cotton purchases
-
పత్తి కొనుగోళ్లు ప్రారంభం..!
సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. రైతు భరోసా కేంద్రాల్లో వీఏఏ (విలేజీ అగ్రికల్చర్ అసిస్టెంట్) వద్ద రైతులు తమ పేర్లు నమోదు చేసుకొన్న వెంటనే స్లాట్ నంబర్ కేటాయిస్తున్నారు. వారికి కేటాయించిన సమయంలో సమీపంలోని మార్కెట్ యార్డులు, జిన్నింగ్ మిల్లులకు పత్తి తీసుకెళుతున్నారు. ప్రస్తుతం కృష్ణా, గుంటూరు, కర్నూలు, పశి్చమ గోదావరి జిల్లాల్లోని 23 జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఇప్పుడిప్పుడే పత్తి కొనుగోళ్లు ఊపందుకొంటున్నాయని అధికారులు తెలిపారు. జిల్లాల వారీగా పంట దిగుబడుల అంచనా... పత్తి దిగుబడులపై జిల్లాల వారీగా వ్యవసాయ శాఖ అధికారులు అంచనాలు రూపొందించారు. ఈ–క్రాప్‌లో పంట నమోదు తప్పనిసరి. పంట దిగుబడులు ఎకరాకు ప్రకాశం జిల్లాలో 6.83 క్వింటాళ్లు, కర్నూలు– 10.32, గుంటూరు– 12, కృష్ణా–12.7, పశి్చమగోదావరి–10.29, విజయనగరం–5.95, శ్రీకాకుళం–6, తూర్పుగోదావరి జిల్లాలో 4.91 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. సీసీఐ తెలంగాణలో ఎకరాకు 15 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేస్తుండగా, రాష్ట్రంలో ఎకరాకు సరాసరిన 9 క్వింటాళ్ల మాత్రమే కొనుగోలు చేస్తోందని, విడతల వారీగా కొనుగోలు చేయడం వల్ల కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, కొంతమంది దళారులు రైతుల నుంచి తక్కువ ధరకు పత్తిని కొనుగోలు చేసి తెలంగాణలో విక్రయిస్తున్నట్లు ఆరోపించారు. ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు రాష్ట్రంలో రైతులకు ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా, కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర ప్రకారం పత్తి కొనుగోలు చేస్తున్నాం. తేమ శాతం 12 లోపు ఉండేలా రైతులు చూసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పత్తి కొనుగోళ్లను వేగవంతం చేశాం. – జి.సాయి ఆదిత్య, సీసీఐ బ్రాంచి మేనేజర్, గుంటూరు -
పత్తి కొనుగోళ్లకు సీసీఐ సిద్ధం
కరీంనగర్‌సిటీ: పత్తి కొనుగోళ్లకు ప్రభుత్వ రంగ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) సిద్ధమయ్యింది. బహిరంగ మార్కెట్లో పత్తి పంటకు అధిక ధరలు పలుకుతున్న క్రమంలో నిన్నామొన్నటి వరకు ప్రైవేట్ వ్యాపారులు పోటీ పడి కొనుగోలు చేశారు. ప్రస్తుతం ధరలు పతనమవుతున్న నేపథ్యంలో పత్తి పంటకు మద్దతు ధర కల్పిం చేందుకు సీసీఐ రంగంలోకి దిగింది. సీసీఐ ద్వారా జిల్లాలోని 4 మార్కెట్‌యార్డులు, 8 జిన్నింగ్ మిల్లుల్లో విడి పత్తి కొనుగోలు చేయుటకు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మార్కెటింగ్‌శాఖ డీడీ పద్మావతి తెలిపారు. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్‌యార్డు, జమ్మికుంట, చొప్పదండి, గంగాధర మార్కెట్‌యార్డుల్లో సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేశారు. శక్తి మురుగన్ ఇండస్ట్రీస్ (ఎలబోతారం), మల్లారెడ్డి కాటన్ ఇండస్ట్రీస్(మల్కాపూర్), రామినేని ఆగ్రో ఇండస్ట్రీస్ (రేణికుంట), ఆదిత్య కాటన్ అండ్ ఆయిల్ ఆగ్రో (జమ్మికుంట), రాజశ్రీ కాటన్ ఇండస్ట్రీస్ (జమ్మికుంట), మురుగన్ ఇండస్ట్రీస్ (జమ్మికుంట), శివశివాని కాటన్ ఇండస్ట్రీస్ (రుక్మాపూర్), కావేరి జిన్నింగ్ మిల్లు (వెలిచాల) జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రైతులు పత్తిని 12 శాతం తేమ మించకుండా.. నీరు చల్లకుండా నాణ్యతా ప్రమాణాలను పాటించి మార్కెట్‌యార్డుకు లేదా జిన్నింగ్ మిల్లులకు తీసుకొచ్చి సీసీఐకి విక్రయించి మద్దతు ధర పొందాలని పద్మావతి కోరారు. సీసీఐ 8 నుంచి 12 శాతం లోపు తేమశాతం ఉన్న పత్తిని మాత్రమే కొనుగోలు చేస్తారని పేర్కొన్నారు. 12 శాతం మించితే సీసీఐ కొనుగోలు చేయబోదని పేర్కొన్నారు. 8 శాతం కంటే తేమ ఎక్కువగా ఉన్నట్లయితే క్వింటాల్ పత్తికి రూ.5450లోపు చెల్లిస్తారని తెలిపారు. సీసీఐకి పత్తిని అమ్ముకునే రైతులు గత సంవత్సరం వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ద్వారా జారీ చేసిన పత్తి రైతు గుర్తింపు కార్డు తీసుకురావాలని కోరారు. గుర్తింపు కార్డు లేని పక్షంలో సంబంధిత వ్యవసాయ విస్తీర్ణాధికారి జారీ చేసిన పత్తి రైతు ధ్రువీకరణ పత్రం తీసుకుని రావాలని పేర్కొన్నారు. గుర్తింపుకార్డు, ధ్రువీకరణ పత్రంతో పాటు పట్టాదారు పాసు పుస్తకం, పహాణి జిరాక్స్, ఆధార్‌కార్డు జిరాక్స్, బ్యాంకు ఖాతా పుస్తకంలోని మొదటి రెండు పేజీలు జిరాక్స్ తీసుకుని రావాలని కోరారు. ఇప్పటివరకు జిల్లాలోని మార్కెట్ యార్డులో 46,354 క్వింటాళ్ల పత్తిని ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేశారని తెలిపారు. పత్తి రైతులు నాణ్యతా ప్రమాణాలతో పత్తిని తీసుకువచ్చి సీసీఐ ద్వారా మద్దతు ధర పొందాలని కోరారు. -
నేటి నుంచి పత్తి కొనుగోళ్లు
సాక్షి, హైదరాబాద్: బుధవారం నుంచి పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని మార్కెటింగ్ శాఖ సంచాలకులు లక్ష్మీబాయి అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 267 జిన్నింగ్ మిల్స్‌లో పత్తి కొనుగోలు కేంద్రాలను, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో 11 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే కొనుగోళ్లు ప్రారంభమయ్యాయని, రైతులు తొందరపడి పత్తి అమ్మకాలు చేయవద్దని, పత్తిలో తేమ శాతం ఎక్కువగా ఉంటే ధర తక్కువ పలుకుతుందని, తేమ 12% ఉంటే ఎక్కువ ధర అందుతుందని తెలిపారు. పత్తి ఆరిన తర్వాతే కొనుగోలు కేంద్రాలకు తేవాలన్నారు. నిజామాబాద్‌లో 40, సిద్దిపేటలో 8, నిర్మల్ జిల్లాలో 21 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. క్వింటాలు రూ. 1,700 మద్దతు ధరతో కొనుగోలు చేసినట్లు తెలిపారు. పెసల కొనుగోలుకు 6 కేంద్రాలు ఏర్పాటుచేసి రూ.6,975 మద్దతు ధరతో 9,411 క్వింటాళ్ల పెసలు కొనుగోలు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో మినుములు, సోయ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. -
తెల్ల బంగారమేనా..!
సాక్షి, ఆదిలాబాద్: కేంద్ర ప్రభుత్వం పత్తికి గత ఏడాది కంటే ఈసారి మద్దతు ధర పెంచడం ఊరటనిచ్చినా.. కొనుగోళ్లలో రైతుకు గిట్టుబాటయ్యే ధర లభిస్తేనే లాభం చేకూరుతుంది. ఏటా కొనుగోళ్లలో తేమ, నాణ్యత కారణంగా ధరలో కోత విధించడంతో న్యాయం చేయాలంటూ రైతులు ఆందోళనలు చేపట్టడం జిల్లాలో జరుగుతూనే ఉంది. ఈ యేడాది ప్రకృతి రైతుపై కన్నెర్ర చేసింది. భారీ వర్షాల కారణంగా ఇప్పటికే పంట నష్టం చవిచూశారు. దిగుబడిపై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర లభిస్తేనే పత్తి రైతుకు న్యాయం జరిగే పరిస్థితి ఉంది. తెల్ల బంగారం ఈసారి రైతు మోములో తళుక్కుమనిపిస్తుందా అనే సందేహం వ్యక్తమవుతోంది. 23లక్షల క్వింటాళ్ల దిగుబడి అంచనా.. జిల్లాలో ఈయేడాది 1.28 లక్షల హెక్టార్లలో పత్తి పంట సాగైంది. గతేడాది 1.21 లక్షల హెక్టార్లలో సాగు కాగా, మార్కెట్లో 23లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు జరిగాయి. ఈయేడాది సుమారుగా అంతే దిగుబడులు రావచ్చని అంచనా వేస్తున్నారు. ప్రధానంగా గతేడాది హెక్టార్‌కు 15 నుంచి 16 క్వింటాళ్ల దిగుబడి రాగా, ఈ యేడాది 20 క్వింటాళ్ల దిగుబడి రావచ్చని వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యం కారణంగా దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. ప్రధానంగా జిల్లాలో ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో1.24 లక్షల ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. ఇందులో అత్యధికంగా 93వేల ఎకరాల్లో పత్తి పంటకే నష్టం చేకూరింది. మిగిలిన పంటలోనూ పత్తి దిగుబడిపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మద్దతు ధరపైనే వారు ఆశలు పెట్టుకున్నారు. మద్దతు ధర రూ.5,450 2018–19 కోసం కేంద్ర ప్రభుత్వం పంటల మద్దతు ధరలో నాణ్యమైన పత్తి క్వింటాలుకు రూ.5,450 ప్రకటించడం జరిగింది. సాధారణ పత్తి క్వింటాలుకు రూ.5,150 ప్రకటించారు. గతేడాది నాణ్యమైన పత్తికి రూ.4320 ఉండగా, సాధారణ పత్తికి రూ.4,020 ఇవ్వడం జరిగింది. కాగా ప్రస్తుతం పెంచిన మద్దతు ధరలతో రైతుకు అదనంగా రూ.వెయ్యికి పైగా లభిస్తున్నప్పటికీ పత్తి తేమ, నాణ్యత విషయంలో మళ్లీ రైతుకు కొర్రీలు పెట్టిన పక్షంలో రైతుకు మద్దతు ధర లభించడం గగనమే. పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు.. పత్తి కొనుగోళ్ల కోసం మార్కెట్ కమిటీల్లో ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్, ఆదిలాబాద్–బి, బేల, ఇచ్చోడ, ఇంద్రవెల్లి, బోథ్, నేరడిగొండ, పొచ్చర, సొనాల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆయా మార్కెట్ యార్డుల్లో పత్తి తూకం యంత్రాలను సరిచేయాల్సి ఉంది. కాగా జిల్లాలో సాధారణంగా దసరాకు పత్తి కొనుగోళ్లు ప్రారంభమవుతాయి. అక్టోబర్ 1 నాటికి మార్కెట్ యార్డులన్ని సిద్ధంగా ఉంచాలని మార్కెటింగ్ శాఖ నుంచి ఆదేశాలు వెలబడ్డాయి. ఈ దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. మరోపక్క సీసీఐకి జిన్నింగ్ మిల్లు అద్దెకు ఇచ్చే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. సోమవారం నాటికి టెండర్ల గడువు ముగిసినప్పటికీ జిన్నింగ్ మిల్లు అద్దె వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. అక్టోబర్ 10 నాటికి పత్తి మార్కెట్‌కు.. అక్టోబర్ 10 నాటికి పత్తి మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉంది. గతేడాది కూడా ఇదే సమయంలో దిగుబడులు రావడం జరిగింది. మార్కెట్ యార్డుల్లో ఏర్పాట్లు చేస్తున్నాం. రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపడుతున్నాం. ఈ మేరకు పనులు ప్రారంభించాం. – శ్రీనివాస్, జిల్లా మార్కెటింగ్ అధికారి, ఆదిలాబాద్ -
మద్దతు దక్కేలా..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పత్తి కొనుగోళ్లకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీ ఐ) ఏర్పాట్లు చేస్తోంది. పత్తికి మద్దతు ధర కల్పించడానికి సీసీఐ ప్రత్యేక కేంద్రాలు నెలకొల్పేందుకు సన్నాహాలు మొదలు పెట్టింది. జిల్లా మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 11 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఆయా జిన్నింగ్ మిల్లుల్లోనే వీటిని ఏర్పాటు చేయనున్నారు. గతేడాది ఏర్పాటు చేసిన ప్రాంతాల్లోనే ఈ సారి కూడా కొనుగోలు కేంద్రాలు తెరుచుకోనున్నాయి. జిల్లావ్యాప్తంగా ఖరీఫ్‌లో 68 వేల హెక్టార్లలో సుమారు లక్ష మందికిపైగా రైతులు పత్తి సాగు చేశారు. సుమారు 12 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని అధికారుల అంచనా ప్రస్తుతం పత్తి వివిధ దశల్లో ఉంది. మాడ్గుల, కొందర్గు, చౌదరిగూడ తదితర ప్రాంతాల్లో పూత దశకు చేరుకుంది. వర్షానికి వర్షానికి మధ్య చాలా రోజుల విరామం ఉండడంతో మొక్కల్లో ఎదుగుదల లోపించింది. దీనికితోడు పోషకాల లేమి కూడా ఎదురైంది. దీంతో పూర్తిస్థాయిలో పూత దశకు చేరుకోలేదు. నవంబర్ రెండో వారం నుంచి పత్తి దిగుబడి మొదలవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఆ లోగా అంటే న వంబర్ ఒకటి కల్లా కొనుగోలు కేం ద్రాలు తెరచాలన్న యోచనలో సీసీఐ ప్రతిని ధులు ఉన్నారు. గతేడాది వరకు దిగుబడి ప్రారంభ దశలో సీసీఐ కేంద్రాలు తెరచుకోలేదు. దీంతో రైతులు ప్రైవేటు వ్యాపారులకు విక్రయించి తీవ్రంగా నష్టపోయారు. వారు నిర్ణయించిందే ధరగా రైతు లు అమ్ముకున్నారు. ఈసారి ఇటువంటి పరిస్థితి రాకుండా దిగుబడి ఆరంభానికి ముందే కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. రైతుకు ‘మద్దతు’.. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పత్తి మద్దతు ధరను పెంచిన విషయం తెలిసిందే. గతేడాది వరకు క్వింటా పత్తి రూ.4,320 ఉండగా దీన్ని తాజాగా రూ.5,450కు పెంచడం విశేషం. ఈ పెంపు రైతులకు ఊరట కలిగించే అంశం. రైతులు పత్తిని వ్యాపారులకు కాకుండా సీసీఐ కేంద్రాల్లోనే విక్రయిస్తే మేలు జరుగుతుంది. ఈ మేరకు త్వరలో రైతులకు అవగాహన కల్పించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. గతేడాది రైతుల పేరిట వ్యాపారులు సీసీఐ కేంద్రాల్లో పత్తి విక్రయించి సొమ్ము చేసుకున్నారు. రైతుల నుంచి వివిధ సాకులతో తక్కువ ధరకు పత్తిని వ్యాపారులు సేకరించారు. ఆ తర్వాత సీసీఐ కేంద్రాల్లో అమ్మి మద్దతు ధరకు కాస్త అటుఇటుగా లాభపడ్డారు. అయితే రైతుల సమగ్ర వివరాలతో రూపొందించిన క్యూఆర్ బార్ కోడ్ కార్డులు రైతులకు ఆలస్యంగా అందజేయడంతో పెద్దగా వారికి ఒరిగిందేమీ లేదు. గతేడాది అందజేసిన క్యూర్ బార్ కోడ్ కార్డుల ద్వారానే రైతుల నుంచి సీసీఐ కేంద్రాల్లో పత్తి విక్రయించేందుకు ఇప్పుడు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో సుమారు 80 వేల మంది రైతుల వద్ద ఆ కార్డులు ఉన్నాయి. ఐదేళ్లపాటు ఈ కార్డులు మనుగడలో ఉంటాయని జిల్లా మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఛాయదేవి తెలిపారు. కార్డులు లేని రైతులు ఆధార్‌కార్డు, పట్టాదారు పాస్‌పుస్తకం, వ్యవసాయ అధికారుల ఇచ్చే ధ్రువీకరణ పత్రం ఆధారంగా పత్తిని విక్రయించుకోవచ్చని పేర్కొన్నారు. -
ప్రతిష్టంభన తొలగేనా..!
సాక్షి, ఆదిలాబాద్: పత్తి కొనుగోళ్ల సీజన్ సమీపిస్తున్నా సీసీఐకి జిన్నింగ్ మిల్లులు అద్దెకు ఇచ్చే విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. పత్తిని జిన్నింగ్ చేసి దూదిని విడదీసి ఇచ్చే విషయంలో సీసీఐ, జిన్నింగ్ మిల్లుల మధ్య కొత్త నిబంధనల లొల్లి నెలకొనగా గత నెల ప్రభుత్వం క్వింటాల్ పత్తికి 33 కిలోల దూది ఇవ్వాలనే నిబంధనను 31 కిలోలకు తగ్గించింది. తద్వారా సమస్య పరిష్కారం అయిందన్న అభిప్రాయం ప్రభుత్వం నుంచి వ్యక్తమైంది. ఇప్పటికీ జిన్నింగ్‌ల అద్దె విషయంలో టెండర్లు పూర్తి కాకపోవడం సమస్యను తేటతెల్లం చేస్తోంది. సీసీఐ నాలుగోసారి టెండర్లను పిలిచింది. ఈ నెల 14 వరకు జన్నింగ్ మిల్లుల నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది. 17న టెండర్లను తెరవనుంది. అప్పటికీ పరిస్థితి తేటతెల్లం అయ్యే అవకాశం ఉంది. కొనుగోళ్ల ఏర్పాట్లపై సమీక్ష పత్తి కొనుగోళ్ల ఏర్పాట్లపై జిల్లాలోని మార్కెట్ల వారీగా మంగళవారం హైదరాబాద్‌లో మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి సమావేశం నిర్వహిస్తున్నారు. దీనికి ఉమ్మడి జిల్లా నుంచి మార్కెటింగ్ శాఖ అధికారులు హాజరు కానున్నారు. ఉమ్మడి జిల్లాలో పత్తి కొనుగోలుకు సంబంధించి సీసీఐ 23 కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇప్పటికీ టెండర్లు పూర్తి కాకపోవడంతో కొనుగోళ్లకు ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయోనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రధానంగా ఉమ్మడి జిల్లాలో దసరా నుంచి పత్తి కొనుగోళ్లను ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుంది. మరో 40 రోజులు మాత్రమే సమయం ఉండగా ఇప్పటికీ జిన్నింగ్ మిల్లుల అద్దె వ్యవహారం తేలకపోవడం పత్తి కొనుగోళ్లలో ప్రతిష్టంభన తేటతెల్లం చేస్తోంది. కొన్ని నిబంధనలు సడలించినా.. ప్రతి ఏడాది సీసీఐ కనీస మద్దతు ధరకు రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేస్తుంది. ఈ పత్తి నిల్వలను ఉంచడంతోపాటు జిన్నింగ్ చేసి దూదిని విడదీసి బేళ్లుగా తయారు చేసేందుకు జిన్నింగ్ మిల్లులను అద్దెకు తీసుకుటుంది. ఈ అద్దె కోసం సీసీఐ కొన్ని నిబంధనలు విధించి మిల్లుల యజమానుల నుంచి టెండర్ల ద్వారా కొటేషన్లను ఆహ్వానిస్తుంది. ఈ ఏడాది సీసీఐ సీఎండీ కొత్త నిబంధనలను తీసుకురావడం ఇప్పుడు వివాదానికి కారణమైంది. క్వింటాలు పత్తిని మిల్లులో జన్నింగ్ చేసినప్పుడు తప్పనిసరిగా 33 కిలోల దూదిని తమకు అప్పగించాలని సీసీఐ నిబంధన పెట్టింది. గతంలో ఇది 30.5 కిలోలే ఉండేది. దీనిపై మిల్లుల యజమానుల నుంచి ఆగ్రహం వ్యక్తం కావడంతో ప్రభుత్వం 31 కిలోలకు దిగి వచ్చింది. మరో నిబంధన పత్తిని జన్నింగ్ చేసిన తర్వాత వచ్చే దూది నుంచి బేళ్లు తయారు చేయగా, అందులో 2 శాతం వ్యర్థాలు మించరాదని కొత్త నిబంధనను తీసుకవచ్చారు. సాధారణంగానే జిన్నింగ్ చేసిన తర్వాత పత్తిలో 3.5 శాతం వ్యర్థాలు ఉంటాయని అలాంటి పరిస్థితిలో బేళ్లలో రెండు శాతం వ్యర్థాల నిబంధన సరికాదని మిల్లుల యజమానులు వాధించారు. దీన్ని 2.5 శాతానికి సీసీఐ పెంచింది. అదే సమయంలో సీసీఐ పత్తిని జిన్నింగ్ కోసం మిల్లులకు పత్తిని ఇచ్చిన తర్వాత తిరిగి బేళ్లను ఇచ్చే క్రమంలో నిబంధనలను మించి తరుగు ఉంటే ఆ భారాన్ని జిన్నింగ్ మిల్లులకు మోపడం ద్వారా అసలు వ్యాపారం చేసుకోవ్వని పరిస్థితి ఉందని వాపోతున్నారు. తరుగు 3.25 కిలోల వరకు మినహాయింపును ఇచ్చింది. కొలిక్కిరాని టెండర్లు.. ప్రతి ఏడాది దసరా నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభం అవుతాయి. అంతకు ముందు సీసీఐ జిన్నింగ్ మిల్లులను అద్దెకు తీసుకోవాలి. పత్తి కొనుగోలు అధికారులను నియమించాలి. జిన్నింగ్ మిల్లులతో టెండర్ల ద్వారా ఒప్పందం చేసుకుని ముందుకు వెళ్తే పత్తి కొనుగోళ్లు సరైన సమయానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగే అవకాశం ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో 18 మార్కెట్ యార్డుల పరిధిలో సుమారు 23 జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ లీజుకు తీసుకోవడం ద్వారా ఈ వ్యవహారాన్ని నడపాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు మూడు సార్లు టెండర్లు పిలిచినా వ్యాపారులు ముందుకు రాలేదు. ఇక తాజాగా గత శుక్రవారం నాలుగోసారి టెండర్లను పిలవడం జరిగింది. దూది శాతం, వ్యర్థాల శాతం, తరుగుశాతం విషయంలో సీసీఐ కొంత దిగి వచ్చినప్పటికీ ఇందులో నెలల వారీగా మళ్లీ శాతం హెచ్చింపు ఉందని, అదే విధంగా ఇతర నిబంధనలు కూడా జిన్నింగ్ మిల్లుల యజమానులకు నష్టం కలిగించేలా ఉన్నాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. దీంతో నాలుగో సారి కూడా టెండర్లు కొలిక్కి వస్తాయో లేదోననే సందిగ్ధం కనిపిస్తోంది. జిల్లాలో ఇదీ పరిస్థితి.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 3.47 లక్షల హెక్టార్లలో పత్తి పంట గతేడాది సాగైంది. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో పత్తిపంట సాగవుతోంది. సుమారు 50 నుంచి 60 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఏడాది పత్తి పంటకు కేంద్రం కనీస మద్దతు ధర రూ.5450కి పెంచింది. దీంతో ఈ ఏడాది సీసీఐ కొనుగోళ్లు అధికంగా ఉండే అవకాశాలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో జిన్నింగ్ మిల్లుల యజమానులు టెండర్లకు ముందుకు వస్తేనే కొనుగోళ్లలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకున్న పక్షంలోనే కొనుగోళ్లు ప్రారంభమయ్యే సమయానికి ఎలాంటి ప్రతిష్టంభన ఉండదు. టెండర్లు పిలిచిన పత్తి కొనుగోలు కేంద్రాలు.. ఉమ్మడి జిల్లాలో 23 జిన్నింగ్‌లు టెండర్లకు పిలిచాయి. అందులో ఆదిలాబాద్, ఆదిలాబాద్(బి), ఆసిఫాబాద్, బేల, బెల్లంపల్లి, భైంసా, చెన్నూర్, ఇచ్చోడ, ఇంద్రవెల్లి, బోథ్, జైనూర్, కడెం, కుభీర్, లక్సెట్టిపేట, మంచిర్యాల, నేరడిగొండ, నిర్మల్, పొచ్చెర, సారంగపూర్, సొనాల, వాంకిడి ఉన్నాయి. నష్టం కలిగిస్తున్నాయి.. సీసీఐ కొత్త నిబంధనలతో జిన్నింగ్ మిల్లులను అద్దెకు ఇవ్వలేం. దూది శాతం, వ్యర్థాల శాతం, తరుగు శాతంలో కొంత మినహాయింపులు ఇచ్చింది. కొనుగోలు ముందుకు సాగే సమయంలో ప్రతి నెల ఈ నిబంధనలు మారి తిరిగి సీసీఐ మొదట సూచించిన శాతాలకు చేరుకుంటున్నాయి. అదే విధంగా ఇందులో ఇతర అనేక నిబంధనలు కూడా జిన్నింగ్ మిల్లుల యజమానులకు నష్టం కలిగించేలా ఉన్నాయి. అయినప్పటికీ అద్దెకు ఇచ్చే విషయంలో ఆలోచన చేస్తున్నాం. త్వరలోనే మా వైఖరి వెల్లడిస్తాం. – రాజీవ్‌కుమార్ మిట్టల్, జిన్నింగ్ మిల్లు యజమాని, ఆదిలాబాద్ -
కొనుగోళ్లు బంద్..!
