ప్రస్తుతం వస్తున్న రాబడికి అదనంగా మరో 15–25 శాతం వరకు పెంచాలి
సాక్షి, అమరావతి: రాష్ట్ర సొంత పన్నులు, పన్నేతర ఆదాయాలను గణనీయంగా పెంచాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదాయ ఆర్జన శాఖలకు స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే ప్రజలపై భారం పడకుండానే ఆదాయ పెంపు మార్గాలను అన్వేషించి ఆదాయ ఆర్జన శాఖలు ప్రస్తుతం వస్తున్న ఆదాయానికి మించి అదనంగా 15 శాతం 25 శాతం వరకు పెంచాలని ఆయా శాఖల అధికారులకు సీఎం సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కేంద్రాన్ని నిధులు అడగలేమని, రాష్ట్ర సొంత ఆదాయ వనరుల ద్వారానే అమలు చేయాల్సి ఉందని ఆయన చేశారు.
ఆదాయ ఆర్జన శాఖలైన వాణిజ్య పన్నులు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ, ఎక్సైజ్, రవాణా, మైనింగ్, ఆర్ధికశాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ఉండవల్లిలోని తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. అధికార వర్గాల సమాచారం మేరకు సీఎం సమీక్షలో ఆదాయ ఆర్జన శాఖలకు ఆర్థిక శాఖ భారీ ఆదాయ లక్ష్యాలను నిర్దేశించినట్లు తెలిసింది. భూముల విలువ పెంపు ద్వారా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ఆదాయాన్ని భారీగా పెంచాల్సిందిగా ఆర్ధిక శాఖ ప్రతిపాదించింది. ప్రస్తుతం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ద్వారా ప్రస్తుతం వస్తున్న రూ.8000 కోట్ల ఆదాయాన్ని రూ.14 వేల కోట్లకు పెంచాలని లక్ష్యంగా నిర్దేశించింది.
ఇందుకుగాను భూముల విలువను పెంచాల్సిందిగా సూచించింది. దీని ద్వారా 10 నుంచి 15 శాతం మేర ఆదాయం పెంచాల్సి ఉందని స్పష్టం చేసింది. అలాగే స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్ చార్జీల పెంపుపైన కూడా కసరత్తు చేయాలని నిర్ణయించారు. జీఎస్‌టీ ఎగవేతలను నిరోధించడం, లీకేజీలను అరికట్టడం ద్వారా ఆదాయాన్ని పెంచాల్సిందిగా సూచించారు. మైనింగ్ కార్యకలాపాల ద్వారా ప్రస్తుతం రూ.4,500 కోట్లు ఆదాయం వస్తోందని, దీన్ని రూ.8000 కోట్లకు పెంచాల్సిందిగా ఆర్థికశాఖ నిర్దేశించింది.
నూతన ఎక్సైజ్ విధానం అమల్లోకి వస్తే ఆదాయం భారీగా పెరుగుతుందనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. రవాణా రంగం ద్వారా ఆదాయం పెంచే మార్గాలను అన్వేíÙంచాల్సిందిగా సూచించింది. సొంత ఆదాయ వనరులను పెంచుకోవడం ద్వారానే హామీలు అమలు చేయగలమని, ఈ నేపథ్యంలో ఆదాయ ఆర్జన శాఖలు అందుకు అనుగుణంగా చర్యలను తీసుకోవాల్సిందిగా సీఎం చంద్రబాబు ఆదేశించారు.
ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త..
ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త.. నినాదంతో ముందుకు సాగాలని, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధిపరిచేందుకు అవసరమైన ముందస్తు ప్రణాళికతో పారిశ్రామిక అభివృద్ధి దిశగా పయనించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఆయన శుక్రవారం పరిశ్రమలశాఖ మంత్రులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
తిరుపతి, అమరావతి, వైజాగ్‌తో కలిపి ఐదు అంతర్జాతీయ వాణిజ్య అభివృద్ధి కేంద్రాలను స్థాపించడం ద్వారా ఎంఎస్‌ఎంఈలలో పోటీతత్వాన్ని మెరుగుపరచాలని సూచించారు. 1.75 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంలో భాగంగా నియోజకవర్గానికి ఒకటి వంతున 175 మైక్రో పార్కులను ఏర్పాటు చేయాలని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో పరిశ్రమలశాఖ మంత్రి టి.జి.భరత్, సూక్ష్మ చిన్న మధ్యతరహ పరిశ్రమల మంత్రి కొండపల్లి శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment