నిరుపేద విమలమ్మ, ఆమె ఇద్దరు మనవరాళ్లు, మనవడు నిన్నటి వరకు తలదాచుకున్న స్వచ్ఛభారత్ మరుగుదొడ్డి
ఒడిశా: తండ్రి చనిపోతాడు. తల్లి పిల్లల్ని పెంచి పెద్ద చేస్తుంది. వాళ్లు ఐ.ఏ.ఎస్.లు, ఐ.పి.ఎస్.లు అవుతారు. (లేదా) తల్లి చనిపోతుంది. తండ్రి పిల్లల్ని వదిలేసి వెళ్లిపోతాడు. వాళ్లను అమ్మమ్మ చేరదీస్తుంది. చాలావరకు ఇలాగే జరుగుతుంది. తండ్రికి పిల్లలెందుకు పట్టరో తల్లిని తీసుకెళ్లిన ఆ దేవుడికే తెలియాలి. మూడేళ్ల క్రితం తల్లి చనిపోయి, తండ్రి వదిలేసి పోతే విమలమ్మే ఇద్దరు మనవరాళ్లను (8 ఏళ్లు, 4 ఏళ్లు) మనవడిని (6 ఏళ్లు) సాకుతోంది. ఏ ప్రభుత్వ రికార్డులలో లేని ఈ కుటుంబం ఒడిశాలోని అంగుల్ జిల్లా, కిషోర్ నగర్ తాలూకా, బైసాన గ్రామంలో ఉంది. మొన్నటి వరకు మట్టి గుడిసెలో ఉండేవారు. వర్షాలకు అది మెత్తబడి, కూలిపోవడంతో గ్రామ శివారులో కొత్తగా కట్టిన స్వచ్ఛ భారత్ మరుగుదొడ్డిలో తల దాచుకుంటున్నారు. తలే దాచుకుంటున్నారు. చదవండి: (ఈ చిన్నారులకు దిక్కెవరూ...! )
వంట, స్నానాలు ఆరు బయట. ఆ నలుగురే ఒకరికొకరు నా అన్న వాళ్లు. పిల్లల్ని ఇంట్లో వదిలేసి ఏ రోజుకారోజు పని వెతుక్కోడానికి వెళ్లొస్తుంటుంది విమలమ్మ. వయసు మీద పడి ఇప్పుడు ఏ పనీ చేయలేకపోతోంది. ఆ కష్టాలను ఊహించుకోవలసిందే. పై నుంచి తల్లి తన తల్లిని, బిడ్డల్ని చూసిందో ఏమో, ఆమే పంపినట్లుగా ఒక సామాజిక కార్యకర్త వాళ్లను చూశాడు. పంచాయితీ ఆఫీసులో తాత్కాలికంగా గూడు ఏర్పాటు చేయించాడు. ఆ నలుగురు పొట్టల్ని నింపడానికి ప్రభుత్వం దగ్గర బియ్యం, పప్పులు ఉప్పులు ఉన్నాయి. ఆమెకు పింఛను ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయి. పిల్లల్ని చేర్చడానికి బడులు ఉన్నాయి. నివాసం ఉంచేందుకు షెల్టర్‌లు ఉన్నాయి. ప్రభుత్వం దగ్గర ఇన్ని ఉన్నా, తీసుకోడానికి వీళ్ల దగ్గర పౌరులుగా ఏ గుర్తింపూ లేదు.
కనీసం ఆధార్ కార్డు లేదు. అవన్నీ వచ్చేవరకు పంచాయితీ కార్యాలయం లో ఉండేందుకైతే అనుమతి వచ్చింది. అక్కడికే సంతోషంగా ఉంది విమలమ్మ. విమలా ప్రధాన్ పూర్తి పేరు. పిల్లలకు ఇవేమీ తెలియదు. తల్లి లేకపోవడం పేదరికం. అమ్మమ్మ దగ్గర ఉండటం రాజరికం. పేదలందరికీ అమ్మమ్మ లాంటి ప్రభుత్వం ఉండాలి. వారిని ప్రభుత్వం దగ్గరకు చేర్చేందుకు అమ్మ లాంటి యాక్టివిస్ట్ లు ఉండాలి.
Comments
Please login to add a commentAdd a comment