వరంగల్ సిటీ: నిమ్ము పత్తి కొనుగోళ్లను నిలిపివేయడంతో వరంగల్ వ్యవసాయ మార్కెట్లో రైతులు ఆందోళనకు దిగారు. తేమ మిషన్లలో లోపాలు ఉన్నాయని.. పత్తిని కొనుగోలు చేయాల్సిందేనని రైతులు పలుమార్లు మార్కెట్ కార్యాలయం వద్ద గొడవకు దిగడంతో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయినా.. ఖరీదుదారులు స్పందించకపోవడంతో పలువురు రైతులు మార్కెట్ ఆవరణలోనే పత్తిని ఆరబెట్టారు. కొందరు మాత్రం వాహనాల్లో ఇంటిబాట పట్టారు. అడ్తిదారుల ప్రయత్నాలు విఫలం నిమ్ము పత్తి కొనుగోలు చేసేది లేదని ఖరీదుదారులు స్పష్టం చేసినప్పటికీ.. అడ్తిదారులు తమ ప్రయత్నాలను కొనసాగించారు. నిమ్ము పత్తిని తక్కువ ధరతో కొనుగోలు చేయించడానికి చివర వరకూ ప్రయత్నించారు. ఓ దశలో రైతులను రెచ్చగొట్టి మార్కెట్ కార్యాలయం మీదకు పంపిం చినట్లు సమాచారం. అంతేకాదు.. మార్కెట్లోని మిని చాంబర్లో ఖరీదు దారులతో అడ్తిదారులు సమావేశమై చర్చించారు. అయినప్పటికీ ఖరీదుదారులు ఏకతాటిపై నిలిచి పొడి పత్తిని మాత్రమే క్వింటాల్‌కు రూ.4,850తో కొనుగోలు చేశారు. జేసీతో మాట్లాడి ఓ నిర్ణయం తీసుకుందా మని తెలిపారు. సెలవన్నట్లే..? ఎట్టకేలకు జేసీ దయానంద్‌తో మార్కెట్ చైర్మన్ ధర్మరా జు, కార్యదర్శి నిర్మల మాట్లాడారు. నిమ్ము పత్తి కొనుగో ళ్ల స్తంభనపై వివరించారు. ఈ సందర్భంగా జేసీ.. ‘అడ్తిదారులు, వ్యాపారుల అభ్యర్థన మేరకే నిర్ణ యం తీసుకున్నాం. ఎప్పుడో ఒకసారి కఠిన నిర్ణయం తీ సుకోకుంటే భవిష్యత్‌లో ఇబ్బంది కలుగుతుంది. ఓ రెం డు రోజులు చూద్దాం. అందరికీ తెలిసి రావాలి. అవగా హన కలగాలి.’ అని అన్నట్లు తెలిసింది. ఈ క్రమంలో మార్కెట్ అధికారులు, అడ్తిదారులు, వ్యాపారులు సా యంత్రం మరోసారి సమావేశమయ్యారు. సోమవారంతోపాటు మంగళవారం మార్కెట్‌కు వచ్చే నిమ్ము పత్తిని పరిశీలించి, అన్నింటినీ కొనుగోళ్లు చేద్దామని.. ఆ త ర్వా త 4 రోజులు మార్కెట్ బంద్ చేద్దామని నిర్ణయించారు. మిషన్లలో లోపాలు..: నిమ్ము పేరిట కొర్రీలతో పత్తిని కొనుగోలు చేయకపోవడం పై రైతులు మండిపడ్డారు. నిమ్ము శాతం కొలిచే యంత్రాల్లో లోపాలు ఉన్నాయని.. వాటిని సెట్ చేసి పెట్టుకున్నారుని ఆరోపించారు. ఓ పత్తిని ఒక మిషన్‌తో పరిశీలిస్తే 14, మరో మిషన్‌తో పరిశీలిస్తే 18 శాతం, ఇంకో మిషన్‌తో ప రిశీలిస్తే 21 శాతం చూపిస్తున్నదని వివరించారు. అయినా ఖరీదుదారులు ససేమిరా అంటూ కొనుగోలు చేయకపోవడంతో కొందరు రైతులు పత్తి వాహనాలతో తిరుగు ప్ర యాణమయ్యారు. అవిపోనూ సాయంత్రం వరకు రెండు వేలకు పైగా పత్తి బస్తాలు మార్కెట్ యార్డులోనే ఉన్నాయి. తేమ మిషన్లతోనే మోసం... మార్కెట్లో తేమ శాతాన్ని కొలిచే మిషన్లలోనే అనేక లోపాలు ఉన్నాయి. వాటితోనే మోసం చేస్తున్నారు. ఒక్కో మిషన్ ఒక్కో రకంగా చూపిస్తోంది. నా పత్తినే 14, 18, 21 శాతం అని చూపించాయి. దేన్ని నమ్మాలి.. పైగా రూ.వెయ్యికి తక్కువ ఇస్తే ఏదోలా అమ్మిస్తామని కొందరు రకరకాలుగా పరేషాన్ చేస్తున్నారు. – కొడెం శ్రీనివాస్, పత్తి రైతు, మహేశ్వరం -
జమ్మికుంట మార్కెట్లో ‘నామ్’ ప్రారంభం
జమ్మికుంట: ఉత్తర తెలంగాణలో రెండో అతి పెద్దదైన జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో కేంద్రం అమలు చేస్తున్న ’నామ్’ పద్ధతిన (ఆన్లైన్లో) పత్తి కొనుగోళ్లు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. గతంలో వ్యాపారి నిర్ణయించిన ధరకే రైతు సరకు అమ్ముకోవాల్సి వచ్చేది. దాంతో ఆ వేలం పద్ధతిని రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం ‘నామ్’ పద్ధతిన కొనుగోళ్లు చేపట్టాలని నిర్ణయించడంతో వ్యసాయ కమిషనర్ ఆదేశాల మేరకు కొత్త పద్ధతిన కొనుగోళ్లు ప్రారంభించారు. వంద వాహనాల్లో లూజు పత్తి, రెండు వేల టిక్కీల పత్తి మార్కెట్‌కు వచ్చింది. ఈ కొత్త పద్ధతిలో సీక్రెట్ క్యాబిన్లో ధరలు నిర్ణయిస్తారు. ముందుగా సరకుకు గ్రేడింగ్ చేసి ధర నిర్ణయిస్తారు. ఈ పద్ధతిలో ఆలస్యం జరుగుతుందని, కిరాయి వాహనాలతో వచ్చిన రైతులు ఆలస్యం కారణంగా వాహనాల కిరాయికి అధిక మొత్తం చెల్లించాల్సి వస్తుందని అంటున్నారు. గ్రేడింగ్ నిర్ధారణకు నిపుణుల కొరత కూడా ఉందని, నిపుణులను నియ మించాలని రైతులు కోరుతున్నారు. కాగా, కొందరు రైతులు నేరుగా మిల్లుల వద్దే సరకు విక్రయించుకునేందుకు వేచి ఉన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పింగిలి రమేష్, వైస్ చైర్మన్ ఎర్రబెల్లి రాజేశ్వరరావు, కార్యదర్శిలు ‘నామ్’ పద్ధతిని ప్రారంబించారు. -
ఏనుమాముల మార్కెట్లో నిలిచిన పత్తి కొనుగోళ్లు
వరంగల్: పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఆసియాలోనే పెద్దదైన వరంగల్ ఏనుమాముల మార్కెట్ యార్డుపై సైతం పడింది. కొత్త నోట్లు రాకపోవడం, చిల్లర కొరత కారణంగా మార్కెట్లో కొనుగోళ్లు నిలిచిపోతున్నాయి. ప్రస్తుతం పత్తి సీజన్ నడుస్తుండగా మార్కెట్‌కు గతంలో కంటే అతి తక్కువగా రైతులు తమ పంట ఉత్పత్తిని తరలిస్తున్నారు. పత్తిని కొన్న అడ్తిదారులు డబ్బుల రూపంలో కాకుండా చెక్కుల రూపంలో ఇస్తున్నారు. ఆ చెక్కులను బ్యాంకుల్లో మార్చుకోలేక, చేతిలో చిల్లిగవ్వ లేక వారు రైతులు పడుతున్నఅవస్థలు వర్ణనాతీతం. కొంతమేరకైనా నగదు రూపంలో ఇస్తే తమ అత్యవసర ఖర్చులకు పనికొస్తాయని అంటున్నారు. -
ప్రైవేటుకు పత్తి అమ్మొద్దు
సాక్షి, హైదరాబాద్: రైతులు తాము పండించిన పత్తిని ప్రైవేటు వ్యాపారులకు అమ్మకుండా విస్తృత ప్రచారం చేయాలని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు. మార్కెటింగ్ శాఖ పరిధిలోని వివిధ అంశాలపై మంత్రి శుక్రవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. మార్కెటింగ్ శాఖ డైరక్టర్ డాక్టర్ శరత్, అదనపు డైరక్టర్ లక్ష్మీబాయి, ఓఎస్డీ జనార్దన్‌రావు పాల్గొన్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రి ఆదేశాలు జారీ చేశారు. పత్తి కొనుగోలుకు సీసీఐ 84 కేంద్రాల ఏర్పాటుకు హామీ ఇవ్వగా, 83 కేంద్రాలు తెరవడంపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రైవేటు వ్యాపారులకు పత్తి అమ్మితే జరిగే నష్టంతో పాటు, సీసీఐ కొనుగోలు కేంద్రాలు పత్తిని తీసుకు రావడంపై శాస్త్రీయంగా అవగాహన కల్పించాలన్నారు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ పండ్ల మార్కెట్‌ను కోహెడ్ వద్ద గుర్తించిన ప్రదేశానికి తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో ప్రస్తుత మార్కెట్ సరిపోవడం లేదని.. అడ్లూర్‌లో నిర్మాణంలో వున్న నూతన యార్డును ప్రారంభించి తరలించాల్సిందిగా సూచిం చారు. ప్రస్తుతమున్న మార్కెట్ యార్డు ఆవరణలో కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయాలని మంత్రి హరీశ్ సూచించారు. బోయిన్పల్లి, వంటిమామిడి, వరంగల్‌లో నిర్మించ తలపెట్టిన కోల్డ్‌స్టోరేజీల పురోగతిపై సమీక్షించడంతో పాటు.. వరంగల్ జిల్లా కలెక్టర్ వాకాటి కరుణతో ఫోన్లో మాట్లాడారు. వరంగల్‌లో నిర్మిం చనున్న కోల్డ్‌స్టోరేజీ, పండ్ల మార్కెట్‌కు స్థలా న్ని మార్కెటింగ్ శాఖకు అప్పగించాలన్నారు. హమాలీలకు యూనిఫారాలు మార్కెటింగ్ శాఖ ద్వారా యార్డుల్లో పనిచేసే హమాలీలకు తక్షణమే యూనిఫారాలు అందజేయాలని మంత్రి ఆదేశించారు. హమాలీకు నిర్వహించాల్సిన ఆరోగ్య, శిక్షణ శిబిరాలను త్వరగా నిర్వహించాలన్నారు. డిసెంబర్ 30 నాటికి హమాలీలకుద్దేశించిన బీమా కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు. రాష్ట్రంలో గుర్తిం చిన 44 మార్కెట్ యార్డుల కంప్యూటరీకరణ వేగంగా పూర్తి చేయాలన్నారు. ఇందుకవసరమైన టెండర్ ప్రక్రియను చేపట్టాలన్నారు. -
నిలిచిన పత్తి కొనుగోళ్లు
ఖమ్మం: కమీషన్ వ్యాపారులకు, ఖరీదు దారులకు మధ్య ఒప్పందం కుదరక పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖమ్మం జిల్లాలోని మార్కెట్ యార్డులో గురువారం జరగాల్సిన జండా పాట జరగలేదు. మార్కెట్ కార్యదర్శి కలుగ జేసుకొని ఇరు వర్గాలను శాంతింప చేయడానికి ప్రయత్నించిన లాభం లేకపోవడంతో 3000 బస్తాల పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. -
ఆదిలాబాద్ మార్కెట్లో పత్తి కొనుగోళ్లు ప్రారంభం
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్‌లో పత్తి కొనుగోళ్లు ఆదివారం ప్రారంభమయ్యాయి. సుమారు 40 క్వింటాళ్ల పత్తిని రైతులు మార్కెట్‌కు తీసుకొచ్చారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్‌కు రూ.4,100 కాగా... రూ.4,131 ధరకు వ్యాపారస్థులు కొనుగోలు చేశారు. -
20 నుంచి పత్తి కొనుగోళ్లు
- కొనుగోళ్లపై సన్నాహక సమావేశం - అన్యాయం జరిగితే మంత్రుల ఇళ్లనే ముట్టడిస్తాం - రాస్తారోకోలతో సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టం - పత్తికి రాష్ట్ర ప్రభుత్వం రూ.500 బోనస్ ఇవ్వాలి - కొనుగోళ్లలో అక్రమాలు జరగకుండా చూడాలి - రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ఈ నెల 20వ తేదీ నుంచి పత్తి కొనుగోళ్లు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని మార్కెటింగ్ శాఖ అధికారులు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని మార్కెట్‌యార్డుల్లో కొనుగోళ్లకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఖరీఫ్ పత్తి కొనుగోళ్లపై సన్నాహక సమీక్ష సమావేశం ఆదివారం స్థానిక కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో జరిగింది. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సీజనులో అక్టోబర్ 5 నుంచి కొనుగోళ్లను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని, ఇందుకోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నామని సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) బ్రాంచ్ మేనేజర్ మహేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. పత్తి విక్రయాల డబ్బులను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తామని అన్నారు. సీసీఐ నిర్ధేశించిన నాణ్యత ప్రమాణాల మేరకు ఉన్న పత్తి కొనుగోలుకు తాము సిద్ధంగా ఉన్నామని వ్యాపారుల సంఘం ప్రతినిధి జి.వినోద్ పేర్కొన్నారు. పలువురు రైతులు మాట్లాడుతూ.. ‘‘రాష్ట్ర ప్రభుత్వం పత్తి రైతులను చిన్న చూపు చూస్తోంది. ఉద్యోగుల జీతభత్యాలను 40 శాతానికిపైగా ఫిట్మెంట్ ప్రకటించిన సర్కారు., పత్తి కనీస మద్దతు ధర క్వింటాళుకు రూ.50 పెంచి ఒక శాతంతో సరిపెట్టింది.. కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర రూ.4,100కు అదనంగా రూ.500 రాష్ట్రప్రభుత్వం బోనస్‌గా చెల్లించాలి..’’ అని డిమాండ్ చేశారు. జైనథ్, కాగజ్‌నగర్, బేల, బజార్‌హత్నూర్‌లలో సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయాలని విజ్ఞప్తి చేశారు. ‘‘మార్కెట్‌యార్డుల్లోనే పత్తి కొనుగోళ్లు జరిగేలా చూస్తేనే రైతులకు మేలు జరుగుతుంది.. సీసీఐ లీజుకు తీసుకున్న జిన్నింగుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు కొనుగోళ్లకు జరుగకుండా చూడాలి.. గత ఏడాది ఈ చర్యలు తీసుకోవడంలో విఫలం కావడంతో పెద్ద ఎత్తున అక్రమ కొనుగోళ్లు జరిగి, రైతులు తీవ్రంగా నష్టపోయారు.. అధికారులు, ప్రజాప్రతినిధులు ట్రేడర్లకు మేలు చేసేలా చూడొద్దు... ఈసారి మాకు అన్యాయం జరిగితే రాస్తారోకోలు చేసి, ప్రజలు, చిరువ్యాపారులను ఇబ్బంది పెట్టేది లేదు.. ఏకంగా జిల్లా మంత్రులు, కలెక్టర్ ఇళ్లను ముట్టడిస్తాం..’’ అని రైతులు, రైతు ప్రతినిధులు తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. తప్పు జరిగితే సర్కారు బదునాం : మంత్రులు ‘ఈసారి పత్తి కొనుగోళ్లలో ఏ చిన్న తప్పు జరిగినా ప్రభుత్వమే బదునాం అవుతుంది.. పత్తి కొనుగోళ్లను పకడ్బందీగా నిర్వహించాలి. ఈసారి సీసీఐతోపాటు, కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్ ద్వారా కూడా పత్తి కొనుగోళ్లు జరిగేలా ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి విన్నవిస్తాం..’ అని మంత్రులు జోగు రామన్న, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. రైతులకు ప్రత్యేక కార్డులు..: కలెక్టర్ బార్ కోడింగ్ విధానం కలిగిన ప్రత్యేక కార్డులను పత్తి రైతులకు జారీ చేసి పత్తి కోనుగోళ్లు జరుపుతామని కలెక్టర్ ఎం.జగన్మోహన్ పేర్కొన్నారు. ‘‘గత ఏడాది తూకాల్లో భారీ మోసాలు జరిగాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారు.. ఈసారి తరచూ కాంటాలను తనిఖీ చేయండి. మీ లోపం కారణంగా తూకాల్లో వ్యత్యాసం రాకుండా ఆకస్మిక తనిఖీలు చేపట్టండి..’ అని తూనికల కొలతల అధికారులను ఆదేశించారు. మార్కెట్‌యార్డుల్లో రైతులకు భోజన వసతి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. పశుగ్రాసం, తాగునీరు అందుబాటులో ఉంచాలన్నారు. ఈ సమావేశంలో ఎంపీ గోడాం నగేష్, ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, దుర్గం చిన్నయ్య, జి.విఠల్‌రెడ్డి, రాథోడ్ బాపూరావు, కలెక్టర్ ఎం.జగన్మోహన్, జేసీ సుందర్‌అబ్నార్, సీసీఐ, మార్కెటింగ్ శాఖ అధికారులు జేడీ శ్యాముల్‌రాజు, శ్రీనివాస్, ఏఎస్పీ పనసారెడ్డి, రైతులు, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
బొక్కింది..మూడు కోట్లు
సాక్షి ప్రతినిధి, గుంటూరు : పత్తి కుంభకోణం కాయకష్టం చేసే కార్మికుల్లోనూ చిచ్చుపెట్టింది. సీజన్లో రావాల్సిన కూలి డబ్బులు సైతం రాకుండా చేసింది. సీసీఐ బయ్యర్లు, మార్కెటింగ్ శాఖ సిబ్బంది మిలాఖత్ కావడమే ఇందుకు కారణం. పత్తి బయ్యర్లకీ, యార్డులో ముఠా కూలీలకు, హమాలీలకు ఏమిటీ సంబంధం అనుకుంటున్నారా? ఇదిగో ఇలా... భారత పత్తి సంస్థ (సీసీఐ) నిబంధనల ప్రకారం రాష్ట్రంలో ఏమూల పత్తి కొన్నా అది ఆయా ప్రాంతాల్లోని వ్యవసాయ మార్కెటింగ్ యార్డుల్లోని కొనుగోలు కేంద్రానికి చేరాలి. వచ్చిన లారీల్లోని పత్తి బోరాలను కార్మికులు దిగుమతి చేసి, కాటా వేసిన తరువాత ఎగుమతి చేస్తారు. రాష్ట్రంలో ఈ ఏడాది 43 పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఒక్కో కేంద్రంలో సగటున 25 నుంచి 30 మంది వరకు కూలీలు (తూకం వేసే వారితో సహా) ఉంటారు. నాలుగు డబ్బులొచ్చే సీజన్ ఇదే వాళ్లకి. రోజుకు సగటున 400 రూపాయల కూలి వస్తుంది. మరేం జరిగింది...? సీసీఐ ఈ ఏడాది సుమారు 93.65 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసింది. లెక్కప్రకారం ఇదంతా మార్కెటింగ్ యార్డులకు వచ్చి అక్కడి నుంచి జిన్నింగ్ మిల్లులకు చేరాలి. అలా జరగడానికి బదులు కేవలం 30 శాతమే అంటే 28 లక్షల క్వింటాళ్లు మాత్రమే రావడంతో కార్మికుల పాలిట సీజన్ కుదేలయింది. మిగతా 70 శాతం నేరుగా జిన్నింగ్ మిల్లులకు చేరింది. దీనివల్ల 90 రోజుల పాటు పని ఉంటుందనుకున్న కార్మికులకు నిరాశే మిగిలింది. 4.5 కోట్ల రూపాయల కూలి డబ్బులకు రెక్కలు... రాష్ట్రంలోని కొనుగోలు కేంద్రాల్లో రోజుకు సుమారు 13వందల మంది కార్మికులు పనిచేశారు. 90 రోజుల పాటు పని ఉంటుందనుకుంటే రోజకు రూ.400 చొప్పున రూ.4.65 కోట్ల రూపాయలు రావాలి. కానీ వచ్చింది మాత్రం కేవలం కోటిన్నరే. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే రూ.1,54,80,000లను మాత్రమే. మిగిలిన రూ.3.10 కోట్ల రూపాయలు కాకిలెక్కలకు పరిమితమైంది. ఈమేరకు రికార్డులు సృష్టించి మార్కెటింగ్ శాఖ, సీసీఐ సిబ్బంది, బయ్యర్లు మింగేశారు. రికార్డులు సృష్టించారిలా... జిన్నింగ్ మిల్లులకు తరలించిన 65.65 లక్షల క్వింటాళ్ల పత్తిని సీసీఐ కొనుగోలు కేంద్రాలకు వచ్చినట్టు, దాన్ని దిగుమతి, ఎగుమతి చేసినట్టు రికార్డులు సృష్టించారు. క్వింటాల్‌కు 5 నుంచి 9 రూపాయల మధ్య రాసుకుని సీసీఐ నుంచి రాబట్టుకుని స్వాహా చేశారు. కూలీల సంఘాలనే చీల్చారు... ఈ విషయం తెలిసిన కార్మికులు తామసలు యార్డుల్లో ఎగుమతి, దిగుమతే చేయలేదని అడ్డం తిరిగారు. దీనివెనుకేదో మతలబు ఉందని గ్రహించి ఆందోళనకు దిగారు. ఈ విషయం బయటకు పొక్కకుండా బయ్యర్లు కొంత మొత్తాన్ని తమ అనుయాయులుగా ఉన్న కార్మికులకు ముట్టజెప్పి సద్దుమణిగేలా చేయాలని చూశారు. దీనికి కొందరు అంగీకరించకపోవడంతో అసలు సంఘాన్నే చీల్చారు. గుంటూరు మార్కెట్ యార్డులో జరిగిన సంఘటనే దీనికి ప్రత్యక్ష సాక్ష్యం. 3 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసినట్టు లెక్కల్లో చూపితే ఓ వర్గం ముఠా కూలీలు వ్యతిరేకించారు. దీంతో అధికారులు ఆ సంఘంలోనే కొంత మందిని ఉసికొల్పి వారి మధ్యే గొడవ పెట్టించారు. దీంతో ఓవర్గం కూలీలు బజారున పడి ధర్నా చేయకతప్పలేదు. తెలివిగల పెద్దలు రంగంలోకి దిగి ఇరువర్గాల నోళ్లు మూయించేలా చెరికొంచెం ముట్టజెప్పి రాజీ కుదర్చడం కొసమెరుపు. -
ఇక దోచుకున్నంత..!
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియూ (సీసీఐ) పత్తి కొనుగోళ్లు బంద్ పెట్టింది. సోమవారం నుంచి ఆయా మార్కెట్ యూర్డుల్లోని కేంద్రాలను మూసివేసింది. దీంతో పత్తి రైతులను దోచుకునేందుకు ఎదురుచూస్తున్న ప్రైవేట్ వ్యాపారులకు కలిసి వచ్చింది. సీసీఐ కొనుగోళ్లు నిలిచిపోరుున మొదటిరోజే పత్తి ధర గణనీయంగా పడిపోరుుంది. జిల్లాలోనే పెద్దదైన జమ్మికుంట మార్కెట్లో క్వింటాల్ పత్తి ధర రూ.3500-3700 మాత్రమే పలికింది. 24 గంటల వ్యవధిలోనే రూ.200 వరకు పడిపోయింది. జమ్మికుంట రూరల్ : జిల్లాలో జమ్మికుంట, పెద్దపల్లి మార్కెట్ యూర్డుల్లో గత డిసెంబర్ నుంచి సీసీఐ పత్తికి మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయడంతో రైతులు కొంత ప్రయోజనం పొందారు. ఇంకా పత్తి అమ్మకాలు పూర్తికాకుండానే ఉన్నఫళంగా సీసీఐ కొనుగోళ్లు బంద్ చేయడంతో రైతులు తక్కువ ధరకు పత్తిని అమ్ముకునే పరిస్థితి దాపురించింది. ఈ నాలుగు నెలల కాలంలోనూ సీసీఐ అధికారులు, వ్యాపారులతో కుమ్మక్కై పెద్ద ఎత్తున బినామీ వ్యాపారం నడిపినట్టు ఆరోపణలు వెల్లువెత్తారుు. సంవత్సరాంతం ఆడిటింగ్ పేరిట పత్తి కొనుగోళ్లకు స్వస్తి చెప్పడంతో వ్యాపారులు ఆడిందే ఆటగా మారిందనే అనుమానాలు వాదనలు వినిపిస్తున్నారుు. ఒక్కరోజులోనే ఎంత తేడా..? సోమవారం జమ్మికుంట మార్కెట్లో జరిగిన క్రయవిక్రయాలను పరిశీలిస్తే వ్యాపారులు రైతులను నట్టేట ముంచుతున్నారనేది స్పష్టమవుతోంది. గరిష్ట ధర క్వింటాల్‌కు రూ.4060గా నిర్ణయించినప్పటికీ మచ్చుకు కొంత చెల్లించి మిగతా మొత్తాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి రైతులను దోచుకున్నారనే ఆరోపణలు వినిపించారుు. సీపీఐ పత్తిని కొనుగోలు చేసిన సందర్భంలో బస్తాల్లో వచ్చిన పత్తికి ప్రైవేట్ ట్రేడర్లు రూ.3700-3900 వరకు చెల్లించారు. సీసీఐ పత్తి కొనుగోళ్లను నిలిపివేయడంతో అదే వ్యాపారులు కేవలం రూ.3500-3700 వరకు చెల్లిస్తూ సోమవారం కొనుగోళ్లు చేపట్టారు. మార్కెట్‌కు 401 క్వింటాళ్ల లూజ్ పత్తి రాగా, 284 క్వింటాళ్ల పత్తి బస్తాలు వచ్చాయి. లూజ్ పత్తికి క్వింటాల్‌కు రూ.4060 ధరగా నిర్ణయించి అతి కొద్దిగా మాత్రమే కొనుగోలు చేశారు. మిగతా పత్తికి తేమ, నాణ్యత పేరుతో తక్కువ ధర చెల్లించారు. గతవారం రోజుల్లో రోజుకు సుమారు 2500 క్వింటాళ్ల పత్తి మార్కెట్‌కు రాగా సోమవారం 686 క్వింటాళ్లు మాత్రమే అమ్మకానికి వచ్చింది. ఏప్రిల్‌లో తెరుచుకుంటాయూ? జమ్మికుంట మార్కెట్లో సీసీఐ ఇప్పటివరకు 2,73,132 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసింది. ప్రైవేట్ వ్యాపారులు 92,933 క్వింటాళ్లు కొన్నారు. అయితే ఏప్రిల్‌లో సీసీఐకి అమ్మితే ధర అధికంగా వస్తుందని ఆశపడ్డ రైతులకు ఇప్పుడు నిరాశే మిగిలింది. సంవత్సరాంతపు ఆడిటింగ్ పూర్తయిన తరువాత ఏప్రిల్ మొదటి వారంలో సీసీఐ తిరిగి పత్తిని కొనుగోలు చే స్తుందని ప్రచారం జరగడంతో రైతులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇప్పటికి రైతుల ఇళ్లలో వేల క్వింటాళ్ల పత్తి నిల్వలున్నారుు. ఆలస్యంగా అమ్మితే మంచి ధర వస్తుందని ఆశించగా, ఇప్పుడు ఆసలుకే ఎసరు వచ్చే ప్రమాదముందని అన్నదాతలు వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి పత్తి రైతులకు మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. ఒక్క రోజులోనే ఎంత తేడా..? జమ్మికుంటలో వ్యాపారులు చెల్లించిన ధరలు మొన్న రూ.37003900 నిన్న రూ.35003700 జమ్మికుంటలో పత్తి కొనుగోళ్లు (క్వింటాళ్లు) సీసీఐ కేంద్రంలో 2,73,132 వ్యాపారులు 92,933 -
వచ్చారు.. వెళ్లారు..
