స్వచ్ఛభారత్‌లో అపశ్రుతి
వేంపల్లె : స్వచ్ఛభారత్ కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. పాఠశాల ఆవరణంలో చెత్తా చెదారం తొలగించి శుభ్రంగా చేస్తుండగా ఓ విద్యార్థికి విషపురుగు కుట్టి మృతి చెందాడు. పాఠశాల ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు మృతి చెందాడని ఆ బాలుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వివరాలిలా ఉన్నారుు.
ఇడుపులపాయ గ్రామ పంచాయతీలోని మారుతీ నగర్ ప్రాథమిక పాఠశాలలో ఆంజనేయులు, వెంకటేశ్వరమ్మల దంపతుల కుమారుడు వెంకట చరణ్ (6) 1వ తరగతి చదువుతున్నాడు. మధ్యాహ్నం 12గంటల ప్రాంతంలో భోజన సమయంలో అక్కడ పాఠశాల ఆవరణంలో ఇతర విద్యార్థులతో కలిసి శుభ్రపరిచేందుకు వెళ్లాడు. ఆ సమయంలో వెంకట చరణ్ కుడికాలికి నొప్పి తగిలింది. వెంటనే అక్కడ ఉన్న ఉపాధ్యాయులు వెంకటేష్, గిరిజకుమారిలకు చెప్పాడు. ఏదో కుచ్చుకుని నొప్పిగా ఉందని తెలియజేయడంతో ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు విషయాన్ని చేరవేశారు. తల్లి వెంకటేశ్వరమ్మ పాఠశాల వద్దకు వెళ్లి తన కొడుకును ఆటోలో వేంపల్లె ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఇక్కడ చికిత్స పొందుతూ వెంకటచరణ్ మృతి చెందాడు.
ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్లే...
స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో పాఠశాల ఆవరణాన్ని శుభ్రపరుస్తుండగా ఏదో విష పురుగు కుట్టిందని.. దీంతోనే తన కుమారుడు మృతి చెందాడని తల్లిదండ్రులు ఆరోపించారు. ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్లే తన కుమారుడు మృతి చెందారని తీవ్రస్థాయిలో తల్లిదండ్రులు, బంధువులు ఆసుపత్రి వద్ద అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులపై విరుచుకపడ్డారు. సంఘటన జరిగిన వెంటనే ఉపాధ్యాయులు ఆసుపత్రికి తీసుకెళ్లి ఉండి ఉంటే తమ కుమారుడు ప్రాణాలతో ఉండేవారని వారు కన్నీటి పర్యంతమయ్యారు.
అక్కడే ఉన్న ఆర్.కె.వ్యాలీ ఎస్‌ఐ ప్రదీప్‌నాయుడు ఘర్షణ జరగకుండా నిలువరించగలిగారు. తమ కుమారుడు మృతికి ఉపాధ్యాయులే కారణమని వాపోయారు. మృతి చెందిన వెంకట చరణ్‌కు నోటి నుండి బురుగు రావడంతో దాదాపు విష పురుగు కుట్టిందని నిర్థారణకు వచ్చారు. పోస్టుమార్టం నిర్వహిస్తే కానీ సరైన కారణం తెలియదు. ఆర్‌కె వ్యాలీ ఎస్‌ఐ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
స్వచ్ఛ భారత్ చేపట్టలేదు
స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టలేదని.. మధ్యాహ్న భోజన సమయంలో ప్లేట్లు శుభ్రపరిచేందుకు అక్కడికి వెళ్లి ఏదో ముళ్లు కుచ్చుకున్నట్లు తమ వద్దకు వచ్చారని అక్కడి ఉపాధ్యాయులు చెబుతున్నారు.
పలువురి పరామర్శ
మృతి చెందిన వెంకటచరణ్ మృతదేహాన్ని పలువురు రాజకీయ నాయకులు సందర్శించారు. తల్లిదండ్రులు, బంధువులను ఓదార్చారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఇడుపులపాయ ఎంపీటీసీ, వేంపల్లె ఎంపీపీ రవికుమార్‌రెడ్డి, వైఎస్‌ఆర్ సీపీ కన్వీనర్ చంద్ర ఓబుళరెడ్డి, వేంపల్లె గ్రామ సర్పంచ్ విష్ణువర్థన్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్‌రెడ్డిలు పరామర్శించిన వారిలో ఉన్నారు. విద్యార్థి మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ పులివెందుల డివిజన్ అధ్యక్షుడు విష్ణువర్థన్‌రెడ్డి డిమాండు చేశారు.