khammam agriculture market
-
మిరప ‘తేజ’స్సు
ఖమ్మం వ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో తేజా రకం మిర్చి ధర చరిత్ర సృష్టించింది. కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసిన మిర్చి క్వింటాకు శనివారం రూ.25,800 ధర పలికింది. చరిత్రలోనే తేజా రకం మిర్చికి ఇంతటి ధర ఎప్పుడూ లభించలేదు. విదేశాల్లో ఈ రకం మిర్చికి డిమాండ్ ఉండటంతో ధర పెరుగుతోందని విశ్లేíÙస్తున్నారు. భద్రా ద్రికొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన అనంత లక్ష్మి పేరిట కోల్డ్ స్టోరేజీలో నిల్వ చేసిన 25 బస్తాల మిర్చిని ఎస్వీఎస్ చిల్లీస్ ట్రేడర్స్ బాధ్యులు అత్యధిక ధరకు కొనుగోలు చేశారు. తేజా రకం మిర్చి ఈ ఏడాది మార్చి 20న రూ.25,550 ధర పలికింది. అదే రికార్డుగా భావిస్తుండగా.. ఇప్పుడు రూ.25,800 ధరతో సరికొత్త రికార్డు నమోదైంది. ఈ ఏడాది పంట సాగు కూడా బాగా తగ్గడం, చీడపీడలతో దిగుబడి తగ్గడానికి తోడు దేశ, విదేశాల నుంచి ఆర్డర్లు వస్తుండటంతో ధరకు రెక్కలొచ్చాయి. -
ఫ్లెక్సీపెట్టి.. అన్నదానం చేసి
సాక్షి, ఖమ్మం: ఎవరైనా కన్నుమూస్తే సంతాప సూచకంగా వారి ఫొటోతో ఫ్లెక్సీ చేయించి కూడళ్లలో ఏర్పాటు చేయడం తెలిసిందే. అయితే ఖమ్మంలో మృతిచెందిన ఓ కోతికి సైతం ఫ్లెక్సీ చేయించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో తిరుగుతూ, నిత్యం హమాలీల మధ్య ఉంటూ.. వారు పెట్టే భోజనం తింటూ గడిపే ఓ కోతి ఇటీవల మృతి చెందింది. దీంతో హమాలీలు ఆ వానరానికి అంత్యక్రియలు నిర్వహించడమే కాకుండా శుక్రవారం అన్నదానం సైతం నిర్వహించారు. ఇంతటితో సరిపెట్టకుండా ఆ కోతి ఫొటోతో ఫ్లెక్సీ చేయించి మార్కెట్ ప్రధాన గేటుకు పెట్టగా పలువురు ఆసక్తిగా పరిశీలించారు. చదవండి: మహబూబాబాద్: టమాటా కూర అత్త ప్రాణం మీదకు తెచ్చింది -
ఎర్ర బంగారం @ రూ.13 వేలు
ఖమ్మంవ్యవసాయం: మిర్చిని ప్రస్తుత ధరతో చూస్తే ఎర్ర బంగారం అని చెప్పక తప్పదు. మిరప ధర రోజురోజుకూ పెరుగుతోంది. విదేశాల్లో డిమాండ్ పెరుగుతుండడంతో ఇక్కడ పంట ధరకు రెక్కలొస్తున్నాయి. కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉంచిన మిర్చి ధర మంగళవారం క్వింటా రూ. 13,100 పలికింది. జిల్లాలో ప్రధాన పంటల్లో మిర్చి ఒకటి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ‘తేజా’ రకం మిర్చిని ప్రధానంగా సాగు చేస్తుంటారు. ఉభయ జిల్లాల్లో దాదాపు 70 వేల ఎకరాల్లో ఈ పంటను సాగవుతుంది. దీనికి చైనా, మలేషియా, సింగపూర్ వంటి దేశాల్లో ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది. ఆయా దేశాలకు మిర్చి ఎగుమతులకు అనుమతి లభించటంతో దేశంలో నిల్వ ఉంచిన సరుకును వ్యాపారులు అక్కడికి తరలిస్తున్నారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో దాదాపు 36 కోల్డ్ స్టోరేజీలు ఉన్నాయి. వీటిలో దాదాపు 15 లక్షల క్వింటాళ్ల మిర్చి నిల్వ ఉన్నట్లు అంచనా. ఉమ్మడి జిల్లాల్లో పండించిన పంటతో పాటు ఖమ్మానికి పరిసర జిల్లాలైన మహబూబాబాద్, సూర్యాపేట, వరంగల్ రూరల్, ఏపీలోని కృష్ణ, గుంటూరు జిల్లాల్లో పండించే తేజా రకం మిర్చిని అధికంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో రైతులు విక్రయిస్తుంటారు. పంట సీజన్లో రైతుల నుంచి క్వింటా రూ. 7,000 నుంచి రూ. 8,500 చొప్పున కొనుగోలు చేసిన వ్యాపారులు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉంచారు. ఆ నిల్వలకు ప్రస్తుతం మంచి ధర పలుకుతోంది. జూన్ నెల చివరి వారంలో రూ. 12 వేలు పలికిన ధర రోజుకో రకంగా పెరుగుతూ వచ్చింది. జూన్ 30న క్వింటా మిర్చి ధర రూ. 12,100 ఉంది. జూలై 9 నాటికి ఆ ధర ఏకంగా వెయ్యి రూపాయలు పెరిగి రూ. 13,100కు చేరింది. కోల్డ్ స్టోరేజీల్లో రైతులు నిల్వ చేసే పంట చాలా తక్కువ. వ్యాపారుల పంట మూడు వంతులకు పైగా నిల్వ ఉంటుందని రైతు సంఘాల ప్రతినిధులు అంటున్నారు. స్థానిక వ్యాపారులు, కమీషన్ వ్యాపారులు పంటను రైతుల నుంచి కొనుగోలు చేసి కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆయా వ్యాపారులు ఎగుమతిదారులు(ఖరీదు దారులు)కు నిల్వ పంటను విక్రయిస్తున్నారు. నిల్వ చేసిన వ్యాపారులకు లాభాల పంట పండుతోంది. క్వింటాకు ఏకంగా రూ. 5 నుంచి 6 వేల వరకు లాభాలు వస్తున్నాయి. ఈ ధర మరికొంత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. రెండేళ్ల క్రితం కూడా మిర్చి ధర రూ.13 వేలు పలికింది. ఈ ఏడాది అంతకు మించడం విశేషం. -
ఇలా సాగుదాం..
ఖమ్మంవ్యవసాయం: జిల్లా వ్యవసాయ శాఖ ఖరీఫ్ సీజన్‌కు ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ సూచనలు, ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్న వనరుల ఆధారంగా పంటల సాధారణ సాగు విస్తీర్ణాన్ని ప్రణాళిక కమిటీ గుర్తించింది. జిల్లాలోని నేలలు, వాతావరణం, నీటి ఆధారం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని.. వాటికి అనుగుణంగా సాగు చేయాల్సిన పంటలను గుర్తించారు. రానున్న ఖరీఫ్‌లో రైతులు వరి, మొక్కజొన్న, జొన్న, సజ్జలు, కందులు, పెసలు, మినుము, వేరుశనగ, నువ్వులు, పత్తి పంటలు సాగు చేయవచ్చని గుర్తించారు. జిల్లాలోని 21 మండలాల్లో ఆయా పంటల సాగుకు 2,30,498 హెక్టార్లు అనువుగా ఉన్నట్లు వ్యవసాయ శాఖ గుర్తించింది. అయితే గత ఏడాది ప్రణాళికతో పోలిస్తే సాధారణ సాగు విస్తీర్ణం ఈ ఏడాది ప్రణాళికలో తగ్గింది. గత ఏడాది సాధారణ సాగు విస్తీర్ణం 2,32,707 హెక్టార్లు కాగా.. అంతకుమించి 2,53,158 హెక్టార్లలో పంటలు సాగు చేశారు. గత ఏడాది వరి, మిర్చి పంటల సాగు విస్తీర్ణంపెరిగింది. గత ఏడాది వరి సాధారణ సాగు విస్తీర్ణం 60,547 హెక్టార్లు కాగా.. 82,437 హెక్టార్లలో సాగు చేశారు. ఈ ఏడాది మాత్రం వరి సాధారణ సాగు విస్తీర్ణం ప్రణాళికలో కొంచెం తక్కువగా చూపారు. ఈ ఏడాది వరి 59,361 హెక్టార్లలో సాగుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అదే విధంగా పప్పు దినుసులు పెసర, కంది, మినుము, వేరుశనగ పంటల సాగు విస్తీర్ణాన్ని కూడా పెంచే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించారు. 43,862 క్వింటాళ్ల విత్తనాలు అవసరం వచ్చే ఖరీఫ్ కాలానికి సాగు చేసే వివిధ రకాల పంట లకు సంబంధించిన విత్తన ప్రణాళికను వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. 43,862 క్వింటాళ్ల విత్తనాలు అవసరం ఉంటాయని వ్యవసాయ శాఖ ప్రణాళికలో పొం దుపరిచింది. వీటిలో దాదాపు 22,189 క్వింటాళ్ల వరి విత్తనాలు అవసరం ఉంటాయని నిర్దేశించారు. టీ సీడ్స్ కార్పొరేషన్ నుంచి విత్తనాలను అందుబాటులో ఉంచుకునే విధంగా ప్రణాళికలు రూపొందించారు. అయితే ఇప్పటికే టీ సీడ్స్ సంస్థ 15వేల క్వింటాళ్ల వరి విత్తనాలను అందుబాటులో ఉంచింది. పెసర 2,910, కంది 50 క్వింటాళ్లను అందుబాటులో ఉంచింది. పచ్చిరొట్టకూ.. జీలుగు, పిల్లి పెసర, జనుము పంటలను సాగు చేసి.. సాగు భూమిని సారవంతం చేయాలని నిర్ణయించారు. జీలుగు 12,500 క్వింటాళ్లు, పిల్లి పెసర 6 వేల క్వింటాళ్లు, 635 క్వింటాళ్ల జనుము విత్తనాలను ఇప్పటికే టీ సీడ్స్ సంస్థ అందుబాటులో ఉంచింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ సూచనల మేరకే.. రాష్ట్ర వ్యవసాయ శాఖ సూచనల మేరకు వచ్చే ఖరీఫ్ సీజన్ ప్రణాళికను రూపొందించాం. అవసరమైన విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే విత్తనాలను టీ సీడ్స్ అందుబాటులో ఉంచే విధంగా చర్యలు చేపట్టింది. ఎరువుల కొరత లేకుండా ముందస్తుగానే అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నాం. – ఏ.ఝాన్సీలక్ష్మీకుమారి జిల్లా వ్యవసాయాధికారి -
‘నకిలీ’పై నజర్
ఖమ్మంవ్యవసాయం: ఆశించిన ఫలితాలు.. నాణ్యమైన పంట ఉత్పత్తులు సాధించేందుకు మూలాధారం విత్తు. దీనిని లక్ష్యంగా భావించిన వ్యవసాయ శాఖ నాణ్యమైన విత్తనాలను రైతు ముంగిటకు చేర్చేందుకు సమగ్ర ప్రణాళికను రూపొందిస్తోంది. ప్రధానంగా నకిలీ, అక్రమ విత్తనాలను సమూలంగా నిర్మూలించడం.. విత్తన అక్రమాలను అరికట్టేందుకు వ్యవసాయ శాఖ.. ప్రభుత్వ శాఖల సహకారంతో ముందుకెళ్తోంది. ఖరీఫ్ సీజన్ దగ్గర పడుతుండటంతో రైతులకు నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచే విధంగా రూపకల్పన చేస్తోంది. జిల్లాలో ప్రధానంగా పత్తి, వరి, మిర్చి, మొక్కజొన్న పంటలను రైతులు సాగు చేస్తున్నారు. ఖరీఫ్ ఆరంభంలో రైతులు పత్తి సాగు చేస్తారు. మే 15 తర్వాత వర్షం పడితే పత్తి సాగుకు పూనుకుంటారు. అందుకోసం రైతులు ముందస్తుగా విత్తనాలను సమకూర్చుకునే పనిలో ఉంటారు. ఈ ప్రాంతంలోని నేలల రకాలు, రైతుల ఆసక్తిని దృష్టిలో పెట్టుకొని విత్తన డీలర్లు దాదాపు 42 రకాల విత్తనాలను అందుబాటులో ఉంచుతారు. పత్తి ధర ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.6వేలకుపైగా పలుకుతుండటంతో ఈ పంట సాగుకు రైతులు ఆసక్తి కనబరిచే అవకాశాలున్నాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది పత్తి సాగు విస్తీర్ణం జిల్లాలో పెరుగుతుందని వ్యవసాయ శాఖ అంచనాకు వచ్చింది. గత ఏడాది 97 వేల హెక్టార్లలో పత్తిని జిల్లాలో సాగు చేయగా.. ఈ ఏడాది 1.14 లక్షల హెక్టార్లలో సాగు చేసే అవకాశాలు ఉన్నట్లు వ్యవసాయ శాఖ అంచనాలు రూపొందించింది. వీటి ఆధారంగా 1.14 లక్షల హెక్టార్లకు 5,72,806 విత్తన ప్యాకెట్లు అవసరం ఉంటాయని వ్యవసాయ శాఖ ప్రణాళికలు తయారు చేసింది. ఒక్కో ఎకరానికి 2 విత్తన ప్యాకెట్లు వినియోగించాల్సి ఉండగా.. అందులో 450 గ్రాముల విత్తనాలు ఉంటాయి. ఒక్కో ప్యాకెట్ ధర ఈ ఏడాది రూ.730 చొప్పున నిర్ణయించారు. వ్యవసాయ శాఖతోపాటు ప్రభుత్వ శాఖల అనుమతి పొందిన విత్తన డీలర్లు మాత్రమే వీటిని విక్రయించాల్సి ఉంటుంది. గతంలో కొందరు అనుమతులు లేకుండా పలు కంపెనీలకు చెందిన నకిలీ విత్తనాలను విక్రయించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. బోల్‌గార్డ్ టెక్నాలజీ–2(బీటీ–2) పత్తి విత్తనాల విక్రయానికి మాత్రమే అనుమతి ఉంది. అలాంటిది.. గత ఏడాది బీటీ–3 విత్తనాల విక్రయం కూడా జరిగింది. వీటిని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సరిహద్దులోని పలు ప్రాంతాల్లో కొందరు రైతులు సాగు చేశారు. వీటి వల్ల పర్యావరణం దెబ్బతింటుందని జనటికల్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ నిర్దారించింది. దీంతో బీటీ–2 విత్తనాలకు మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయినప్పటికీ దొడ్డిదారిన కొందరు డీలర్లు బీటీ–2 మాటున.. బీటీ–3 విత్తనాలను విక్రయించారు. ఈ ఏడాది ఈ వ్యవహారంపై వ్యవసాయ శాఖ సీరియస్‌గా ఉంది. పత్తి విత్తనాలతోపాటు వరి, పెసర వంటి విత్తనాల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండే విధంగా ప్రణాళికలు తయారు చేసింది. నియామకాలకు సమాయత్తం నకిలీ, అక్రమంగా విత్తనాలను విక్రయించకుండా, రైతులు ఆ విత్తనాల బారినపడకుండా ఉండేందుకు ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపట్టింది. వివిధ ప్రాంతాల నుంచి గతంలో జిల్లాకు నకిలీ విత్తనాలు వివిధ కంపెనీల పేరిట వచ్చిన, విక్రయించిన సంఘటనలు ఉన్నాయి. అటువంటి వ్యవస్థ పునరావృతం కాకుండా వ్యవపాయ శాఖ పలు చర్యలు చేపట్టింది. వివిధ కంపెనీల పేరిట, ఎలాంటి కంపెనీల పేరు లేకుండా లూజ్‌గా ఉన్న విత్తనాలను విక్రయించిన ఘటనలు కూడా గతంలో చోటు చేసుకున్నాయి. ఇటువంటి అక్రమార్కులను నిలువరించేందుకు వ్యవసాయ శాఖ తనిఖీ బృందాలను నియమించే చర్యలకు పూనుకుంది. టాస్క్‌ఫోర్స్ బృందాలు, ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించే చర్యలు చేపట్టారు. బృందాలతోపాటు విజిలెన్స్ బృందాలు కూడా జిల్లాలో ఎప్పటికప్పుడు పర్యటిస్తుంటాయి. మండల, జిల్లాస్థాయిలో తనిఖీ బృందాలు టాస్క్‌ఫోర్స్ బృందాలను మండల, జిల్లాస్థాయిల్లో నియమించేందుకు వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఇందులో వ్యవసాయ శాఖతోపాటు పోలీస్, రెవెన్యూ అధికారులుంటారు. ఒక మండల, వ్యవసాయ డివిజన్ అధికారిని మరో మండల, వ్యవసాయ డివిజన్‌కు తనిఖీ బాధ్యులుగా నియమించేందుకు నిర్ణయించారు. బృందంలో స్థానిక రెవెన్యూ అధికారి, ఓ పోలీస్ అధికారిని కూడా నియమించుకుంటారు. కలెక్టర్ సూచనల మేరకు ఉన్నతస్థాయి అధికారులతో జిల్లాస్థాయి తనిఖీ బృందాన్ని నియమించనున్నారు. పకడ్బందీ చర్యలు అనుమతి లేని పత్తి విత్తనాలను నిరోధించేందుకు పకడ్బందీ చర్యలకు పూనుకుంటున్నారు. జనటికల్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ నిర్ణయించిన విత్తన రకాలను మాత్రమే.. అనుమతించిన డీలర్లు విక్రయించే విధంగా పటిష్ట చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ ప్రణాళిక రూపొందించింది. అన్ని రకాల లైసెన్స్‌లు, అనుమతులు కలిగిన డీలర్లతో సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి.. ఆయా డీలర్లకు విత్తన విక్రయాలపై తగిన సలహాలు, సూచనలు కూడా ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. అనుమతి లేని విత్తనాలు విక్రయిస్తే విత్తన చట్టాన్ని ప్రయోగించాలని, ఎంతటి వారినైనా ఉపేక్షించొద్దని జిల్లా వ్యవసాయ శాఖ నుంచి కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. అన్ని స్థాయిల్లో తనిఖీలు.. అనుమతి పొందిన.. నాణ్యమైన విత్తనాలను విక్రయించే విధంగా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. విత్తన విక్రయాలపై అన్ని స్థాయిల్లో తనిఖీ బృందాలు ఉంటాయి. అక్రమ, నకిలీ విత్తనాలు విక్రయించినట్లు గుర్తిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. రైతులకు విత్తన విక్రయాల్లో అనుమానాలు తలెత్తినట్లయితే వెంటనే వ్యవసాయాధికారులకు సమాచారం ఇవ్వాలి. వ్యవసాయ శాఖ సూచనల మేరకు మాత్రమే రైతులు విత్తనాలను కొనుగోలు చేయాలి. పత్తి విత్తనాలపై ప్రత్యేక దృష్టి సారించాం. – ఏ.ఝాన్సీలక్ష్మీకుమారి, జిల్లా వ్యవసాయాధికారి -
‘పెట్టుబడి’ ఎలా?
