ఖమ్మం వ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం సీసీఐ అధికారులు పత్తి కొనుగోళ్లలో కొర్రీలు పెట్టారు. నిబంధనల మేరకు సరుకులేదంటూ కొనుగోళ్లను నిలిపి వేశారు. దాదాపు మూడున్నర గంటలకు పైగా సరకు కొనుగోలు చేయలేదు. రైతులు ఆందోళనకు దిగడంతో ఖమ్మం ఆర్డీవో వినయ్‌కృష్ణారెడ్డి అక్కడికి చేరుకున్నారు.
సీసీఐ అధికారులతో మాట్లాడి కొనుగోళ్లు జరిపించారు.మార్కెట్‌లోని సీసీఐ కొనుగోలు కేంద్రానికి బుధవారం దాదాపు 40 వేల బస్తాల పత్తి అమ్మకానికి వచ్చింది. ముగ్గురు సీసీఐ అధికారులు మాయిశ్చర్ యంత్రం తీసుకొని తేమ చూసేందుకు ఉదయం 8:30 గంటల సమయంలో యార్డులోకి వెళ్లారు. మునుపెన్నడూ లేని విధంగా మాయిశ్చర్ యంత్రంతో పరీక్షలు చేసి నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా సరుకు లేదని కొనుగోళ్లకు నిరాకరించారు.
అమ్మకానికి వచ్చిన దాదాపు 90 శాతం సరుకును తిరస్కరించడంతో రైతులు బిత్తరపోయారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సీసీఐ అధికారులు తేమ పేరుతో కొనుగోళ్లు జరపకపోవటంపై రైతులు ఆందోళనకు దిగారు. విషయం తెలిసి త్రీటౌన్ పోలీస్‌లు మార్కెట్‌కు చేరుకున్నారు. రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. త్రీటౌన్ సీ.ఐ రెహమాన్, ఎస్‌ఐలు కుమారస్వామి, సర్వయ్య, సీసీఐ అధికారులు శివశంకర్ వశిష్ట, ఖాన్, షకీల్, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి మహ్మద్ అబ్దుల్‌జావీద్, మార్కెటింగ్ శాఖ ఇన్‌చార్జి సహాయ సంచాలకులు అలీంతో చర్చించారు.
సరుకు కొనుగోలులో వారికున్న నిబంధనలను సీసీఐ అధికారులు వివరించారు. ఈ చర్చలు కొనసాగుతున్న సమయంలోనే సమస్య జిల్లా జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్ దృష్టికి వెళ్లింది. జాయింట్ కలెక్టర్ ఆదేశాలతో ఖమ్మం ఆర్డీవో వినయ్ కృష్ణారెడ్డి మార్కెట్‌కు చేరుకున్నారు. తొలుత సీసీఐ, మార్కెట్ అధికారులను సమస్య గురించి అడిగి తెలుసుకున్నారు. పంట ఉత్పత్తిని కొనుగోలు చేయాలని, సీసీఐ కేంద్రం లక్ష్యం నెరవేరాలని అధికారులకు సూచించారు.
అనంతరం బయటకు వచ్చి రైతులతో మాట్లాడారు. కొందరు రైతులు పంట పండించటంలో చోటుచేసుకున్న ఇబ్బందులు, వర్షాభావ పరిస్థితులు, సీసీఐ కేంద్రంలో ఎదురవుతున్న బాధలను ఆర్డీవో దృష్టికి తీసుకెళ్తారు. ప్రస్తుతం శీతాకాలం కావడంతో పంట ఉత్పత్తిలో తేమ ఉంటుందని రైతులు వాదించారు. అమ్మకానికి తీసుకువచ్చిన తమ సరుకును సీసీఐతో కొనుగోలు చేయించాలని ఆర్డీవోకు మొరపెట్టుకున్నారు.
సీసీఐ సరుకును కొనుగోలు చేస్తుంది కానీ నాణ్యమైన పత్తిని మార్కెట్‌కు తీసుకొచ్చేందుకు రైతులు ప్రయత్నించాలని ఆర్డీవో సూచించారు. ఆర్డీవో సూచన మేరకు సీసీఐ కొనుగోళ్లు ప్రారంభించింది. సీసీఐ అధికారులు, మార్కెట్ అధికారులను ఆర్డీవో వెంటబెట్టుకొని రైతుల సరుకు వద్దకు తీసుకెళ్లారు. దగ్గరుండి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరలకు కొనుగోలు చేయించారు.
తేమశాతం ఆధారంగా క్వింటాలు రూ.3,868 నుంచి రూ.4,050 వరకు కొనుగోలు చేశారు. ఈ వ్యవహారంపై మార్కెట్ అధికారులు, సీసీఐ అధికారులు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి జాయింట్ కలెక్టర్‌కు మార్కెట్‌లో తల్తెతిన సమస్యను వివరించినట్లు సమాచారం.
కొనేదిలేదు..
Published Thu, Nov 6 2014 2:41 AM | Last Updated on Sat, Sep 2 2017 3:55 PM
Advertisement
Advertisement