‘నకిలీ’పై నజర్‌ | Fake Seeds In Khammam Agriculture | Sakshi
Sakshi News home page

‘నకిలీ’పై నజర్‌

Published Fri, Apr 26 2019 7:30 AM | Last Updated on Fri, Apr 26 2019 7:30 AM

Fake Seeds In Khammam Agriculture - Sakshi

ఖమ్మంవ్యవసాయం: ఆశించిన ఫలితాలు.. నాణ్యమైన పంట ఉత్పత్తులు సాధించేందుకు మూలాధారం విత్తు. దీనిని లక్ష్యంగా భావించిన వ్యవసాయ శాఖ నాణ్యమైన విత్తనాలను రైతు ముంగిటకు చేర్చేందుకు సమగ్ర ప్రణాళికను రూపొందిస్తోంది. ప్రధానంగా నకిలీ, అక్రమ విత్తనాలను సమూలంగా నిర్మూలించడం.. విత్తన అక్రమాలను అరికట్టేందుకు వ్యవసాయ శాఖ.. ప్రభుత్వ శాఖల సహకారంతో ముందుకెళ్తోంది. ఖరీఫ్‌ సీజన్‌ దగ్గర పడుతుండటంతో రైతులకు నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచే విధంగా రూపకల్పన చేస్తోంది. జిల్లాలో ప్రధానంగా పత్తి, వరి, మిర్చి, మొక్కజొన్న పంటలను రైతులు సాగు చేస్తున్నారు. ఖరీఫ్‌ ఆరంభంలో రైతులు పత్తి సాగు చేస్తారు.

మే 15 తర్వాత వర్షం పడితే పత్తి సాగుకు పూనుకుంటారు. అందుకోసం రైతులు ముందస్తుగా విత్తనాలను సమకూర్చుకునే పనిలో ఉంటారు. ఈ ప్రాంతంలోని నేలల రకాలు, రైతుల ఆసక్తిని దృష్టిలో పెట్టుకొని విత్తన డీలర్లు దాదాపు 42 రకాల విత్తనాలను అందుబాటులో ఉంచుతారు. పత్తి ధర ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.6వేలకుపైగా పలుకుతుండటంతో ఈ పంట సాగుకు రైతులు ఆసక్తి కనబరిచే అవకాశాలున్నాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది పత్తి సాగు విస్తీర్ణం జిల్లాలో పెరుగుతుందని వ్యవసాయ శాఖ అంచనాకు వచ్చింది. గత ఏడాది 97 వేల హెక్టార్లలో పత్తిని జిల్లాలో సాగు చేయగా.. ఈ ఏడాది 1.14 లక్షల హెక్టార్లలో సాగు చేసే అవకాశాలు ఉన్నట్లు వ్యవసాయ శాఖ అంచనాలు రూపొందించింది. వీటి ఆధారంగా 1.14 లక్షల హెక్టార్లకు 5,72,806 విత్తన ప్యాకెట్లు అవసరం ఉంటాయని వ్యవసాయ శాఖ ప్రణాళికలు తయారు చేసింది.

ఒక్కో ఎకరానికి 2 విత్తన ప్యాకెట్లు వినియోగించాల్సి ఉండగా.. అందులో 450 గ్రాముల విత్తనాలు ఉంటాయి. ఒక్కో ప్యాకెట్‌ ధర ఈ ఏడాది రూ.730 చొప్పున నిర్ణయించారు. వ్యవసాయ శాఖతోపాటు ప్రభుత్వ శాఖల అనుమతి పొందిన విత్తన డీలర్లు మాత్రమే వీటిని విక్రయించాల్సి ఉంటుంది. గతంలో కొందరు అనుమతులు లేకుండా పలు కంపెనీలకు చెందిన నకిలీ విత్తనాలను విక్రయించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. బోల్‌గార్డ్‌ టెక్నాలజీ–2(బీటీ–2) పత్తి విత్తనాల విక్రయానికి మాత్రమే అనుమతి ఉంది. అలాంటిది.. గత ఏడాది బీటీ–3 విత్తనాల విక్రయం కూడా జరిగింది.

వీటిని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సరిహద్దులోని పలు ప్రాంతాల్లో కొందరు రైతులు సాగు చేశారు. వీటి వల్ల పర్యావరణం దెబ్బతింటుందని జనటికల్‌ ఇంజనీరింగ్‌ అప్రూవల్‌ కమిటీ నిర్దారించింది. దీంతో బీటీ–2 విత్తనాలకు మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయినప్పటికీ దొడ్డిదారిన కొందరు డీలర్లు బీటీ–2 మాటున.. బీటీ–3 విత్తనాలను విక్రయించారు. ఈ ఏడాది ఈ వ్యవహారంపై వ్యవసాయ శాఖ సీరియస్‌గా ఉంది. పత్తి విత్తనాలతోపాటు వరి, పెసర వంటి విత్తనాల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండే విధంగా ప్రణాళికలు తయారు చేసింది.
 
నియామకాలకు సమాయత్తం 
నకిలీ, అక్రమంగా విత్తనాలను విక్రయించకుండా, రైతులు ఆ విత్తనాల బారినపడకుండా ఉండేందుకు ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపట్టింది. వివిధ ప్రాంతాల నుంచి గతంలో జిల్లాకు నకిలీ విత్తనాలు వివిధ కంపెనీల పేరిట వచ్చిన, విక్రయించిన సంఘటనలు ఉన్నాయి. అటువంటి వ్యవస్థ పునరావృతం కాకుండా వ్యవపాయ శాఖ పలు చర్యలు చేపట్టింది. వివిధ కంపెనీల పేరిట, ఎలాంటి కంపెనీల పేరు లేకుండా లూజ్‌గా ఉన్న విత్తనాలను విక్రయించిన ఘటనలు కూడా గతంలో చోటు చేసుకున్నాయి. ఇటువంటి అక్రమార్కులను నిలువరించేందుకు వ్యవసాయ శాఖ తనిఖీ బృందాలను నియమించే చర్యలకు పూనుకుంది. టాస్క్‌ఫోర్స్‌ బృందాలు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లను నియమించే చర్యలు చేపట్టారు. బృందాలతోపాటు విజిలెన్స్‌ బృందాలు కూడా జిల్లాలో ఎప్పటికప్పుడు పర్యటిస్తుంటాయి.

మండల, జిల్లాస్థాయిలో తనిఖీ బృందాలు 
టాస్క్‌ఫోర్స్‌ బృందాలను మండల, జిల్లాస్థాయిల్లో నియమించేందుకు వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఇందులో వ్యవసాయ శాఖతోపాటు పోలీస్, రెవెన్యూ అధికారులుంటారు. ఒక మండల, వ్యవసాయ డివిజన్‌ అధికారిని మరో మండల, వ్యవసాయ డివిజన్‌కు తనిఖీ బాధ్యులుగా నియమించేందుకు నిర్ణయించారు. బృందంలో స్థానిక రెవెన్యూ అధికారి, ఓ పోలీస్‌ అధికారిని కూడా నియమించుకుంటారు. కలెక్టర్‌ సూచనల మేరకు ఉన్నతస్థాయి అధికారులతో జిల్లాస్థాయి తనిఖీ బృందాన్ని నియమించనున్నారు.
 
పకడ్బందీ చర్యలు 
అనుమతి లేని పత్తి విత్తనాలను నిరోధించేందుకు పకడ్బందీ చర్యలకు పూనుకుంటున్నారు. జనటికల్‌ ఇంజనీరింగ్‌ అప్రూవల్‌ కమిటీ నిర్ణయించిన విత్తన రకాలను మాత్రమే.. అనుమతించిన డీలర్లు విక్రయించే విధంగా పటిష్ట చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ ప్రణాళిక రూపొందించింది. అన్ని రకాల లైసెన్స్‌లు, అనుమతులు కలిగిన డీలర్లతో సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి.. ఆయా డీలర్లకు విత్తన విక్రయాలపై తగిన సలహాలు, సూచనలు కూడా ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. అనుమతి లేని విత్తనాలు విక్రయిస్తే విత్తన చట్టాన్ని ప్రయోగించాలని, ఎంతటి వారినైనా ఉపేక్షించొద్దని జిల్లా వ్యవసాయ శాఖ నుంచి కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.

అన్ని స్థాయిల్లో తనిఖీలు.. 
అనుమతి పొందిన.. నాణ్యమైన విత్తనాలను విక్రయించే విధంగా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. విత్తన విక్రయాలపై అన్ని స్థాయిల్లో తనిఖీ బృందాలు ఉంటాయి. అక్రమ, నకిలీ విత్తనాలు విక్రయించినట్లు గుర్తిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. రైతులకు విత్తన విక్రయాల్లో అనుమానాలు తలెత్తినట్లయితే వెంటనే వ్యవసాయాధికారులకు సమాచారం ఇవ్వాలి. వ్యవసాయ శాఖ సూచనల మేరకు మాత్రమే రైతులు విత్తనాలను కొనుగోలు చేయాలి. పత్తి విత్తనాలపై ప్రత్యేక దృష్టి సారించాం. – ఏ.ఝాన్సీలక్ష్మీకుమారి, జిల్లా వ్యవసాయాధికారి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement