వచ్చారు.. వెళ్లారు.. | Checks on CCI cotton purchases | Sakshi
Sakshi News home page

వచ్చారు.. వెళ్లారు..

Published Mon, Feb 9 2015 4:40 AM | Last Updated on Sat, Sep 2 2017 9:00 PM

వచ్చారు.. వెళ్లారు..

వచ్చారు.. వెళ్లారు..

- సీజన్ పూర్తయ్యాక వచ్చిన విజిలెన్స్ బృందం..
- సీసీఐ పత్తి కొనుగోళ్లపై తనిఖీలు
- కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అక్రమాలు

సాక్షిప్రతినిధి, ఆదిలాబాద్ : పత్తి కొనుగోళ్లపై భారత పత్తి సంస్థ(సీసీఐ) విజిలె న్స్ విభాగం దృష్టి సారించింది. ముంబయిలోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయం నుంచి విజిలెన్స్ విభాగం ఉన్నతాధికారుల బృందం నాలుగు రోజుల క్రితం జిల్లాకు వచ్చింది. ఆదిలాబాద్‌లోని ఆ సంస్థ బ్రాంచ్ కార్యాలయంలో పలు రికార్డులను తనిఖీ చేసింది. అనంతరం జిల్లాలోని పలు సీసీఐ కొనుగోలు కేంద్రాలను సందర్శించింది. కొనుగోళ్ల తీరును బృందంలోని ఉన్నతాధికారులు పరిశీలించారు. ఆదిలాబాద్ సీసీఐ బ్రాం చ్ అద్దెకు తీసుకున్న మెదక్ జిల్లా తూప్రాన్‌లో పత్తి బేళ్ల గోదాములను కూడా బృందం తనిఖీ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

కొనుగోళ్ల సీజనంతా ముగిసాక విజిలెన్స్ విభాగం తనిఖీలు చేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. రెండు నెలల క్రితం జిల్లాలో పత్తి కొనుగోళ్లు జోరుగా సాగాయి. కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు వ్యక్తయయ్యాయి. సీసీఐ అధికారులు దళారులతో కుమ్మక్కై రూ.లక్షలు దండుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. మొదట్లో రైతుల పత్తిలో తేమ శాతం అధికంగా ఉందనే సాకుతో కొనుగోళ్లకు సీసీఐ అధికారులు నిరాకరించారు. ఇదే పత్తిని దళారులు క్వింటాల్‌కు రూ.3,500 నుంచి రూ.3,700 చొప్పున కొనుగోలు చేసి సీసీఐకికనీస మద్దతు ధర క్వింటాళుకు రూ.4,050 చొప్పు న విక్రయించారు.

దళారులు తెచ్చిన పత్తిని సీసీఐ అధికారులు ఎలాంటి నాణ్యత పరిశీలించకుండానే కొనుగోలు చేశారు. ఈ వ్యవహారంలో క్వింటాల్‌కు రూ.200 వరకు సీసీఐ అధికారులకు దళారులు ముట్టజెప్పారనే ఆరోపణలు వచ్చాయి. సీసీఐ అద్దెకు తీసుకున్న జిన్నింగ్ మిల్లులో ఇటీవల పలు అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల వెనుక కూడా తీవ్ర ఆరోపణలు వచ్చాయి. కొనుగోళ్లలో జరిగిన అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి ఈ అగ్ని ప్రమాదాలు ఆసరాగా చేసుకున్నారనే ఆరోపణలు కూడా వ్యక్తమయ్యాయి.

ఈ సీజన్‌లో ఆసిఫాబాద్, బోథ్, బేల తదితర చోట్ల ఉన్న సీసీఐ జిన్నింగ్‌లలో ఈ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. కొనుగోళ్ల సీజనంతా ముగిసాక విజిలెన్స్ విభాగం తనిఖీలు చేయడం మరిన్ని ఆరోపణలకు దారితీస్తోంది. ఈ బృందం ఆదిలాబాద్‌తోపాటు, వరంగల్ సీసీఐ బ్రాంచ్ కార్యాలయాన్ని, కరీంనగర్, వరంగల్, మెదక్ జిల్లాల్లో సీసీఐ కొనుగోలు కేంద్రాలను కూడా సందర్శించినట్లు తెలుస్తోంది. ఈ తనిఖీలన్నీ ఏటా ఉండేవేనని సీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. సాధారణ తనిఖీల్లో భాగంగానే ఈ విభాగం అధికారులు జిల్లాకు వచ్చారని అన్నారు.
 
సీసీఐ పంట పండింది..
పత్తి సాగుతో అన్నదాతలు అప్పులపాలైతే.. దళారులు, సీసీఐ అధికారులకు మాత్రం పంట పండినట్లయింది. ఈ కొనుగోలు సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 17 కేంద్రాలను సీసీఐ ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు సుమారు 44 లక్షల క్వింటాళ్ల పత్తిని సీసీఐ కొనుగోలు చేసింది. ప్రైవేటు వ్యాపారులు నామమాత్రంగా 1.60 లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి సీసీఐ భారీ స్థాయిలో కొనుగోళ్లు చేపట్టింది. సుమారు రూ.1,500 కోట్ల విలువ చేసే టర్నోవర్ చేసినట్లు సీసీఐ వర్గాలు పేర్కొంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement