న్యూఢిల్లీ: పెగసస్ స్పైవేర్‌ను కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వమే ఇజ్రాయెల్ నుంచి 2017లో కొనుగోలు చేసిందని న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని ప్రచురించిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో తాజాగా మరో పిటిషన్ దాఖలైంది. గతంలో పెగసస్‌పై కోర్టుకెక్కిన ప్రధాన పిటిషన్‌దారుడైన అడ్వకేట్ ఎంఎల్ శర్మ మళ్లీ సుప్రీం తలుపు తట్టారు. రూ.15 వేల కోట్ల రక్షణ ఒప్పందంలో భాగంగానే పెగసస్‌ను భారత ప్రభుత్వం కొనుగోలు చేసినట్టుగా న్యూయార్క్ టైమ్స్ తమ కథనంలో పేర్కొందని ఆయన ఈసారి పిటిషన్‌లో ప్రస్తావించారు.
ఈ నివేదిక ఆధారంగా ఇజ్రాయెల్‌తో జరిగిన రక్షణ ఒప్పందంపై విచారణ జరిపించాలని ఆయన కోరారు. ఆ రక్షణ ఒప్పందాన్ని పార్లమెంటు ఆమోదించలేదని, అందుకే దానిని రద్దు చేసి, ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి వసూలు చేసేలా ఆదేశించాలని ఆ పిటిషన్‌లో కోరారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి పెగసస్ స్పైవేర్‌ని కేంద్రమే కొనుగోలు చేసిందని వస్తున్న ఆరోపణలపై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంని కోరారు.
పెగసస్ స్పైవేర్‌ని వినియోగించి కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ సహా వివిధ రాజకీయ పార్టీల నాయకులు, జర్నలిస్టులు, హక్కుల సంఘాల కార్యకర్తలు 300 మందిపై కేంద్రం ఫోన్ ట్యాపింగ్ పెట్టిందని గత ఏడాది ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అప్పట్లోనే దీనిపై శర్మ, పాత్రికేయుడు ఎన్.రామ్ వంటివారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దానిని విచారించిన అత్యున్నత న్యాయస్థానం రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ రవీంద్రన్ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని 2021 అక్టోబర్ 27న ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఏర్పాటై 13 వారాలు గడుస్తున్నా విచారణలో కాస్త కూడా పురోగతి లేదు. ఇప్పుడు కేంద్రమే దానిని కొనుగోలు చేసిందన్న నివేదికపైనా ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఇది దేశద్రోహమేనని తీవ్రంగా వ్యాఖ్యానిస్తున్నాయి.
న్యూయార్క్ టైమ్స్ నివేదికను పరిశీలించండి
పెగసస్ స్పైవేర్ దర్యాప్తులో న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని కూడా ఆధారంగా తీసుకోవాలని దానిపై వి చారణ జరుపుతున్న సుప్రీం కోర్టు నియమిత జస్టిస్ ఆర్.వి.రవీంద్రన్ కమిటీని ఎడిటర్స్ గిల్డ్ కోరింది. దీనిపై బహిరంగ విచారణ చేపట్టాలని, అలా చేయడం వల్ల పారదర్శకత ఉండడంతో పాటు ప్రజలందరికీ నిజానిజాలు తెలుస్తాయని ఎడిటర్స్ గిల్డ్ ఆదివారం జస్టిస్ రవీంద్రన్ కమిటీకి లేఖ రాసింది.
అవన్నీ కపట విమర్శలు
పెగసస్ స్పైవేర్‌ను అప్రజాస్వామికంగా వ్యవహరించే దేశాలకు విక్రయిస్తున్నట్టుగా వస్తున్న ఆరోపణల్ని ఆ స్పైవేర్‌ను తయారు చేసే సైబర్ కంపెనీ ఎన్‌ఎస్‌ఓ గ్రూప్ తిప్పికొట్టింది. అవన్నీ కపట విమర్శలంటూ దుయ్యబట్టింది. ఇజ్రాయెల్ సహా ప్రపంచవ్యాప్తంగా ఆ స్పైవేర్‌ను దుర్వినియోగం చేశారంటూ న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని ప్రచురించిన నేపథ్యంలో కంపెనీ సీఈఓ షలెవ్ హులియో స్థానిక మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు.
దశాబ్దకాలంగా ఆ సాఫ్ట్‌వేర్‌ను అమ్ముతున్నామంటూ తమ కంపెనీ ఆపరేషన్లను గట్టిగా సమర్థించుకున్నారు. అయితే అక్కడక్కడ కొన్ని పొరపాట్లు జరిగి ఉండవచ్చునని ఆయన అంగీకరించారు. న్యూయార్క్ టైమ్స్ కథనంతో పెగసస్‌పై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వస్తున్న విషయాన్ని ప్రస్తావించగా ‘‘రాత్రి నేను గాఢంగా నిద్రపోయాను’’ అని సమాధామిచ్చి తాను అలాంటివేవి పట్టించుకోనని పరోక్షంగా చెప్పారు.
‘‘మేము ఏదో ఒక్క దేశానికి మా సాఫ్ట్‌వేర్ అమ్మలేదు. కదనరంగంలో వాడే ఆయుధాలు, ఎఫ్–35 ట్యాంకులు, డ్రోన్లు వంటివి అమ్మడం సరైన పని అయినప్పుడు ఇంటెలిజెన్స్ విభాగానికి సమాచార సేకరణలో ఉపయోగపడే సాఫ్ట్‌వేర్‌ను అమ్మితే తప్పేంటి’’ అని హులియో ప్రశ్నించారు. అమెరికా తమ సంస్థపై ఆగ్రహంతోనే బ్లాక్ లిస్ట్‌లో పెట్టిందని, త్వరలోనే దానిని ఎత్తేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం పెడతాం
పెగసస్ అంశంపై లోక్‌సభను తప్పుదారి పట్టించారన్న ఆరోపణలకు సంబంధించి ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌పై సభాహక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు సభలో ఆ పార్టీ నాయకుడు అధిర్ రంజన్ చౌధరి లేఖ రాశారు. పెగసస్ స్పైవేర్‌ను ఎప్పుడూ తాము తీసుకురాలేదని ఇన్నాళ్లూ కేంద్ర ప్రభుత్వం బుకాయిస్తూ వస్తోందని ఆయన ఆరోపించారు. ఇప్పుడు న్యూయార్క్ టైమ్స్ కథనంతో అసలు వాస్తవాలు బయటకు వచ్చాయన్నారు. మోదీ ప్రభుత్వం పార్లమెంటుని, సుప్రీంకోర్టుని, దేశ ప్రజలందరినీ తప్పుదారి పట్టించిందని ధ్వజమెత్తారు. హక్కుల ఉల్లంఘన నోటీసు ఐటీ శాఖ మంత్రికి జారీ చేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment