ప్రజలపై ‘స్వచ్ఛ’ భారం
అన్ని సేవలపై స్వచ్ఛభారత్ పేరిట 0.5 శాతం పన్ను
ఈనెల 15 నుంచి అమలు
కేంద్రానికి అదనంగా ఏటా రూ.4,000 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: మోదీ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమానికి నిధుల సేకరణే లక్ష్యంగా తాజాగా అన్ని సేవలపై 0.5 శాతం ‘స్వచ్ఛభారత్’ పన్నును విధించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నెల 15వ తేదీ నుంచి ఈ కొత్త పన్ను అమల్లోకి రానుంది. పన్ను అమల్లోకి వస్తే ప్రతీ రూ.100 విలువైన సేవలపై 50 పైసలు సెస్ రూపంలో వసూలు చేస్తారు. విమాన ప్రయాణాలు, టెలిఫోన్ సేవలు, హోటల్ భోజనాలు, బ్యాంకింగ్ ఇలా ప్రతీ సేవ పైనా ‘స్వచ్ఛ భారత్’ పన్నును విధిస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తగా వసూలు చేస్తున్న 14 శాతం సేవా పన్నుకు ఇది అదనం. ఈ పన్ను ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలోనే అదనంగా రూ.4,000 కోట్లు కేంద్రం సమీకరించనుంది. ఈ మొత్తాన్ని కేవలం స్వచ్ఛభారత్ కార్యక్రమం కోసం ఖర్చు చేయనున్నారు. ఫిబ్రవరి 28న 2015-16 బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి జైట్లీ మాట్లాడుతూ.. అవసరమైతే 2 శాతం స్వచ్ఛభారత్ సెస్ వసూలుచేస్తామని వ్యాఖ్యానించడం తెలిసిందే.
స్వచ్ఛభారత్ అభియాన్ నీతి ఆయోగ్ ఉప కమిటీ కన్వీనర్‌గా ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల నివేదికను ప్రధాని మోదీకి అందచేసిన విషయం విదితమే. ఆ నివేదికలో 2019 నాటికి దేశాన్ని స్వచ్ఛభారత్‌గా తీర్చిదిద్దడానికి చేపట్టాల్సిన అంశాలను సిఫార్సుల రూపంలో కేంద్రానికి నివేదించింది. స్వచ్ఛభారత్‌కు నిధుల సమీకరణ విషయంలో కార్పొరేటు సామాజిక బాధ్యత కింద వివిధ సంస్థలు, చమురు సంస్థలు, ఇతరత్రాల నుంచి సెస్‌ల రూపంలో వసూలు చేయడానికి సిఫార్సులు చేసినట్టు బాబు చెప్పడం ప్రస్తావనార్హం. కానీ శుక్రవారం కేంద్రం అన్ని సేవలపై సెస్ రూపంలో ప్రజలపై భారం వేస్తూ నిర్ణయం తీసుకుంది.
అయితే, స్వచ్ఛభారత్ సెస్ ఎలాంటి పన్ను కాదని శుక్రవారం ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదలచేసింది. స్వచ్ఛభారత్‌లో దేశ ప్రజలందరినీ భాగస్వాములను చేసే దిశలో కేంద్రం వేసిన ముందడుగు అని అభివర్ణించింది. ఈ దిశగా దేశంలో ఇప్పుడు అమలులో ఉన్న అన్ని రకాల సేవలపై స్వచ్ఛభారత్ సెస్‌గా విధిస్తున్నట్లు ప్రకటన తెలిపింది. 2015-16 బడ్జెట్‌లో స్వచ్ఛభారత్‌కు సంబంధించి సెస్ వసూలకు ప్రతిపాదన చేసినట్టు పేర్కొంది. కేంద్రం తాజా నిర్ణయంతో సేవా పన్ను పెరగడంతోపాటు, కార్పోరేట్ సంస్థలు సెస్‌కు తగ్గట్లుగా తమ వ్యాపార ప్రణాళికలను మార్చుకోవాల్సి ఉంటుందని ఎర్నెస్ట్ అండ్ యంగ్ ట్యాక్స్ పార్ట్‌నర్ బిపిన్ సాప్రా అభిప్రాయపడ్డారు. కొత్త సెస్‌తో భారత్‌లో వ్యాపార ఖర్చు పెరుగుతుందని డెలాయిడ్ ఇండియా సీనియర్ డెరైక్టర్ సలోని రాయ్ చెప్పారు.