పరిశుభ్రమైన భారత దేశ నిర్మాణం కోసం స్వచ్ఛ్ భారత్ పేరుతో ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన జాతీయోద్యమం చరిత్రాత్మకమైనది. తరతరాల అలవాట్లను మార్చడానికీ, మరుగుదొడ్లు కట్టుకొని వినియో గించడానికీ, ప్రతి ఇంటినీ, వాడనీ, గ్రామాన్నీ పరిశుద్ధంగా దిద్దితీర్చ డానికీ గురువారం మోదీ మొదలుపెట్టిన రెండు లక్షల కోట్ల రూపాయల భారీ పారిశుద్ధ్య పథకం విజయవంతంగా అమలు జరగడానికీ ప్రజలందరూ త్రికరణశుద్ధిగా కృషి చేయాలి.
మోదీ స్వయంగా చీపురు చేతపట్టి ఊడ్చటం, దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులూ, సామాజిక ప్రముఖులూ, ఉన్నతాధికారులూ పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొనడం, ఈ సందర్భంగా మహాత్మాగాంధీని స్మరించడం గమనించినవారికి దీన్ని ఎంత సమర్థంగా అమలు చేయాలని ప్రధాని సంకల్పించారో అర్థం అవుతుంది. లోగడ ప్రభుత్వాలు ఇటువంటి ప్రయత్నాలు చేయకపోలేదు. అన్నిటి మాదిరే ఇది కూడా అరకొర ఫలితాలు ఇచ్చి మూలనపడింది. ఎన్‌డీఏ సర్కార్ ప్రారంభించిన ఈ కార్యక్రమం ఇదివరకటి కార్యక్రమాల కంటే విస్తృతిలో, ప్రాధాన్యంలో భిన్నమైనది. మోదీ ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజులకే స్వాతంత్య్ర దినోత్సవ సందేశంలో స్వచ్ఛ్‌భారత్ స్వప్నాన్ని ఆవిష్కరించారు. ఈ బృహత్కార్యక్రమానికి మహాత్మాగాంధీ 145వ జయంతినాడు శ్రీకారం చుట్టబోతున్నట్టు చెప్పారు.
అమెరికా యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకొని వచ్చిన వెంటనే మోదీ తన ఆలోచనను ఆచరణలో పెట్టారు. లోగడ ఏ ప్రధానీ చేయని విధంగా పరిశుభ్రమైన భారతదేశ నిర్మాణానికి జాతీయోద్యమం నిర్వహించాలనీ, దానికి కేంద్రప్రభుత్వమే పూనిక వహించాలనీ, 2019 నాటికి మరుగుదొడ్డి లేని ఇల్లు కానీ, విద్యాసంస్థ కానీ, కార్యాలయం కానీ ఉండకూడదనీ, స్వచ్ఛమైన నీరూ, గాలీ, వాతావరణం ఉండే విధంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునే సంస్కృతి నెలకొనాలనీ, బహిరంగ ప్రదేశాలలో కాలకృత్యాలు తీర్చుకునే అలవాటుకు స్వస్తి చెప్పే విధంగా ప్రజలలో అవగాహన, చైతన్యం పెంచాలనీ సంకల్పం. అపరి శుభ్రత అనారోగ్యానికి మూలం. అనారోగ్యం పైన విజయం సాధించాలంటే స్వచ్ఛ్ భారత్ ఉద్యమం జయప్రదం కావాలి.
పారిశుద్ధ్యం లోపించిన కారణంగా వాతావరణం కలుషితమై వ్యాధులు ప్రబలి ప్రాణనష్టంతో పాటు లక్షల కోట్ల రూపాయల నష్టం జరుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఘోషిస్తోంది. బహిర్భూమికి వెళ్ళవలసిన కారణంగా దేశంలోని అనేక ప్రాంతాలలో యువతులు మానవమృగాల లైంగికదాడికి గురైన ఉదంతాలు అనేకం. పాఠశాలలో మరుగుదొడ్లు లేక దేశంలో లక్షలమంది బాలికలు చదువులను అర్ధంతరంగా మాని వేస్తున్నారు. అనేకమంది బాలికలకూ, ఉపాధ్యాయులకూ మూత్రపిండాల జబ్బులు వచ్చినట్టు నివేదికలు ఉన్నాయి. పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణాన్ని సుప్రీంకోర్టు పర్యవేక్షించినా ప్రయోజనం లేకపోయింది. ఇప్పుడు ప్రధాని స్వయంగా పూనుకున్నారు కనుకా, ఇందులో దేశ ప్రజలను భాగస్వాములను చేయబోతున్నారు కనుకా ఈ మహాప్రయత్నం ఫలిస్తుందని ఆశించవచ్చు. కానీ ఇది ప్రభుత్వ బాధ్యతగానో, సర్కారీ కార్యక్రమంగానో ప్రజలు భావించినట్లయితే ఈ పథకం సైతం పూర్వపు పథకాల మాదిరే విఫలమై మనలను వెక్కిరిస్తుంది. ఇది ఒక్క రోజుకో లేదా కేరళ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమం ఉద్దేశించిన ట్టు ఒక నెలకో పరిమితం కారాదు. ఇది నిత్యకృత్యం కావాలి.