- సీజన్ పూర్తయ్యాక వచ్చిన విజిలెన్స్ బృందం.. - సీసీఐ పత్తి కొనుగోళ్లపై తనిఖీలు - కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అక్రమాలు సాక్షిప్రతినిధి, ఆదిలాబాద్ : పత్తి కొనుగోళ్లపై భారత పత్తి సంస్థ(సీసీఐ) విజిలె న్స్ విభాగం దృష్టి సారించింది. ముంబయిలోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయం నుంచి విజిలెన్స్ విభాగం ఉన్నతాధికారుల బృందం నాలుగు రోజుల క్రితం జిల్లాకు వచ్చింది. ఆదిలాబాద్‌లోని ఆ సంస్థ బ్రాంచ్ కార్యాలయంలో పలు రికార్డులను తనిఖీ చేసింది. అనంతరం జిల్లాలోని పలు సీసీఐ కొనుగోలు కేంద్రాలను సందర్శించింది. కొనుగోళ్ల తీరును బృందంలోని ఉన్నతాధికారులు పరిశీలించారు. ఆదిలాబాద్ సీసీఐ బ్రాం చ్ అద్దెకు తీసుకున్న మెదక్ జిల్లా తూప్రాన్‌లో పత్తి బేళ్ల గోదాములను కూడా బృందం తనిఖీ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కొనుగోళ్ల సీజనంతా ముగిసాక విజిలెన్స్ విభాగం తనిఖీలు చేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. రెండు నెలల క్రితం జిల్లాలో పత్తి కొనుగోళ్లు జోరుగా సాగాయి. కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు వ్యక్తయయ్యాయి. సీసీఐ అధికారులు దళారులతో కుమ్మక్కై రూ.లక్షలు దండుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. మొదట్లో రైతుల పత్తిలో తేమ శాతం అధికంగా ఉందనే సాకుతో కొనుగోళ్లకు సీసీఐ అధికారులు నిరాకరించారు. ఇదే పత్తిని దళారులు క్వింటాల్‌కు రూ.3,500 నుంచి రూ.3,700 చొప్పున కొనుగోలు చేసి సీసీఐకికనీస మద్దతు ధర క్వింటాళుకు రూ.4,050 చొప్పు న విక్రయించారు. దళారులు తెచ్చిన పత్తిని సీసీఐ అధికారులు ఎలాంటి నాణ్యత పరిశీలించకుండానే కొనుగోలు చేశారు. ఈ వ్యవహారంలో క్వింటాల్‌కు రూ.200 వరకు సీసీఐ అధికారులకు దళారులు ముట్టజెప్పారనే ఆరోపణలు వచ్చాయి. సీసీఐ అద్దెకు తీసుకున్న జిన్నింగ్ మిల్లులో ఇటీవల పలు అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల వెనుక కూడా తీవ్ర ఆరోపణలు వచ్చాయి. కొనుగోళ్లలో జరిగిన అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి ఈ అగ్ని ప్రమాదాలు ఆసరాగా చేసుకున్నారనే ఆరోపణలు కూడా వ్యక్తమయ్యాయి. ఈ సీజన్లో ఆసిఫాబాద్, బోథ్, బేల తదితర చోట్ల ఉన్న సీసీఐ జిన్నింగ్‌లలో ఈ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. కొనుగోళ్ల సీజనంతా ముగిసాక విజిలెన్స్ విభాగం తనిఖీలు చేయడం మరిన్ని ఆరోపణలకు దారితీస్తోంది. ఈ బృందం ఆదిలాబాద్‌తోపాటు, వరంగల్ సీసీఐ బ్రాంచ్ కార్యాలయాన్ని, కరీంనగర్, వరంగల్, మెదక్ జిల్లాల్లో సీసీఐ కొనుగోలు కేంద్రాలను కూడా సందర్శించినట్లు తెలుస్తోంది. ఈ తనిఖీలన్నీ ఏటా ఉండేవేనని సీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. సాధారణ తనిఖీల్లో భాగంగానే ఈ విభాగం అధికారులు జిల్లాకు వచ్చారని అన్నారు. సీసీఐ పంట పండింది.. పత్తి సాగుతో అన్నదాతలు అప్పులపాలైతే.. దళారులు, సీసీఐ అధికారులకు మాత్రం పంట పండినట్లయింది. ఈ కొనుగోలు సీజన్లో జిల్లా వ్యాప్తంగా 17 కేంద్రాలను సీసీఐ ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు సుమారు 44 లక్షల క్వింటాళ్ల పత్తిని సీసీఐ కొనుగోలు చేసింది. ప్రైవేటు వ్యాపారులు నామమాత్రంగా 1.60 లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి సీసీఐ భారీ స్థాయిలో కొనుగోళ్లు చేపట్టింది. సుమారు రూ.1,500 కోట్ల విలువ చేసే టర్నోవర్ చేసినట్లు సీసీఐ వర్గాలు పేర్కొంటున్నాయి. -
ఇష్టమైతే అమ్మండి.. లేదంటే మీ ఇష్టం
మేమిచ్చేదింతే..! గజ్వేల్: మేమిచ్చే ధర ఇది... ఇష్టమైతే అమ్మండి.. లేదంటే మీ ఇష్టం...అంటూ వ్యాపారులంతా ఒక్కటై రైతన్నలను దగా చేసేందుకు ప్లాన్ వేశారు. అంతేకాకుండా ఏకంగా పత్తి కొనుగోళ్లను నిలిపివేయడంతో అన్నదాతలు ఆగ్రహించారు. వెంటనే కొనుగోళ్లను చేపట్టడంతో పాటు గతంలో ఇచ్చిన ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఈ ఘటన గురువారం గజ్వేల్ మార్కెట్ యార్డులో ఉద్రిక్తతకు దారి తీసింది. పత్తి రైతులు రోజూలాగే గజ్వేల్ యార్డుకు పత్తిని తీసుకొని వచ్చారు. కానీ యార్డులో వ్యాపారులు దుకాణాలు తెరిచినా, కొనుగోళ్లు చేయకుండా కూర్చుండిపోయారు. రైతులు ఆరా తీస్తే ‘‘పత్తి ధర బాగా పడిపోయింది...మేం చెప్పిన ధరకైతే కొనుగోలు చేస్తం...లేదంటూ మీ ఇష్టం’’ అంటూ చేతులెత్తేశారు. నిజానికి నిన్నటి వరకు క్వింటాలు పత్తికి రూ.3,700 నుంచి రూ.3,900 వరకు చెల్లించిన వ్యాపారులు గురువారం మాత్రం రూ.3000 నుంచి రూ.3500 మాత్రమే చెల్లిస్తామని తెగేసి చెప్పారు. దీంతో ఆగ్రహించిన రైతులు యార్డు పక్కనే ఉన్న గజ్వేల్-తూప్రాన్ రహదారిపై బైఠాయించి ట్రేడర్ల తీరుపై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతుల రాస్తారోకో కారణంగా రాకపోకలకు 40 నిమిషాలకు అంతరాయం కలిగింది. రైతుల ఆందోళనకు గజ్వేల్ మాజీ జెడ్పీటీసీ బొల్లారం ఎల్లయ్య కూడా మద్దతు పలికారు. విషయం సమాచారం తెలుసుకున్న గజ్వేల్ ఎస్ఐ జార్జి సంఘటనాస్థలానికి చేరుకుని రైతులను సముదాయించారు. యార్డులో కొనుగోళ్లు జరిగేలా అధికారులతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. అనంతరం రైతుల ఆందోళన విరమింపజేసి వారితో కలిసి యార్డుకు వెళ్లారు. మార్కెట్ కమిటీ సూపర్వైజర్ వీర్శెట్టి, ఇతర వ్యాపారులతో మాట్లాడారు. పత్తి కొనుగోళ్లను నిన్నటి మొన్నటిలాగే క్వింటాలుకు రూ.3,700 పైగా చెల్లించాలని సూచించారు. దీంతో వ్యాపారులు లావాదేవీలు ప్రారంభించడంతో వివాదం సద్దుమణిగింది. ఇదిలా ఉండగా.. రైతులు తెస్తున్న పత్తిలో తేమ శాతం ఎక్కువగాఉండటం వల్ల ధర ఎక్కువ చెల్లించలేమని వ్యాపారులు వాదించడం గమనార్హం. ఇష్టమొచ్చినట్లు చేస్తుండ్రు.. కూలోళ్లకు ఇయ్యనీకి పైసల్లేక మూడు క్వింటాళ్ల పత్తి అమ్ముదామని ఈడికి వచ్చిన. సేట్లు ఇష్టమొచ్చినట్లు చేస్తుండ్రు. ముందుగల్ల అసలే పత్తి కొనుగోలు జేయమన్నరు. కొందరు మేం చెప్పిన రేటుకు ఇస్తే కొంటమన్నారు. గిదేం పద్ధతి..? కష్టం చేసుకొని బతికే రైతులను ముంచుతరా..? ఇప్పటికైన ఈడ కొనుగోళ్లు సరిగా జరిగేటట్టు సూడాలె. -తలకొక్కుల సత్యనారాయణ, రైతు, తిమ్మాపూర్, జగదేవ్‌పూర్ మండలం మస్తు దుఃఖమొస్తుంది ఆరుగాలం కష్టపడి పంట పండించిన పత్తిని ఇక్కడికి తెస్తే ధర సరిగా వస్తలేదు. సేట్లు సక్రమంగా కొనక సతాయిస్తుండ్రు. ఇవన్నీ జూస్తే మస్తు దుఃఖమొస్తుంది. ఇప్పటికైనా గజ్వేల్ యార్డులో పత్తి తేంగానే కిరికిరి పెట్టకుండా కొనేటట్టు చేయాలె. -బ్యాగరి శ్రీను, రైతు, రాయపోల్, దౌల్తాబాద్ మండలం 11జీజేడబ్ల్యూ01, 01ఎః గజ్వేల్‌లో వ్యాపారులు తీరుకు నిరసనగా పత్తి రైతుల రాస్తారోకో దృశ్యం. 11జీజేడబ్ల్యూ01బీ, 01సీః గజ్వేల్ యార్డులో పత్తి క్రయవిక్రయాలు నిలిచిపోయిన దృశ్యం. 11జీజేడబ్ల్యూ01డీః తలకొక్కుల సత్యనారాయణ. 11జీజేడబ్ల్యూ01ఈః బ్యాగరి శ్రీను. -
కొనేదిలేదు..
ఖమ్మం వ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో బుధవారం సీసీఐ అధికారులు పత్తి కొనుగోళ్లలో కొర్రీలు పెట్టారు. నిబంధనల మేరకు సరుకులేదంటూ కొనుగోళ్లను నిలిపి వేశారు. దాదాపు మూడున్నర గంటలకు పైగా సరకు కొనుగోలు చేయలేదు. రైతులు ఆందోళనకు దిగడంతో ఖమ్మం ఆర్డీవో వినయ్‌కృష్ణారెడ్డి అక్కడికి చేరుకున్నారు. సీసీఐ అధికారులతో మాట్లాడి కొనుగోళ్లు జరిపించారు.మార్కెట్లోని సీసీఐ కొనుగోలు కేంద్రానికి బుధవారం దాదాపు 40 వేల బస్తాల పత్తి అమ్మకానికి వచ్చింది. ముగ్గురు సీసీఐ అధికారులు మాయిశ్చర్ యంత్రం తీసుకొని తేమ చూసేందుకు ఉదయం 8:30 గంటల సమయంలో యార్డులోకి వెళ్లారు. మునుపెన్నడూ లేని విధంగా మాయిశ్చర్ యంత్రంతో పరీక్షలు చేసి నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా సరుకు లేదని కొనుగోళ్లకు నిరాకరించారు. అమ్మకానికి వచ్చిన దాదాపు 90 శాతం సరుకును తిరస్కరించడంతో రైతులు బిత్తరపోయారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సీసీఐ అధికారులు తేమ పేరుతో కొనుగోళ్లు జరపకపోవటంపై రైతులు ఆందోళనకు దిగారు. విషయం తెలిసి త్రీటౌన్ పోలీస్‌లు మార్కెట్‌కు చేరుకున్నారు. రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. త్రీటౌన్ సీ.ఐ రెహమాన్, ఎస్ఐలు కుమారస్వామి, సర్వయ్య, సీసీఐ అధికారులు శివశంకర్ వశిష్ట, ఖాన్, షకీల్, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి మహ్మద్ అబ్దుల్‌జావీద్, మార్కెటింగ్ శాఖ ఇన్చార్జి సహాయ సంచాలకులు అలీంతో చర్చించారు. సరుకు కొనుగోలులో వారికున్న నిబంధనలను సీసీఐ అధికారులు వివరించారు. ఈ చర్చలు కొనసాగుతున్న సమయంలోనే సమస్య జిల్లా జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్ దృష్టికి వెళ్లింది. జాయింట్ కలెక్టర్ ఆదేశాలతో ఖమ్మం ఆర్డీవో వినయ్ కృష్ణారెడ్డి మార్కెట్‌కు చేరుకున్నారు. తొలుత సీసీఐ, మార్కెట్ అధికారులను సమస్య గురించి అడిగి తెలుసుకున్నారు. పంట ఉత్పత్తిని కొనుగోలు చేయాలని, సీసీఐ కేంద్రం లక్ష్యం నెరవేరాలని అధికారులకు సూచించారు. అనంతరం బయటకు వచ్చి రైతులతో మాట్లాడారు. కొందరు రైతులు పంట పండించటంలో చోటుచేసుకున్న ఇబ్బందులు, వర్షాభావ పరిస్థితులు, సీసీఐ కేంద్రంలో ఎదురవుతున్న బాధలను ఆర్డీవో దృష్టికి తీసుకెళ్తారు. ప్రస్తుతం శీతాకాలం కావడంతో పంట ఉత్పత్తిలో తేమ ఉంటుందని రైతులు వాదించారు. అమ్మకానికి తీసుకువచ్చిన తమ సరుకును సీసీఐతో కొనుగోలు చేయించాలని ఆర్డీవోకు మొరపెట్టుకున్నారు. సీసీఐ సరుకును కొనుగోలు చేస్తుంది కానీ నాణ్యమైన పత్తిని మార్కెట్‌కు తీసుకొచ్చేందుకు రైతులు ప్రయత్నించాలని ఆర్డీవో సూచించారు. ఆర్డీవో సూచన మేరకు సీసీఐ కొనుగోళ్లు ప్రారంభించింది. సీసీఐ అధికారులు, మార్కెట్ అధికారులను ఆర్డీవో వెంటబెట్టుకొని రైతుల సరుకు వద్దకు తీసుకెళ్లారు. దగ్గరుండి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరలకు కొనుగోలు చేయించారు. తేమశాతం ఆధారంగా క్వింటాలు రూ.3,868 నుంచి రూ.4,050 వరకు కొనుగోలు చేశారు. ఈ వ్యవహారంపై మార్కెట్ అధికారులు, సీసీఐ అధికారులు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి జాయింట్ కలెక్టర్‌కు మార్కెట్లో తల్తెతిన సమస్యను వివరించినట్లు సమాచారం.