న్యూఢిల్లీ: పెగసస్ స్పైవేర్‌ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేసిందని ఆరోపిస్తూ న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనం రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. మోదీ ప్రభుత్వం దేశద్రోహ నేరానికి పాల్పడిందని విపక్షాలు భగ్గుమన్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థల మీదే దాడి జరుగుతోందని, చట్టసభల్ని, న్యాయవ్యవస్థని మోసం చేసిందని, ప్రజలకు కల్లబొల్లి కబుర్లు చెప్పి ప్రజాస్వామ్యాన్ని హైజాక్ చేసిందని మండిపడ్డాయి.
దేశాన్ని ఒక ‘బిగ్ బాస్ షో’లా మార్చేసిందని విరుచుకుపడ్డాయి. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతామని స్పష్టం చేశాయి. సుప్రీంకోర్టు ఈ అంశాన్ని సూమోటోగా తీసుకొని ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం చేసిన మోసంపై విచారణ జరపాలని డిమాండ్ చేశాయి. మరోవైపు న్యూయార్క్ కథనాన్ని కేంద్రం తిప్పి కొట్టింది. న్యూయార్క్ టైమ్స్‌ని సుపారీ మీడియా అంటూ కేంద్రమంత్రి వీకే సింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ’’మీరు న్యూయార్క్ టైమ్స్‌ని నమ్ముతున్నారా? వాళ్లు సుపారి మీడియాగా పేరుపడ్డారు’’ అని ట్వీట్ చేశారు. దీనిపై సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో విచారణ జరుగుతోందని, సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్‌వీ రవీంద్రన్ బృందం ఇచ్చే నివేదిక కోసం వేచి చూస్తున్నట్టుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ఎవరినీ వదల్లేదు...
‘‘దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలు, రాజకీయనాయకులు, సాధారణ ప్రజల మీద నిఘా పెట్టడానికే మోదీ ప్రభుత్వం పెగసస్‌ని కొనుగోలు చేసింది. ప్రభుత్వ అధికారులు, ప్రతిపక్ష నాయకులు, సాయుధ బలగాలు, న్యాయవ్యవస్థ.. ఇలా అందరూ ఫోన్ ట్యాపింగ్‌లకు టార్గెట్ అయ్యారు. ఇది దేశద్రోహం. మోదీ ప్రభుత్వం దేశ ద్రోహానికి పాల్పడింది’’ – రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నాయకుడు
మౌనం అర్ధాంగీకారమే!
‘‘ఆ సైబర్ ఆయుధాన్ని ఎందుకు తీసుకువచ్చారు? దానిని వాడడానికి ఎవరు అనుమతి ఇచ్చారు? లక్ష్యాలను ఎలా నిర్ణయించారు? వీటన్నింటికీ మోదీ ప్రభుత్వం అఫడివిట్ రూపంలో సమాధానం ఇవ్వాలి. ఇంత కీలకమైన అంశంలో మౌనంగా ఉంటే నేర కార్యకలాపాలకు పాల్పడ్డామని అంగీకరించినట్టు అవుతుంది’’
– సీతారామ్ ఏచూరి, సీపీఎం ప్రధాన కార్యదర్శి
రియాలిటీ షో చేసేశారు...
‘‘రక్షణ వ్యవహారాలకు ఈ స్పైవేర్‌ని వినియోగించుకుండా ప్రతిపక్షాలు, జర్నలిస్టులపై ప్రయోగించడమేంటి? బీజేపీ ఉంటేనే ఇలాంటివి సాధ్యమవుతాయి. వాళ్లు దేశాన్ని ఒక బిగ్ బాస్ షోలా మార్చేస్తున్నారు’’
– ప్రియాంక చతుర్వేది, ఎంపీ, శివసేన
కావాలని కేంద్రం తప్పించుకుంటోంది
‘‘పెగసస్‌పై ఐటీ కమిటీకి ప్రభుత్వం సమాధానమివ్వడం లేదు. ఎప్పుడు ఈ విషయాన్ని చర్చిద్దామన్నా బీజేపీ సభ్యులు ఉద్దేశపూర్వకంగానే హాజరుకాకపోవడంతో కోరమ్ ఉండటం లేదు. దీంతో నిజానిజాలను నిర్ధారించడానికి కమిటీకి అవకాశం లేకుండా పోయింది. సుప్రీంకోర్టు ఈ అంశంపై విచారిస్తోంది. నిజంగా పెగసస్‌ను ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌కి వినియోగిస్తే మన ప్రజాస్వామ్యమే పెను ప్రమాదంలో పడినట్టే’’
– శశిథరూర్, కాంగ్రెస్ ఎంపీ, కమ్యూనికేషన్లు, ఐటీపై పార్లమెంటరీ ప్యానెల్ చైర్మన్
అది సుపారీ మీడియా
‘మీరు న్యూయార్క్ టైమ్స్‌ని నమ్ముతున్నారా? వాళ్లు సుపారీ మీడియాగా పేరుపడ్డారు’’
– కేంద్రమంత్రి వీకే సింగ్ ట్వీట్
Comments
Please login to add a commentAdd a comment