ఖమ్మంవ్యవసాయం: రైతుబంధుకు కాసుల కొరత ఏర్పడింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పథకాన్ని ప్రారంభించినా.. ఖజానాలో నగదు కొరత వల్ల రైతుల ఖాతాల్లో జమ కావడం లేదు. అక్టోబర్ నుంచి రబీ సీజన్ ప్రారంభం కాగా.. పంటల సాగుకు పెట్టుబడి సాయంగా ప్రభుత్వం నిధులు విడుదల చేయాల్సి ఉంది. నెల క్రితమే రబీ కోసం రైతుబంధు నగదును రైతులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో సీజన్‌కు ఎకరాకు రూ.4వేల చొప్పున పెట్టుబడిగా అందించాలనే లక్ష్యంతో ఈ ఏడాది ఖరీఫ్ నుంచే ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. లబ్ధిదారులకు బ్యాంకు చెక్కుల రూపంలో పెట్టుబడి సాయం అందించారు. జిల్లాలో వివిధ కారణాలతో 20వేల మంది రైతులకు అందలేదు. రబీలో కూడా ఖరీఫ్ మాదిరిగానే చెక్కుల విధానంలో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో ఎన్నికల కమిషన్ ఈ పథకం అమలుపై పలు ఆంక్షలు విధించింది. ఖరీఫ్‌లో మాదిరిగానే చెక్కుల విధానం కాకుండా రైతుల బ్యాంక్ ఖాతాలో ఆన్లైన్ విధానంలో నగదును జమ చేయాలని ఈసీ ఆదేశించింది. దీంతో వ్యవసాయాధికారులు రైతుల నుంచి బ్యాంక్ ఖాతాల వివరాలను సేకరించి రాష్ట్ర వ్యవసాయ శాఖకు ఆన్లైన్లో పంపించారు. వీటి ఆధారంగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమచేసే ప్రక్రియను చేపట్టాల్సి ఉంది. జిల్లాలో రబీ సీజన్‌కు గాను 2,59,264 మంది రైతులను రైతుబంధు పథకం కోసం వ్యవసాయ శాఖ గుర్తించింది. వీరికున్న భూముల ఆధారంగా రూ.256కోట్లు అవసరం ఉంది. ఈ క్రమంలో విడతలవారీగా రైతుల ఖాతాల్లో నగదును జమచేసే ప్రక్రియను ప్రారంభించారు. అయితే నిధుల లేమి కారణంగా ఆదిలోనే దీనికి బ్రేకులు పడ్డాయి. వ్యవసాయ శాఖ 2,32,765 మంది అర్హులైన రైతుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి.. రాష్ట్ర వ్యవసాయ శాఖకు పంపించింది. ఇందులో 1,37,565 మంది రైతులకు రూ.140కోట్ల నగదు మంజూరైంది. ఈ మొత్తంలో 74,727 మంది రైతులకు రూ.80కోట్లు గత నెల చివరి వారంలో జమ అయ్యాయి. అప్పటి నుంచి బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రభుత్వ ఖజానాలో నగదు లేకపోవడంతో ఈ దుస్థితి నెలకొందని తెలిసింది. ఇంకా 1.85 లక్షల మంది రైతులకు సుమారు రూ.186కోట్ల నగదును బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. కొందరు రైతులు డబ్బుల కోసం వ్యవసాయ శాఖ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తమ ఖాతాల్లో రైతుబంధు నగదు జమ కాలేదని చెబుతున్నారు. అధికారులు ఆయా రైతులకు సమాధానం చెప్పేందుకు కొంత ఇబ్బంది పడుతున్నారు. కొందరు రైతులకు రైతుబంధు నగదు రావడం.. మరికొందరికి రాకపోవడంతో అధికారులకు ఇబ్బందికరంగా మారింది. అన్నదాతల ఎదురు చూపులు రబీ సీజన్ ప్రారంభం కావడంతో రైతులు మొక్కజొన్న, వేరుశనగ పంటలు వేస్తున్నారు. వరినార్లు కూడా అక్కడక్కడ పోస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన రైతుబంధు పథకం ద్వారా ఎకరాకు రూ.4వేల ఆర్థిక సహాయం అందుతుందని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇది అందితే కనీసం దుక్కులకు, విత్తనాలకు కొంత మేరకు ఉపయోగపడతాయని భావించారు. గ్రామాల్లో కొందరు రైతులకు మొదటి విడతగా ఖాతాల్లో నగదు పడగా.. మరికొందరు రైతులకు పడలేదు. దీంతో రైతులు తమ ఖాతాల్లో రైతుబంధు నగదు ఎందుకు పడలేదని అధికారులను ప్రశ్నిస్తున్నారు. కొద్ది రోజుల్లో పడతాయని అధికారులు చెబుతున్నా.. ప్రక్రియ నిలిచిపోయి సుమారు 20 రోజులు కావస్తోంది. దీంతో నగదు ఎప్పుడు బ్యాంక్ ఖాతాల్లో పడుతుందని రైతులు అధికారుల చట్టూ తిరుగుతున్నారు. పెట్టుబడి రాలేదు.. రబీ రైతుబంధు పెట్టుబ డి నగదు బ్యాంక్ ఖాతా లో జమ కాలేదు. ఐదెకరాలకు పెట్టుబడి సహా యం రూ.20వేలు వస్తా యి. ఆ సహాయం అంది తే రబీలో మొక్కజొన్న వేయాలని ఉంది. వ్యవసాయశాఖ అధికారులు వస్తాయంటున్నారు. బ్యాంక్ ఖాతాలో మాత్రం ఇంకా జమ కాలేదు. – తోట శ్రీను, బచ్చోడు, తిరుమలాయపాలెం మండలం వెంటనే ప్రయోజనం రబీలో అందించాల్సిన రైతుబంధు పెట్టుబడి వెంటనే అందిస్తే ఉపయోగకరంగా ఉంటుంది. ఖరీఫ్‌లో వేసిన పత్తి పంట దిగుబడి రాలేదు. నష్టం వచ్చింది. ఈ భూమిలో మొక్కజొన్న వేయాలనుకుంటున్నా. రెండెకరాలకు రూ.8వేలు వస్తే విత్తనాలు, దుక్కికి ఉపయోగపడతాయి. – భూక్యా వీరన్న, బాలాజీనగర్ తండా, తిరుమలాయపాలెం మండలం ప్రక్రియ కొనసాగిస్తున్నాం.. రైతుబంధు పథకం ప్రక్రియను కొనసాగిస్తున్నాం. ఆన్లైన్లో అర్హులైన రైతుల వివరాలన్నీ రాష్ట్ర వ్యవసాయశాఖకు పం పించాం. కొందరి రైతుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ అయ్యింది. ఆన్లైన్లో రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతోంది. – ఎ.ఝాన్సీలక్ష్మీకుమారి, జిల్లావ్యవసాయాధికారి -
ఎరువు.. ‘ధర’వు
ఖమ్మంవ్యవసాయం: ఒకవైపు చీడపీడలు.. మరోవైపు అనుకూలించని వాతావరణంతో సతమతమవుతున్న రైతుకు పెరిగిన ఎరువుల ధరలు గుదిబండగా మారాయి. గతంలో బస్తాకు రూ.10 లేదా రూ.20 చొప్పున పెంచిన కంపెనీలు ఈసారి ఏకంగా రూ.వందలు పెంచి కష్టజీవులపై మోయలేని భారం మోపాయి. గడిచిన ఏడు నెలల కాలంలోనే రెండుసార్లు రేట్లు పెరగడం గమనార్హం. గిట్టుబాటు ధర ఆశించిన స్థాయిలో లేకపోవడం.. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పంట దిగుబడి తగ్గిపోవడం.. తాజాగా ఎరువుల ధరలు ఎగబాకి పెట్టుబడి అమాంతం పెరగడం.. రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. జిల్లాలో దాదాపు 6 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. అందుకోసం దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను వినియోగిస్తున్నారు. ముడిసరుకు ధరల ప్రభావం.. ఎరువుల తయారీకి వినియోగించే ముడి సరుకును ఆయా కంపెనీలు విదేశాల నుంచి దిగుమతి చేస్తాయి. ఎరువులను తయారు చేసేందుకు పెట్రో ఉత్పత్తులతోపాటు పాస్పరిక్ యాసిడ్‌ను వినియోగిస్తారు. అయితే వాటి రేట్లు అంతర్జాతీయ మార్కెట్లో పెరగడంతో ఎరువుల ధరలు కూడా అమాంతం ఎగబాకినట్లు వ్యవసాయాధికారులు భావిస్తున్నారు. ఈ ఏడాది ఒకే సీజన్లో ఎరువుల ధరలు రెండు దఫాలు పెరిగాయి. ఫిబ్రవరి 1వ తేదీన, తిరిగి అక్టోబర్ 1వ తేదీన ధరలు పెంచారు. దీంతో ఒక్కో బస్తాపై రూ.400 వరకు పెరిగిన పరిస్థితి నెలకొంది. అంతకుముందు రూ.900 నుంచి రూ.1000 వరకు ఉన్న బస్తా ధర ప్రస్తుతం రూ.1,450 చేరింది. రైతులు దిగుబడి కోసం ఎక్కువగా డీఏపీ, కాంప్లెక్స్, మూరేట్ ఆఫ్ పొటాష్, సింగిల్ సూపర్ పాస్పేట్ వంటి ఎరువులను వినియోగిస్తుంటారు. కంపెనీలు కూడా ఆ ఎరువుల ధరలనే పెంచి రైతుల అవసరాన్ని సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయని రైతు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. యూరియా రేట్లు కూడా.. ఎరువులన్నింట్లో యూరియా ధర కొంత భిన్నంగా ఉంటుంది. ప్రభుత్వమే యూరియాకు ఒక ధరను నిర్ణయిస్తుంది. ఆ ధరలకే(సబ్సిడీ) రైతులకు విక్రయించాల్సి ఉంటుంది. ఒకవేళ దాని ఉత్పత్తి ఖరీదు పెరిగినా అది ప్రభుత్వమే భరిస్తుంది. ఈ ఏడాది యూరియాను 45 కిలోల బస్తాలుగా విక్రయిస్తున్నారు. ఒక్కో బస్తా ఖరీదు రూ.265 కాగా.. కొరత పేరుతో రూ.300 నుంచి రూ.320 వరకు వ్యాపారులు విక్రయిస్తున్నారు. అదేమని రైతులు ప్రశ్నిస్తే.. కొరత ఉందని, దిగుమతి, ఎగుమతి చార్జీలు ఉంటాయని రైతులను వ్యాపారులు దగా చేస్తున్నారు. అన్నీ పెరిగెన్.. ఈ ఏడాది రైతుకు పెట్టుబడి భారం బాగానే పెరిగిందని చెప్పుకోవాలి. దుక్కి దున్నింది మొదలు అన్ని రకాల ఖర్చులు పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలు చూపిస్తుండడంతో ట్రాక్టర్లకు దుక్కి దున్నే కిరాయిలు ఎక్కువయ్యాయి. గత ఏడాది ఒకసారి ఎకరం దుక్కి దున్నడానికి రూ.1000 అయ్యేది. ప్రస్తుతం అది రూ.1,400 చేరింది. అంటే రూ.400 పెరిగింది. ఇదిలా ఉంటే.. ఒక్కో ఎరువుల బస్తాపై గతం కన్నా సుమారు రూ.400 పెరిగింది. పంట వేసే క్రమంలో మూడుసార్లు దుక్కి దున్నుతారు.. మూడుసార్లు ఎరువులు వేస్తారు. దీంతో మొత్తం ఎకరానికి గతంలో కంటే రూ.2,500 నుంచి రూ.3,000 వరకు రైతులపై భారం పడుతోంది. దీనికి కూలీలు, పురుగు మందుల ఖర్చులు అదనం.. మొత్తం మీద ఈ ఏడాది రైతుకు పెట్టుబడి తడిసి మోపెడుతోంది. ఇంత ఖర్చు పెట్టినా దిగుబడి మంచిగా ఉంటుందా అంటే అదీ లేదు. వాతావరణం అనుకూలించక అన్ని పంటల దిగుబడులు భారీగా తగ్గాయి. దీంతో రైతులకు నష్టాలు తప్పా.. లాభాలు వచ్చే అవకాశం లేదనే చెప్పుకోవాలి. బాగా పెరిగాయి ఎరువుల ధరలు ఈ ఏడాది బాగా పెరిగాయి. గతంలో ఒకేసారి ఎన్నడూ ఇంత పెరగలేదు. రూ.1,080 నుంచి డీఏపీ బస్తా ఒకేసారి రూ.1,450 పెరిగింది. ఇలా అయితే ఎలా. రైతుల వ్యవసాయం చేయాలా.. వద్దా.. చివరికి పెట్టుబడి కూడా చేతికి వస్తందనే నమ్మకం లేదు. ప్రభుత్వం ధరలపై పునరాలోచించాలి. – మంకెన నాగేశ్వరరావు నేరెడ, చింతకాని మండలం వ్యవసాయం ఎలా చేయాలి గతంలో ఎప్పుడూ లేనం తగా ఎరువుల ధరలు పెంచారు. ఇలా అయితే రైతులు వ్యవసాయం ఎలా చేయాలి. గిట్టుబా టు ధరను పెంచకుండా ఇబ్బడి ముబ్బడి ఎరువుల రేట్లు పెంచడం దారుణం. ఈ ఏడాది దిగుబడి ఆశించినంత లేదు. దీనికి తోడు పెట్టుబడి పెరిగింది. ఈ సారి రైతులకు నష్టాలు తప్పవు. – మాదినేని సూరయ్య, పాతకాచారం, కొణిజర్ల మండలం -
‘ఖమ్మం ఘటనపై న్యాయవిచారణ జరపాలి’
హైదరాబాద్: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో రైతులు విధ్వంసం సృష్టించిన ఘటనపై న్యాయ విచారణ చేయించాలని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి కోరారు. దీనిపై రాష్ట్ర మంత్రి హరీష్ రావును కలిశామన్నారు. ప్రభుత్వానికి సమగ్ర వ్యవసాయ, మార్కెటింగ్ విధానాలు లేకపోవడం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. ఖమ్మం ఘటనకు సంబంధించి అరెస్టు చేసిన రైతులను బేషరతుగా విడుదల చేసి వారిపై పెట్టిన కేసులను కొట్టివేయాలని డిమాండ్ చేశారు. మార్కెట్ ధ్వంసం వెనక ఎవరు ఉన్నారు... మార్కెట్ ఎవరి చేతిలో ఉంది.. రైతుల వివరాలు సేకరిస్తే అసలు గుట్టు బయట పడుతుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో రైతు పరిస్థితి అధ్వానంగా ఉండగా రాజకీయ లబ్ధికోసం బీజేపీ, టీఆర్ఎస్ దోబూచులాడుతున్నాయని ఆరోపించారు. పసుపు రైతుల పరిస్థితి దయనీయంగా తయారయిందని, వ్యాపారులు, దళారులు మధ్య రైతు నష్ట పోతున్నాడని చెప్పారు. వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం, మార్కెట్లలో దిగువ స్థాయి అధికారులు వ్యాపారులతో లాలూచీ పడి రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆరోపించారు. ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టిన నాగార్జునసాగర్ కాల్వల ఆధునీకరణ పనుల్లో లూటీ జరుగుతోందని విమర్శించారు. ఇసుక అక్రమ రవాణా కోసం గోదావరి నదిలో రోడ్డు వేశారని వెల్లడించారు. ఆస్పత్రుల్లో మరణాలపై మంత్రి లక్ష్మారెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వీటన్నిటిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశానన్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. -
పత్తి పోటెత్తె..
ఖమ్మం వ్యవసాయం : ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) కేంద్రానికి మంగళవారం పత్తి భారీగా అమ్మకానికి వచ్చింది. సుమారు 45 వేల పత్తి బస్తాలు విక్రయానికి వచ్చాయి. గత గురువారం సీసీఐ కేంద్రంలో పత్తి కొనుగోలు చేశారు. ఆ రోజు కూడా సుమారు 30 వేల బస్తాలు అమ్మకానికి వచ్చాయి. ఒక్క రోజులో పత్తి కొనుగోళ్లు పూర్తిగాక పోవడంతో శుక్రవారం కూడా కొనుగోళ్లు చేశారు. శనివారం అమావాస కావడం, మార్కెట్‌కు సెలవు దినం కావడంతో ఆ రోజు కాంటాలు తదితర పనులు పూర్తికాలేదు. దీంతో గురువారం సీసీఐ కేంద్రానికి వచ్చిన సరుకు కాంటాలు తదితర పనులు సోమవారానికి పూర్తయ్యాయి. దీంతో నాలుగు రోజుల పాటు సీసీఐ కేంద్రంలో కొత్తగా సరుకు కొనుగోళ్లు జరప లేదు. దీంతో మంగళవారం సీసీఐ కేంద్రానికి పత్తి పోటెత్తింది. తప్పని కొనుగోలు కష్టాలు మంగళవారం కూడా గురువారం నాటి పరిస్థితులే పునరావృతమయ్యాయి. ఖమ్మం సీసీఐ కేంద్రంలో పత్తి కొనుగోళ్లకు ఒక్క బయ్యరును మాత్రమే ఏర్పాటు చేశారు. దీంతో ఆ ఒక్క బయ్యరు సీసీఐ కేంద్రానికి అమ్మకానికి వచ్చిన 45 వేల బస్తాలను ఒక్క రోజులో కొనుగోలు చేయటం సాధ్యం కావడం లేదు. అంతేకాకుండా ఇదే బయ్యరుకు కొత్తగూడెం, చండ్రుగొండ సీసీఐ కేంద్రాలలో పత్తి కొనుగోళ్ల పనిని కూడా అప్పగించారు. ఒక్క బయ్యరుకు మూడు కేంద్రాల్లో పత్తి కొనుగోళ్ల పని అప్పగించడంతో సరుకు కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతోంది. సీసీఐ కేంద్రానికి పత్తి అమ్మకానికి తెచ్చిన రైతులు రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. సరుకు కొనుగోలుకు రెండు నుంచి మూడు రోజులు పడుతుండగా సరుకు కాంటాలకు మరో రెండు రోజులు పడుతుంది. మొత్తంగా రైతులు సీసీఐ కేంద్రానికి పత్తి అమ్మకానికి తీసుకొస్తే వారం రోజులు ఆ కేంద్రం చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇక అమ్మిన సరుకు చెక్కులు 20 రోజులకైనా రావటం లేదు. వాటి కోసం కూడా రైతులు మార్కెట్ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తోంది. సీసీఐ కేంద్రంలో పత్తి అమ్మకానికి రైతులు తీవ్ర అవస్థలు పడక తప్పటం లేదు. మంగళవారం అమ్మకానికి తెచ్చిన సరుకులో అదే రోజు కేవలం 15 వేల బస్తాలను మాత్రమే కొనుగోలు చేశారు. మరో 25 వేల బస్తాలను బుధవారం కొనుగోలు చేస్తారని అధికారులు చెబుతున్నారు. ఒక్క రోజులో 25 వేల బస్తాలు కొనుగోలు చేసే పరిస్థితులు కనిపిండచం లేదు. బుధవారం ఖమ్మం సీసీఐ కేంద్రంలో పత్తి కొనుగోళ్లు జరపడం లేదని కొత్తగా రైతులు సీసీఐ కేంద్రానికి సరుకు అమ్మకానికి తీసుకురావొద్దని మార్కెట్ అధికారులు ప్రకటించారు. మళ్లీ ఎప్పుడు కొనుగోలు చేస్తారనేది ప్రశ్నార్థంకంగానే ఉంది. సీసీఐ కొనుగోళ్లు సజావుగా లేకపోవడం, డబ్బు సకాలంలో చేతికి అందకపోవడంతో విసుగు చెందుతున్న రైతులు ప్రైవేటు వ్యాపారులు, దళారులను ఆశ్రయిస్తున్నారు. సీసీఐ ఇబ్బందులను భరించలేక రైతులు తక్కువ ధరకు ప్రైవేటు వ్యాపారులకు సరుకును అమ్ముకుంటున్నారు. సీసీఐకి విక్రయించడంకంటే ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకోవడమే మేలని రైతులు భావిస్తున్నారు. -
కొనేదిలేదు..
ఖమ్మం వ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో బుధవారం సీసీఐ అధికారులు పత్తి కొనుగోళ్లలో కొర్రీలు పెట్టారు. నిబంధనల మేరకు సరుకులేదంటూ కొనుగోళ్లను నిలిపి వేశారు. దాదాపు మూడున్నర గంటలకు పైగా సరకు కొనుగోలు చేయలేదు. రైతులు ఆందోళనకు దిగడంతో ఖమ్మం ఆర్డీవో వినయ్‌కృష్ణారెడ్డి అక్కడికి చేరుకున్నారు. సీసీఐ అధికారులతో మాట్లాడి కొనుగోళ్లు జరిపించారు.మార్కెట్లోని సీసీఐ కొనుగోలు కేంద్రానికి బుధవారం దాదాపు 40 వేల బస్తాల పత్తి అమ్మకానికి వచ్చింది. ముగ్గురు సీసీఐ అధికారులు మాయిశ్చర్ యంత్రం తీసుకొని తేమ చూసేందుకు ఉదయం 8:30 గంటల సమయంలో యార్డులోకి వెళ్లారు. మునుపెన్నడూ లేని విధంగా మాయిశ్చర్ యంత్రంతో పరీక్షలు చేసి నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా సరుకు లేదని కొనుగోళ్లకు నిరాకరించారు. అమ్మకానికి వచ్చిన దాదాపు 90 శాతం సరుకును తిరస్కరించడంతో రైతులు బిత్తరపోయారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సీసీఐ అధికారులు తేమ పేరుతో కొనుగోళ్లు జరపకపోవటంపై రైతులు ఆందోళనకు దిగారు. విషయం తెలిసి త్రీటౌన్ పోలీస్‌లు మార్కెట్‌కు చేరుకున్నారు. రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. త్రీటౌన్ సీ.ఐ రెహమాన్, ఎస్ఐలు కుమారస్వామి, సర్వయ్య, సీసీఐ అధికారులు శివశంకర్ వశిష్ట, ఖాన్, షకీల్, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి మహ్మద్ అబ్దుల్‌జావీద్, మార్కెటింగ్ శాఖ ఇన్చార్జి సహాయ సంచాలకులు అలీంతో చర్చించారు. సరుకు కొనుగోలులో వారికున్న నిబంధనలను సీసీఐ అధికారులు వివరించారు. ఈ చర్చలు కొనసాగుతున్న సమయంలోనే సమస్య జిల్లా జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్ దృష్టికి వెళ్లింది. జాయింట్ కలెక్టర్ ఆదేశాలతో ఖమ్మం ఆర్డీవో వినయ్ కృష్ణారెడ్డి మార్కెట్‌కు చేరుకున్నారు. తొలుత సీసీఐ, మార్కెట్ అధికారులను సమస్య గురించి అడిగి తెలుసుకున్నారు. పంట ఉత్పత్తిని కొనుగోలు చేయాలని, సీసీఐ కేంద్రం లక్ష్యం నెరవేరాలని అధికారులకు సూచించారు. అనంతరం బయటకు వచ్చి రైతులతో మాట్లాడారు. కొందరు రైతులు పంట పండించటంలో చోటుచేసుకున్న ఇబ్బందులు, వర్షాభావ పరిస్థితులు, సీసీఐ కేంద్రంలో ఎదురవుతున్న బాధలను ఆర్డీవో దృష్టికి తీసుకెళ్తారు. ప్రస్తుతం శీతాకాలం కావడంతో పంట ఉత్పత్తిలో తేమ ఉంటుందని రైతులు వాదించారు. అమ్మకానికి తీసుకువచ్చిన తమ సరుకును సీసీఐతో కొనుగోలు చేయించాలని ఆర్డీవోకు మొరపెట్టుకున్నారు. సీసీఐ సరుకును కొనుగోలు చేస్తుంది కానీ నాణ్యమైన పత్తిని మార్కెట్‌కు తీసుకొచ్చేందుకు రైతులు ప్రయత్నించాలని ఆర్డీవో సూచించారు. ఆర్డీవో సూచన మేరకు సీసీఐ కొనుగోళ్లు ప్రారంభించింది. సీసీఐ అధికారులు, మార్కెట్ అధికారులను ఆర్డీవో వెంటబెట్టుకొని రైతుల సరుకు వద్దకు తీసుకెళ్లారు. దగ్గరుండి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరలకు కొనుగోలు చేయించారు. తేమశాతం ఆధారంగా క్వింటాలు రూ.3,868 నుంచి రూ.4,050 వరకు కొనుగోలు చేశారు. ఈ వ్యవహారంపై మార్కెట్ అధికారులు, సీసీఐ అధికారులు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి జాయింట్ కలెక్టర్‌కు మార్కెట్లో తల్తెతిన సమస్యను వివరించినట్లు సమాచారం. -
సీసీఐ ‘షో’
రెండోరోజు కూడా పత్తి కొనుగోలుకు ఆసక్తి చూపని బయ్యర్ ఖమ్మం వ్యవసాయం: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) పత్తి కొనుగోళ్ల వ్యవహారమంతా ‘షో’గా మారింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో రెండో రోజు(శనివారం)న కూడా సీసీఐ కొనుగోళ్లు జరగలేదు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం నుంచి కొనుగోళ్లు సాగించాలని సీసీఐ నిర్ణయించింది. తొలి రోజున ఇలా... తొలి రోజున మార్కెట్‌కు ఇద్దరు సీసీఐ బయ్యర్లు, వరంగల్ నుంచి జాయింట్ డెరైక్టర్ ఆఫ్ మార్కెటింగ్(జేడీఎం) వచ్చారు. సీసీఐ కేంద్రం ప్రారంభానికి జిల్లా ఉన్నతాధికారులను గానీ, ప్రజాప్రతినిధులనుగానీ ఆహ్వానించలేదు. వ్యాపారులతో, కమీషన్ ఏజెంట్లతో, రైతులతో, కార్మిక సంఘాల ప్రతినిధులతో సీసీఐ బయ్యర్లు, మార్కెటింగ్ శాఖ అధికారులు మాట్లాడుతూ.. నిబంధనలకు అనుగుణంగా విడి పత్తిని రైతులు తీసుకురాలేదని అన్నారు. ఆ తరువాత, వారు కార్యాలయంలోకి వెళ్లిపోయారు. బస్తాల్లో తెచ్చిన పత్తిని కొనుగోలు చేయాలని రైతుల నుంచి ఒత్తిడి పెరగటంతో అధికారులు, ఇద్దరు బయ్యర్లు కలిసి మార్కెట్ యార్డులోకి వెళ్లి సరుకును పరీక్షించి, ‘తేమ అధికంగా ఉంది’ అని చెప్పి తొలి రోజున కొనుగోళ్లు ప్రారంభించలేదు. రెండోరోజున.. రెండోరోజు శనివారం కూడా రైతులు దాదాపు 14,000కు పైగా బస్తాలలో పత్తిని అమ్మకానికి తీసుకొచ్చారు. ఒక్క బయ్యర్ మాత్రమే మార్కెట్లో ఉన్నారు. పత్తి కొనుగోలుకు ఆయన ఆసక్తి చూపలేదు. అదే సమయంలో.. ‘సీసీఐ కొనుగోళ్లు చేసినా డబ్బు చెల్లింపుల్లో తీవ్ర జాప్యం చేస్తుంది. నెల తరువాత సరుకు తాలూకు డబ్బు ఇస్తుంది’ అనే ప్రచారం జోరుగా సాగింది. ఇదే అదనుగా జెండా పాటకు ముందే కొందరు వ్యాపారులు సరకు కొనుగోలు చేశారు. బయ్యర్ ‘షో’ సరుకు కొనుగోలు చేయటం లేదన్న విమర్శలు రాకుండా ఉండేందుకు రెండోరోజున సీసీఐ బయ్యర్ ‘షో’ చేశారు. ఆయన మార్కెట్ అధికారులతో కలిసి యార్డులో అక్కడక్కడ తిరిగి సరుకును ‘పరిశీలించారు’. ‘ప్చ్.. ఈ రోజు వచ్చిన సరుకులో కూడా తేమ శాతం ఎక్కువ గా ఉంది. నిబంధనల ప్రకారంగా దీనిని కొనుగోలు చేయలేము’ అని చేతులెత్తేశారు. దీంతో, పత్తి రైతులు అయోమయానికి, ఆందోళనకు లోనయ్యారు. తప్పనిసరి పరిస్థితుల్లో సరుకును వ్యాపారులకు (వారు చెప్పిన ధరకే) విక్రయించారు. ‘‘సీసీఐ బయ్యర్లు షో చేశారు. సరుకును కొనకూడదని ముందే నిర్ణయించుకున్నా రు’’అని రైతుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ప్రచారం ఘనం.. ఫలితం శూన్యం.. ‘ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సీసీఐ కేంద్రం ఏర్పాటవుతుంది. రైతులెవరూ కూడా తమ సరుకును దళారులకు అమ్మొద్దు’ అంటూ, గ్రామాల్లో మార్కెటింగ్ శాఖ విస్తృతంగా ప్రచారం చేసింది. దీనిని నమ్మి, సరుకును తీసుకొచ్చిన రైతులు.. రెండు రోజులపాటు ఇక్కడ జరిగిన ‘షో’ చూసి నివ్వెరపోయారు. ‘సీసీఐ కేంద్రాల్లో పత్తిని అమ్ముకుని, క్వింటాలుకు రూ.4,050 మద్దతు ధర పొందండని చెప్పిన అధికారులు.. రెండు రోజులుగా సీసీఐ సాగిస్తున్న ‘షో’పై ఎందుకు స్పందించడం లేదంటూ రైతుల్లో ఆగ్రహావేశంతో ప్రశ్నిస్తున్నారు. పత్తి నిల్వలు ఉండడం, అంతర్జాతీయంగా ఎగుమతులు లేనందునే కొనుగోళ్లకు సీసీఐ ఆసక్తి చూపడం లేదన్న చర్చ సాగుతోంది. -
మార్కెట్‌కు పత్తి శోభ
ఖమ్మం వ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్ గురువారం నుంచి కొత్త పత్తితో కళకళలాడుతోంది. సంప్రదాయం ప్రకారం వ్యాపారులు, కార్మికులు పూజలు నిర్వహించి కొత్త పత్తిని కొనుగోలు చేశారు. మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి మహ్మద్ అబ్దుల్‌జావీద్ కొత్త పత్తి కొనుగోలును ప్రారంభించి సరుకు నాణ్యతను పరిశీలించారు. తొలిరోజు దాదాపు ఐదువేల బస్తాలు అమ్మకానికి వచ్చాయి. వీటిలో 1600 బస్తాల కొత్త పత్తి ఉంది. గురువారం పత్తి జెండా పాట రూ.4,001 పలికింది. వ్యాపారులు మాత్రం కింటాలుకు రూ.3,000 నుంచి రూ.3,500 వరకు మాత్రమే ధర చెల్లించారు. కొత్త పత్తి ధర కూడా రూ. 3,500కు మించ లేదు. పత్తికి ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ. 4,050 కాగా గురువారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గరిష్ట (జెండా పాట)ధర కూడా ఆమాత్రం పలకలేదు. అంతర్జాతీయంగా పత్తి ధరలు మందగించాయని, ఎగుమతులు లేక ధర బాగా క్షీణించిందని వ్యాపారులు చెబుతున్నారు. గతేడాది పత్తిని నిల్వ చేసుకున్న రైతులను ఈ ధరలు బాగా దెబ్బతీశాయి. క్వింటాలుకు దాదాపు రూ.1500 నుంచి రూ.2000 వరకు పత్తి నిలువ పెట్టుకున్న రైతులు నష్టపోయారు. ఇంకా ధర పడిపోతుందనే భయంతో రైతులు నిలువ ఉంచిన పత్తిని అమ్ముకుంటున్నారు. దాదాపుగా నెల రోజులుగా పత్తి ధర తగ్గుముఖం పడుతోంది. ఈ ఏడాది పత్తి ధర బాగా తగ్గే సూచనలు కనబడటంతో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)ను రంగంలోకి దించాలని మార్కెటింగ్ శాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. పత్తి ధర బాగా పడిపోయిందని వెంటనే సీసీఐని రంగంలోకి దించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అంతర్జాతీయంగా పత్తి ధర బాగా తగ్గిపోయిందని.. వ్యాపారులు మరీ దగా చేస్తున్నారని..తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. సరుకు నాణ్యంగా ఉన్నా కనీసం ప్రభుత్వం ప్రకటించిన ధర కూడా పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సీసీఐని రంగంలోకి దించే విషయమై జిల్లా జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్ను మార్కెటింగ్ శాఖ అధికారులు గురువారం కలిశారు. జేసీ ద్వారా సీసీఐకి లేఖ రాసినట్లు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి మహ్మద్ అబ్దుల్‌జావీద్ ‘సాక్షి’ కి తెలిపారు. ఇవే ధరలకు కొనుగోళ్లు జరిపితే రైతులు ఆందోళనకు దిగే అవకాశం ఉంది.