్..
 గేయానంద్ : ఇల్లు ఇవ్వాలని ప్రభుతాన్ని అడిగారా?
 లక్ష్మినరసమ్మ :  చాలా ఏళ్ల కిందట కంపోస్ట్ యార్డు వద్ద ఇస్తామని చెప్పారు కానీ ఇవ్వలేదు. ఇప్పటికీ అడుగుతూనే ఉన్నాం. ఎవరూ పట్టించుకోవడం లేదు.
 గేయానంద్ : మీ పిల్లలనూ ఈ పనిలోనే కొనసాగిస్తారా?
 లక్ష్మినరసమ్మ : మా బాధలు పిల్లలకు వద్దు. ఈ కష్టం మాతోనే పోవాలె. అందుకే ఉన్నదాంట్లో వారికి ఖర్చు చేసి చదివించుకుంటున్నాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement