ఫైల్ ఫొటో
భారత్–చైనాల మధ్య వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో ఏర్పడిన ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతుండగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ శుక్రవారం మన దేశం వచ్చారు. అయితే ఎప్పుడూ ఉండే హడావుడి ఈ సారి కనబడకపోవడం, ప్రభుత్వం సైతం ఆయన రాకకు పెద్దగా ప్రాధాన్యతనివ్వకపోవడం గమనించదగ్గ పరిణామం. సాధారణంగా ఇలాంటి పర్యటనలకు వారం పదిరోజుల ముందునుంచే మీడియాలో కథనాలు వెలువడతాయి. ఇరుదేశాల మధ్యా రెండున్నరేళ్లుగా ఉద్రిక్తతలు ఉన్నందువల్ల చర్చల ఫలితాలపై అందరిలో ఆసక్తి ఏర్పడు తుంది.
ఈమధ్యే భారత్–చైనాల మధ్య సైనికాధికారుల స్థాయిలో సంప్రదింపులు జరిగినా ఎలాంటి పురోగతీ లేదు. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర అనంతర పరిణామాల విషయంలో యాదృచ్ఛికం గానే కావొచ్చు.. మన దేశమూ, చైనా దాదాపు ఒకే రకమైన అడుగులు వేశాయి. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంతోపాటు భద్రతామండలి, ఇతర అంతర్జాతీయ సంస్థల్లో రష్యాను అభిశంసించే తీర్మానాలపై జరిగిన ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి. మన దేశమైతే ‘ఉక్రెయిన్ పౌరుల తరలింపు, వారికి అందాల్సిన మానవతా సాయం’పై భద్రతా మండలిలో రష్యా ప్రతిపాదించిన తీర్మానంపై జరిగిన ఓటింగ్‌కు కూడా దూరంగా ఉంది.
భారత్ – చైనాల ఆచరణలోని సామ్యాన్ని గమనించి ఇరు దేశాలూ భవిష్యత్తులో దగ్గర కావొచ్చని కొందరు భావించారు. అయితే మన నిర్ణయాలకు స్వీయ ప్రయోజనాలే గీటురాయి. రష్యాతో ఉన్న దౌత్య సంబంధాలు, ఇంధనం, రక్షణ తదితర అంశాల్లో ఆ దేశం అందిస్తున్న సహాయ సహకారాలు మన నిర్ణయాలను ప్రభావితం చేశాయి. చైనా తీరు వేరు. చైనా, రష్యాలు రెండూ గత కొన్నేళ్లుగా సన్నిహితంగా ఉంటున్నాయి. ఇక ఉక్రెయిన్‌లో రష్యా పెట్టిన కుంపటి వెనక చైనా పాత్ర ఉన్నదన్న సంశయం చాలామందిలో ఉండనే ఉంది.
తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో 2020 ఏప్రిల్‌లో అయిదు చోట్ల చైనా దళాలు ఎల్‌ఏసీని అతిక్రమిం చడం మనకు ఊహించని పరిణామం. అక్కడ గస్తీ తిరుగుతున్న మన జవాన్లపై అకారణంగా దాడి చేయడం, 21 మంది ప్రాణాలు తీయడం విషాదకర ఘటన. సరిహద్దు సమస్యలున్నా మూడు దశాబ్దాలుగా ఇరు దేశాల మధ్యా స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయి. ఈ సుహృద్భావ వాతా వరణాన్ని ఉన్నట్టుండి దెబ్బతీసింది చైనాయే. వాస్తవానికి సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించు కునే ప్రయత్నం చేస్తూనే.. వాణిజ్య రంగంలో సహకరించుకుందామని, ఆర్థికంగా లాభపడదామని చైనా కోరినప్పుడు మన దేశం హృదయపూర్వకంగా స్వాగతించింది. రెండు దేశాల మధ్యా ఎన్నో ఒప్పందాలు కుదిరాయి.
సహజంగానే వీటివల్ల అత్యధికంగా లాభపడింది ఆ దేశమే. సరిహద్దు ఘర్షణల తర్వాత ఆ దేశం సరుకులు బహిష్కరించాలన్న పిలుపులు వినబడినా, మన ప్రభుత్వం చైనా యాప్‌లు కొన్నింటిని నిషేధించినా 2020–21 మధ్య ఎగుమతులు, దిగుమతుల్లో వృద్ధి నమోదైంది. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం చైనా సరుకులపై అధిక సుంకాలు వేసినా దిగుమతులపై దాని ప్రభావం పెద్దగా పడలేదు. అంతక్రితం మన దేశం నుంచి చైనాకు 5.3 శాతంగా ఉన్న ఎగుమతులు 2020–21 మధ్య 7.3 శాతానికి ఎగబాకగా.. మన దిగుమతుల్లో చైనా వాటా అంతక్రితం కన్నా 3 శాతం పెరిగి 16.6 శాతానికి చేరింది.
చైనాలో పరిశ్రమల సంఖ్య ఎక్కువ. పైగా కరోనా మహమ్మారి విసిరిన పంజాతో ప్రపంచ దేశాల్లో చాలా చోట్ల లాక్‌డౌన్‌లు అమలై తయారీ రంగ పరిశ్రమల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. కరోనా నుంచి అందరికన్నా ముందు తేరుకున్న చైనా యధాప్రకారం ఉత్పాదక రంగాన్ని పరుగులెత్తించింది. కనుక మన దేశం కూడా దానిపై ఆధారపడక తప్పలేదు.
ఎల్‌ఏసీ వివాదం అనంతరం ఇరు దేశాల విదేశాంగ మంత్రులు సమావేశమయ్యాక నిరుడు ఫిబ్రవరిలో గాల్వాన్, ప్యాంగాంగ్ సో, స్పంగూర్ సో ప్రాంతాల నుంచి ఇరు దేశాల సైన్యాలు వెనక్కి తగ్గాయి. ఆ ప్రాంతాల్లో గస్తీ తిరొగద్దని నిర్ణయిం చాయి. సైనికాధికారుల మధ్య అనంతర కాలంలో జరిగిన చర్చలు మాత్రం ఏమాత్రం ఆశాజనకంగా లేవు. పైగా కుదిరిన అవగాహనకు భిన్నంగా డెస్పాంగ్‌లో 900 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని చైనా తన అధీనంలోకి తీసుకుంది.
ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ తర్వాత అంతర్జాతీయంగా ఏర్పడిన పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకోవచ్చని చైనా ఆశిస్తున్నట్టు కనబడుతోంది. భారత్‌తో మళ్లీ ‘సాధారణ సంబంధాలు’ పునరుద్ధరించుకోవాలని తహతహలాడుతోంది. అయితే అదంతా గతం. సరిహద్దుల స్థితిగతులే దేశాల మధ్య స్నేహ సంబంధాలను నిగ్గు తేలుస్తాయని జైశంకర్ ఆమధ్య తేల్చి చెప్పారు. వచ్చే జూన్‌లో చైనాలో బ్రిక్స్ దేశాల సదస్సు, ఆ తర్వాత భారత్, రష్యా, చైనాల శిఖరాగ్ర సదస్సు జరగాల్సి ఉంది.
ఈ రెండింటిలో మన దేశం పాల్గొనడం అంతర్జాతీయంగా రష్యా, చైనాలకు ఎంతో అవసరం. వాటిల్లో పాల్గొనవద్దని అమెరికా, పాశ్చాత్య దేశాలు ఎటూ మన దేశంపై ఒత్తిళ్లు తీసుకొస్తాయి. ఆ అంశంలో అంతిమంగా మన నిర్ణయం ఏమిటన్న సంగతలా ఉంచి, ముందుగా ఎల్‌ఏసీలో చైనా దుందుడుకు పోకడలు విడనాడవలసి ఉంటుంది.
వాంగ్ యీ ఈ విషయంలో ఏం హామీ ఇచ్చారో, ఎలాంటి ప్రతిపాదన తెచ్చారో చూడాల్సి ఉంది. అది త్వరలో జరిగే తదుపరి సైనికాధికారుల స్థాయి సమావేశంలో ప్రతిఫలిస్తుంది. ఒకసారంటూ సుహృద్భావ సంబంధాలు దెబ్బతినే విధంగా ప్రవర్తిస్తే వాటిని పునరుద్ధరించడం అంత సులభం కాదని చైనా గుర్తించకతప్పదు.
Comments
Please login to add a commentAdd a comment