గొప్ప కల కనడమే కాకుండా, జాతి సిగ్గుతో తల దించుకోవలసిన ఒకానొక మౌలిక సమస్యనూ, దురాచారాన్నీ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ప్రముఖంగా ప్రస్తావించే సాహసం చేసినందుకూ, పరిష్కారానికి నడుం బిగించినందుకూ నరేంద్రమోదీకి సహస్రాభినం దనలు. ఈ పథకాన్ని మహాత్మాగాంధీ పుట్టిన రోజున ప్రారంభించడంలో గడుసుదనం లేకపోలేదు. మోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న బీజేపీకీ, దాని సైద్ధాంతిక మూలాధారమైన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌కీ గాంధీ అంటే సరిపడదు. నాథూరాం గాడ్సే, వీర్ సావర్కర్‌ల భావజాలానికీ, గాంధీమార్గానికీ పొంతనలేదు. పైగా వైరుధ్యం ఉంది. అటువంటి గాంధీని ఒక ముఖ్యమైన జాతీయస్థాయి ఉద్యమానికి ప్రతీకగా నిలపడం ద్వారా మోదీ రెండు సత్ఫలితాలు సాధించాలని ఆశించి ఉంటారు.
ఒకటి, గాంధీజీ కాంగ్రె స్ సొంతం కాదనీ, అందరికీ చెందినవాడని నిరూపించడం. రెండు, సంఘ్ పరివారం గాంధీ మార్గాన్ని అనుసరించడానికీ సంకోచించదనీ, ఇదివరకటి రాజీలేని, పట్టువిడుపులు లేని వైఖరిని విడనాడి స్వాతంత్య్ర సేనాని స్ఫూర్తిని గౌరవిస్తుందనీ చాటడం ద్వారా బీజేపీకి ఉదారస్వభావం కలిగిన పార్టీగా కొత్త అర్థాన్ని ఆపాదించడం. ఈ రెండు లక్ష్యాలు కూడా కాషాయం రంగు వెలసి బీజేపీ అన్ని వర్గాలకూ, అన్ని తరగతులకూ ఆమోదయోగ్యమైన పార్టీగా రూపాంతరం చెందితే దేశానికి మంచిదే కానీ నష్టం లేదు. ఏ కోణం నుంచి చూసినా స్వచ్ఛ్ భారత్ ఉద్యమం పట్ల సందేహాలూ, సంకోచాలూ ఉండవలసిన అవసరం కనిపించదు. పారిశుద్ధ్య కార్యక్రమాన్ని మహాత్మాగాంధీ కేవలం మురికి లేకుండా, అనారోగ్యాన్ని దూరంగా పారదోలే సాధనంగా మాత్రమే చూడలేదు. ప్రజల మధ్య కులపరమైన, ఆర్థికపరమైన అంతరాలు తొలగించడానికీ, పారిశుద్ధ్యం పనిపట్ల గౌరవం కలిగించడానికీ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించారు.
మోదీ సైతం సమాజంలో వివిధ వర్గాల మధ్య ఉన్న గోడల్ని కూల్చడానికి ఈ కార్యక్రమం ద్వారా ప్రయత్నిస్తున్నారు. పనిలో పనిగా ప్రజలు, ముఖ్యంగా కాంగ్రెస్‌పార్టీ, విస్మరించిన మహాత్ముడిని మరో విమోచన ఉద్యమానికి, ప్రేరణకు సంకేతంగా నిలిపి జాతిపితకు అద్భుతమైన నివాళి అర్పించారు. ఈ మంచి ప్రయత్నం విజయం సాధించాలనీ, స్వచ్ఛ్ భారత్ స్వప్నం సాకారం కావాలనీ దేశవాసులంతా ఆకాంక్షించాలి.
స్వచ్ఛ్ భారత్‌ను స్వాగతిద్దాం
Published Fri, Oct 3 2014 12:31 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement