ఇజ్రాయెలీ సైబర్ నిఘా సాఫ్ట్‌వేర్ ‘పెగసస్’ వ్యవహారం పీటముడిగా మారుతోంది. రోజుకో కొత్త కథనం బయటకొస్తూ, పాలకులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కేంద్రం తనకు వ్యతిరేకమని భావిస్తున్న జర్నలిస్టులు, పౌరహక్కుల నేతలు, రాజకీయవాదులపై నిఘా కోసం ఈ సాఫ్ట్‌వేర్‌ను వినియోగిం చిందనే వాదనకు ప్రసిద్ధ ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక జనవరి చివరలో ప్రచురించిన తాజా కథనం తోడైంది.
ఆ కథనం రాసిన పరిశోధనాత్మక జర్నలిస్టుతో ‘ది వైర్’ జరిపిన తాజా వీడియో ఇంటర్వ్యూ మరో సంచలనమైంది. ఒకేసారి 50 ఫోన్లపై నిఘాకు వీలుగా భారత్ ఆ నిఘావేర్‌ను కొన్నదన్నది ఆ జర్నలిస్టు మాట. వ్యక్తుల ప్రైవసీకి భంగకరంగా ఈ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించినట్లు ప్రభుత్వం అధికారికంగా ఒప్పుకోలేదన్న మాటే కానీ, బయటపడుతున్న కథనాలు ఆ చేదు నిజాన్నే చెబుతు న్నాయి. పెగసస్‌పై సుప్రీమ్ కోర్టే రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్వీ రవీంద్రన్ సారథ్యంలో ముగ్గురు నిపుణుల బృందంతో స్వతంత్ర దర్యాప్తు సాగిస్తున్నవేళ బయటకొచ్చిన ఈ అంశాలు దిగ్భ్రాంతికరం.
పార్లమెంటులో కానీ, సర్వోన్నత న్యాయస్థానంలో కానీ మన పాలకులు నోరు విప్పి అవునని కానీ, కాదని కానీ చెప్పలేదన్నమాటే కానీ, అంతర్జాతీయ వేదికలు పెగసస్ దుర్వినియోగాన్ని నెత్తీ నోరూ కొట్టుకొని చెబుతూనే ఉన్నాయి. తప్పు జరిగిందనే వేలెత్తి చూపుతున్నాయి. పెగసస్ నిఘా బారిన పడిన 50 వేల పైచిలుకు మందిలో 300 మంది భారతీయులేనని ఓ అంతర్జాతీయ జర్నలి స్టుల కన్సార్టియమ్ గత జూలైలోనే చెప్పింది. ఇలా ఆరోపణలు వస్తున్నా సరే జాతీయ భద్రతను సాకుగా చూపి, పాలకులు దర్యాప్తు జరపకపోవడం సరి కాదని సుప్రీమ్ కోర్టే చెప్పాల్సి వచ్చింది. పెదవి విప్పని ప్రభుత్వ ప్రవర్తనతో చివరకు స్వతంత్ర విచారణకూ ఆదేశించాల్సి వచ్చింది.
అది ఓ పక్క సాగుతుండగానే, నిరుడు డిసెంబర్‌లో అమెరికన్ ఫోరెన్సిక్ దర్యాప్తు సంస్థ ఆర్సెనెల్ కన్సల్టింగ్ మరో సంగతి వెల్లడించింది. బీమా కోరేగావ్ కేసులో ఉద్యమకారుడు రోనా విల్సన్‌ను జైలులో పెట్టిన వ్యవహారమూ పెగసస్ పుణ్యమే అని బయట పెట్టింది. విల్సన్ మొబైల్ ఫోన్‌పైన కనీసం 49 సార్లు దాడి జరిగిందనీ, ఆయన కంప్యూటర్‌లో, ఆయన సహ నిందితుడైన సురేంద్ర గాడ్లింగ్ కంప్యూటర్‌లోనూ వైరస్‌ను ప్రవేశపెట్టారనీ తేల్చింది. నెల తిరిగిందో, లేదో ఇçప్పుడు న్యూయార్క్ టైమ్స్ జనవరి 28 నాటి కథనం సంచలనమైంది. ఇజ్రాయెల్‌కు చెందిన ‘ఎన్‌ఎస్‌ఓ గ్రూపు’ ఈ ‘పెగసస్’ నిఘావేర్‌ను ఎలా రూపొందించిందీ, ప్రపంచవ్యాప్తంగా ప్రయో
జనాల్ని కాపాడుకోవడానికి ఇజ్రాయెల్ ఎలా వాడుకున్నదీ ఆ పరిశోధనాత్మక కథనం వివరించింది.
నిజానికి, తీవ్రవాదులు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాదార్ల కోసం ఉద్దేశించిన నిఘా సాఫ్ట్ వేర్ అది. కానీ, దాన్ని ప్రతిపక్షాల పైన, ఓ కన్నేసి ఉంచే జర్నలిస్టుల పైన వాడేందుకు వీలుగా ఇజ్రా యెల్ అమ్మజూపింది. ఆ రకంగా పాలస్తీనా విషయంలో సుదీర్ఘకాలంగా తమను వ్యతిరేకిస్తున్న దేశాలను సైతం తమ వైపు తిప్పుకోవడానికి ఈ సాఫ్ట్‌వేర్ అమ్మకాన్ని తాయిలంగా చూపింది. 2020 ఆగస్టులో ఇజ్రాయెల్‌కూ, పొరుగున ఉన్న అరబ్ దేశాలకూ మధ్య ‘అబ్రహమ్ శాంతి ఒప్పందాలు’ కుదరడానికీ ఇదే కారణమట. అలాగే, పాలస్తీనా విషయంలో ఏళ్ళ తరబడి ఇజ్రాయెల్‌ను వ్యతిరేకించిన భారత్ సైతం ఇటీవల చెట్టపట్టాలేసుకోవడానికీ ఇదే కారణమని ఆరోపణ.
ఇజ్రాయెల్‌ను సందర్శించిన తొలి భారత ప్రధాని మోదీయే. 2017 జూలై నాటి ఆ పర్యటనలో భారత్, ఇజ్రాయెల్‌ల మధ్య కుదిరిన 200 కోట్ల డాలర్ల మేర ‘అత్యాధునిక ఆయుధాలు, నిఘా పరికరాల’ ఒప్పందంలో ఈ ‘పెగసస్’ నిఘా సాఫ్ట్‌వేర్ కొనుగోలు సైతం భాగమనేది ‘న్యూయార్క్ టైమ్స్’ కథనం. ఆ తర్వాతే అనేక ఏళ్ళ పాలస్తీనా అనుకూల విధానాన్ని భారత్ మార్చేసుకుందనీ, 2019లో ఐరాస ఆర్థిక, సామాజిక మండలిలో పాలస్తీనా మానవ హక్కుల సంఘానికి పరిశీలక హోదా నిరాకరిస్తూ, ఇజ్రాయెల్ వైపు ఓటు వేసిందనీ వాదన. అలాగే, ప్రభుత్వ విమర్శకుల నోళ్ళు మూయించడం కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మెక్సికోలలో పెగసస్‌ను వాడారట. అమెరికా తన నిఘాసంస్థ ‘ఎఫ్‌బీఐ’లో సైతం ఆ సాఫ్ట్‌వేర్‌ను పరీక్షించి చూసిందట కానీ, దేశంలో వాడలేదట.
ఒకప్పుడు ఫోన్ వాడేవారిని ఆకర్షించి, వారు క్లిక్ చేసే మోసకారి లింకుల రూపంలో జొరబడేవారు. ఇప్పుడూ లింకులు నొక్కడం లాంటివేవీ అవసరం లేకుండానే లక్షిత వ్యక్తిపై నిఘా పెట్టడం, కంప్యూటర్‌లలో కొత్త లెటర్లు జొప్పించడం కొత్త పెగసస్ పద్ధతి. అంటే బీమా కోరేగావ్ సహా అనేక కేసుల్లో మావోయిస్టు పథకరచన అంటూ పాలకులు చూపిస్తున్న ఆధారాల విశ్వసనీయత ప్రశ్నార్హమైనదే. అసలు ప్రభుత్వాలకే పెగసస్‌ను విక్రయిస్తుంటామని ఎన్‌ఎస్‌ఓ చెబుతోంది. అందుకే, పౌరస్వేచ్ఛకూ, ప్రాథమిక హక్కులకూ భంగం కలిగించేలా పాలకులు అనుసరిస్తున్న ఈ దొడ్డిదారి సంగతి తేలాల్సిందే. న్యూయార్క్ టైమ్స్ సహా తాజా కథనాల సమాచారాన్నీ సుప్రీమ్ స్వతంత్ర విచారణ బృందం పరిగణనలోకి తీసుకోవాలి.
అసలు కథేమిటో అధికారికంగా నిగ్గుదేల్చాలి. కంటిలో నలుసుగా మారిన వకీళ్ళు, పౌర ఉద్యమకారులు, జర్నలిస్టులతో సహా పలువురి మొబైల్ ఫోన్లనూ, ఇతర పరికరాలనూ పెగసస్ తోనో, లేదంటే మరేదైనా నిఘావేర్‌తోనో పాలకులు ఇనెఫెక్ట్ చేసిందీ, లేనిదీ వెల్లడి కావాలి. దీనిపై పట్టుబడుతున్న ప్రతిపక్షాలే కాదు... పౌరసమాజం... యావద్దేశం తెలుసుకోవాలను కుంటున్నది అదే. మరి, పాలకులు తెలుసుకోనిస్తారా? సచ్ఛీలతను నిరూపించుకుంటారా?
Comments
Please login to add a commentAdd a comment